ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి

లతీఫాతో కనిపిస్తున్న ఇద్దరు మహిళలు ఈ ఫోటోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Instagram

ఫొటో క్యాప్షన్,

లతీఫా (మధ్యలో ఉన్న మహిళ)

దుబయి పాలకుడు కుమార్తె ప్రిన్సెస్ లతీఫా తన స్నేహితులతో కనిపిస్తున్న ఓ ఫోటోను రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఇటీవల పోస్ట్ చేశారు. అంతకు కొన్నినెలల ముందు నుంచి లతీఫా కనిపించడం లేదు.

గత ఫిబ్రవరిలో లతీఫా మాట్లాడుతున్న సీక్రెట్ వీడియోను ‘బీబీసీ పనోరమ’ ప్రసారం చేసింది. తనను నిర్బంధించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని లతీఫా ఆ వీడియోలో చెప్పారు.

తాజా ఫోటోను బీబీసీ ధ్రువీకరించలేదు. ఈ ఫోటోకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు.

ఈ ఫోటోను అనుకోకుండా పోస్ట్ చేయలేదని, ఆమె అదృశ్యానికి సంబంధించిన అంశాలతో దీనికి సంబంధముందని బీబీసీ భావిస్తోంది.

ఫొటో సోర్స్, PRINCESS LATIFA

‘‘ఆమె విషయంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నట్లు మేం ధ్రువీకరిస్తున్నాం. ఈ దశలో ఇంతకుమించి మేం మాట్లాడలేం. తగిన సమయంలో పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేస్తాం’’అని ఫ్రీ లతీఫా క్యాంపెయిన్ గ్రూప్ కో ఫౌండర్ డేవిడ్ హై చెప్పారు.

బీబీసీ అడిగిన ప్రశ్నలకు లండన్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎంబసీ స్పందించలేదు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఫోటోపై స్పందించేందుకు నిరాకరించింది. ‘‘లతీఫా జీవించి ఉన్నారనే రుజువు చేసే ఆధారాల కోసం మేం ఎదురుచూస్తున్నాం’’అని తెలిపింది. యూఏఈ ఈ ఆధారాలను ఐరాసకు సమర్పించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, TIINA JAUHIAINEN

ఫోటోల్లో ఏం కనిపిస్తోంది?

దుబయిలోని ''ద మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్'' షాపింగ్ మాల్‌లో మరో ఇద్దరు మహిళలతో కలిసి లతీఫా కూర్చున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. ఫోటోలోని మిగతా ఇద్దరు మహిళలు తమకు తెలుసని లతీఫా స్నేహితులు బీబీసీతో చెప్పారు. ఆ ఇద్దరు లతీఫాకు ఆప్తులని వివరించారు.

ఈ ఫోటోను ఎప్పుడు తీశారు? ఎన్నిగంటలకు తీశారు? ఎక్కడ తీశారు? తదితర సమాచారం ఆ పోస్ట్‌లలో కనిపించడం లేదు. దీన్ని రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.

ఈ ఫోటో రివర్స్‌లో కనిపిస్తోంది. ''డీమన్ స్లేయర్: మ్యూజెన్ ట్రైన్'' సినిమా అడ్వర్టైజ్‌మెంట్ వెనుక కనిపిస్తోంది. ఈ సినిమా దుబయిలో మే 13న విడుదలైంది.

ఫోటోలు ఎప్పుడు తీశారు? లతీఫా ఇప్పుడు ఎలా ఉన్నారు? తదితర ప్రశ్నలకు ఆ ఫోటోలోని లతీఫాతో కనిపిస్తున్న ఇద్దరు మహిళలు స్పందించలేదు.

''ఈ ఫోటో నిజమైనదేనని మేం భావిస్తున్నాం. ఆమె బతికే ఉన్నారని ఈ ఫోటో రుజువు చేస్తోంది. అయితే, ఆమె నిర్బంధం గురించి ఎలాంటి వివరాలు దీనిలో తెలియడం లేదు''అని హ్యూమన్ రైట్స్ వాచ్ అడ్వకసీ గ్రూప్‌కు చెందిన కెన్నెత్ రోథ్ బీబీసీతో చెప్పారు.

శనివారం అదే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి మరో ఫోటోను పోస్ట్ చేశారు. ''లతీఫాతో కలిసి బైస్ మార్‌లో రుచికరమైన ఆహారం తిన్నాం''అని ఫోటోతోపాటు రాశారు.

దుబయిలోని బుర్జ్ ఖలీఫాలో ఈ రెస్టారెంట్ ఉంది. అంతకుమించి వివరాలను ఈ ఫోటో కింద వెల్లడించలేదు.

ఈ ఫోటోలపై యూఏఈ స్పందించలేదు. లతీఫా ఆమె ఇంటిలో క్షేమంగా ఉన్నారని గత ఫిబ్రవరిలో బీబీసీకి యూఏఈ తెలియజేసింది.

''ఆమె పరిస్థితి మెరుగుపడుతోంది. త్వరలో ఎప్పటిలానే ఆమె బయట తిరుగుతారు''అని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకూ లతీఫాకు ఏమైంది?

షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పిల్లలు 25 మందిలో ఒకరైన లతీఫా ఫిబ్రవరి 2018లో దుబయి నుంచి పారిపోయారు.

ఆమె దుబయి నుంచి వెళ్లిపోయిన కొంత సేపటికి ఓ వీడియోను విడుదల చేశారు. తనపై చాలా ఆంక్షలు విధిస్తున్నారని ఆమె చెప్పారు. ''2000 నుంచి దేశం వదిలి బయటకు రాలేదు. నాకు బయట దేశాలకు వెళ్లాలని, చదువుకోవాలని, సాధారణ జీవితం గడపాలని ఉంది. కానీ వారు ఒప్పుకోవడం లేదు''అని ఆమె వీడియోలో చెప్పారు.

అయితే, హిందూ మహాసముద్రంలో ఎనిమిది రోజులపాటు ప్రయాణించిన ఆమెను కమాండోలు పట్టుకున్నారు. బలవంతంగా మళ్లీ ఆమెను దుబయికి తరలించారు.

కమాండోలు ఆమెను వెనక్కు తీసుకురావడాన్ని.. ఆమెను కాపాడేందుకు చేపట్టిన మిషన్‌గా ఆమె తండ్రి అభివర్ణించారు.

లతీఫా సీక్రెట్‌గా రికార్డు చేసిన ఓ వీడియోను ఫిబ్రవరి 2021లో బీబీసీ పనోరమ ప్రసారం చేశారు. దుబయికి తీసుకొచ్చిన తర్వాత తన జీవితం ఎలా ఉందో దీనిలో లతీఫా వివరించారు. విదేశాల్లోని తన స్నేహితులకు ఆమె సందేశం పంపించారు.

తనను వితంతువులతో కలిపి ఓ విల్లాలో ఉంచారని వీడియోలో లతీఫా చెప్పారు. ఆ భవనం కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయని, 24 గంటలూ పోలీసులు కాపలా కాస్తుంటారని వివరించారు. తనకు వైద్యం, న్యాయ సేవలు అందుబాటులో లేవని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)