చైనా: నాన్‌జింగ్‌లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్, 'వూహాన్' కన్నా ప్రమాదకరం అంటున్న అధికారులు

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

చైనాలోని నాన్‌జింగ్‌ నగరంలో తొలిసారిగా బయటపడిన కొత్త కరోనావైరస్ వేరియంట్, ఇప్పటివరకు 5 ప్రావిన్సులతో పాటు బీజింగ్ నగరంలోనూ వ్యాప్తి చెందుతోంది.

‘వూహాన్‌ వేరియంట్’ తర్వాత ఇది అత్యంత విస్తృతంగా వ్యాప్తి చెందే వేరియంట్‌ అని దేశ జాతీయ మీడియా పేర్కొంది.

నాన్జింగ్‌లోని రద్దీగా ఉండే విమానాశ్రయంలో జూలై 20న ఈ వైరస్‌ను గుర్తించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 200 మంది దీని బారిన పడ్డారు.

ఈ కేసుల నడుమ అధికారుల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే అధికారులు ఇప్పటికే నగర వ్యాప్తంగా పరీక్షలను విస్తృతం చేశారు.

నాన్‌జింగ్‌ విమానాశ్రయం నుంచి ఆగస్టు 11 వరకు అన్ని విమాన ప్రయాణాలను నిలిపివేసినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

సందర్శకులతో కలిపి నగరంలోని మొత్తం 93 లక్షల మంది ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారని షిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.

తాజాగా బయటపడిన ఈ వైరస్‌కు, ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయంలో బయటపడిన కారణంగా ఇది తీవ్రంగా వ్యాపించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

వైరస్ వ్యాప్తి పట్ల విమానాశ్రయ నిర్వహణ వ్యవస్థను కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్ క్రమశిక్షణా సంస్థ మందలించింది. ‘పర్యవేక్షణలో నిర్లక్ష్యంతో పాటు వృత్తిపరమైన నిర్వహణ లోపాల వల్లే వైరస్ వ్యాపించింది’ అని ఆ సంస్థ పేర్కొంది.

రాజధాని నగరం బీజింగ్‌తో పాటు చెంగ్డూ సహా కనీసం 13 నగరాల్లో ఈ వైరస్ వ్యాపించినట్లు పరీక్షలు వెల్లడిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

అయితే, గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడిన నిపుణులు మాత్రం ఈ వైరస్ వ్యాప్తి ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, దాన్ని నియంత్రించవచ్చని నమ్ముతున్నారు.

వైరస్ సోకిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని నాన్జింగ్‌లోని స్థానిక అధికారులు తెలిపారు. కొత్తగా కేసులు పెరుగుతుండటంతో, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా చైనా టీకాలు పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి.

తాజాగా వైరస్ బారిన పడినవారు వ్యాక్సీన్ తీసుకున్నారా లేదా అనే అంశంలో స్పష్టత లేదు.

ఇప్పటివరకు చైనా వ్యాక్సీన్ల పైనే ఆధారపడిన అనేక ఆగ్నేయాసియా దేశాలు తాము ఇతర టీకాలను కూడా ఉపయోగిస్తామని ఇటీవలే ప్రకటించాయి.

సరిహద్దులను మూసివేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని చైనా కట్టడి చేసింది. స్థానికంగా వైరస్ వ్యాప్తిని కూడా సమర్థంగా అడ్డుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)