మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న అఫ్గాన్ సింహం
- బీబీసీ మానిటరింగ్
- న్యూస్ రిపోర్టింగ్, విశ్లేషణ

ఫొటో సోర్స్, MASSOUD HOSSAINI/AFP via Getty Images
అఫ్గానిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో తాలిబన్లతో భీకరంగా పోరాడుతున్న వారిలో ‘‘మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్’’ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన్ను అందరూ ‘‘అఫ్గాన్ సింహం’’ అని కొనియాడుతున్నారు.
రెండు వారాలుగా హెరాత్‌లో తాలిబన్లపై సైనిక చర్యలకు ఖాన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన, ఆయన అనుచరులు నేరుగా ఆయుధాలు పట్టి, యుద్ధ క్షేత్రంలోకి దిగుతున్నారు.
తాలిబన్లను తట్టుకొని హెరాత్ ఇలా నిలబడటానికి ఖాన్, ఆయన అనుచరులే కారణమని అఫ్గాన్‌లోని చాలా వార్తా సంస్థలు కొనియాడుతున్నాయి.
‘‘ఆమిర్ ఇస్మాయిల్ ఖాన్, ఆయన అనుచరులు యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టకపోయుంటే, హెరాత్ కూడా ఎప్పుడో తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయుండేది. ఖాన్, ఆయన నేతృత్వంలోని పబ్లిక్ రెబల్ ఫోర్సెస్ కలిసి తాలిబన్ల ఆశలకు గండికొట్టారు’’అని అర్మాన్-ఏ-మిలీ పత్రిక సంపాదకీయం ప్రచురించింది.
ఫొటో సోర్స్, Aref Karimi/AFP via Getty Images
తజిక్ సింహం..
మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్‌ను ఆయన అనుచరులు ‘‘బూడా శేర్’’అని పిలుస్తుంటారు. అంటే విశేష అనుభవమున్న సింహం అని అర్థం.
ఖాన్.. తజిక్ తెగకు చెందినవారు. తజిక్ తెగల్లో ఎక్కువ మంది తజికిస్తాన్లో ఉంటారు. వీరిలో కొందరు అఫ్గాన్‌లోనూ ఉన్నారు. అఫ్గాన్‌లోని తజిక్‌లు ఇస్మాయిల్ ఖాన్‌కు గట్టి మద్దతుదారులు.
హెరాత్‌లోని శిందాంద్ జిల్లాలో 1946లో ఖాన్ జన్మించారు. జమీయత్-ఏ-ఇస్లామీ సీనియర్ నాయకుల్లో ఈయన కూడా ఒకరు.
1978ల్లో అఫ్గాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఖాన్ పనిచేసేవారు. కాబూల్‌లోని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వంపై భారీ తిరుగుబాటుకు ఆయన ప్రణాళికలు రచించారు. అయితే, 1979లో అఫ్గాన్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించింది. దీంతో ఖాన్.. ముజాహిదీన్ కమాండర్‌గా మారిపోయారు.
1980ల నుంచి సోవియట్ యూనియన్ ఇక్కడి నుంచి నిష్క్రమించే వరకు.. ఆయన ముజాహిదీన్ కమాండర్‌గానే ఉన్నారు. పశ్చిమ అఫ్గాన్‌లోని భారీ ముజాహిదీన్ సైన్యానికి ఆయన నాయకత్వం వహించారు.
ఫొటో సోర్స్, Aref Karimi/AFP via Getty Images
ఇరాన్లో తలదాచుకొని..
1992 నుంచి 1995 మధ్య గవర్నర్‌గా ఖాన్ పనిచేశారు. ఆ తర్వాత, హెరాత్ ప్రావిన్స్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. దీంతో ఖాన్.. ఇరాన్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత, తిరిగి వచ్చిన ఆయన్ను తాలిబన్లు ఖైదు చేశారు. అయితే, 2000లో ఆయన జైలు నుంచి పరారయ్యారు. అనంతరం యాంటీ-తాలిబన్ నార్తెర్న్ కోలేషన్తో చేతులు కలిపారు.
2001లో అఫ్గాన్‌లో అమెరికా కాలుమోపడంతో, తాలిబన్ పాలనకు తెరపడింది. దీంతో మళ్లీ హెరాత్ గవర్నర్‌గా ఖాన్ బాధ్యతలు తీసుకున్నారు.
ఖాన్ హయాంలో కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేశారని, ప్రభుత్వ సేవలను మెరుగుపరిచారని ఆయన అనుచరులు చెబుతుంటారు. అయితే, ఆయన హయాంలో ప్రజా ధనాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడంలో అవకతవకలు జరిగాయని కొందరు విమర్శిస్తున్నారు.
2005లో హమిద్ కర్జాయ్ ప్రభుత్వంలో ఖాన్.. జల వనరులు, ఇంధన శాఖల మంత్రిగా నియమితులయ్యారు. 2013 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు.
2014లో దేశ అధ్యక్ష పదవికి ఖాన్ పోటీ చేశారు. అయితే, ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆయన ఏం చెబుతారు?
అఫ్గాన్‌లో పాకిస్తాన్ పాత్రను మొదట్నుంచి ఖాన్ తప్పుపడుతున్నారు. ముఖ్యంగా తాలిబన్ల హింస విషయంలో పాక్‌ను ఆయన తూర్పారబడుతున్నారు.
‘‘ఈ యుద్ధం ప్రభుత్వ బలగాలు, తాలిబన్ల మధ్య కాదు. ఇది పాక్, అఫ్గాన్ల మధ్య యుద్ధం. ఈ విషయాన్ని అఫ్గాన్ ప్రజలందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. పాక్ చేతిలో తాలిబన్ ఒక పావు లాంటిది’’ అని ఆగస్టు 4న ఓ ప్రైవేటు టీవీ ఛానెల్లో ఆయన చెప్పారు.
‘‘చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్ లాంటి దేశాల సాయంతో మేం ఏమైనా చేయగలమని తాలిబన్లు అనుకుంటున్నారు. కానీ అఫ్గాన్‌లో అది సాధ్యంకాదు’’ అని 2017లో అరియానా న్యూస్ ఛానెల్లో ఆయన వ్యాఖ్యానించారు.
2021, జులైలో హెరాత్ నగరానికి సమీపంగా తాలిబన్లు వచ్చినప్పుడు ప్రజల ధైర్యాన్ని ఖాన్ కొనియాడారు.
‘‘తాలిబన్లను నగరంలోకి రానివ్వబోమని మన ప్రజలు చక్కగా చెప్పారు. కొన్ని జిల్లాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో వారు నగరానికి సమీపంలోకి వచ్చారు. అయితే, నగరానికి రక్షణగా ప్రజలు తీసుకున్న చర్యలు ఎంతో ఉపయోగపడ్డాయి’’ అని ఆయన అన్నారు.
అయితే, హెరాత్‌లో తాలిబన్లపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించడం లేదని ఖాన్ విమర్శిస్తున్నారు.
‘‘వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదు. ఉదాహరణకు ఆయుధాలు ఇతర రక్షణ సామగ్రి పంపిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు మాకు అవి చేరలేదు. కానీ నగరాన్ని కాపాడేందుకు వేల మంది యువకులు సిద్ధంగా ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
ఎవరు ఏం అంటున్నారు?
తాలిబన్లపై ఖాన్ చేపడుతున్న సైనిక చర్యలను కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ప్రశంసిస్తున్నారు.
‘‘మా ముజాహిదీన్ సోదరుడు ఆమిర్ మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, సైన్యాధికారులు, పౌరులు ప్రదర్శిస్తున్న అసమాన ధైర్యాన్ని మేం కొనియాడుతున్నాం. ఈ కష్టకాలంలో మేం వారికి తోడుగా ఉంటాం’’అని హై కౌన్సిల్ ఆఫ్ నేషనల్ రీకన్సీలియేషన్ చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
‘‘ఆమిర్ మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ నేతృత్వంలో హెరాత్ ప్రజలు చేస్తున్న కృషి దేశానికి గర్వకారణం. మనం వారిని ప్రశంసించాలి. విలువలు, గౌరవం కోసం ప్రజలు ముందుకు వచ్చి పోరాడతారని ఇది రుజువు చేస్తోంది’’అని జమియాత్-ఏ-ఇస్లామీ నాయకుడు సలాహుద్దీన్ రబ్బానీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)