బియ్యంలో ఆర్సెనిక్ ఎంత ప్రమాదకరం, అన్నం ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా

ఫొటో సోర్స్, EPA/WAQAR HUSSAIN
ప్రపంచవ్యాప్తంగా బియ్యం వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా ఆసియా దేశాల్లో వరి ప్రధాన ఆహారంగా ఉంది.
కొంతమంది రైస్ డ్రింక్‌ను పాలకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తున్నారు. బియ్యంతో తయారు చేసే మిగతా పదార్థాల వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది.
అయితే, బియ్యంలో ఆర్సెనిక్ ఉండడం పెద్ద సమస్యా? అది నిజమే అయితే మనం ఆ ముప్పును ఎలా తప్పించుకోవాలి? అనే ప్రశ్నలకు బీబీసీ సిరీస్ 'ట్రస్ట్ మీ అయాం ఎ డాక్టర్'లో పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేశారు.
ఆర్సెనిక్ సహజంగా తయారయ్యే ఒక మూలకం. అది మట్టి, నీళ్లలో కూడా ఉంటుంది.
ఆర్సెనిక్ విషపూరితం కావచ్చు. యూరోపియన్ యూనియన్ దీనిని మొదటి కేటగిరీ కాన్సర్ కారకాల జాబితాలో ఉంచింది. అంటే మనుషుల్లో కాన్సర్ రావడానికి ఆర్సెనిక్ కూడా కారణం కావచ్చు.
ఫొటో సోర్స్, Science Photo Library
బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి
మట్టి, నీళ్లలో ఆర్సెనిక్ ఉంటుంది కాబట్టి, వాటిలోని కొంత మోతాదు ఆహార పదార్థాల్లో కూడా ఉండడం అనేది సాధ్యమే. కానీ సాధారణంగా మన ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ స్థాయి ఎంత తక్కువగా ఉంటుందంటే, దాని గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
కానీ మిగతా ఆహార ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి పది నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
వరి పొలాలకు నీళ్లు ఎక్కువగా ఉపయోగించడమే దీనికి ప్రధాన కారణం. దానివల్ల ఆర్సెనిక్ మట్టిలో నుంచి వరి ధాన్యంలోకి చేరడం చాలా సులభం అవుతుంది.
బెల్ఫాస్ట్ క్వీన్స్ యూనివర్సిటి ప్రొఫెసర్ ఆండీ మెహార్గ్ దీనిపై ఎన్నో ఏళ్లపాటు పరిశోధనలు చేశారు. బీబీసీ ప్రెజెంటర్ మైకేల్ మోల్జీ ఆయన్ను దీనికి సంబంధించి చాలా ప్రశ్నలు అడిగారు.
వాటికి మెహార్గ్ తన రీసెర్చ్, టెస్టింగ్ ఆధారంగా సమాధానాలు ఇచ్చారు.
బాస్మతి బియ్యంలో మిగతా రకాల బియ్యంతో పోలిస్తే ఆర్సెనిక్ స్థాయి తక్కువగా ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో ఆర్సెనిక్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. బియ్యపు గింజ చుట్టూ ఉండే పొట్టు దానికి కారణం.
ఆర్గానిక్ వరి సాగు వల్ల ఆర్సెనిక్ స్థాయిలో ఎలాంటి తేడాలూ ఉండవు. తాగే నీళ్లలో ఎంత ఆర్సెనిక్ అనుమతించారో, రైస్ మిల్క్‌లో అది అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది.
బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిని నిర్ణయించే చట్టాలు కూడా బ్రిటన్‌లో ఉన్నాయని ప్రొఫెసర్ యాండీ మెహార్గ్ చెప్పారు.
బియ్యంలో ఆర్సెనిక్ ఉండడంపై 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ గైడ్‌లైన్స్ జారీ చేసింది. యూరప్‌లో విక్రయించే వరి ఉత్పత్తులకు యూరోపియన్ యూనియన్ కూడా ఆర్సెనిక్ స్థాయిని నిర్ణయించింది.
యూరోపియన్ యూనియన్ చిన్న పిల్లల కోసం విక్రయించే ఉత్పత్తులకు ఆర్సెనిక్ కనీస స్థాయిని నిర్ధరిస్తుంది. భారత్‌లో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్లో బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి గురించి చాలాసార్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
పిల్లలను, అన్నం ఎక్కువగా తినేవారిని దీన్నుంచి కాపాడ్డానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ ఆండీ మెహార్గ్ అభిప్రాయ పడుతున్నారు.
ఫొటో సోర్స్, REUTERS/NAVESH CHITRAKAR
అంతర్జాతీయ సంస్థలు ఏం చెబుతున్నాయి
ప్రపంచంలోని ఒక భాగంలో వరి ప్రధాన ఆహారంగా ఉంది. బియ్యం సరఫరా తగినంత ఉండడం కూడా ఆహార భద్రతకు చాలా ముఖ్యం.
"ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ లాంటి విషపూరిత పదార్థాలు ఉండడం వల్ల మనుషులకు నష్టం కలగవచ్చు. అది దూరం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్యుల ఆరోగ్యం, వాణిజ్య కోణాలను బట్టి పాలిష్ చేసిన ఒక కిలో బియ్యంలో గరిష్టంగా 0.2 మిల్లీ గ్రాముల ఆర్సెనిక్ ఉండడం సముచితమేనని పరిగణిస్తున్నాం" అని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ చెప్పింది.
ఫొటో సోర్స్, NURPHOTO/GETTYIMAGES
అన్నం ఎంత తినాలి
ఇది క్లిష్టమైన ప్రశ్న. దీని గురించి ఇప్పటివరకు పక్కాగా కచ్చితంగా ఏదైనా చెప్పడం చాలా కష్టం. కానీ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక అంచనా వేయవచ్చు.
ఆర్సెనిక్ ఎంత ఉంటే తక్కువ ప్రమాదకర కేటగిరీలోకి వస్తుంది అనే దానికి మనం అమెరికాకు చెందిన ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ రిపోర్ట్ సాయం తీసుకోవచ్చు.
70 కిలోలకు పైగా బరువున్న వ్యక్తి రోజుకు వంద గ్రాముల బియ్యం వినియోగించడం సరిపోతుందని భావిస్తున్నారు. కానీ ఈ గణాంకాలను రోజువారీగా తీసుకునే లక్ష్యంగా చూడకూడదు. ఎందుకంటే, మిగతా ఆహార పదార్థాలు, నీళ్ల ద్వారా కూడా మన శరీరంలోకి ఆర్సెనిక్ చేరవచ్చు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.
దీనికి పరిష్కారం ఎలా?
మిగతా ఆహారాల్లాగే అన్నాన్ని కూడా సమతులాహారంలో ఒక భాగంగా తీసుకోవాలి. చాలా మందికి అన్నం తినడం అనేది పెద్దగా ఆందోళన కలిగించే అంశం కాదు. కానీ అన్నం లేదా బియ్యంతో చేసిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి అది ప్రమాదకరం కావచ్చు.
కానీ మనం బియ్యాన్ని రాత్రంతా నానపెట్టి, తర్వాత రోజు శుభ్రమైన నీళ్లతో బాగా కడిగి వండినప్పుడు వాటిలో ఆర్సెనిక్ స్థాయిని తగ్గించవచ్చు.
ఉడికించే సమయంలో నీళ్లు మార్చడం కూడా అన్నంలో ఆర్సెనిక్ స్థాయిని తగ్గిస్తుంది.
ఇలా అన్నం వండడం వల్ల ఆర్సెనిక్ స్థాయిని 80శాతం వరకూ తగ్గించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)