మియన్మార్: సైన్యానికి ఎదురు నిలిచిన ఓ చిన్న పట్టణంలోని ప్రజలు ఎలా పోరాడుతున్నారు

  • జొనాథన్ హెడ్
  • ఆగ్నేయాసియా ప్రతినిధి
మిందాత్ ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

మియన్మార్‌లోని మిండాట్ పట్టణాన్ని గతవారం సైన్యం చుట్టుముట్టింది. అయితే, సైన్యానికి స్థానిక పౌర సైన్యం దీటుగా బదులిస్తోంది.

మిండాట్‌పై మోర్టార్లు, రాకెట్లతో సైన్యం దాడిచేసింది. దీంతో చాలా మంది ప్రజలు పట్టణాన్ని వదిలి పరిసరాల్లోని అటవీ ప్రాంతంలోకి పరుగులుతీశారు.

చాలా మంది ప్రజలకు సాయం అత్యవసరమని వలంటీర్లు చెబుతున్నారు. ‘‘వారి దగ్గర ఆహారం కొంచెం మాత్రమే ఉంది. ఉండటానికి చోటు లేదు. వైద్య సేవలు అందుబాటులో లేవు’’అని వలంటీర్లు వివరించారు.

పట్టణ ప్రధాన రహదారిని సైన్యం దిగ్బంధించింది. నీటి సరఫరా నిలిపివేసింది. దీంతో పట్టణంలో మిగిలిన ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

‘‘వీధుల్లో సైనికులు నిత్యం తిరుగుతున్నారు. కాల్పులు జరుగుతున్నారు. ఇంట్లోకి చొరబడి ప్రజలను అరెస్టు చేస్తున్నారు. అందుకే చాలా మంది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతున్నారు’’అని ఒక వలంటీర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

తిరుగుబాటు అనంతరం మొదలు..

50,000 మంది కంటే తక్కువ జనాభా గల మిండాట్ పట్టణం మియన్మార్ నిరసనకారుల్లో స్ఫూర్తి నింపుతోంది. ‘‘మిండాట్ ఫైటింగ్’’అనే నినాదాలతో దేశ వ్యాప్తంగా వారు నిరసనలు చేపడుతున్నారు.

కొండల నడుమ పశ్చిమ మియన్మార్‌లోని చిన్ రాష్ట్రంలో ఈ పట్టణం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు అనంతరం చాలా ప్రాంతాల్లానే ఇక్కడ కూడా నిరసనలు మొదలయ్యాయి. ఎన్నికల్లో మోసం జరిగిందని చెబుతూ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసింది. అయితే సైన్యం చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ బయటపెట్టలేదు.

సైనిక తిరుగుబాటు అనంతరం మూడు నెలలుగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఈ నిరసనలు సైన్యం జోక్యంతో ఘర్షణలుగా మారుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

సొంతంగా తుపాకుల తయారీ..

తిరుగుబాటు తర్వాత మొదటి నెలలో తాము ఒంటరిగానే నిరసనలు చేపట్టామని మిండాట్ వాసులు చెబుతున్నారు. భారత్ సరిహద్దుల వెంబడి అటవీ ప్రాంతంలోని కొండల మీదుగా బైక్ ర్యాలీలు చేశామని వివరించారు.

అయితే, మార్చిలో మియన్మార్‌లోని ఇతర ప్రాంతాల్లోలానే ఇక్కడ కూడా నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపింది.

ఏప్రిల్ నాటికి మియన్మార్‌లో మృతుల సంఖ్య 500 దాటిపోయింది. సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలని నిరసనకారులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీరి చేతుల్లో దాదాపు ఎలాంటి ఆయుధాలూ లేవు.

కానీ పశ్చిమ మియన్మార్‌లోని చిన్ తెగలు.. ‘‘తుమి’’గా పిలిచే పొడవైన వేట తుపాకులు తయారుచేస్తుంటారు. వీరు సైన్యానికి దీటుగా నిలబడేందుకు పౌర్య సైన్యాలను ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images

తొలిసారి సైన్యం వైపు ప్రాణ నష్టం

మియన్మార్‌లోని మైనారిటీలైన చిన్ తెగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మార్చి చివర్లో సైన్యానికి ప్రతిఘటన ఎదురైంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి.

ఇక్కడే తొలిసారి సైన్యం వైపు కూడా ప్రాణ నష్టం సంభవించింది. అయితే, ఎలాంటి శిక్షణాలేని పౌరసైన్యం వైపు మృతులు కొంచెం ఎక్కువే సంభవించాయి.

బర్మీస్ యేతర తెగలు ఎక్కువగా ఉండే ఇతర సరిహద్దు రాష్ట్రాల్లానే చిన్‌లోనూ.. 1948లో మియన్మార్ స్వాతంత్ర్యం అనంతరం సైన్యం అరాచకాలకు పాల్పడింది. 1990ల్లో సైన్యాన్ని ప్రతిఘటించేందుకు ఇక్కడ చిన్ నేషనల్ ఫ్రంట్ (సీఎన్ఎఫ్) ఏర్పడింది.

సైన్యం చర్యల నుంచి తప్పించుకునేందుకు వేల మంది చిన్ ప్రజలు పొరుగునున్న భారత్‌లోకి పారిపోయారు. దీంతో సీఎన్ఎఫ్ సైనిక బలం తగ్గిపోయింది. 2012లో ప్రభుత్వంతో కాల్పుల విరమణకు సీఎన్ఎఫ్ అంగీకరించింది.

మియన్మార్ తూర్పు సరిహద్దుల్లోని కారెన్, షాన్, కాచిన్ తెగల్లా సీఎన్ఎఫ్ పోరాడలేకపోయింది. నేడు కనీసం సాయుధ తిరుగుబాటుదారు దళంగా కూడా సీఎన్‌ఎఫ్ చెప్పుకోవడం లేదు. కేవలం ప్రజలకు సాయం చేయడం, సైన్యాన్ని వ్యతిరేకించే వారికి ఆశ్రయం ఇవ్వడం లాంటి పనులు మాత్రమే చేస్తోంది.

ఫొటో సోర్స్, Reuters

‘‘ప్రాణాల కోసం పోరాడుతున్నాం’’

సీఎన్ఎఫ్ నుంచి ఎలాంటి సాయమూ అందకపోవడంతో విసుగు చెందిన చిన్ పోరాటయోధులు, ఉద్యమకారులు.. చిన్‌లాండ్ డిఫెన్ ఫోర్స్ (సీడీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఇది దేశ వ్యాప్తంగా సైన్యంతో పోరాడేందుకు ఏర్పాటైన పౌర సైన్యం.

సీడీఎఫ్‌కు చెందిన ఒక శాఖ మిండాట్‌లోనూ ఉంది. గత ఫిబ్రవరిలో సైన్యం కూల్చేసిన ప్రభుత్వానికి మద్దతు నిచ్చే కొందరు ‘‘పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ టీమ్’’ను ఏర్పాటుచేశారు. సైన్యాన్ని ప్రతిఘటించడమే వీరి లక్ష్యం.

మిండాట్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోస్టర్లు అతికించిన ఏడుగురు యువ ఉద్యమకారుల్ని అరెస్టు చేయడంతో ఇక్కడ ప్రతిఘటన తారస్థాయికి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆ ఏడుగురితోపాటు అరెస్టైన మరో ఐదుగురిని విడుదల చేయాలని ఏప్రిల్ 24న పెద్దయెత్తున జనం గుమిగూడారు. అప్పుడు కాల్పులు చోటుచేసుకున్నాయని, ముగ్గురు పోలీసు అధికారులు మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఆ తర్వాత మూడు రోజులు పరిస్థితులను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సైన్యం ప్రయత్నించింది. అయితే, సైనిక వాహన శ్రేణిపై పౌరసైన్యం దాడి చేసింది. దీంతో 15 మంది సైనికులు మరణించినట్లు పౌరసైన్య ప్రతినిధులు తెలిపారు.

ఫొటో సోర్స్, STRINGER/ANADOLU AGENCY VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

మియన్మార్‌లో నిరసనకారులు

ఏప్రిల్ 27న కాల్పుల విరమణకు సైన్యం అంగీకరించింది. అదే రోజు రాత్రి అరెస్టైన ఏడుగురు కార్యకర్తల్ని సైన్యం విడిచిపెట్టింది. ప్రతిగా సీడీఎఫ్ బంధించిన 20 మంది సైనికులన్ని విడుదల చేసింది. పోలీసులతోపాటు, సైన్యం కూడా మిండాట్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండు వారాలు ఇక్కడ ఘర్షణలు దాదాపుగా ఆగిపోయాయి.

అయితే, మిండాట్‌లోకి తమని అనుమతించాలని సైన్యం డిమాండ్ చేసింది. మరోవైపు మిగిలిన ఐదుగురు కార్యకర్తల్ని విడుదల చేయాలని సీడీఎఫ్ డిమాండ్ చేసింది. రెండు వైపులా ఈ డిమాండ్లే మే 12న తాజా ఘర్షణలకు కారణమయ్యాయి.

ఒక రోజు తర్వాత మిండాట్‌లో సైనిక చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అంతేకాదు మోర్టార్లు, రాకెట్ చోదిత గ్రెనేడ్లతో దాడులు మొదలుపెట్టింది.

మరోవైపు సైనిక వాహనాలపై సీడీఎఫ్ దాడిచేసింది. వీటిలో ఐదింటిని దహనం చేసింది. వాటిలోని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఈ దాడిలో కొంతమంది సైనికులు కూడా మరణించారు. మిగతావారు పారిపోయారు. అయితే, సైన్యం హెలికాప్టర్లను ఉపయోగించడం మొదలుపెట్టింది.

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్,

మియన్మార్‌లోని బాగోలో నిరసనకారులపై జల ఫిరంగుల ప్రయోగం

మే 15న ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగించుకొని సైన్యం మళ్లీ పట్టణంలోకి ప్రవేశించింది. దీంతో వేల మంది ప్రజలతో కలిసి పరిసరాల్లోని అడవుల్లోకి సీడీఎఫ్ ఫైటర్లు వెళ్లిపోయారు.

‘‘మా ప్రాణాల కోసం మేం పరుగులు తీస్తున్నాం’’అని ఓ ఫైటర్.. బీబీసీతో చెప్పారు. ‘‘వేల మంది అడవుల్లో ఉన్నారు. కేవలం చిన్న పిల్లలు, వృద్ధులు మాత్రమే పట్టణంలో ఉన్నారు. యువకులంతా ఆయుధాలు పట్టుకొని సీడీఎఫ్‌లో చేరారు’’.

మిండాట్‌కు కొన్ని గంటల దూరంలోని చిన్న గ్రామాల్లో ఏర్పాటుచేసిన నాలుగు శిబిరాల్లో దాదాపు 2000 మంది తలదాచుకున్నారు.

వారి దగ్గర ఆహారం చాలా తక్కువగా ఉంది. పెద్ద వర్షాలు పడుతున్నాయి. అయితే నీరు పైన పడకుండా టెంట్లు ఏర్పాటు చేయడానికి తగినన్ని వస్తువులు వారి దగ్గర లేవు. పోరాటంలో గాయపడిన వారికి చికిత్స అందండం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. పట్టణానికి శివార్లలోని ప్రాంతాలకు చాలా మంది వెళ్లిపోయి తలదాచుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

తాము మరో పోరాటానికి సిద్ధం అవుతున్నామని, చిన్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని సీడీఎఫ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వేళ్తామని సీడీఎఫ్ తెలిపింది.

సంప్రదాయ తుమీ తుపాకులకు బదులు వీరి చేతుల్లో కొత్త ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వీరు సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరికొన్నింటి మియన్మార్, భారత్‌లలోని ఇతర గ్రూపుల నుంచి సేకరించారు. ఈ ఆయుధాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)