ప్రిన్స్ ఫిలిప్: అధికార లాంఛనాలు లేకుండా రాజకుటుంబ సంప్రదాయంలో అంత్యక్రియలు

ఫొటో సోర్స్, PA Media
ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరగబోయే సెయింట్ జార్జ్ ఛాపెల్
డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా అంత్యక్రియలు రాజ కుటుంబ సంప్రదాయంలో జరుగుతాయి తప్ప అధికార లాంఛనాలు, సందర్శనల మధ్య జరగబోవడం లేదు.
ప్రిన్స్ ఆకాంక్ష మేరకే ఇలా నిర్వహించనున్నట్లు కాలేజ్ ఆఫ్ ఆర్మ్స్ వెల్లడించింది.
ప్రిన్స్ ఫిలిప్ పార్థివ దేహం విండ్సర్ ప్యాలెస్‌లోనే ఉంటుందని, సెయింట్ జార్జ్ ఛాపెల్‌లో ఆయన అంత్యక్రియలు రాజరిక సంప్రదాయంలో జరుగుతాయని కాలేజ్ ఆఫ్ ఆర్మ్స్ వెల్లడించింది.
కోవిడ్ కారణంగా సందర్శన కోసం రావద్దని ప్రజలకు ఇప్పటికే సూచించారు. ఆపరేషన్ ఫోర్త్‌బ్రిడ్జ్ పేరుతో ఈ లాంఛనాలు జరగబోతున్నాయి.
అయితే వైరస్ ప్రభావం కారణంగా ఈ కార్యక్రమాలలో పలు మార్పులుచేర్పులు చేశారు.
ఫొటో సోర్స్, EPA
శుక్రవారం నుంచి అంత్యక్రియల తర్వాతి రోజు ఉదయం 8 గంటల వరకు ప్రభుత్వ భవనాలపై జెండాలు అవనతం చేసే ఉంటాయి.
అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలను బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసే అవకాశం ఉంది.
గతంలో ముగ్గురు రాచ సహచరుల( రాజు భార్య లేదా రాణి భర్త) భౌతిక కాయాలకు మాత్రమే అధికారిక ప్రజా సందర్శన ఏర్పాటు చేశారు.
2002లో క్వీన్ మదర్ అంత్యక్రియల సందర్భంగా వెస్ట్ మినిస్టర్ హాల్‌లో సుమారు 2 లక్షలమంది ప్రజలు ఆమె భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు.
అయితే ప్రిన్స్ అంత్యక్రియలు మాత్రం రాజసంప్రదాయాలు, ప్రిన్స్ ఆకాంక్షల మేరకు జరుగుతాయని కాలేజ్ ఆఫ్ ఆర్మ్స్ వెల్లడించింది.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సినంత ప్రముఖుడిని కాదని ప్రిన్స్ ఫిలిప్ అనేవారని ఆయన సహాయకుడొకరు ఒకసారి వెల్లడించారు.
అధికార లాంఛనాలను కేవలం రాజు లేదా రాణి మరణించినప్పుడు మాత్రమే నిర్వహించడం ఆనవాయితీ.
రాజ సంప్రదాయంలో అంత్యక్రియలు అంటే, గతంలో క్వీన్ మదర్‌కు జరిగిన అంత్యక్రియల తరహాలో ఉంటాయి. ప్రిన్స్ ఫిలిప్‌కు కూడా అదే పద్ధతిలో జరుగుతాయి.
ఫొటో సోర్స్, PA
హర్ రాయల్ హైనెస్ బిరుదు లేకపోయినప్పటికీ, ప్రిన్సెస్ డయానాకు కూడా దాదాపు రాజ సంప్రదాయంలోనే అంత్యక్రియలు జరిగాయి.
ఈ విధానంలోనే రాజ కుటుంబ వారసులకు, అలాగే రాజ కుటుంబంలో ఉంటూ అత్యున్నత మిలిటరీ అధికార బాధ్యతలను నిర్వహిస్తున్న వారికీ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాజకుటుంబ ఆదేశాలు, నిధుల విడుదలకు పార్లమెంటు ఆమోదంతో రాచ అంత్యక్రియల తరహాలో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలను నిర్వహిస్తారు.
నేవీ అధికారి లార్డ్ నెల్సన్, మాజీ ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్‌కు ఈ తరహాలో అంత్యక్రియలు జరిగాయి.
అయితే అధికార లాంఛనాలు, రాజ సంప్రదాయ అంత్యక్రియల మధ్య స్వల్ప ప్రొటోకాల్ తేడాలు మాత్రమే ఉంటాయి.
రెండింటిలో మిలిటరీ పరేడ్, అధికారిక ప్రజా సందర్శన ఉంటాయి. అయితే ప్రిన్స్ ఫిలిప్ కోరిక మేరకు ప్రజా సందర్శన ఉండబోవడం లేదు.
ప్రిన్స్ మరణం తర్వాత జరగబోయే కార్యక్రమాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు లండన్‌కు, విండ్సర్ ప్యాలెస్‌కు తరలి వస్తారని, మిలటరీ పరేడ్‌ను దగ్గరగా చూడటానికి కొందరు అక్కడే క్యాంప్‌లు వేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రిన్స్‌కు గౌరవ సూచకంగా సైనిక దళాలకు చెందిన వందలమంది సిబ్బంది లండన్ నగర వీధుల్లో కవాతు నిర్వహిస్తారు.
ప్రజల రద్దీని నియంత్రించడానికి వేలమంది పోలీసులు విధుల్లో ఉంటారు.
అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా చేరకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)