హోలోకాస్ట్‌పై జోకులు వేసినందుకు ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల డైరెక్టర్‌‌ తొలగింపు

కోబయాషి

ఫొటో సోర్స్, NEWSCOM / ALAMY STOCK PHOTO

ప్రపంచ క్రీడోత్సవం మొదలు కావడానికి ఒక రోజు ముందు ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరెక్టర్‌గా ఉన్న కెంటారో కొబయాషిని తొలగించారు.

కెంటారో కోబయాషికి 1990లలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు చెందిన ఫుటేజి ఇటీవల బయటపడింది. అందులో ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల మారణహోమం - హోలో కాస్ట్‌పై జోకులు వేశారు.

ఈ వీడియోలో ఆయన 'చరిత్రలోని బాధాకరమైన వాస్తవాలను' హేళన చేశారని జపాన్ ఒలింపిక్స్ చీఫ్ సీకో హషిమోటో వెల్లడించారు.

టోక్యో ఒలింపిక్స్‌ను తాకిన వరుస కుంభకోణాల్లో ఈయన తొలగింపు సరికొత్తది.

ఈ ఏడాది ప్రారంభంలో ముగ్గురు నిర్వాహకులను ఒలింపిక్స్‌ బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించారు.

కమెడియన్ అయిన కోబయాషి, 23 ఏళ్ల క్రితం పిల్లలను సంతోషపరిచే ఒక వినోద కార్యక్రమంలో మరో కమెడియన్‌తో కలిసి నటించారు.

అందులో కోబయాషి తన సహచరుడికి ఓ కాగితం బొమ్మ చూపిస్తూ, "నువ్వు 'మనం హోలోకాస్ట్ ఆడదాం' అని అన్నావు కదా. ఇవి ఆ కాలానికి చెందినవే" అని వ్యాఖ్యానించారని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఈ వ్యాఖ్యలను జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగా తీవ్రంగా ఖండించారు. "ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని దారుణమైన వ్యాఖ్య" అని ఆయన అన్నారు.

"ఎంత సృజనాత్మకత ఉన్న వ్యక్తికైనా నాజీ మారణహోమ బాధితులను వెక్కిరించే హక్కు లేదు' అని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న హోలోకాస్ట్‌ పరిశోధన సంస్థ సిమన్ వీసెంథాల్ సెంటర్‌కు చెందిన రబ్బీ అబ్రహాం కూపర్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA

తన తొలగింపుపై స్వయంగా కోబాయాషి కూడా వివరణ ఇచ్చారు.

"వినోదం ప్రజలకు ఎప్పుడూ అసౌకర్యంగా ఉండకూడదు. నేను ఆ సమయంలో ఎంపిక చేసుకున్న మాటలు సరైనవి కాదు. అందుకు చింతిస్తున్నాను" అన్నారు.

కోబయాషిని నియమించే ముందు ఈ వ్యాఖ్యల గురించి తనకు తెలియదని ఒలింపిక్స్ చీఫ్ సీకో హషిమోటో చెప్పారు. ఒలింపిక్స్‌లో భాగమైనవారు, టోక్యో ప్రజలు, జపనీయులు తనను క్షమించాలని కోరారు.

చివరి నిమిషంలో మార్పులు జరిగినా క్రీడలను అనుకున్నట్లుగానే నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు.

కోవిడ్ నేపథ్యంలో, ఒలింపిక్స్‌ను కేవలం 950 మందితో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఒలింపిక్ క్రీడలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదు.

ఓ వారం క్రితం క్రీడలు రద్దు కూడా కావొచ్చని టోక్యో ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఓటింగులో 55 శాతం మంది జపనీయులు ఒలింపిక్స్ నిర్వహణను నిలిపేయాలని కోరుకున్నారు. ఈవెంట్తో కరోనా వైరస్ మరితం వేగంగా వ్యాప్తి చెందుతుందనే భయాందోళనలే ఇందుకు కారణమని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది.

జపాన్లో మూడింట ఒక వంతు మందికి మాత్రమే ఇప్పటిదాకా వ్యాక్సీన్ అందించగలిగారు. ఒలింపిక్స్ నిర్వాహకులు కూడా అంతకంతకూ దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను పరిశీలిస్తున్నారు.

కొందరు క్రీడాకారులకు ఇప్పటికే కరోనా వైరస్ సోకింది. దీంతో క్రీడలు జరిగే రెండు వారాల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో 'జీరో రిస్క్' ఆటలు నిర్వహించలేరని, ఇప్పటివరకూ ఒలింపిక్స్ నిర్వాహకులు తమ బాధ్యతలు నిర్వహించడం సఫలం అయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియెసస్ అభినందించారు.

'కేసులేవీ నమోదు కాకపోవడం విజయం కాదు. వచ్చిన కేసులను ఎంత తొందరగా గుర్తించి, వైద్యం అందజేస్తారో అందులోనే విజయం ఉంది' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)