'గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకు' మాకి కాజీ మృతి

ఫొటో సోర్స్, Reuters
'గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకు'గా పేరుపొందిన జపాన్‌కు చెందిన మాకి కాజీ(69) కన్నుమూశారు.
1980ల్లో తన సొంత మ్యాగజీన్ నికోలిలో తొలిసారిగా నంబర్ పజిల్‌ను కాజీ ప్రచురించారు.
ఒకటి నుంచి తొమ్మిది నంబర్లతో ఆడే ఈ ఆట అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
ఈ ఆటపై టోర్నమెంట్లు కూడా జరిగాయి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రజలు ఈ ఆటను ఆడుతున్నారు.
బైల్ డక్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆగస్టు 10వ తేదీన టోక్యోలో మాకి కాజీ తుది శ్వాస విడిచారని ఆయన స్థాపించిన నికోలి సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉత్తర జపాన్‌లో సప్పోరో నగరంలో 1951లో కాజీ జన్మించారు.
ఫొటో సోర్స్, AFP
కియో యూనివర్సిటీ నుంచి డ్రాపవుట్ అయిన కాజీ 1980 ఆగస్టులో పజిల్ మ్యాగజైన్ నికోలిని స్థాపించారు.
సుడోకు ఆవిర్భావం గురించిన స్పష్టమైన ఆధారాలు లేవు. 18వ శతాబ్దానికి చెందిన గణితవేత్త యూలర్ సుడోకుని సృష్టించారని కొందరు అంటారు. ఇంకొందరు ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దంలో చైనా నుంచి ఇండియా ద్వారా అరబ్ దేశాలకు ఈ ఆట వచ్చిందని చెబుతారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఫ్రెంచ్ వార్తాపత్రికలు ఈ ఆటకు చెందిన ముందు వెర్షన్లను 19వ శతాబ్దం చివరిలో ప్రచురించాయి. 1895 జులైలో ఈవిల్ మేజిక్ స్క్వేర్ అనే పేరిట లా ఫ్రాన్స్ వార్తాపత్రిక పజిల్‌ను ప్రచురించింది.
కానీ, పజిల్ ఆధునిక రూపకర్తగా అమెరికన్ ఆర్కిటెక్ట్ హోవర్డ్ గార్న్స్ ను పిలుచుకుంటారు. 1970ల్లో నంబర్ ప్లేస్ అనే పేరిట పజిల్ ను రూపొందించారు. 1984లో దీన్నే కాజీ గుర్తించారు.
'అది చాలా ఆసక్తిని కలిగించే పజిల్, దాన్ని పరిష్కరించడం ఓ సరదా' అని 2008లో కాజీ పేర్కొన్నారు.
'కానీ దానికి పెట్టిన పేరు నాకు నచ్చలేదు. దానికి జపనీస్ పేరు పెట్టాలనుకున్నాను' అని చెప్పారు.
తొలుత 'షుజి వా డోకుషిని ని కగిరు' అనే పేరు పెట్టారు. దీనికి 'నెంబర్లు ఒంటరిగా ఉండాలి' అని అర్థం.
సహోద్యోగులు ఆకర్షణీయమైన పేరు పెట్టాలని కోరడంతో 25 సెకన్లలోనే 'సుడోకు' అనే పేరును కాజీ సూచించారు.
జపాన్‌లో ఈ ఆట బాగా పేరొందింది. టైమ్స్ ఆఫ్ లండన్ వార్తా పత్రిక 2004లో సుడోకును ప్రచురించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది.
కాజీ ఈ ఆటకు ట్రేడ్ మార్క్ తెచ్చుకోలేదు. ఈ ఆట వల్ల ఆయనకు ఆర్థికంగా కలిగిన పెద్ద లాభం కూడా ఏమీ లేదు. డబ్బు కన్నా ఆటలో ఉన్న సరదా, ఇతరులు ఆటను ఆస్వాదిస్తున్నారా లేదా అన్నదే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు.
'పజిల్ గురించిన కొత్త ఐడియాలు నాకు బాగా నచ్చుతాయి' అని 2007లో ఆయన బీబీసీతో చెప్పారు. 'నేను నిజంగా దాని గురించి సంతోషిస్తాను. ఇదో నిధిని కనుక్కోవడం లాంటిది' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)