అఫ్గానిస్తాన్ యుద్ధం: వ్యూహాత్మక కుందుజ్ సహా ఐదు ప్రాంతీయ రాజధానులు తాలిబన్ల వశం

అఫ్గానిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. తాజాగా మూడు ప్రాంతీయ రాజధానులు తాలిబన్ల వశమయ్యాయి.

ఆదివారం ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని కీలక నగరం కుందుజ్, సార్-ఇ-పుల్, తలోకాన్‌లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో శుక్రవారం నుంచి తాలిబన్లు ఐదు ప్రాంతీయ రాజధానులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కుందుజ్‌ను స్వాధీనం చేసుకోవడం తాలిబన్లు ఈ ఏడాదిలో సాధించిన భారీ విజయం.

రాజధాని కాబూల్‌ సహా దేశంలో ఏ ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా కుందుజ్ ప్రధాన కూడలిగా ఉంది.

గత కొన్ని వారాలుగా తాలిబన్లు అఫ్గాన్ ప్రభుత్వ బలగాలపై పైచేయి సాధిస్తున్నారు.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు, ఇప్పుడు కీలక పట్టణాలు, నగరాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఆదివారం గంటల వ్యవధిలోనే ఉత్తరంగా ఉన్న మూడు నగరాలు తాలిబన్ల నియంత్రణలోకి వచ్చాయి.

కుందుజ్‌ నగరం అంతా గందరగోళంగా ఉందని ఒక స్థానికుడు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం - అఫ్గాన్ ప్రభుత్వం

మరోవైపు, తమ దళాలు కీలక స్థావరాలను తిరిగి చేజిక్కించుకునేందుకు పోరాడుతున్నాయని అఫ్గాన్ ప్రభుత్వం వెల్లడించింది.

పశ్చిమాన హెరాత్‌, దక్షిణ నగరాలైన కాందహార్, లష్కర్ గాహ్‌లో కూడా భీకర ఘర్షణలు జరిగాయి.

ఈ ఏడాది అఫ్గాన్ భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న భీకర పోరులో వేలాది మంది పౌరులు నిర్వాసితులయ్యారు. చిన్న పిల్లలతో సహా చాలా కుటుంబాలు ఈశాన్య నగరం అసదాబాద్‌లోని ఒక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నాయి.

''మా గ్రామంపై ఎన్నో బాంబులు పడ్డాయి. తాలిబన్లు వచ్చి అన్నీ ధ్వంసం చేశారు. మేము నిస్సహాయంగా ఉన్నాము. మా ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. పిల్లలతో కలిసి నేలపైనే పడుకుంటున్నాం'' అని గుల్ నాజ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.

''అక్కడ కాల్పులు జరిగాయి. నా ఏడేళ్ల పాప ఆ సమయంలో బయటకు వెళ్లి కనిపించకుండాపోయింది. తను బతికుందో లేదో నాకు తెలీదు'' అని మరో నిర్వాసితుడు చెప్పారు.

తాలిబన్ల స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తీవ్రవాదులు చనిపోయారని అఫ్గాన్ సైనిక అధికారులు తెలిపారు.

అయితే అమెరికా వైమానిక దాడుల్లో లష్కర్ గాహ్‌లోని రెండు ఆస్పత్రులు, ఒక పాఠశాల దెబ్బతిన్నాయని తాలిబన్లు చెబుతున్నారు. ఈ రెండు వాదనలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.

అఫ్గాన్ నగరాలపై తాలిబన్ల హింసాత్మక దాడిని అఫ్గానిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. బలవంతంగా పాలించాలనుకోవడం ఆమోదయోగ్యం కాదు అని పేర్కొంది.

''పౌరుల సంక్షేమం, హక్కులను వారు కాలరాస్తారు. దేశ ప్రజలు మరింత సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తారు'' అని ఒక ప్రకటనలో పేర్కొంది.

తాలిబన్లు మేలో తమ దాడులు ప్రారంభించినప్పటి నుంచి కుందుజ్‌ను స్వాధీనం చేసుకోవడం వారికి భారీ విజయం లాంటిది.

కాబూల్‌ సహా ఇతర ప్రధాన నగరాలను అనుసంధానించే హైవేలు ఉండడం వల్ల కుందుజ్‌ వ్యూహాత్మకంగా ముఖ్యమైన నగరం. ఈ ప్రావిన్స్ తజికిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటోంది.

నల్లమందు, హెరాయిన్లను మధ్య ఆసియాకు అక్రమ రవాణా చేయడానికి అఫ్గానిస్తాన్‌లో ఈ సరిహద్దును ఉపయోగిస్తున్నారు. అక్కడి నుంచి యూరప్‌కు రవాణా సులభతరం అవుతుంది. కుందుజ్‌ని నియంత్రించడం అంటే ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైన డ్రగ్స్ అక్రమ రవాణాను నియంత్రించడమే.

తాలిబన్ల ఉనికిలో కుందుజ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. 2001కి ముందు ఉత్తరాన తాలిబన్లకు అది కంచుకోటగా ఉండేది. మిలిటెంట్లు ఈ నగరాన్ని 2015. 2016లో స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎక్కువ కాలం ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోలేక పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)