అఫ్గానిస్తాన్ సంక్షోభం: అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పిందేంటి, చేసిందేంటి?

  • జోన్ సోపెల్
  • ఉత్తర అమెరికా ఎడిటర్
బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

'టు కిల్ ఏ మాకింగ్ బర్డ్' పుస్తకంలో 'పరిస్థితులెప్పుడూ కనిపించేటంత చెడ్డవి కావు' అనే ఓ వాక్యం ఉంది. ఇది ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు చాలా విషయాలు అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి.

అఫ్గానిస్తాన్ నుంచి అస్తవ్యస్తంగా సాగిన అమెరికా బలగాల ఉపసంహరణపై 'అన్నీ కోల్పోవడం ఎలా' అనే ఓ పుస్తకాన్ని రాయొచ్చు. జరగబోయే దారుణం గురించిన హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైంది. ప్రణాళికలు. అమలు బాధాకరంగా జరిగింది.

ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఒక విషయాన్ని లోతుగా చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్లో యుద్ధానికి అనువైన కాలం ఒకటి ఉంది. అది వసంత కాలంలో మొదలవుతుంది. చలికాలం ప్రారంభానికి ముగుస్తుంది. చలికాలం రాగానే తాలిబాన్లు వారి ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ సమయంలో అఫ్గానిస్తాన్లో గడ్డ కట్టే చలి ఉంటుంది.

సైనికుల ఉపసంహరణకు ఇది సరైన సమయమని ఎవరికీ అనిపించలేదా? ఉపసంహరణ తర్వాత ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి ఈ సమయం ఉపయోగపడేది. ఎలాగూ తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను వారి ఆధీనంలోకి తీసుకోవడం ఖాయమే. సమయం ఉండి ఉంటే అఫ్గాన్లో పరిస్థితి నేటిలా దిగజారకుండా ఉండేది.

బైడెన్ ప్రభుత్వానికి ఉపసంహరణకు ఓ ఆకర్షణీయమైన తేదీ అవసరమైంది. 9/11 ఉగ్రవాదుల దాడి జరిగి 20 ఏళ్లు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 11 నాటికి సైనికులను పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించుకుంది.

ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చేందుకు క్యూబాకు చెందిన వలసదారులతో సీఐఏ జట్టు కట్టింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జాన్ ఎఫ్.కెనెడీ, విజయానికి వంద మంది తండ్రులు ఉంటారని, అపజయం ఎప్పుడూ అనాథే అని అన్నారు.

ప్రస్తుతం అనాథ జో బైడెనే. ఈ పరిస్థితి ఆయన అధ్యక్ష పదవిపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరీ ముఖ్యంగా ప్రపంచదేశాలు అమెరికాను వేరే కోణంలో చూసే అవకాశం ఉంది.

బైడెన్ ఎన్నికల ప్రచారంలో అనుసరించిన మూడు ముఖ్యమైన అంశాలు ఆయనను డొనాల్డ్ ట్రంప్ కన్నా భిన్నంగా చూపించాయి. మొదటిది ఆయన ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే వ్యక్తి అన్నది. రెండోది మరింత సమర్ధత కలిగిన నాయకుడు, 'అమెరికా ఫస్ట్' అనే నినాదాన్ని 'అమెరికా ఈజ్ బ్యాక్' అనే దానితో పూరించడం మూడోది.

కానీ, నిన్న బైడెన్ చేసిన ప్రసంగం వేలాది మంది అఫ్గానీల దయనీయ స్థితిని ఆయన అర్థం చేసుకోలేకపోయారని స్పష్టం చేసింది. గడచిన 20 ఏళ్లుగా అమెరికన్లకు సాయం చేస్తున్న అఫ్గానీల గురించి ఆయన పట్టనట్లు మాట్లాడారు. సైన్యం ఉపసంహరణ సక్రమంగా సాగకపోవడం వల్ల ఆయన సమర్ధత పైనా నీలి నీడలు కమ్ముకున్నాయి. బైడెన్ వీరాభిమానులు కూడా ఈ విషయంలో ఆయన్ను వెనకేసుకురాలేకపోతున్నారు.

కొన్ని రోజులుగా అఫ్గానిస్తాన్లో కొనసాగుతున్న పరిస్థితులు అమెరికా బ్యాక్ అనే నినాదాన్ని ఎలా సూచిస్తాయి. చాలా మంది బైడెన్, అఫ్గానిస్తాన్ విషయంలో ట్రంప్ నడిచిన దారిలోనే వెళ్తున్నారని అంటున్నారు. కొందరైతే సరైన రీతిలో ఉపసంహరణ జరగలేదంటూ వెకిలి జోకులు వేస్తున్నారు.

ఇది ఆయన ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అమెరికా మాజీ అధ్యక్షులు హ్యారీ ట్రూమాన్‌(ఎడమ వైపు), కెన్నెడీ(కుడివైపు)

అసలు జో బైడెన్ పాలసీయే సరిగా లేదు. ఆయన తన లోపల ఉన్న హ్యారీ ట్రూమాన్‌ (అమెరికా మాజీ అధ్యక్షుడు)ను ఆవహించినట్లు మాట్లాడారు. ట్రూమాన్ తరచూ వాడే నానుడి (బక్స్ స్టాప్స్ విత్ మి)ని మార్చి బక్స్ స్టాప్స్ విత్ హిమ్ (బాధ్యతను మరొకరిపై నెట్టేయడం)గా బైడెన్ వాడినట్లు ఆయన ప్రసంగం చూస్తే అర్థమవుతోంది.

ఏదేమైనా, ఆయన నిందలను ఇతరులపై నెట్టి సంతోషంగా ఉన్నారు. అఫ్గాన్ నాయకత్వం సరిగా లేదు. అఫ్గాన్ సాయుధ దళాల్లో పోరాట పటిమ లేదు. డోనాల్డ్ ట్రంప్ ఒప్పందాన్ని సరిగా చేసుకోలేదు అంటూ నిందలను పక్కనవారిపై నెట్టే ప్రయత్నం చేశారు.

బైడెన్‌కు ఆయనను ప్రశ్నించేవారంటే నచ్చదు. విదేశాంగ విధానంపై చాలా ప్రశ్నలకు ఆయన సొంత ఆలోచనలే సరైనవి అని నమ్మారు.

బైడెన్ ఎన్నడూ ఉదారవాదిగా మాట్లాడేవారు కాదు. ఉదార ప్రజాస్వామ్యం అన్నది బాల్టిమోర్ నౌకాశ్రయం నుంచి 40 అడుగుల కంటైనర్లలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేది కాదు. అమెరికా మిలిటరీ తమ కీలక ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే విదేశాలలో ఉండాలని ఆయన భావిస్తున్నట్టు ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టి, అల్-ఖైదా సంస్థను చెల్లా చెదురు చేయడంతో తమ పని సంపూర్ణమయిందని, అందుకే ఇక ఇంటికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమయిందని భావించి ఉండొచ్చు.

ఇది లక్షలాది అమెరికన్లు నాతో పంచుకున్న అభిప్రాయం. కానీ పాలసీని ఆమోదించడానికి, దానిని నిలిపి వేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. తాలిబాన్ల విజయంతో ప్రేరణ పొందిన ఉగ్రవాద సంస్థలు విదేశాల్లోని అమెరికన్లపైనా, స్వదేశంలోనూ దాడులకు పాల్పడితే పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి రాజకీయ అస్థిరతకు దారి తీస్తుంది.

ఇక పాశ్చాత్య నాయకులు ఇప్పుడు అమెరికాను ఎలా చూస్తారో మాకు అర్థమవుతోంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ చెప్పిన దాని ప్రకారం, తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి బైడెన్ మరో ప్రపంచ నేతతో మాట్లాడలేదు. అమెరికాతో పాటు బ్రిటన్, ఇతర దేశాలు కూడా అఫ్గాన్ గడ్డపై పోరాటానికి భారీ ఖర్చు చేశాయి. ఇది కొంచెం ఆశర్చకరమైన విషయమే. మరోవైపు, సల్లివన్ బ్రీఫింగ్ తర్వాత బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో మాట్లాడినట్లు వైట్‌హౌస్ ప్రకటించడం కొసమెరుపు.

జీ7 సదస్సు కోసం సమావేశమైనప్పుడు, నాటో దేశాలు బ్రస్సెల్స్‌లో కలుసుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు బాధ్యత తీసుకోవడం మిగతా దేశాల అధ్యక్షులు, ప్రధానులకు ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అమెరికా స్పందించే తీరును బట్టి చూస్తే, అగ్ర దేశం ఎలా అవమానానికి గురి కావాల్సివస్తోందో అర్థం అవుతోంది. ప్రపంచ నాయకులతో మాటలు పడాల్సిన పరిస్థితికి ఎలా బైడెన్ నిర్ణయాలు దారి తీశాయి. మంచి నిర్ణయం అనుకున్నదే ఇప్పుడు బెడిసికొట్టేలా ఉంది.

అమెరికా వెనుతిరగడంపై తాలిబాన్లు కాకుండా మరో ముగ్గురు లాభపడ్డారు. అవి రష్యా, ఇరాన్, చైనా దేశాలు. 'అమెరికా ఈజ్ బ్యాక్' అనే నినాదాన్ని ఇచ్చే సమయంలో బైడెన్ ఆయన మనసులో ఏం అనుకున్నారో నాకు అర్థం అవడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)