అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?

కాబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో దిగుతున్న హెలికాప్టర్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

కాబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో దిగుతున్న హెలికాప్టర్

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ను తాలిబాన్‌లు ఆక్రమించుకున్న తరువాత అక్కడి తమ రాయబార కార్యాలయం నుంచి తమ దేశ పౌరులు, ఉద్యోగులను అమెరికా హెలికాప్టర్లలో తరలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి.

ఇలాంటి చిత్రం చాలామందికి పరిచయమే.

1975లో వియత్నాం వార్ ముగింపు దశకు వచ్చిన సమయంలో ఫొటోగ్రాఫర్ హల్బర్ట్ వాన్ ఎస్ ఇలాంటి ఛాయాచిత్రాన్నే తీశారు.

సైగన్‌ నగరంలో ఒక భవనం పైకప్పుపై దిగిన హెలికాప్టర్‌లోకి వెళ్లేందుకు జనం ఆరాటపడుతున్న ఫొటో ఇది.

విశ్లేషకులు, అమెరికా చట్టసభల సభ్యులు(రిపబ్లికన్‌లు, డెమొక్రాట్లు కూడా) ప్రస్తుత కాబుల్ పతనాన్ని సైగన్ పతనంతో పోల్చుతున్నారు.

ఇంతకీ ఈ సైగన్ పతనం ఏమిటి?

ఉత్తర వియత్నాంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అమెరికా అండదండలున్న దక్షిణ వియత్నాం మధ్య సంక్షోభమే వియత్నాం యుద్ధం.

సుమారు 20 ఏళ్లు కొనసాగిన ఈ సుదీర్ఘ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు చేసింది. వియత్నాం యుద్ధం కారణంగా అమెరికన్లలో తీవ్ర విభేధాలు ఏర్పడ్డాయి.

యుద్ధంలో చివరకు దక్షిణ వియత్నాం రాజధాని సైగన్‌ను ఉత్తర వియత్నాంకు చెందిన పీపుల్స్ ఆర్మీ ఆఫ్ వియత్నాం స్వాధీనం చేసుకోవడాన్నే 'సైగన్ పతనం' అంటారు.

1975 ఏప్రిల్ 30న వియత్నాం పీపుల్స్ ఆర్మీ సైగన్‌ను హస్తగతం చేసుకుంది.

ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యంలో ఉత్తర వియత్నాంకు రష్యా, మరికొన్ని కమ్యూనిస్ట్ దేశాలు అండగా నిలవగా.. దక్షిణ వియత్నాంకు వేలాది అమెరికా బలగాలు సహా ఇతర పాశ్చాత్య దేశాలు సహకరించాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సైగన్‌లో భవనంపై హెలికాప్టర్.. అందులో ఎక్కేందుకు నిచ్చెనపై బారులు తీరిన ప్రజలు(1975 నాటి చిత్రం)

అమెరికా 1973లో దక్షిణ వియత్నాం నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది. అక్కడికి రెండేళ్ల తరువాత ఉత్తర వియత్నాం సైగన్‌ను స్వాధీనం చేసుకోగా దక్షిణ వియత్నాం లొంగిపోయినట్లు ప్రకటించింది.

అనంతర కాలంలో ఉత్తర వియత్నాం నాయకుడు హోచిమిన్ పేరిట సైగన్‌కు ‘హో చి మిన్ సిటీ’ అని పేరు మార్చారు.

కాబుల్ తరహాలోనే సైగన్‌ను కూడా ఊహించిన కంటే వేగంగా స్వాధీనం చేసుకుంది ఉత్తర వియత్నాం.

సైగన్ పతనమైన వెంటనే అమెరికా ఆ నగరంలోని తన రాయబార కార్యాలయాన్ని విడిచిపెట్టి అక్కడున్న 7 వేల మంది అమెరికన్ పౌరులు, కొందరు దక్షిణ వియత్నాం ప్రజలు, ఇతర విదేశీయులను హెలికాప్టర్లలో తరలించింది.

ఈ హడావుడి తరలింపు కార్యక్రమాన్ని 'ఆపరేషన్ ఫ్రీక్వెంట్ విండ్' అంటారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

బైడెన్

కాబుల్‌, సైగన్‌ల పోలిక సరైనదేనా?

వియత్నాం యుద్ధం ముగిసే నాటికి అమెరికా పూర్తిగా అపఖ్యాతి పాలైంది. ఈ యుద్ధంలో అమెరికా వందల కోట్ల డాలర్లను ఖర్చు చేయడమే కాదు 58 వేల మంది అమెరికన్ల ప్రాణాలను పణంగా పెట్టింది.

అంతర్జాతీయ యవనికపై అమెరికాను నిలదొక్కుకోనీయకుండా 'సైగన్ పతనం' దెబ్బకొట్టిందంటారు కొందరు విశ్లేషకులు.

అనంతర కాలంలో 'వియత్నాం సిండ్రోమ్' అనే పదం కూడా వాడుకలోకి వచ్చింది. ఇతర దేశాలలో అమెరికా సైనిక శక్తిని ఉపయోగించడాన్ని అమెరికా ఓటర్లు విముఖత చూపడాన్ని 'వియత్నాం సిండ్రోమ్' అంటారు.

చాలామంది అమెరికా విధాన నిర్ణేతలు సైగన్, కాబుల్‌ ఉదంతాలను పోల్చారు.

రిపబ్లికన్ హౌస్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఎలిస్ స్టెఫానిక్ ''ఇది జో బైడెన్ సైగన్' అని ట్వీట్ చేశారు.

''అంతర్జాతీయ వేదికపై ఈ ఘోర వైఫల్యం ఎన్నటికీ మర్చిపోలేనిది'' అని ఆయన తన ట్వీట్‌లో అన్నారు.

యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ గత నెలలో ఇలాంటి పోలికలను కొట్టిపారేశారు.

''వియత్నాంలో జరిగినట్లు జరుగుతుందని నేను అనుకోను. నా అంచనా తప్పు కావొచ్చు. కానీ, ఉత్తర వియత్నాం ఆర్మీ అంతటి శక్తిమంతులు కారు తాలిబాన్‌లు. ఇక్కడలాంటి పరిస్థితి లేదు'' అన్నారు మిల్లీ.

పోలికల సంగతి పక్కన పెడితే, రెండు ఉదంతాల మధ్య కొన్ని తేడాలూ ఉన్నాయి.

వియత్నాం నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న రెండేళ్ల తరువాత సైగన్ పతనమైంది.

కానీ, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు ఉపసంహరణ కొనసాగుతుండగానే కాబుల్ తాలిబాన్‌ల స్వాధీనమైంది.

సైగన్ పతనం నాటికి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న గెరాల్డ్ ఫోర్డ్ రాజకీయంగా పతనం కాగా ఇప్పుడు అఫ్గాన్ పరిణామాలు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది అస్పష్టమే.

''ఈ పరిణామాలు బైడెన్‌కు నష్టం కలిగిస్తాయని అనుకుంటున్నాను'' అన్నారు నాటింగ్‌హామ్ యూనివర్సిటీలో అమెరికన్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే క్రిస్టొఫర్ ఫెల్ప్స్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)