తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను మళ్లీ బహిరంగ ఉరిశిక్షల కాలానికి తీసుకెళ్తారా?
- జాన్ సింప్సన్
- వరల్డ్ అఫైర్స్ ఎడిటర్

ఫొటో సోర్స్, GETTY IMAGES
అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబాన్లు
అది 2001, నవంబర్ 14. నేను, నా సహోద్యోగులు కాబుల్‌లోకి అడుగుపెడుతుంటే, "దేవుడి దయవల్ల మీరు వచ్చారు" అంటూ ఓ వృద్ధుడు అరిచాడు. సంతోషంతో ఉప్పొంగుతున్న జనాల మధ్య నుంచి మేం నడుచుకుంటూ వెళ్లాం.
అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతుతో, తాలిబాన్ వ్యతిరేక అఫ్గాన్ దళాలు నగర శివార్లలో నిలిచి ఉన్నాయి.
తాలిబాన్లకు పారిపోక తప్పలేదు. అయిదేళ్లపాటు సాగిన అతివాద మతతత్వ పాలన ముగిసింది. తాలిబాన్ల హయాంలో అఫ్గానిస్తాన్ అతివాద శక్తుల కేంద్రంగా మారింది.
అప్పటికి న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలపై 9/11 దాడులు జరిగి రెండు నెలలు కావొస్తోంది. తాలిబాన్ల నుంచి అఫ్గానిస్తాన్‌కు విముక్తి లభించింది.
అయితే, తాలిబాన్లు తిరిగి రాగలరని, అఫ్గాన్‌పై పట్టు సాధించగలరని నాకు ఎప్పుడూ అనిపించలేదు.
ఇప్పుడు అదే జరుగుతుంటే, అందరూ కారణాల కోసం వెతుక్కుంటున్నారు. కానీ, అదేమంత కష్టం కాదు.
2001లో అఫ్గానిస్తాన్‌లో జాన్ సింప్సన్
తాలిబాన్ల అనంతరం బలమైన అఫ్గాన్ ప్రభుత్వం ఏర్పడలేదు
తాలిబాన్ల పాలన అనంతరం అఫ్గాన్ అధ్యక్షులుగా అధికారాన్ని చేపట్టిన హమీద్ కర్జాయ్, అష్రాఫ్ ఘనీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనప్పటికీ, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో విఫలమయ్యారు.
దానికి తోడు, అవినీతి రాజ్యమేలింది.
అయినప్పటికీ, ఘనీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
2020 ఎన్నికలకు ముందు డోనాల్డ్ ట్రంప్ అమెరికా విదేశాంగ విధానాలలో మార్పు కోరుకుని ఉండకపోతే, ఇప్పటికీ ఘనీ తన అధికార భవనంలోనే ఉండేవారు. ఖరీదైన పాశ్చాత్య వాహనాలలో అఫ్ఘాన్ ఆర్మీ గస్తీ తిరుగుతూ ఉండేది.
అఫ్గానిస్తాన్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేయడమే విజయమని ట్రంప్ భావించి ఉండకపోతే ఈరోజు అక్కడ ఈ పరిస్థితి ఉండేది కాదు.
అమెరికాకు, తాలిబాన్ నాయకత్వానికి 2020 ఫిబ్రవరిలో జరిగిన దోహా ఒప్పందం తరువాత నాకు తెలిసిన చాలామంది అఫ్గాన్ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు భయభ్రాంతులకు లోనయ్యారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత, దోహా ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడంతో వారంతా మరింత ఆందోళన చెందారు.
దోహాలో ఎంత శాంతియితంగా చర్చలు జరిగినప్పటికీ, ఒప్పందం తర్వాత అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొంటుందని ప్రమాణాలు చేసుకున్నప్పటికీ, మైదానంలో ఉన్న తాలిబన్ మిలిటెంట్లు పత్రాలలో రాసుకున్న విషయాలకు కట్టుబడి ఉంటారని ఆశించలేమంటూ వారంతా హెచ్చరించారు.
వారు అనుకున్నదే జరిగింది. అమెరికా, బ్రిటిష్, ఇతర పాశ్చాత్య దేశాల దళాలు అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడంతోనే తాలిబాన్లు మెల్లిమెల్లిగా ఆక్రమించుకోవడం ప్రారంభించారు.
జైల్లో ఉన్న ఖైదీలను ఉరితీస్తున్నారంటూ వస్తున్న వార్తలు ప్రజల్లో అలజడి సృష్టించాయి. క్రమంగా కాబూల్ కూడా లొంగిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి అధికారులు, సైనికులు విమానాశ్రయాల వైపు పరుగులు తీస్తున్నారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
శనివారం కాబూల్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద గుమికూడిన అఫ్గానిస్తాన్ ప్రజలు
తాలిబాన్ల నియంత్రణలో అఫ్గానిస్తాన్ ఎలా ఉండబోతోంది?
కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని, మిలటరీ, పోలీసు బలగాలు, ప్రజలు దేశం విడిచి వెళ్లిపోనవసరం లేదని బహుశా తాలిబాన్లు ధైర్యవచనాలు పలకవచ్చు.
మళ్లీ పాశ్చాత్య దేశాల భద్రతా దళాలు అఫ్గాన్‌లోకి అడుగుపెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదని కూడా వాళ్లు ఆలోచిస్తూ ఉండవచ్చు.
ఇలాంటి వ్యూహాల మధ్య తాలిబాన్ల నియంత్రణలోని అఫ్గానిస్తాన్ ఎలా ఉండబోతోంది?
ఇది ఊహించడానికి ప్రస్తుతానికి మనకున్న ఒకే ఒక్క ఆధారం, 1996 నుంచి ఐదేళ్ల పాటు సాగిన తాలిబాన్ల పాలన. అప్పట్లో అహ్మద్ షా మసూద్ నియంత్రణలో ఉన్న మితవాద ముజాహిదీన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు.
మరి కొద్ది రోజుల్లో అఫ్గానిస్తాన్‌లో మళ్లీ ఆనాటి రోజులను చూసే పరిస్థితి వస్తుంది.
తాలిబాన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో నేను చాలారోజులే ఉన్నాను. అప్పటి రోజులు చాలా భయానకంగా ఉండేవి.
షరియా చట్టం అత్యంత భయంకర రూపాల్లో దేశమంతటా అమలులో ఉండేది. బహిరంగ ఉరిశిక్షలు, రాళ్లతో కొట్టి చంపడం, కొరడా దెబ్బలు విరివిగా ఉండేవి.
వీధి వీధికీ వీరి ముఠాలు పహారా కాస్తుండేవి. పురుషులు చీలమండలు కనిపించేలా బట్టలు వేసుకున్నా, పాశ్చాత్య దుస్తులు ధరించినా ఈ ముఠాలు దాడి చేసేవి.
మహిళల సంగతి చెప్పక్కర్లేదు. పురుషులు లిఖితపూర్వకంగా అనుమతి ఇస్తేనే స్త్రీలు బయటకు వచ్చేవారు. అది కూడా శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా బుర్ఖాలు ధరించి.
దొంగతనాలు చేసి పట్టుబడిన నేరగాళ్ల కాళ్లు, చేతులు నరికేయడానికి సర్జన్లను పంపించాలని అంతర్జాతీయ రెడ్ క్రాస్‌ను కోరినప్పటికీ, వారు తమ అభ్యర్థనను తిరస్కరించారని, అందుకే తానే పూనుకుని ఆ పని చేయవలసి వస్తోందని తాలిబాన్ ఆరోగ్య మంత్రి ముల్లా బలోచ్ నాతో ఫిర్యాదు చేశారు. అయితే, ఆ పని చేయడాన్ని ఆయన చాలా ఆస్వాదిస్తున్నట్లే నాకు అనిపించింది.
అప్పట్లో టీవీలో పనిచేయడం అంటే ఓ పీడకల. ఎందుకంటే, మతవిశ్వాసాల దృష్ట్యా బతికున్న ప్రాణుల ఫొటోలు తీయడం పూర్తిగా నిషేధం.
పుస్తకాల దుకాణాలపై నిర్దాక్షిణ్యమైన తనిఖీ జరిగేది. ఏ షాపు యజమానైనా పట్టుబడ్డారో కొరడా దెబ్బలే.
అనేకమంది నగరాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చాలా దుకాణాలు మూతపడ్డాయి.
తాలిబాన్లకు చమురు దిగుమతి చేసుకునేంత ఆర్థిక స్థోమత లేదు. అందుచేత రాత్రిపూట ఇళ్లల్లో వెలిగించే కొవ్వొత్తుల వెలుగే ఆధారం. శబ్దాలంటే యజమానులు విడిచిపెట్టిన వేట కుక్కల అరుపులే.
ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్ల అనంతరం వాణిజ్యపరంగా అభివృద్ధి
తాలిబాన్లను తరిమి కొట్టిన తరువాత అఫ్గాన్ ప్రభుత్వాలు బలపడడంలో విఫలమైనప్పటికీ, కాబుల్‌తో సహా ఇతర నగరాలన్నీ కమర్షియల్‌గా బాగా ఎదిగాయి.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. వీధులన్నీ కార్లతో నిండాయి. పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు చదువుకునే అవకాశాలు మెరుగయ్యాయి. తాలిబాన్ల పాలనలో స్త్రీవిద్య నిషిద్ధం.
కొత్త భవనాలు వెలిశాయి. 2001లో నేను, నా కలీగ్స్ కలిసి నడిచిన దారులను గుర్తే పట్టలేకపోయాను. ఆ ప్రదేశమంతా పూర్తిగా మారిపోయింది.
తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకోవడం తమకు, తమ దేశానికి కూడా సంభవించిన పెద్ద విపత్తుగా అఫ్గాన్ ప్రజలు భావిస్తారు.
అయితే, ఇప్పుడు మనముందున్న అతి పెద్ద ప్రశ్న.. తాలిబాన్లు మునుపటిలాగే ప్రవర్తిస్తూ అఫ్గానిస్తాన్‌ను వెనక్కు నడిపిస్తారా? లేదా గతం నుంచి ఏవైనా పాఠాలు నేర్చుకొని ఉంటారా?
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- కాందహార్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గాన్‌లో రెండో అతిపెద్ద నగరం
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ హత్యకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- అఫ్గానిస్తాన్: తాలిబన్ల వశమైన ఐదు ప్రాంతీయ రాజధానులు
- అఫ్గానిస్తాన్: జైలును స్వాధీనం చేసుకుని ఖైదీలందరినీ వదిలేశామని ప్రకటించిన తాలిబన్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)