అఫ్గానిస్తాన్: మూడు నగరాల్లో భీకర కాల్పులు, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లు

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, AFP

అఫ్గానిస్తాన్‌లో మూడు ప్రధాన నగరాలను ప్రభుత్వ బలగాల నుంచి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబాన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

హెరాత్, లష్కర్ గాహ్, కాందహార్‌లలో ఆదివారం కూడా విధ్వంసకర ఘర్షణలు చెలరేగాయి.

సెప్టెంబర్ నాటికి దాదాపు అన్ని విదేశీ దళాలు ఆ ప్రాంతాలను ఖాళీ చేస్తాయని ప్రకటించినప్పటి నుంచి తాలిబన్లు గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం అయ్యారు.

ప్రభుత్వ దళాలు ఎంతకాలం తమ పట్టు నిలుపుకుంటాయనే అంశంపై ఈ మూడు కీలక నగరాల భవితవ్యం ఆధారపడి ఉంది.

అఫ్గాన్‌ భూభాగంలోని సగం ఇప్పటికే తాలిబాన్ల పరమైనట్లు భావిస్తున్నారు. ఇరాన్, పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాలు కూడా వారి వశమయ్యాయి. అయితే, దేశ రాజధాని మాత్రం ఇంకా వారికి చాలా దూరంలోనే ఉంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

కాందహార్‌లో వేలమంది నిరాశ్రయులయ్యారు

లష్కర్ గాహ్‌లో భీకర కాల్పులు

లష్కర్ గాహ్ నగరంలో ప్రభుత్వ బలగాలు, తాలిబాన్ల మధ్య భీకర ఘర్షణలు ఆదివారం కూడా కొనసాగాయి.

శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి కేవలం కొన్ని వందల కి.మీ. దూరానికి తాలిబాన్లు వచ్చేశారు. అయితే, ఉదయానికల్లా వారిని మళ్లీ ప్రభుత్వ బలగాలు వెనక్కి వెళ్లేలా చేశాయి.

తాలిబాన్లే లక్ష్యంగా అఫ్గాన్, అమెరికా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. వీటిలో డజన్ల మంది తాలిబాన్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

''తాలిబాన్లకు మాపై దయలేదు. ప్రభుత్వం కూడా బాంబులు వేయడం ఆపడం లేదు''అని లష్కర్ గాహ్‌లో ఉండే హలీమ్ కరీమీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, EPA

కాందహార్‌కు చెందిన ఒక ఎంపీ బీబీసీతో మాట్లాడుతూ 'నగరం అత్యంత ప్రమాదంలో ఉంది. ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులయ్యారు. మానవతా విపత్తు పొంచి ఉంది' అని చెప్పారు.

గంట గంటకూ పరిస్థితి చేజారిపోతోందని గుల్ అహ్మద్ కమీన్ తెలిపారు. నగరంలో జరుగుతోన్న పోరాటం గత 20 ఏళ్లలో అత్యంత తీవ్రమైనదని అన్నారు.

'తాలిబన్లు కాందహార్‌ను కేంద్ర బిందువుగా భావిస్తున్నారు. దీన్ని వారి తాత్కాలిక రాజధానిగా మార్చాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ నగరం వారి ఆధీనంలోకి వెళ్లిపోతే దీనితో పాటు 5 లేదా 6 ప్రావిన్సులను కూడా కోల్పోవాల్సి వస్తుంది' అని కమీన్ వెల్లడించారు.

'నగరంలో అన్ని వైపులా తాలిబన్లు ఉన్నారు. ఒకవేళ వారు లోపలికి చొరబడితే, నగరంలో జనాభా భారీగా ఉండడం వల్ల ప్రభుత్వ బలగాలు భారీ ఆయుధాలను ఉపయోగించలేవు' అని చెప్పారు.

హెరాత్‌లో ఘర్షణలు తీవ్రతరం అయ్యాయని టోలో న్యూస్ రిపోర్టర్ వెల్లడించారు. నగరంలోని దక్షిణ ప్రాంతాల్లోకి తాలిబన్లు ప్రవేశించారని చెప్పారు.

కనీసం 5 వేర్వేరు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అఫ్గాన్ బలగాలకు మద్దతుగా అమెరికా వైమానిక దాడులు చేస్తోంది.

విమానాశ్రయం సమీపంలోని యూఎన్ కాంపౌండ్‌కు కాపలా ఉన్న గార్డు శుక్రవారం హత్యకు గురయ్యారు. దీన్ని ఉద్దేశపూర్వక తాలిబన్ల దాడిగా అమెరికా పేర్కొంది.

నగరంలోని కొన్ని ప్రాంతాలు సురక్షితంగా ఉన్నట్లు అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. తమని తాము రక్షించుకునేందుకు ఆయుధాలను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.

తిరుగుబాటుదారులు దక్షిణ ప్రావిన్స్ హెల్మండ్ రాజధాని లష్కర్ గాహ్‌లో సిటీ సెంటర్‌కు కేవలం 2 కి.మీ దూరంలోకి చేరుకున్నారు. అయితే వారిని తిప్పికొట్టడంలో ప్రభుత్వ దళాలు సఫలమయ్యాయి.

తీవ్రవాదులకు భారీ ప్రాణనష్టం జరిగిందని అఫ్గాన్ దళాల కమాండర్ చెప్పారు.

తాలిబన్లు శుక్రవారం గవర్నర్ కార్యాలయానికి చేరువగా వచ్చినట్లు స్థానికులు బీబీసీతో చెప్పారు. వారిని ప్రభుత్వ దళాలు తిప్పికొట్టాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)