తాలిబాన్ల పాలనలో అల్ ఖైదా, ఐఎస్‌లకు అఫ్గానిస్తాన్‌‌ అడ్డాగా మారుతుందా?

  • ఫ్రాంక్ గార్డెనర్
  • బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్
2021 ఆగస్టు 16 నాటి ఈ చిత్రంలో తుపాకులు చేతబట్టి కాబుల్ వీధులో గస్తీ తిరుగుతున్న తాలిబాన్ మిలిటెంట్లను చూడవచ్చు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్,

మళ్లీ కాబుల్ వీధుల్లోకి వచ్చిన అఫ్గాన్లు.. ప్రభుత్వం ఏర్పాటు చేశాక తమ తీరును మార్చుకుంటారా?

అఫ్గానిస్తాన్‌లో మారుమూల కునార్ ప్రాంతంలో, ఆన్‌లైన్ జిహాదిస్ట్ చాట్ ఫారంలలో ఉత్సాహం వెల్లివిరిసింది. అల్ ఖైదా మద్దతుదారులంతా తాలిబాన్ల ఆక్రమణను "ఒక చారిత్రక విజయం"గా పరిగణిస్తూ వేడుక చేసుకొంటున్నారు.

20 ఏళ్ల క్రితం పాశ్చాత్య దేశాల సైనిక దళాలు తరిమికొట్టిన తాలిబాన్లు, ఇప్పుడు మళ్లీ వెనక్కు వచ్చి అఫ్గానిస్తాన్‌లో విజయ పతాకం ఎగరవేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాశ్చాత్య వ్యతిరేక జిహాదీలకు గొప్ప ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తోంది.

తలదాచుకోవడానికి, ఆ దేశంలో కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి వారికి ఇదొక మంచి అవకాశం. ముఖ్యంగా, ఇరాన్, సిరియాలలో తమ స్థావరాలు కోల్పోయి కొత్త ప్రదేశాల కోసం వెతుకుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు ఇది అందివచ్చిన అవకాశం.

ఈ నేపథ్యంలో "అల్ ఖైదా అఫ్గానిస్తాన్‌కు తిరిగి రావడం తథ్యం" అంటూ పాశ్చాత్య దేశాధికారులు, రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు.

అంతర్జాతీయ ఉగ్రవాద దళాలకు అఫ్గానిస్తాన్ స్వర్గధామం కాకుండా నిరోధించేందుకు పశ్చిమ దేశాలు ఏకం కావాలంటూ బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు.

సోమవారం, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ, "అఫ్గానిస్తాన్‌లో పొంచి ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద ముప్పును అణిచివేసేందుకు తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించాలని" ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు.

అయితే, తాలిబాన్లు అధికారంలోకి రావడం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతుందా? అల్ ఖైదా, ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు అఫ్గానిస్తాన్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తుందా?

దీనికి జవాబు "కచ్చితంగా అలా జరుగుతుంది అని చెప్పలేం".

వీడియో క్యాప్షన్,

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా పగ్గాలు చేపట్టేది ఎవరు?

చట్టబద్ధమైన గుర్తింపు కోసం ఆరాటం

అఫ్గానిస్తాన్‌లో 1996 నుంచి 2001 వరకు తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు, ఆ దేశం అంటరానిదిగా మిగిలిపోయింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, యూఏఈ తప్ప తాలిబాన్లకు చట్టబద్ధమైన గుర్తింపు ఎవరూ ఇవ్వలేదు.

తమ సొంత ప్రజలను క్రూరంగా హింసించడంతో పాటు, ఒసామా బిన్ లాడెన్ సంస్థ అల్ ఖైదాకు అభయహస్తం ఇచ్చింది. వారు సురక్షితంగా తలదాచుకునే వీలు కల్పించింది.

అప్పట్లో, ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది ఉగ్రవాదులు "యూనివర్సిటీ ఆఫ్ టెర్రర్"గా పేరొందిన అల్ ఖైదా శిబిరాల్లో శిక్షణ పొందారని ఒక అంచనా.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబాన్లు, తమను తాము "అఫ్గానిస్తాన్‌కు నిజమైన ఇస్లామిక్ పాలకులు"గా పరిగణించుకుంటున్నారు. ఎన్నిక కాకపోయినా సరే, అది తమ హక్కుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు తప్పక అంతర్జాతీయ గుర్తింపును కోరుకుంటారు.

గత ఇరవై ఏళ్లల్లో పేరుకుపోయిన అవినీతి, అంతర్గత కలహాలు, వనరుల దుర్వినియోగాన్ని అంతం చేసి, శాంతిభద్రతలను, న్యాయవ్యవస్థను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని తాలిబాన్లు చెబుతూ వస్తున్నారు.

అయితే, అల్ ఖైదాతో పూర్తిగా సంబంధాలు తెంచేసుకుంటేనే తాలిబాన్లకు ఈ గుర్తింపు దక్కుతుందని దోహాలో జరిగిన శాంతి చర్చల్లో అమెరికా స్పష్టం చేసింది.

అల్ ఖైదాతో సంబంధాలు తెంచేసుకున్నామని తాలిబాన్లు అంటున్నారు. కానీ, అది నిజం కాదని ఇటీవల వచ్చిన ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.

ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న గిరిజన, వివాహ సంబంధాలను ఉటంకిస్తూ వారి మధ్య సత్సంబంధాలు నెలకొనే ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు.

తాజాగా అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకుంటున్న సమయంలో తాలిబాన్లతో పాటు పలు చోట్ల "విదేశీ" లేదా అఫ్గానేతర మిలిటెంట్లు కూడా కనిపించారని అనేక రిపోర్టులు వెల్లడించాయి.

అంతే కాకుండా, జరుగుతున్న హింస, దాడులు చూస్తుంటే, తాలిబాన్ రాజకీయ ప్రతినిధులు మాట్లాడిన మాటలకు, ఇచ్చిన హామీలకు, వాస్తవంలో జరుగుతున్న విషయాలకు పొంతన లేదని కూడా స్పష్టం అవుతోంది.

"తాలిబాన్లు దోహాలో చెప్పిన మాటలకు, బడఖ్షాన్, గజ్నీ, హెల్మంద్, కాందహార్‌లలో జరుగుతున్న హింసకు పొంతన లేదు. హింస, భయం, యుద్ధం ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తే అంతర్జాతీయ స్థాయిలో ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది" అంటూ కాబుల్‌లోని అమెరికా రాయబారి ఆగస్టు 12న ట్వీట్ చేశారు. అప్పటికి తాలిబాన్లు ఇంకా కాబుల్ చేరుకునే దిశలోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలోని అల్ ఖైదా అఫ్గాన్ నుంచే 9/11 దాడులకు పథకం వేసింది

జిహాదిస్టులను పాశ్చాత్య దేశాలు అదుపు చేయగలవా?

తాలిబాన్ల లక్ష్యం అఫ్గానిస్తాన్‌లో షరియా చట్టాన్ని అమలు చేస్తూ, అధికారాన్ని స్థాపించడమే. ఆ దేశ సరిహద్దులు దాటి పాలించే ఆలోచన వారికి లేదు.

కానీ, అల్ ఖైదా, ఐఎస్ లాంటి జిహాదిస్టులకు ఆ దేశ సరిహద్దుల వెలుపల అనేక లక్ష్యాలు ఉండవచ్చు.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసినా, వారి కంట పడకుండా తమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించగలిగేలా ఉగ్రవాద దళాలకు అఫ్గానిస్తాన్‌లో పలు స్థావరాలు ఉన్నాయి.

ప్రస్తుతం కునార్ ప్రాంతాన్ని స్థావరంగా మార్చుకుని 200 నుంచి 500 మంది అల్ ఖైదా సభ్యులు మనుగడ సాగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.

సమీప భవిష్యత్తులో అక్కడ వీరి సంఖ్య పెరగవచ్చని ఆసియా పసిఫిక్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సజ్జన్ గోహెల్ అంచనా వేస్తున్నారు.

"కునార్ ప్రాంతాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, అక్కడ దట్టమైన అడవులు, లోయలు ఉన్నాయి. ఇప్పటికే, అల్ ఖైదా అక్కడ తలదాచుకుంటోంది. ఈ స్థావరాన్ని విస్తరించుకోవడానికే ప్రయత్నిస్తుంది" అని ఆయన అన్నారు.

అదే జరిగితే అల్ ఖైదాను, ఉగ్రవాదాన్ని అదుపుచేయడం పాశ్చాత్య దేశాలకు తలకు మించిన భారమే అవుతుంది.

గత 20 ఏళ్లల్లో అఫ్గాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌డీఎస్)పై ఈ దేశాలు చాలా ఎక్కువగా ఆధారపడి పనిచేశాయి. ఎన్‌డీఎస్ నెట్‌వర్క్‌లోని నిఘా సిబ్బంది ఇచ్చే సమాచారం ఆధారంగా.. అమెరికా, బ్రిటన్, అఫ్గాన్ ప్రత్యేక దళాలు తక్షణం స్పందించేవి.

ఇప్పుడు అదంతా పోయింది. నిఘా భాషలో చెప్పాలంటే అఫ్గానిస్తాన్ ఇప్పుడొక ‘కఠిన సవాలు’.

అక్కడ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను గుర్తించగలిగితే, డ్రోన్ల సాయంతో లేదా క్రూజ్ మిసైల్ సాయంతో దాడి చేయవచ్చు. అదొక్కటే మార్గం. కానీ, ఇవి 1998లో ఒసామా బిన్‌లాడెన్‌ను అంతమొందించడంలో విఫలమైన సంగతి గుర్తుంచుకోవాలి.

అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదం ఏ రూపు దాలుస్తుందనేది అధికంగా పాకిస్తాన్ నిర్ణయాలపై ఆధారపడి ఉందని డాక్టర్ గోహెల్ అభిప్రాయపడ్డారు.

తమ భూభాగం గుండా విదేశీ మిలిటెంట్లు అఫ్గానిస్తాన్‌లోకి జొరబడేందుకు పాకిస్తాన్ అవకాశం కల్పిస్తుందా లేక వారిని కట్టడి చేస్తుందా అనేదానిపై భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)