గాజాలో ప్రజలు పడే కష్టాలు... పగవాడికి కూడా వద్దు

గాజా పై ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా గాయపడిన ఓ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక

సుమారు 41 కి.మీ. పొడవు, 10 కి.మీ. వెడల్పు ఉండే గాజాలో దగ్గర దగ్గర 20 లక్షల మంది నివసిస్తుంటారు. చుట్టూ మధ్యధరా సముద్రం, ఇజ్రాయెల్, ఈజిప్టులు ఉంటాయి. గత కొన్నిరోజులుగా ఇక్కడ సాగిన ఘర్షణలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఒకదశలో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది.

మొదట్లో ఈజిప్టు ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతం 1967లో జరిగిన మిడిల్ ఈస్ట్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. 2005 లో ఇక్కడి నుంచి తన బలగాలతో పాటు, 7 వేలమంది సెటిలర్లను కూడా ఇజ్రాయెల్ వెనక్కి రప్పించింది.

2007లో పాలస్తీనా సైన్యంలోని ఇస్లామిక్ తిరుగుబాటు గ్రూపు హమాస్ ఈ ప్రాంతాన్ని తన చేతిలోకి తీసుకుంది. అప్పటి నుంచి అటు ఇజ్రాయెల్, ఇటు ఈజిప్టు దేశాలు గాజాకు సరుకు రవాణా, రాకపోకలపై ఆంక్షలు విధించాయి.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2014లో స్వల్పంగా ఘర్షణ జరగ్గా, ఇప్పుడు తీవ్ర స్థాయిలో జరిగింది.

తాజా ఘర్షణకు కారణమేంటి?

ముస్లింలు, యూదులు పవిత్ర నగరంగా భావించే జెరూసలేంలోని తూర్పు ప్రాంత ఆక్రమణ అంశంపై ఇజ్రాయెల్, గాజాలు ఘర్షణకు దిగాయి. ఈ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్లాలన్నది హమాస్ డిమాండ్.

మే 10న హమాస్ ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ముదిరింది. 2014 తర్వాత గాజా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

గాజాలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది.

విద్యుత్ సరఫరాపై రాకెట్ దాడులు

ఇజ్రాయెల్ నుంచి తరచూ జరుగుతున్న వైమానిక దాడులతో గాజా ప్రాంతంలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నది. రోజులో ఎనిమిది గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచి పోతోంది.

చాలా ఇళ్లకు మూడు నాలుగు గంటలకు కూడా విద్యుత్ సరఫరా ఉండటం లేదని ఐక్య రాజ్య సమితికి చెందిన కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎఫైర్స్ (ఓచా) వెల్లడించింది.

గాజాకు విద్యుత్ సరఫరా ఆ ప్రాంతానికి ఉన్న ఒకే ఒక్క ఉత్పత్తి కేంద్రంతో పాటు, ఇజ్రాయెల్, ఈజిప్టుల కొంత కరెంట్ అందుతుంది.

చాలామంది డీజీల్‌ తో నడిచే జనరేటర్ల మీద ఆధార పడుతుంటారు. కానీ, ఇజ్రాయెల్ ఆంక్షలతో ఈ ప్రాంతంలోకి చమురు సరఫరా కూడా కష్టమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గాజా సిటీలోని ఓ వీధిలో బ్రెడ్ అమ్ముతున్న యువకుడు

సరిహద్దుల మూసివేత

గాజా ప్రాంతం హమాస్ చేతిలోకి వచ్చిన 2007 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంతో ఉన్న సరిహద్దులను ఈజిప్టు పూర్తిగా మూసివేసింది. కరోనా వైరస్ కారణంగా, ఈ నిబంధనలను మరింత కఠినం చేసింది.

ఈజిప్టులోకి వెళ్లే రఫా క్రాస్, ఇజ్రాయెల్‌లోకి ప్రవేశం కల్పించే ఎరెజ్ క్రాస్‌లు సంవత్సరంలో 240 రోజులు మూసే ఉంటున్నాయని ఐక్యరాజ్య సమితి విభాగం ఓచా తెలిపింది.

2019లో సుమారు 78,000 మంది రాఫా క్రాసింగ్ ద్వారా గాజా దాటి ఈజిప్టులో ప్రవేశించగా, 2020లో కేవలం 25,000 మంది మాత్రమే రాగలిగారు. అదే ఎరెజ్ క్రాస్ ద్వారా కేవలం 8,000 మంది మాత్రమే ఇజ్రాయెల్‌లో ప్రవేశించగలిగారు. అందులోనూ ఎక్కువమంది కోవిడ్ చికిత్స కోసం వెళ్లిన వారే ఉన్నారు.

టన్నెల్ నెట్‌వర్క్ టార్గెట్

గాజా ప్రాంతపు ప్రజల్లో 80 శాతం మంది అంతర్జాతీయ సాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇందులో పది లక్షల మందికి ఆహారం అంతర్జాతీయ సాయం ద్వారానే అందుతుంది. ఇజ్రాయెల్ ఆంక్షలు విధిస్తే గాజా వాసులు ఏ పనీ చేసుకోవడానికి వీలు కాదు.

ఇలాంటి ఆంక్షలను తప్పించుకోవడానికి, హమాస్ సొరంగ మార్గాలను ఏర్పాటు చేసింది. దీని ద్వారా సరకులను రవాణా చేసుకుంటారు. అయితే ఈ టన్నెల్స్ ద్వారా హమాస్ అక్రమంగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తోందని, వీటి మీద కూడా బాంబు దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఇక కరోనా వైరస్ కారణంగా గాజా ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే, ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో ఈ ఘర్షణ మొదలైందని వరల్డ్ బ్యాంక్ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

గాజాలో స్వచ్ఛమైన మంచి నీటికి కూడా కరువే

జనసాంద్రత ఎక్కువ

ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. ఇక్కడున్న ఎనిమిది కీలక ప్రాంతాలలో సుమారు 6 లక్షల మంది నివసిస్తున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

ప్రతి చదరపు కిలోమీటరుకు సగటున 5,700 మంది నివసిస్తున్నట్లు తేలింది. ఇది లండన్ జన సాంద్రతతో సమానం. గాజా సిటీలో మాత్రం జన సాంద్రత చదరపు కిలో మీటరుకు 9,000 వరకూ ఉంటుంది.

రాకెట్ లాంచర్ దాడులను, సొరంగ మార్గాల ద్వారా ప్రవేశాలను నివారించడానికి ఇజ్రాయెల్ 2014లో కొంత ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించింది. ఈ కారణంగా అక్కడ నివాస, వ్యవసాయ భూములు తగ్గిపోయాయి.

ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం గాజాలో ఇప్పుడు 1,40,000 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. 2014 యుద్ధం ముగిసిన తరువాత కూడా ఇక్కడ 90 వేల కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు.

తాజా ఘర్షణల్లో కొన్ని వందల ఇళ్లు ధ్వంసమయ్యాయనని ఓచా వెల్లడించింది. పూర్తిస్థాయి విధ్వంసం గురించి తెలుసుకోవాలంటే మరికొంత కాలం పడుతుంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఇజ్రాయెల్ బాంబు దాడులతో అనేక భవనాలు కుప్పకూలాయి.

వైద్య సేవలు గగనమే.

సరిహద్దులు మూసివేయడం, తీవ్రమైన ఆంక్షల కారణంగా ప్రజా ఆరోగ్య సేవలు సరిగా అందడం లేదు. ఐక్యరాజ్య సమితి 22 హెల్త్ కేర్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్‌తో జరిగిన అనేక ఘర్షణల కారణంగా, గాజాలో పలు ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయి

వెస్ట్‌ బ్యాంక్‌, లేదా తూర్పు జెరూసలేం లలో వైద్య చికిత్సకు వెళ్లాలంటే ప్రజలు ముందు పాలస్తీనియన్ అథారిటీ అనుమతి, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2019లో లెక్కల ప్రకారం 65శాతం దరఖాస్తులకు మాత్రమే అనుమతి లభించింది.

కరోనా కారణంగా గాజాలో ఆరోగ్య వ్యవస్థ మరింత ఇబ్బందుల్లో పడింది. ఏప్రిల్ నెలలో రోజుకు 3,000 కేసుల వరకు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 946మంది మరణించారు.

సరిహద్దు దేశాల ఆంక్షల వల్ల గాజాలో ఆరోగ్య పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా గాజాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

ఆహార సరఫరాకు అడ్డంకులు

ఒకపక్క తాము సాయం అందిస్తున్నప్పటికీ గాజాలో 10 లక్షల మందికి పైగా తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు ఐక్య రాజ్య సమితి చెబుతోంది. ఇజ్రాయెల్ అక్కడి వ్యవసాయంపై ఆంక్షలు విధించడం, చేపల వేటనూ నియంత్రించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఆహార సరఫరాకు అనుమతులు లభించినా, ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలతాయో తెలియని పరిస్థితి ఉండటంతో రవాణాకు అంతరాయం కలుగుతోంది.

ఇజ్రాయెల్ ప్రకటించిన బఫర్ జోన్‌లో గాజా ప్రజలు వ్యవసాయం చేయడానికి వీల్లేదు. ఈ జోన్ ఇజ్రాయెల్ సరిహద్దు పొడవునా గాజా లోపలికి 1.5 కి.మీ వెడల్పున ఉంటుంది. ఈ ఆంక్షల వల్ల ఏటా 75 వేల టన్నుల మేర ఆహార ఉత్పత్తులు తగ్గుతున్నాయి.

తాజా ఘర్షణల తర్వాత ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో చేపల వేటను కూడా నిసేధించింది. గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ ఇలా ఆంక్షలు విధిస్తుండటంతో సుమారు 5,000 మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు.

తాగు నీటి సమస్య

గాజాలో చాలామంది ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కుళాయి నీరు ఉప్పగా ఉండటం, కాలుష్య భరితం కావడం లాంటి పరిస్థితులు తరచూ ఎదురవుతుంటాయి.

ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఒక వ్యక్తి రోజువారీ అవసరాలనకు 100 లీటర్ల నీరు అవసరమవుతుండగా, ప్రస్తుతం గాజా వాసులు కేవలం 88 లీటర్ల నీటిని మాత్రమే పొందగలుగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇటీవలి సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున గాజా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ జరగ లేదు.

విద్య- నిరుద్యోగం

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే అనేక పాఠశాలలు బాంబుల కారణంగా షెల్టర్ జోన్‌లుగా మారిపోయాయి. పాలస్తీన రిఫ్యూజీ ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం 275 స్కూళ్లలో 64 శాతం స్కూళ్లు రెండు షిఫ్టులలో పని చేస్తున్నాయి.

19 ఏళ్లలోపు యువకులలో అక్షరాస్యతా 99 శాతం ఉండగా, అది క్రమంగా పెరుగుతోంది. అయితే హైస్కూల్ పూర్తి చేసుకుని అప్పర్ సెకండరీ స్కూల్స్‌లో ప్రవేశిస్తున్న వారు 66 శాతం మందే ఉన్నట్లు తేలింది.

ఇక ఇక్కడ ఉద్యోగావకాశాలు కూడా చాలా తక్కువ. యువతలో నిరుద్యోగం 70 శాతం వరకు ఉందని ఐక్య రాజ్య సమితి విభాగం ఓచా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)