ఇటలీ: మజియోరే సరస్సు వద్ద కేబుల్ కారు తెగి పడి 12 మంది మృతి -Newsreel

ఇటలీ కేబుల్ కార్ ప్రమాదం

ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న మజియోరే సరస్సు వద్ద ఆదివారం ఓ కేబుల్ కారు తీగలు తెగడంతో కొండల్లో పడిపోయింది.

ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు తెలిపారు.

రిసార్ట్ టౌన్ స్ట్రెసా నుంచి పీడ్మాంట్ ప్రాంతంలోని మోటరోనే కొండపైకి ప్రయాణికులను చేరవేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గుబురుగా ఉన్న చెట్ల మధ్య కేబుల్ కారు పడి ఉండడం ఫొటోల్లో గమనించవచ్చు.

తొమ్మిది, ఐదు సంవత్సరాల పిల్లలిద్దరిని సంఘటన స్థలం నుంచి రక్షించి హెలికాప్టర్‌లో టూరిన్ ఆస్పత్రికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదంలో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఆల్పైన్ రెస్క్యూ అధికారులు హెచ్చరించారు.

పోలీసులు, అగ్నిమాపక దళం మొదలైన సేవలు సంఘటన స్థలం వద్దే ఇంకా ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది.

ఆదివారం ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక సమయం 12.00 గంటల ప్రాంతంలో వారికి సమాచారం అందిందని అత్యవసర సేవల అధికారులు తెలిపారు.

అంత ఎత్తు నుంచి పడడంతో కేబుల్ కారు నుజ్జునుజ్జయిపోయిందని ఆల్పైన్ రెస్క్యూ బృందం ప్రతినిధి వాల్టర్ మిలన్ తెలిపారు.

ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. కొండపైన 300 మీ (983 అడుగుల) ఎత్తులో కేబుల్ కారు తెగిపోయి ఉండవచ్చని స్థానిక మీడియా రిపోర్టులు సూచిస్తున్నాయి.

సముద్ర మట్టానికి 1,491 మీటర్ల ఎత్తులో ప్రయాణికులను తీసుకెళ్లి దింపడానికి సాధారణంగా 20 నిమిషాలు పడుతుందని స్ట్రెసా-ఆల్పైన్-మోటరోనే కేబుల్ కారు వెబ్‌సైట్ తెలిపింది.

మజియోరే సరస్సు, ఓర్టా సరస్సుకు మధ్యలో అందమైన మోటరోనే ప్రాంతం ఉంది.

కరోనావైరస్ కారణంగా కొన్నాళ్ల పాటు నిలిచిపోయిన కేబుర్ కారు సేవలు ఈమధ్యనే ప్రారంభమయ్యాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

ఫొటో క్యాప్షన్,

విశాఖకు చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వ

కోవిడ్ రిలీఫ్ సామగ్రితో విశాఖ తీరానికి చేరిన ఐఎన్ఎస్ జలాశ్వ

బ్రూనే, సింగపూర్ దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు వంటి కోవిడ్ సహాయక సామగ్రితో ఐఎన్ఎస్ జలాశ్వ విశాఖపట్నం చేరుకుంది.

భారత నౌకాదళం ప్రారంభించిన కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ 'సముద్ర సేతు II'లో భాగంగా 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, ఇతర కోవిడ్ సహాయక సామగ్రితో పాటు సింగపూర్, బ్రూనేల నుంచి 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఐఎన్ఎస్ జలాశ్వ ఆదివారం విశాఖపట్నం చేరుకుంది.

విదేశాల్లోని భారత రాయబార సంస్థలు సమకూర్చిన ఈ కోవిడ్ రిలీఫ్ సామగ్రిని దేశంలోని వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేస్తారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే లక్ష్యంతో గత ఏడాది మే 5న 'ఆపరేషన్ సముద్ర సేతు'ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 3,992 మంది స్వదేశానికి తీసుకు వచ్చారు.

మెడికల్ ఆక్సిజన్, ఇతర కోవిడ్ సహాయక సామాగ్రిని విదేశాల నుంచి తీసుకు వచ్చేందుకు ఈ ఏడాది మేలో 'ఆపరేషన్ సముద్ర సేతు II'ను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, IMD

ఫొటో క్యాప్షన్,

'యాస్' తుపాను ఉపగ్రహ చిత్రం

ముంచుకొస్తున్న 'యాస్' తుపాను, ఇండియన్ ఆర్మీ అప్రమత్తం

తౌక్తే తుపాను తర్వాత భారత్‌లోని చాలా ప్రాతాలకు ఇప్పుడు యాస్ తుపాను ముప్పు ముంచుకొస్తోందని భారత వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్' తుపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించవచ్చని వాతావరణ విభాగం చెబుతోంది.

ఈ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు జాతీయ విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో సమావేశమయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటూ, టెలికామ్, పౌర విమానయాన శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తుపాను వల్ల మే 26న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 100 కి. మీ. వేగంతో గాలులు వీయవచ్చని, చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురవచ్చని వాతావరణ విభాగం చెప్పింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మే 24 నాటికి ఇది యాస్ తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ చెప్పింది.

తదుపరి హెచ్చరికలు జారీ చేసేవరకూ సముద్రంలోకి వెళ్లకూడదని పశ్చిమ బెంగాల్ మత్స్యకారులకు సూచించింది.

యాస్ తుఫాను ముప్పు ముంచుకొస్తుండడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఇండియన్ ఆర్మీ తమ బృందాలను సిద్ధం చేసిందని ఏఎన్ఐ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

'రెండు డోసుల కోవిషీల్డ్ వ్యాక్సీన్‌తో కొత్త వేరియంట్ నుంచి 87 శాతం రక్షణ'

రెండు డోసుల ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ లేదా ఫైజర్ వ్యాక్సీన్ తీసుకుంటే భారత్‌లో వ్యాపిస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ (బీ1.617.2 వేరియంట్) నుంచి 87 శాతం వరకు రక్షణ ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్‌ను కోవిషీల్డ్ పేరుతో ‘ద సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఉత్పత్తి చేస్తోంది. దీనిని జనవరి 16 నుంచి భారత్‌లో ప్రజలకు ఇస్తున్నారు.

ఇటీవల బ్రిటన్ ప్రభుత్వ న్యూ అండ్ ఎమర్జింగ్ రెస్పిరేటరీ వైరస్ థ్రెట్స్ అడ్వైజరీ గ్రూప్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తాజా అధ్యయన ఫలితాలను ప్రవేశపెట్టినట్లు టెలిగ్రాఫ్ ఓ కథనాన్ని ప్రచురించింది. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు.

మెరుపు వేగంతో బీ1.617.2 వేరియంట్ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఒక డోసు తీసుకుంటే 33 శాతం మాత్రమే రక్షణ

ఈ రెండు వ్యాక్సీన్లలో దేన్నైనా ఒక డోసు మాత్రమే తీసుకుంటే వైరస్‌పై కేవలం 33 శాతం మాత్రమే రక్షణ లభిస్తుందని అధ్యయనంలో తేలింది.

ముఖ్యంగా హాస్పిటళ్లలో చేరడం, మరణాలను తగ్గించడంలో ఈ వ్యాక్సీన్లు క్రియాశీల పాత్ర పోషించగలవని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ తెలిపింది.

తాజా ఫలితాలతో టీకాలపై తమ నమ్మకం పెరిగిందని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాన్‌కాక్ తెలిపారు.

''వ్యాక్సీన్లతో ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చనే నమ్మకాన్ని తాజా ఫలితాలు మరింత పెంచాయి. దీనితో నాలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది''.

భారత వేరియంట్‌పై ఫైజర్ వ్యాక్సీన్ 88 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది. మరోవైపు కెంట్ వేరియంట్‌పై ఇది 93 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్‌ అరెస్ట్

రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక విభాగం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఆ విభాగం స్పెషల్ సీపీ నీరజ్ ఠాకుర్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా 'బీబీసీ'కి ఈ విషయం ధ్రువీకరించారు.

దిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన ఘర్షణలో 23 ఏళ్ల రెజ్లర్ సాగర్ చనిపోయిన కేసులో సుశీల్ కుమార్, మరికొందరిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.

అప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

సుశీల్ కుమార్ రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు.

పశ్చిమ దిల్లీలోని ముండ్‌కా ప్రాంతంలో సుశీల్‌ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)