కోవిడ్ వ్యాక్సీన్: ఆ దేశంలో 20 వేల డోసుల టీకాలను ధ్వంసం చేశారు... కారణమేంటి?

  • హ్యారియెట్ ఓరెల్
  • బీబీసీ ప్రతినిధి
వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మలావిలో సుమారు 20,000 వ్యాక్సీన్ డోసులను ధ్వంసం చేశారు.

మలావి దేశం బహిరంగంగా 20,000 వ్యాక్సీన్ డోసులు పనికిరానివని నాశనం చేసి పారదర్శకతను ప్రదర్శించింది.

వ్యాక్సీన్ డోసుల సురక్షత గురించి తమదేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే గడువు దాటిపోయిన 19,610 వ్యాక్సిన్లను ధ్వంసం చేసినట్లు మలావి వైద్య కార్యదర్శి తెలిపారు.

ప్రపంచంలో 5 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే ఇప్పటి వరకు వ్యాక్సీన్ లభించినట్లు అవర్ వరల్డ్ ఇన్ డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లను ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?

"చాలా వరకు వ్యాక్సీన్లు వృథా కావు" అని యూకేలోని లివర్‌పూల్‌లో జాన్ మూర్స్ యూనివర్సిటీలో సప్లై చెయిన్ మేనేజ్మెంట్‌‌ సీనియర్ లెక్చరర్ డాక్టర్ శారా స్కిఫ్లింగ్ చెప్పారు.

"కోవిడ్ వ్యాక్సీన్ల గురించి పూర్తి సమాచారం ఇంకా మన దగ్గర పూర్తిగా లేదు. కానీ, వాటి గడువు గురించి మాత్రం మనం కొంచెం సంప్రదాయ రీతిలో ఆలోచిస్తున్నాం. వాటి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉండటం వల్ల వాటిని త్వరగా వాడేయాలి" అన్నారు డాక్టర్ శారా.

మలావికి ఆఫ్రికా నుంచి ఏప్రిల్ 13 వరకు గడువు తేదీ ఉన్న 102,000 డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లు మార్చి 26న సరఫరా అయ్యాయి. అందులో 80 శాతం డోసులను వాడేశారు.

ఫొటో క్యాప్షన్,

ధ్వంసం కావడానికి సిద్ధంగా ఉన్న వ్యాక్సీన్ డోసులు

వ్యాక్సీన్లను ఎందుకు ధ్వంసం చేయాలి?

"వ్యాక్సీన్లను ధ్వంసం చేయడం విచారకరం. నేను దానికి కారణాన్ని అర్ధం చేసుకోగలను. మలావిలో వ్యాక్సీన్ తీసుకునేందుకు ప్రజలు సంశయిస్తున్నారు" అని డాక్టర్ స్కిఫ్లింగ్ అన్నారు.

"ఇలా వ్యాక్సీన్లను ధ్వంసం చేయడం విచారకరం. కానీ, అలా చేయడం వల్ల వచ్చే ముప్పు కంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి" అని మలావి ఆరోగ్య కార్యదర్శి బీబీసీ కి చెప్పారు.

"మా దగ్గర గడువు తేదీ ముగిసిన వ్యాక్సీన్లు ఉన్నట్లు వార్తలు రాగానే, వ్యాక్సినేషన్ కోసం ప్రజలు రావడం లేదనే విషయాన్ని గమనించాం" అని డాక్టర్ ఛార్లెస్ మాన్సామ్బో చెప్పారు.

"వాటిని గనక మేము కాల్చి ధ్వంసం చేయకపోతే, మేము వాటినే వాడుతున్నామని అనుకుని ప్రజలు వ్యాక్సినేషన్ కోసం రాకపోవచ్చు. అలాంటి వారికి కోవిడ్ సోకే ప్రమాదం ఉంది" అని అన్నారు.

వ్యాక్సినేషన్ కోసం ప్రజలను ఒప్పించడం కష్టం కావడం వల్లే ఆ వ్యాక్సిన్లు వ్యర్థం అయ్యాయని చెప్పారు.

సౌత్ సుడాన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆ దేశంలో గడువు ముగిసిన సుమారు 59,000 వ్యాక్సీన్లు ఉన్నాయి. ఇవి వారికి ఆఫ్రికన్ యూనియన్ నుంచి అందాయి.

గడువు తేదీని పొడిగించవచ్చేమో అనే అంశాన్ని పరిశీలించే వరకు వాటిని భద్రంగా ఉంచమని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు వాటిని పారేయమని చెబుతోంది.

"వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు జరుగుతున్న సమయంలో వ్యాక్సీన్లను నాశనం చేయడం విచారకరమైన విషయమే అయినప్పటికీ గడువు తేదీ ముగిసిన వ్యాక్సిన్లను సురక్షితంగా ధ్వంసం చేయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో చెప్పింది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ల వాడకానికి ఆమోదం లభించక ముందే వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు వాటిని ఉత్పత్తి చేసి స్టాక్ ‌ నిల్వ చేయడంతో వాటి షెల్ఫ్ లైఫ్ తగ్గిపోయిందని కోవాక్స్ పథకాన్ని నిర్వహించే గావి చెబుతోంది.

వ్యాక్సీన్ గడువు తేదీ గురించి కోవాక్స్ భాగస్వామ్య దేశాలన్నిటికీ తెలియచేశామని, ఆయా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపిన తర్వాతే వ్యాక్సీన్ డోసులను సరఫరా చేసినట్లు గావి ప్రతినిధి బీబీసీకి చెప్పారు. .

ఈ విడత తర్వాత విడుదల చేసే వ్యాక్సీన్ల గడువు తేదీని పొడిగించే అవకాశం ఉన్నట్లు కూడా గుర్తించాలని చెప్పారు. ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయ రెగ్యులేటర్లకు తెలియచేస్తామని చెప్పారు.

కానీ, ఈ వ్యాక్సీన్ల వ్యర్థం ఒక్క ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జరగటం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వ్యాక్సిన్ల వ్యర్థం ఒక్క ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జరగటం లేదు

వ్యాక్సీన్లు ఎందుకు వ్యర్థం అవుతాయి?

అమెరికాలో మార్చి చివరి నాటికి 182,874 వ్యాక్సీన్ డోసులు వ్యర్థం అయినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నమోదు చేసిందని అమెరికాకు చెందిన కె‌ఎన్‌హెచ్ అనే హెల్త్ న్యూస్ సంస్థ తెలిపింది. అమెరికా జనవరి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేసింది.

ఫ్రాన్సులో కూడా ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లను విసిరేస్తున్న డాక్టర్ వీడియో వైరల్ అయింది.

"మూడు రోజుల్లో జరిపిన కన్సల్టేషన్‌లలో 6 డోసుల వ్యాక్సిన్లు ఇవ్వగలిగాను. కానీ, అందరూ వ్యాక్సిన్లు తీసుకోవడానికి తిరస్కరించారు" అని డాక్టర్ ప్యాట్రిక్ ఓట్ వీడియోలో చెప్పారు.

"వైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. కానీ, ఈ వ్యాక్సిన్ల గడువు ముగిసింది. దాంతో నాకు వాటిని విసిరేయడం తప్ప మరో మార్గం లేదు" అని అన్నారు.

"వ్యాక్సీన్లు ఎవరికీ అక్కరలేకపోవడంతో నేను మహమ్మారి మధ్య కాలంలో వాటిని చెత్త బుట్టలో పడేస్తున్నాను" అని చెప్పారు.

"వ్యాక్సీన్లు వ్యర్థం కావడం చాలా సాధారణం" అని యూకేలోని బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్సిటీలో సప్లై చెయిన్ మేనేజ్మెంట్ నిపుణురాలు డాక్టర్ లిజ్ బ్రీన్ అన్నారు. మహమ్మారికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ ప్రతి రోజూ ఇచ్చే 50 శాతం వ్యాక్సీన్లు వ్యర్థం అయినట్లు చెప్పారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో పోలిస్తే ఆ వ్యాక్సిన్ల వ్యర్థం చాలా తక్కువని అన్నారు.

"వృథా కావడం ఉంటుంది. కానీ, అది అతి తక్కువగా జరిగితే మంచిదని ఆశిస్తున్నాను" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రపంచంలో 5 శాతం కంటే తక్కువ జనాభా మాత్రమే వ్యాక్సీన్ తీసుకున్నారు.

"వ్యాక్సీన్లు వ్యర్థం కాకుండా టీకాలు ఇచ్చేవారికి శిక్షణ ఇవ్వడం, వీలైనంత ప్రణాళికలు చేయడం లాంటివి చేశారు. కానీ, వ్యాక్సీన్లు ఎంత మొత్తంలో వ్యర్థం అవుతున్నాయో తెలుసుకోవడం కష్టం" అని అన్నారు.

"ఈ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండు ఉంది. అవి వ్యర్థం అవుతున్నాయని ఎవరూ వినాలని అనుకోవడం లేదు. లేదా అవి వాడని దేశాల్లో నిల్వ ఉండటం కూడా ఇష్టపడటం లేదు" అని ఆమె అన్నారు.

"అలా వ్యర్థం కావడం ఆ దేశ ప్రభుత్వాల మీద సంస్థల మీద దురభిప్రాయాన్ని కలుగచేస్తుంది. మలావిలో వ్యాక్సీన్ వ్యర్థం పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ఇలాంటి పరిస్థితి మరో చోట కూడా జరుగుతూ ఉండవచ్చు. కానీ, ఆ విషయం మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా" అని ఆమె వివరించారు.

అలా జరుగుతుందని తెలియడం వల్ల బీభత్సాన్ని సృష్టించవచ్చనే అనుమానంతో కూడా ఆ విషయం గురించి వెల్లడి చేయకపోవచ్చు.

బహిరంగంగా వ్యాక్సీన్ సీసాల ధ్వంసం

ఏదైనా సీసా ఒక సారి తెరిచిన తర్వాత అందులో ఉన్న డోసులను వాడకపోయినా కూడా అవి వ్యర్ధంగా మారతాయి.

కోవిడ్ 19 వ్యాక్సీన్లు మల్టీ డోసులో రావడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.

ప్రస్తుతం ఫైజర్ వ్యాక్సీన్ 5 డోసులు ఉన్న సీసాల్లో సరఫరా అవుతోంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ 8-10 డోసులలో సరఫరా అవుతోంది.

మోడర్నాలో 10 డోసులు ఉంటాయి.

వ్యాక్సీన్లు డోసులో కొంత వేస్టేజి ఉంటుంది కాబట్టి, టీకా మందు సీసాలో కొంత మొత్తాన్ని ఎక్కువగా నింపడం ఉత్పత్తిదారులకు సాధారణమే.

ఫైజర్ వ్యాక్సీన్ సీసాల నుంచి ఆరవ డోసు కూడా వేయవచ్చని అమెరికా, యూరప్, యూకేలలో వైద్య సంస్థలన్నీ తమ నిబంధనలను సవరించాయి. దీంతో వ్యాక్సీన్లు వ్యర్థం కావడం నిరోధించవచ్చు.

వ్యాక్సీన్లు ఇవ్వడానికి సరైన సైజు సిరంజులు లేకపోవడం కూడా వేస్టేజికి కారణమని ఒక సైన్స్ పత్రికలో వచ్చిన నివేదిక చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫైజర్ వ్యాక్సీన్ సీసాల నుంచి ఆరవ డోసు కూడా వేయవచ్చని అమెరికా, యూరోప్, యూకేలలో వైద్యసంస్థలు ఆమోదించాయి

అయితే, ఇదేమంత పెద్ద విషయం కాదని డాక్టర్ స్కిఫ్లింగ్ అంటున్నారు.

"కోల్డ్ చెయిన్‌లో కలిగే అంతరాయాలు, గడువు తేదీలు, డిమాండు నిర్వహణ లాంటి చాలా అంశాలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.

ఒక రోజులో ఎంత మంది వ్యాక్సీన్ వేయించుకోవడానికి వస్తారు, ఎన్ని డోసుల వ్యాక్సీన్ అందుబాటులో ఉందనే లాంటి అంశాలు కూడా తెలుసుకోవాలి" అని ఆమె అన్నారు .

"ఒక వేళ టీకా వేయించుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్లాల్సిన బాధ్యత వ్యకిగతంగా తీసుకోవాలి. కొన్ని సార్లు మిగిలిపోయిన వ్యాక్సిన్లను ఇవ్వడానికి ప్రజలను ఆఖరు నిమిషంలో పిలుస్తున్నట్లు కూడా వింటున్నాం. ఇలాంటివి పోస్ట్ కోడ్ లాటరీ లా ఉంటాయి" అని ఆమె అన్నారు.

సీల్ తీయని టీకా మందు సీసాల నాశనం

మలావిలో జరిగిన వ్యాక్సీన్ వ్యర్థం అసలు తెరవలేని వ్యాక్సిన్లతో జరిగింది. ఇలాంటి పరిస్థితి కోల్డ్ చెయిన్ కు అంతరాయం కలిగినప్పుడు, వాటిని రవాణా చేస్తున్నప్పుడు, నిల్వ ఉంచినప్పుడు సరైన ఉష్ణోగ్రతల్లో భద్రపరచనప్పుడు, కూడా జరుగుతుంది.

"సప్లై చెయిన్ కోసం మన దగ్గర తగిన మౌలిక సదుపాయాలు ఉండటం అవసరం" అని డాక్టర్ స్కిఫ్లింగ్ అన్నారు.

ఇజ్రాయెల్, యూఏఈ లాంటి చిన్న ధనిక దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంలో విజయవంతం అయ్యాయి. వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు వారి దగ్గరున్న మౌలిక సదుపాయాలే దీనికి కారణమని చెప్పవచ్చు.

"ఆఫ్రికా, ఇండోనేసియాలాంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, మారుమూల ప్రాంతాల్లో ఉన్న జనాభాను చేరడం పెద్ద సమస్య. నిర్ణీత సమయంలో వ్యాక్సిన్లను రవాణా చేయడం కూడా కష్టమే" అని డాక్టర్ స్కిఫ్లింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇజ్రాయెల్, యూఎఈ లాంటి చిన్న ధనిక దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంలో విజయవంతం అయ్యాయి

మలావి లాగే, మిగిలిన ఆఫ్రికా దేశాల్లో కూడా వ్యాక్సీన్లు వృథా అవుతున్నాయి.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసినప్పటి నుంచి శీతల పరిస్థితుల్లో 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఏప్రిల్ గడువు తేదీ ఉన్న వ్యాక్సిన్లను ఆఫ్రికన్ యూనియన్ ఫిబ్రవరిలో సరఫరా చేసింది.

దక్షిణాఫ్రికాలో ఉన్న వేరియంట్ నుంచి ఈ వ్యాక్సీన్ రక్షణ ఇవ్వదనే ఆందోళనతో వాటిని వాడకూడదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

దాంతో, ఆ దేశం దగ్గరున్న 10 లక్షల డోసులను మిగిలిన ఆఫ్రికా దేశాలకు ఇవ్వడానికి ఆఫ్రికన్ యూనియన్‌కు అమ్మేసింది.

అయితే, ఈ గడువు తేదీ గురించి తమకు తెలియదని దక్షిణ సూడాన్ చెబుతోంది.

అదనపు డోసులతో ఏమి చేయాలి?

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా భారీ స్థాయిలో జరుగుతోంది. మనం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల డోసుల గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యాక్సిన్ల వ్యర్థం తప్పకుండా ఉంటుంది" అని డాక్టర్ స్కిఫ్లింగ్ అన్నారు.

మహమ్మారి సమయంలో ఇంకా మెరుగైన సప్లై, డిమాండ్ ప్రణాళిక చేయాలని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మలావిలో వ్యాక్సిన్ల వ్యర్థం

ఒక వేళ వ్యాక్సీన్ సీసా తెరిచి ఉంచకపోతే, వాడని అదనపు డోసులను ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నాయి.

అన్ని డోసులను వాడలేకపోతున్నందున అదనపు డోసులను పొరుగు దేశాలైన టోగో, ఘనాకు పంపిస్తున్నారు. కొన్నిటిని జమైకాకు కూడా పంపిణీ చేస్తున్నారు.

కోవాక్స్ పథకంలో భాగంగా లభించిన 17 లక్షల ఆస్ట్రాజెనెకా డోసులను వాడలేమని ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చెబుతోంది.

ఏప్రిల్ చివరి నాటికి కేవలం 1000 డోసులు మాత్రమే ఇచ్చారు. జూన్ 24 వరకు గడువు తేదీ ఉన్న వ్యాక్సీన్లను ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారు. ఇందులో కొన్ని ఇప్పటికే ఘనా, మడగాస్కర్ దేశాలకు పంపించారు.

వ్యాక్సీన్ గడువు తేదీ వల్ల ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఇతర దేశాలకు వ్యాక్సిన్లను తరలించి అవి వ్యర్థం కాకుండా చూస్తున్నట్లు గావి ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోవాక్స్ పథకంలో భాగంగా లభించిన 17 లక్షల ఆస్ట్రాజెనెకా డోసులను వాడలేమని ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చెబుతోంది.

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజల నమ్మకాన్ని పొందేందుకు గడువు తేదీ ముగిసిన వ్యాక్సిన్లను నాశనం చేయడమే సరైన పద్ధతి అని నిపుణులు అంటున్నారు.

"ఈ వ్యాక్సీన్ల వ్యర్థం గురించి ప్రజలకు తెలియడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ గురించి వచ్చిన దుష్ప్రచారంతో పాటు వ్యాక్సిన్ల పైన నమ్మకం పోయేందుకు తగినంత హాని జరిగింది అని డాక్టర్ బ్రీన్ అన్నారు.

"ఒక వేళ గడువు తేదీ ముగిసిన వ్యాక్సీన్ ఇస్తారేమోనని ప్రజలు వ్యాక్సీన్ తీసుకోవడానికి సంశయించవచ్చు. కానీ, అలా జరగడం చాలా అరుదు అని అన్నారు.

"వ్యాక్సీన్లు గడువు తేదీ ముగియడం వల్ల ఏమి హాని చేయవు. వాటి వల్ల ప్రాణాలు పోవు. కానీ, వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అవి ఇచ్చిన తర్వాత ఎవరికైనా కోవిడ్ సోకితే వ్యాక్సీన్ల పై నమ్మకం పోతుంది. భారీ స్థాయిలో చేసే వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో చిన్న మొత్తంలో వృథా కావడం సాధారణమే. కానీ, వ్యాక్సీన్లను వృథాగా పారేయడంపై పారదర్శకత ప్రదర్శించడం మాత్రం సాధారణమైన విషయం కాదు. ఇది చాలా విచారకరంగా, ఆశ్చర్యకరంగా ఉంది" అని డాక్టర్ స్కిఫ్లింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)