కోవిడ్-19: మహమ్మారిని ఎదుర్కోవడంలో మహిళా నేతలే ముందున్నారా? బ్రెజిల్‌ రీసెర్చ్‌‌లో తేలిన నిజాలేంటి?

  • మారియాన శాంచెస్
  • బీబీసీ కరస్పాండెంట్
మహిళా అధినేతలు, ప్రజాప్రతినిధులు ఉన్న దేశాలు, ప్రాంతాలలో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉందని సర్వేలో తేలింది.
ఫొటో క్యాప్షన్,

మహిళా అధినేతలు, ప్రజాప్రతినిధులు ఉన్న దేశాలు, ప్రాంతాల్లో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉందని సర్వేలో తేలింది.

కరోనా మహమ్మారి కాలంలో మహిళా నాయకత్వానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు లభించాయి.

వీరిలో న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్, తైవాన్ ప్రధాని సాయ్‌ ఇంగ్-వెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా లాంటి వారు కొందరు ఉన్నారు.

కరోనా మహమ్మారి వల్ల జరగబోయే ప్రమాదాన్ని అంచనావేసి వేగంగా చర్యలు తీసుకున్నారని వీరికి పేరు ప్రతిష్టలు దక్కాయి.

అయితే, ఆరోగ్య విధానాలకు, మహిళా పాలకులకు మధ్య సంబంధాన్ని ఇటీవలి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని బ్రెజిల్‌లో నిర్వహించిన ఓ సర్వే తేల్చింది.

ఆ దేశంలో మగ నేతలకన్నా, మహిళా పాలకులు ఉన్న చోట మరణాల సంఖ్య తక్కువగా ఉందని తేలింది.

పురుషులు అధికారంలో ఉన్న ప్రాంతాల్లోని ఆసుపత్రులతో పోలిస్తే మహిళల ఏలుబడిలో ఉన్న ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో చేరిన బాధితుల సంఖ్య 30శాతం, మరణించిన వారి సంఖ్య 43 శాతం తక్కువగా నమోదైనట్లు ఈ సర్వేలో తేలింది.

మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకునే జాగ్రత్తల్లో ప్రధానమైన మాస్క్‌లు ధరింపజేయడం, పెద్ద పెద్ద గ్రూపులుగా ఒక చోట చేరకుండా మహిళా నేతలు సమర్ధవంతంగా నిబంధనలు అమలు చేశారని ఈ సర్వే తేల్చింది.

''పురుషులు అధికారంలో ఉన్న ప్రాంతాలలో కంటే మహిళలు అధికారంలో ఉన్న చోట ఈ మహమ్మారి కట్టడి చర్యలు బాగున్నాయని మా సర్వేలో తేలింది'' అని ఈ పరిశోధనలో పాల్గొన్న ఓ మహిళా రీసెర్చర్ వెల్లడించారు.

''జాతీయ స్థాయి ప్రముఖ నేతల కన్నా, కింది స్థాయి మహిళా నాయకులు కోవిడ్ నిబంధనలను అమలు చేయడంలో, సరైన విధానాలను గుర్తించి అమలు చేయడంలో ముందున్నారని తేలింది'' అని ఆమె వివరించారు.

ఫొటో క్యాప్షన్,

మెడికల్ విధానాల కన్నా సహజ విధానాల ద్వారానే కోవిడ్ నియంత్రణకు మహిళా నేతలు ప్రాధాన్యమిచ్చారు.

ప్రాణాలు కాపాడారు

ఈ సర్వే నిర్వాహకులు బ్రెజిల్‌లోని 5,500 పట్టణాలపై పరిశోధన నిర్వహించారు. 2016లో జరిగిన ఎన్నికల్లో కనీసం 700 మున్సిపాలిటిలో మహిళలకు, పురుషులకు మధ్య గట్టి పోటీ కనిపించింది.

కనీసం 2 లక్షల జనాభా ఉండి, ఒకేసారి ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలను మాత్రమే సర్వే బృందం తమ పరిశోధనకు ఎంచుకుంది.

ఒకే స్థాయిలో ఉండి, పోల్చదగిన పట్టణాలను గుర్తించిన సర్వే బృందం అక్కడి మున్సిపాలిటీలలో స్త్రీ, పురుషుల పాలనలోని తేడాలను పరిశీలించింది.

స్థానిక ప్రభుత్వ యంత్రాంగం రూపొందించిన గణాంకాల ఆధారంగా స్త్రీలు, పురుషుల పాలనలోని తేడాలను పోల్చగా, మహిళలు అధికారంలో మున్సిపాలిటీల్లో ప్రతి లక్షమందిలో 43.7శాతం తక్కువ కోవిడ్ మరణాలు సంభవించినట్లు గుర్తించారు.

అలాగే, ఈ మున్సిపాలిటీలలో ఆసుపత్రులకు వచ్చిన వారి సంఖ్య కూడా 30శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

బ్రెజిల్‌లో ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్ మరణాలు సంభవించాయి.

మహిళా నాయకులంతా నిబంధనలను సమర్ధంగా అమలు చేయడం, విధానాలకు అవసరమైన మార్పులు చేర్పులు చేయడం ద్వారా మరణాలను తగ్గించడంలో ముందంజ వేయగలిగారని సర్వే నిర్వాహకులు వెల్లడించారు.

మహిళా మేయర్లు వైద్య విధానాల కన్నా సహజ నివారణ పద్ధతులు పాటించడానికి ప్రయత్నించారు.

ప్రజలు గుంపులుగా చేరకుండా మహిళా నేతలు 5.5శాతం అధికంగా కంట్రోల్ చేయగలిగారని, మాస్కులను తప్పనిసరి చేసే విషయంలో 14 శాతం అధికంగా నిబంధనలను కఠినంగా అమలు చేశారని తేలింది.

దేశంలోని సగం మున్సిపాలిటీలో మహిళా నాయకులు ఉండి, ఇదే విధంగా నిబంధనలు అమలు చేస్తే ఇంకా ఎన్ని మరణాలను ఆపగలిగే ఉండే వాళ్లమో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు సర్వే నిర్వాహకులు.

సగంమంది మహిళా ప్రజా ప్రతినిధులుంటే 15శాతం మరణాలు తగ్గడమో, లేదంటే చనిపోయిన సుమారు అయిదున్నర లక్షలమందిలో 74 వేల మంది బ్రెజిలియన్లు ఇప్పుడు జీవించి ఉండేవారనే అంచనాకు వచ్చారు.

ప్రస్తుతం బ్రెజిల్‌లో మహిళా ప్రజాప్రతినిధులు 13శాతం ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బ్రెజిల్‌లో మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలలో 43 శాతం తక్కువ మరణాలు నమోదైనట్లు గుర్తించారు.

భిన్నమైన ఆప్షన్లు

మరి పురుష నేతలకన్నా, మహిళా నేతలు ప్రభావ వంతంగా మహమ్మారిని ఎదుర్కోవడానికి కారణాలేంటి ? చదువు, వయసులాంటి అంశాలను పరిశీలించినా వాటివల్ల ఇది సాధ్యమైనట్లు తేలలేదు.

హాస్పిటల్ బెడ్స్ సంఖ్యను పెంచడం, ప్రజారోగ్య విభాగానికి నిధులు ఎక్కువ కేటాయించడంలాంటి కోవిడ్‌కు ముందు చేసిన ప్రయత్నాలకు కూడా ఈ ఫలితాలతో సంబంధం లేదని వారు గుర్తించారు.

కరోనా నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించే దేశాధ్యక్షుడు బోల్సనారో పార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్న మున్సిపాలిటీల్లో కూడా ఈ మహిళా నేతలు నిబంధనలను కఠినంగా అమలు చేయగలిగారని సర్వేలో గుర్తించారు.

''మిగతా అన్ని విషయాలకన్నా మహిళా నేతలు అత్యంత కఠినంగా నిబంధనలను అమలు చేయడమే మహమ్మారిని ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. ఈ విషయంలో పురుషులకన్నా వారు మరింత సమర్ధంగా వ్యవహరించారు'' అని ఈ సర్వే ఫలితాల నివేదిక సహ రచయిత రాఫేల్ బ్రూస్ వెల్లడించారు.

మహిళలు మరింత ముందు జాగ్రత్త తో వ్యవహరిస్తారన్న మాటకు ఈ సర్వే ఫలితాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని ఇటలీకి చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చర్ గగేట్ మిరాండా వ్యాఖ్యానించారు.

''చికిత్సకన్నా నివారణ మీద... అంటే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడంలాంటి వాటిపై ఈ మహిళా నేతలు ఎక్కువగా దృష్టి పెట్టారు'' అని మిరాండే అన్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో ఫేస్ మాస్కులు కూడా లేని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

రాజకీయ శక్తి

యూనివర్సిటీ ఆఫ్ సావోపాలో, ఇన్‌‌స్పైరా సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ప్రస్తుతం నిపుణుల పరిశీలనలో ఉంది. అయితే, ఇందులో బైటపడ్డ విషయాలు గతంలో జరిగిన కొన్ని పరిశోధనలకు, సర్వేల ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.

అమెరికాకు చెందిన జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ 2020లో విడుదల చేసిన నివేదికలో ఆ దేశంలో మహిళా గవర్నర్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే పురుషుల అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కోవిడ్ మృతులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

మీడియాతో మాడ్లాడే విషయంలో మహిళలు మరింత సమర్ధవంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారని కూడా ఈ జర్నల్ నివేదిక తెలిపింది.

ఈ సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ అండ్ రీడింగ్ విడుదల చేసిన ఓ నివేదికలో మహిళలు అధినేతలుగా ఉన్న దేశాలు, పురుష నాయకత్వంలో ఉన్న దేశాలను పోల్చినప్పుడు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మహిళా నేతలు సమర్ధవంతంగా వ్యవహరించినట్లు తేలింది.

ఈ పరిశోధన ఫలితాలు ఎలా ఉన్నా, రాజకీయ రంగంలో మహిళల ప్రాధాన్యత పురుషులకన్నా తక్కువగా ఉందన్న విషయం మాత్రం స్పష్టం. ఈ కారణంగా కూడా మహమ్మారి కాలంలో పరిస్థితులు దారుణంగా మారాయని ఈ సర్వే ఫలితాలను బట్టి అంచనా వేయవచ్చు.

''బ్రెజిల్‌లో మహిళా ప్రజాప్రతినిధులు పురుషులను మించకుండా నిబంధనలు ఉన్నాయి. అందుకే, సమర్ధులైన కొద్దిమంది మహిళలే గెలవడమో, విజయానికి చేరువగా రావడమో జరుగుతుంది'' అన్నారు మిరాండ.

''తమ విధులు నిర్వర్తించే విషయంలో మహిళా మేయర్లు ఒత్తిడికి గురవుతారు. దీనికి అదనంగా వారు రాజకీయంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ, దాన్ని మనం కొలమానంగా తీసుకోలేం'' అని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న బ్రూస్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)