ప్రిన్స్ ఫిలిప్- లండన్‌ నగరంతో విడదీయరాని అనుబంధం

ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, Getty Images

రాచకుటుంబసభ్యుడిగా డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ప్రిన్స్‌ ఫిలిప్‌ అనేక ధార్మిక (చారిటీస్‌) సంస్థల్లో కీలకపాత్ర పోషించారు.

ఆయన నుంచి సాయం పొందిన సంస్థలు ఒక్క లండన్‌ నగరంలోనే 800కు పైగా ఉన్నాయి. ఆయన కృషి లేకుంటే లండన్‌ నగరంలోని చాలా ప్రాంతాలు ఈ రోజు మరోలా ఉండేవి.

చారిటీ కార్యక్రమాలలో ఆయన చాలా క్రియాశీలకంగా ఉండేవారు. తాను భాగస్వామ్యం పంచుకునే సంస్థలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు.

"ఆయన తన పాత్రను తాను నిర్వచించుకున్నారు. మొదట్లో (రాణి పాలన ఆరంభంలో) ఆయన అలా ఉండేవారు కాదు" అని 'ది డ్యూక్: 100 చాప్టర్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ప్రిన్స్ ఫిలిప్' రచయిత ఇయాన్ లాయిడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, SHAKESPEARE'S GLOB

సౌత్‌ బ్యాంక్‌ లోని షేక్స్‌పియర్‌ గ్లోబ్‌ ఆయన విశేష కృషికి ఒక ఉదాహరణ. ఆయన 40 ఏళ్లకు పైగా దానికి పోషకులుగా ఉన్నారు. ఆ భవనం నిర్మించడానికి దాతల నుంచి ఆర్థిక సాయం అందేలా సహకరించారు.

ప్రజలకు అంకితమిచ్చాక, అది ఒక సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాక కూడా దాని విషయంలో ఆయన శ్రద్ధను కొనసాగించారు.

"ప్రారంభంలో శామ్ వాన్‌మేకర్ (ప్రాజెక్ట్ ప్రారంభించిన నటుడు, దర్శకుడు) ఈ గ్లోబ్‌ను నిర్మించడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆ భవనాన్ని పూర్తి చేయడానికి, 1997లో దాన్ని ప్రారంభించడానికి ప్రిన్స్ ఫిలిప్ సహాయం చాలా కీలకం అయ్యింది" అని గ్లోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీల్ కాన్‌స్టేబుల్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆ భవన నిర్మాణం కోసం విండ్సర్ గ్రేట్ పార్క్‌ నుంచి ఓక్స్ చెట్లను డ్యూక్ విరాళంగా ఇచ్చారు. కాంప్లెక్స్‌కు ఆదరణ పెరుగుతున్నా ఎన్నో ఏళ్ల పాటు ఆయన క్రమం తప్పకుండా అక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఈ భవనాన్ని ప్రతి ఏటా పది లక్షల మందికి పైగా సందర్శిస్తారు.

"మా అందమైన థియేటర్స్ పనితనంపై, ముఖ్యంగా దాని కోసం ఉపయోగించిన సంప్రదాయ సామగ్రిపై ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపించేవారు" అని కాన్‌స్టేబుల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

గ్రీనిచ్‌లో థేమ్స్ నదికి కాస్త దిగువన ప్రపంచంలో మిగిలిన ఏకైక టీ క్లిప్పర్ (తేయాకు రవాణా చేసే నౌక) 'కట్టీ సార్క్' ఉంది.

ఈ సుప్రసిద్ధ నౌక 1869 నవంబర్‌లో తన తొలి ప్రయాణం ప్రారంభించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది తుక్కుగా మారిపోయే పరిస్థితి వచ్చింది.

కానీ, దాన్ని సంరక్షించడానికి కట్టీ సార్క్ సొసైటీ ఏర్పడింది. ఆ తర్వాత ఆ నౌక పర్యటకులను ఆకర్షించే కేంద్రంగా మారిపోయింది.

కట్టీ సార్క్‌ సంరక్షణలో డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా పాత్ర ఎంతో ఉందని డైరెక్టర్ ఆఫ్ రాయల్ మ్యూజియమ్స్ గ్రీ పాడీ రోడ్జర్స్ చెప్పారు.

"ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ కోసం దీనిని గ్రీనిచ్‌కు తరలించాలని మొదట సూచించింది డ్యూక్. 1957లో ప్రజల సందర్శనార్థం దానిని తెరిచే ముందు దానిని పునరుద్ధరణకు దాతల నుంచి సాయం అందేలా ఆయన సహకరించారు" అన్నారు.

1948లో ‘రాయల్ మ్యూజియమ్స్ గ్రీనిచ్‌‘కు ప్రిన్స్ ఫిలిప్ ట్రస్టీ కూడా అయ్యారు. కొన్ని దశాబ్దాలపాటు ఆయన కట్టీ సార్క్ గురించి జరిగే బోర్డు సమావేశాలకు రెగ్యులర్‌గా హాజరయ్యేవారని, సలహాలు ఇచ్చేవారని రోడ్జర్స్ చెప్పారు.

"70 ఏళ్లకు పైగా ఆయన నుంచి అందిన ఆ మద్దతు ప్రిన్స్ ఆసక్తి, అంకితభావం గురించి చెప్పకనే చెబుతుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం లండన్ యూత్‌గా మారిన 'లండన్ ఫెడరేషన్ ఆఫ్ బాయ్స్ క్లబ్స్' యూత్ ఆర్గనైజేషన్‌లకు పోషకులు అయినప్పటి నుంచే లండన్‌లో డ్యూక్ చారిటీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

1948 మార్చిలో రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన బాక్సింగ్ పైనల్‌కు హాజరయినప్పటి నుంచి చారిటీ కార్యక్రమాల్లో ఆయన ఒంటరిగా పాల్గొనడం ప్రారంభమైంది. పోషకుడిగా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా 2017లో బకింగ్‌హమ్ పాలెస్‌లో గార్డెన్ పార్టీ కూడా జరిగింది.

" అనేక సమస్యల నుంచి వచ్చిన వారి కోసం మేం నిర్వహించే కార్యక్రమాలకు డ్యూక్ వ్యక్తిగతంగా చాలా సాయం చేసేవారు. తమ జీవితావకాశాలను మెరుగు పరుచుకుని, పౌరులుగా ఒక సమర్థమైన పాత్ర పోషించేలా ఆయన ఎన్నో తరాలకు ప్రేరణనిచ్చారు." అని లండన్ యూత్ ప్రెసిడెంట్ సర్ కెన్ లిసా చెప్పారు.

ధార్మిక కార్యక్రమాలకు చేయూతనందించడం మొదలు పెట్టిన రోజుల్లో ఆయన నుంచి సాయం పొందిన మరో సంస్థ 'నేషనల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ అసోసియేషన్'. దానికి అధ్యక్షుడుగా ఆయనకు లండన్ హెడ్ క్వార్టర్స్‌లో సొంత డెస్క్ ఉండేది.

దాని ద్వారా డ్యూక్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నగరంలో, బ్రిటన్ అంతటా ఏర్పాటైన గ్రీన్ స్పేసెస్ (ఉద్యాన వనాల) కోసం ఆయన అనేకమంది నుంచి మద్దతు కూడ గట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

తన అసోసియేషన్ తరఫున ఒక చారిటీ రికార్డ్ విడుదల చేసేలా ప్రముఖ అమెరికన్‌ సింగర్‌, నటుడు ఫ్రాంక్ సింటారాను కూడా ప్రిన్స్‌ ఒప్పించారు. ఈ తరహా రికార్డులలో ఇది మొదటిదిగా చాలామంది దీనిని భావిస్తారు. ఇందులోఒక పరిచయ సందేశాన్ని డ్యూక్ అందించారు.

ప్రస్తుతం ఆ చారిటీ 'ఫీల్డ్స్ ఇన్ ట్రస్ట్' అనే పేరుతో ఉంది. తన సుదీర్ఘ, నిబద్ధత కలిగిన సేవతో ప్రిన్స్ ఫిలిప్ చారిటీకి సంబంధించిన ప్రతి అంశంలోనూ పాల్గొనేవారు.

" ప్రజలు ఆడుకోడానికి, ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండడానికి అవసరమైన పార్కులకు డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా శాశ్వతత్వాన్ని కల్పించారు" అని ఆ చారిటీ సంస్థ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

క్వీన్‌తో వివాహానికి ముందే ప్రిన్స్ ఫిలిప్‌ జీవితానికి లండన్‌ నగరానికి అనుబంధం ఉంది.

"ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు ఒంటరి వారయ్యారు. ఆయనకు ఒక ఇల్లు కూడా లేకుండా పోయింది. లండన్‌లోని తన బంధువులతో కలిసి ఉండేవారు" అని లాయిడ్ చెప్పారు.

స్కూల్‌ లేనప్పుడు, నేవీ నుంచి లీవులో ఉన్నప్పుడు ప్రిన్స్ ఫిలిప్ తరచూ బెల్గ్రేవియా చెస్టెర్ స్ట్రీట్‌లో ఉన్న మౌంట్‌బాటెన్స్ నివాసంలో ఉండేవారు. అక్కడ ఆయనకు ఒక కాంప్ బెడ్ ఉండేదని చెబుతారు.

ఆయన అప్పుడప్పుడూ తన అమ్మమ్మ విక్టోరియా మౌంట్‌బాటెన్, డొవేజర్ మార్చియోనెస్ ఆఫ్‌ మిల్‌ఫోర్డ్ హెవెన్‌ దగ్గర కూడా ఉండేవారు. ఆమెకు కెన్సింగ్టన్‌ పాలెస్‌లోని అపార్ట్‌మెంట్స్‌ ఉండేది. యువకుడుగా ఫిలిప్ ఎక్కువగా లండన్ లైఫ్‌స్టైల్‌ను ఆస్వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫిలిప్, ఆయన కజిన్ డేవిడ్ మౌంట్‌బాటెన్, థర్డ్ మార్కెస్ ఆఫ్ మిల్‌ఫోర్డ్ హవెన్‌లకు సేవకుడుగా పనిచేసిన జాన్ డీన్ రాసుకున్నవారిద్దరూ విక్టోరియా పట్ల చాలా గౌరవం చూపించేవారని తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు.

"ఆమెకు మెలకువ రాకుండా ఉండడానికి వాళ్లు స్కూల్ పిల్లల్లా ప్రవర్తించేవారు. ముఖ్యంగా అర్థరాత్రి పూట ఆమె నిద్ర పాడవుతుందనే భయంతో పైకప్పు మీద నుంచి ఎక్కి, లేదటే బెడ్ రూం కిటీకీల్లోంచి లోపలికి వెళ్లేవారు" అని చెప్పారు.

ప్రిన్సెస్ ఎలిజెబెత్ రాణి కావడానికి ముందే ఆయన ఆమెతో కలిసి ఎన్నో ఏళ్ల పాటు లండన్ నగరంలో సాయంత్రాలను ఆస్వాదించారు.

"వాళ్లు పగటి పూట 400 క్లబ్, ఎంబసీ క్లబ్‌ లాంటి పెద్ద క్లబ్బుల్లో డాన్స్ చేయడానికి వెళ్లేవారు" అని రాయల్ బయోగ్రాఫర్ లాయిడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, PA Media

1947 నవంబర్ 20న వెస్ట్‌మినిస్టర్‌ అబ్బేలో ఇద్దరి వివాహం జరిగింది. వారు బకింగ్‌హమ్ పాలెస్‌లో కొంతకాలం గడిపారు. అక్కడ తర్వాత ఏడాది ప్రిన్స్ చార్ల్స్ పుట్టాక, వాళ్లకు క్లారెన్స్ హౌస్ ఇచ్చారు. దానికి రిపేర్లు, డెకరేషన్ చేయించిన తర్వాత వారు కొత్త ఇంట్లోకి వెళ్లారు. అయితే, జార్జ్ VI మరణించే వరకూ వాళ్లు అక్కడ 18 నెలలే ఉన్నారు.

"వాళ్లు నిజంగా తమ ఇంట్లోనే ఉండాలనుకున్నారు. కానీ, ఆ సమయంలో ప్రధానిగా ఉన్న విన్‌స్టన్ చర్చిల్.. మీరు బకింగ్‌హమ్ పాలెస్‌లోనే ఉండాలని పట్టుబట్టారు. అలా, ఒక విధంగా వాళ్ల మనసు విరిగిపోయింది" అంటారు లాయిడ్.

ఫొటో సోర్స్, Getty Images

రాణిగా పట్టాభిషేకం అయిన తర్వాత కూడా డ్యూక్ తన లండన్ జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. ఆయన ఎక్కువగా ఓల్డ్ క్రాంప్టన్ స్ట్రీట్‌లోని వీలర్స్ రెస్టారెంట్ మూడో అంతస్తులో థర్స్‌డే క్లబ్‌కు వెళ్లేవారు.

"గురువారాలు మగవాళ్లంతా కలుసుకునే ఒక సోషల్ ఈవెంట్‌లా ఉండేది. లంచ్ చేసిన తర్వాత వీకెండ్ కోసం వాళ్లు ఇళ్లకు వెళ్లేవారు" అని రాయల్ బయోగ్రాఫర్ చెప్పారు.

థర్స్ డే క్లబ్‌ మెనూలో మాంసాహారం, వైన్ ఉండేది, అక్కడికి ఎప్పుడూ వచ్చేవారిలో నటులు డేవిడ్ నివెన్, జేమ్స్ రాబర్ట్‌సన్ జస్టిస్ ఉండేవారు. సోవియట్ యూనియన్ వెళ్లిపోయిన ఎం16 అధికారి కిమ్ ఫిల్బీ కూడా అక్కడ కనిపించేవారని చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images

బిల్లీ ఎలియట్, వన్ మాన్, టూ గవర్నర్స్, వార్ హార్స్ లాంటి షోలను చూడ్డానికి రాయల్ కపుల్ థియేటర్లకు వెళ్తుండడంతో లండన్‌లోని వెస్ట్ ఎండ్ ఏరియా ఎన్నో ఏళ్ల పాటు ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా నిలిచింది.

కార్యక్రమాలకు, వేడుకలకు వెళ్లడానికి, తనను ఎవరూ గుర్తించకుండా నగరమంతా తిరగడానికి డ్యూక్ 1999లో ఒక లండన్ మెట్రో క్యాబ్ కొనుగోలు చేశారు.

ఆయన దాన్లో సావిల్ రోకు కూడా వెళ్లేవారు. అక్కడ ఉన్న జాన్ కెంట్ ఆఫ్ కెంట్ అండ్ హేస్ట్ లాంటి టైలర్లు ఆయనకు దుస్తులు రూపొందించేవారు.

"ఆయన ఒకసారి నన్ను దాటి(తన టాక్సీలో) వెళ్లారు. కళ్లజోడు పెట్టుకున్న ఆయన వెనుక కూర్చుని డాక్యుమెంట్స్ చూస్తూ కనిపించారు" అని లాయిడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

క్వీన్‌ను పెళ్లాడ్డానికి ముందు, తర్వాత కూడా డ్యూక్‌కు లండన్ అంటే వల్లమాలిన అభిమానం, గాఢమైన అనుబంధం ఉంది.

ప్రిన్స్ ఫిలిప్ ఒంటరిగా పాల్గొన్న చివరి కార్యక్రమం 2017 ఆగస్టులో జరిగింది. తన దశాబ్దాల సర్వీసుకు బకింగ్‌హమ్ పాలెస్‌ గ్రౌండ్స్‌లో ఆయన రాయల్ మెరైన్స్ గ్రూప్ నుంచి త్రీ చీర్స్ అందుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters

రాయల్ బయోగ్రాఫర్ లాయిడ్ చెప్పినట్లు "ఆయనకు లండన్ నగరంతో ఎంతో అనుబంధం ఉంది".

All images subject to copyright