తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమిస్తోంటే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది? ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు?
- సింధువాసిని
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Universal History Archive/Getty Images
1945లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణు బాంబుతో దాడిలో గాయపడిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జపాన్‌వాసులు
76ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధంతో చాలా దేశాలు కుదేలయ్యాయి. దీంతో ‘‘శాంతి స్థాపనే’’ లక్ష్యంగా ప్రపంచ దేశాలు 1945లో చర్చలు మొదలుపెట్టాయి.
ఆనాడు 50 దేశాల ప్రతినిధులు కలిసి ఓ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒడంబడికే ఓ కొత్త అంతర్జాతీయ సంస్థకు బాటలు పరిచింది.
మొదటి రెండు ప్రపంచ యుద్ధాల తరహాలో మరో ప్రపంచ యుద్ధం తలెత్తకుండా ఈ అంతర్జాతీయ సంస్థ కాపాడుతుందని అందరూ ఆశించారు.
ఈ అంతర్జాతీయ సంస్థనే ‘‘ఐక్యరాజ్యసమితి (ఐరాస)’’ లేదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యూఎన్ఓ)గా పిలుస్తున్నారు.
ఈ సంస్థ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను తమ అధికారిక వెబ్సైట్లో ఐరాస పేర్కొంది.
నేడు అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు బలప్రయోగంతో ఆక్రమించారు. అక్కడ తీవ్రమైన మానవ సంక్షోభం తలెత్తుతోంది. దీంతో అసలు ఐక్యరాజ్యసమితి ఏం చేస్తోందనే ప్రశ్నలు మళ్లీ పుట్టుకొస్తున్నాయి.
గూగుల్ సహా ఇతర సోషల్ మీడియాల్లోనూ ఐరాస ట్రెండ్ అవుతోంది. విద్యావేత్తలు, దౌత్యవేత్తలు, జర్నలిస్టులతో మొదలుపెట్టి సామాన్యుల వరకు.. ‘‘ఐరాస ఎక్కడుంది?’’అని ప్రశ్నిస్తున్నారు.
ఫొటో సోర్స్, DON EMMERT/AFP via Getty Images
న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం
ఐరాస ఎక్కడుంది?
ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తాజాగా చేసిన వ్యాఖ్యలను మనం పరిశీలించాలి.
‘‘మనం అఫ్గాన్ ప్రజలను అలా వదిలేయలేం. వదిలేయకూడదు కూడా.’’
‘‘యుద్ధాన్ని ప్రేరేపించే దిశగా అడుగులు వేస్తున్న వారికి అంతర్జాతీయ సమాజం ఇచ్చే సందేశం సుస్పష్టం. సైనిక చర్యలతో అధికారాన్ని చేజిక్కించుకోవడమంటే వినాశనాన్ని కొనితెచ్చుకోవడమే.’’
‘‘వెంటనే హింసను విడనాడాలని తాలిబాన్లను అభ్యర్థిస్తున్నాం. అఫ్గాన్, అక్కడి ప్రజల శ్రేయస్సు కోసం తాలిబాన్లు చర్చలు జరపాలి.’’
అఫ్గాన్‌లో సంక్షోభానికి తెరదించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)ని గుటెరస్ కోరారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలని ఆయన అభ్యర్థించారు.
ఫొటో సోర్స్, Horacio Villalobos Corbis via Getty Images
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్
అఫ్గాన్ శరణార్థులను తిరస్కరించొద్దని, కల్లోలిత ప్రాంతాలకు వారిని తిప్పి పంపొద్దని ఇతర దేశాలను ఐరాస సెక్రటరీ జనరల్ అభ్యర్థించారు.
మరోవైపు అఫ్గాన్‌పై యూఎన్ఎస్సీ రెండు సమావేశాలు నిర్వహించింది. రాజకీయ పరిష్కారం కోసం తాలిబాన్లు ప్రయత్నించాలని, మరోసారి అఫ్గాన్‌ను ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా మార్చొద్దని వీటిలో అభ్యర్థించారు.
‘‘తాలిబాన్లను ఐక్యరాజ్యసమితి అభ్యర్థించడం ఎంత విడ్డూరంగా ఉంది. సాయుధ బలగాల మాట వినని తాలిబాన్లు ఐరాస చెప్పింది వింటారా?’’అని దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లోని స్ట్రాటజిక్ స్టడీస్ విభాగ అధిపతి హర్ష్ వీ పంత్ వ్యాఖ్యానించారు.
అసలు తాలిబాన్లను ఐరాస ఎందుకు పదేపదే అభ్యర్థిస్తోంది? చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? లాంటి ప్రశ్నలు నేడు చాలా మందిని వెంటాడుతున్నాయి.
ఎందుకంటే ఐక్యరాజ్యసమితి ఓ స్వతంత్ర సంస్థ కాదు. ఇది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదు. సంస్థాగతమైన లోపాలే దీనికి కారణం.
ఫొటో సోర్స్, ANGELA WEISS/AFP via Getty Images
అసలు ఏమిటీ సంస్థాగత లోపాలు?
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆరు ప్రధాన విభాగాల్లో భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) ఒకటి. అంతర్జాతీయ భద్రత, శాంతి పరిరక్షణలకు యూఎన్ఎస్సీనే బాధ్యత వహిస్తుంది.
యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారం.. భద్రతా మండలిలో ఐదే శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ ఐదు దేశాలనే పీ-5 దేశాలుగా పిలుస్తారు.
ఈ దేశాలకు ‘‘వీటో పవర్’’ ఉంటుంది. అంటే భద్రతా మండలి ఏదైనా తీర్మానాన్ని ఆమోదించాలని అనుకున్నప్పుడు.. వీరందరి ఆమోదం అవసరం అవుతుంది.
సరళంగా చెప్పాలంటే, వీటో అధికారాల సాయంతో ఏదైనా శాశ్వత సభ్య దేశం అడ్డుపడితే, ఆ తీర్మానం ఇక ఆమోదం పొందనట్టే లెక్క.
ఐరాస ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానిలోని సభ్యుల అంగీకారం తప్పనిసరి. ముఖ్యంగా ఈ ఐదు శాశ్వత సభ్య దేశాల అనుమతి తప్పనిసరి.
అన్ని శాశ్వత సభ్య దేశాలు ఒకే మాటపై ఉండి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదు. అందుకే చర్యలు తీసుకోవడంలో భద్రతా మండలి విఫలం అవుతుంటుంది.
దీనితోపాటు ఐక్యరాజ్యసమితిలో మరో సమస్య కూడా ఉంది.
‘‘శాంతి, భద్రతల విషయంలో ఐక్యరాజ్యసమితిలో కొన్నిసార్లు ప్రతిష్టంభన కూడా ఏర్పడుతుంది. తమ పాత్ర గురించి అన్ని వర్గాలూ ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడే ఐరాస చర్యలు మొదలుపెడుతుంది. అంటే యుద్ధాన్ని ఆపి, శాంతిని పరిరక్షించాలని రెండు వర్గాల నుంచీ అభ్యర్థనలు వచ్చినప్పుడు మాత్రమే ఐరాస శాంతి పరిరక్షణ దళాలను పంపిస్తుంది. మరోవైపు శాంతి పరిరక్షణ కోసం మాత్రమే ఐరాస బలగాలను పంపిస్తుంది. శాంతి కోసం ఐరాస ఎలాంటి ఒత్తిడీ చేయదు’’అని హర్ష్ పంత్ వివరించారు.
ఫొటో సోర్స్, ADEK BERRY
ఎందుకు జోక్యం చేసుకోదు?
ఇప్పుడు అఫ్గాన్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ పరిస్థితి కాస్త సంక్లిష్టమైనది. ఐరాస జోక్యం మరింత సంక్లిష్టమైన ప్రక్రియ. అంటే పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఐరాస చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
‘‘ప్రపంచంలోని అగ్ర దేశాలు జోక్యం చేసుకున్నప్పుడు ఐరాస పాత్ర తగ్గిపోతుంది. ప్రస్తుత అఫ్గాన్ సమస్య కూడా అలాంటిదే.’’
‘‘తాలిబాన్లపై అమెరికా 20ఏళ్లుగా దాడులు చేస్తోంది. మరోవైపు తాలిబాన్లను గుర్తించేందుకు రష్యా, చైనా సిద్ధమవుతున్నాయి.’’
మరోవైపు చైనా, రష్యాలతో అమెరికా సంబంధాలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
‘‘ఉదాహరణకు భద్రతా మండలిలోని ఓ శాశ్వత సభ్య దేశం తాలిబాన్లకు వ్యతిరేకంగా తీర్మానాన్ని తీసుకువస్తే, తమ వీటో అధికారాలను ఉపయోగించి చైనా, రష్యా అడ్డుపడే అవకాశముంది’’అని పంత్ అన్నారు.
అగ్ర దేశాలు జోక్యం చేసుకున్నప్పుడు ఐరాస పాత్ర పరిమితం కావడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం దీనికి చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఫొటో సోర్స్, WAKIL KOHSAR/AFP via Getty Images
మరి ఐరాస పాత్ర ఏమిటి?
ఇలాంటి పరిస్థితుల్లో శాంతి పరిరక్షణ సంస్థగా ఐక్యరాజ్యసమితి పాత్ర ఏమిటి?
ఈ ప్రశ్నను ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా మంది అడిగారు. అఫ్గాన్ సంక్షోభం నడుమ మరోసారి దీనిపై చర్చ జరుగుతోంది. ఐరాసను ‘‘పనికిరాని సంస్థ’’గా చెబుతూ చాలా మంది సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేస్తున్నారు.
‘‘అఫ్గానిస్తాన్‌లో శాంతి పరిరక్షణకు ఐరాస పెద్దగా ఏమీ చేయలేదనేది నిజం. చెప్పాలంటే ఐరాస నెమ్మదిగా మరణించే స్థాయికి వెళ్లిపోతోంది’’అని ఈజిప్టు, సౌదీ అరేబియా, బ్రిటన్‌లో దౌత్యవేత్తగా పనిచేసిన పినాకీ చక్రబర్తి వివరించారు.
‘‘ఐరాస అంటే సభ్య దేశాల కలయికే. శాంతి పరిరక్షణలో ఎవరైనా అడ్డుపడుతున్నారంటే.. అవి, భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలే.’’
ఐక్యరాజ్యసమితోపాటు భద్రతా మండలిలోనూ సంస్థాగత సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘1945లో ఐరాస ఏర్పాటైంది. నేడు 2021. ఇప్పటికీ భద్రతా మండలిలో ఐదే శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. నాటికి నేటికి పరిస్థితులు చాలా మారాయి. కొత్త దేశాలు అవతరించాయి. కొన్ని దేశాలు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాయి. ఆ మార్పులు ఐరాసలో ప్రతిబింబిచడం లేదు. ఇది అతిపెద్ద సమస్య’’అని ఆయన వివరించారు.
‘‘భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరముందని నేటి పరిస్థితులు చెబుతున్నాయి. కొత్త మార్పులు తీసుకురాకపోతే ఐదు శాశ్వత సభ్య దేశాలకు లబ్ధి చేకూర్చే అజెండానే ఐరాస అనుసరిస్తుంది.’’
ఫొటో సోర్స్, Social Media
సంస్కరణల విషయంలోనూ..
భద్రతా మండలిలో సంస్కరణలపై చర్చ జరగడం ఇదేమీ తొలిసారి కాదు.
జర్మనీ, జపాన్, భారత్‌లకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఎప్పటినుంచో వాదనలు ఉన్నాయి. అయితే, సంస్థాగత లోపాలే దీనికి అడ్డుపడుతున్నాయి.
అంటే కొత్త దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలంటే, మండలిలోని అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది.
సంస్కరణల గురించి శాశ్వత సభ్య దేశాలు బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ, ఆచరణ విషయంలో మాత్రం ముందుకు అడుగులు వేయడం లేదు.
‘‘శాశ్వత సభ్య దేశాలు భద్రతా మండలిలో తమ ఆధిపత్యం కొనసాగాలని భావిస్తున్నాయి’’అని పినాకీ అన్నారు.
కొత్త దేశాలకు సభ్యత్వంతోపాటు భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాల వీటో అధికారాల గురించి కూడా చర్చ జరుగుతోంది.
ఈ వీటో అధికారాలు అప్రజాస్వామిక అధికారాలని కొందరు విదేశాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వీటో అధికారాల వల్లే యుద్ధ సమయాల్లో తమ మిత్రపక్షాలపై చర్యలు తీసుకోకుండా శాశ్వత సభ్య దేశాలు అడ్డుకోగలుగుతున్నాయి. ప్రస్తుత అఫ్గాన్ సంక్షోభం విషయంలోనూ అదే జరగుతోంది.
ఫొటో సోర్స్, TIMOTHY A. CLARY/AFP via Getty Images
నానాజాతి సమితిలానే అయిపోతుందా?
ఐక్యరాజ్యసమితి పనితీరును చూస్తుంటే ఇది మరో నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్)లా అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘‘ఐక్యరాజ్యసమితి ఓ కొత్త నానాజాతి సమితి. అయితే, దానిలో కాస్త ఎక్కువ మంది సభ్యులు ఉండేవారు’’అని ఎన్డీటీవీ జర్నలిస్టు అక్షయ్ డాంగ్రే ట్వీట్ చేశారు.
ఐరాసకు ముందుగా నానాజాతి సమితి ఉండేది. శాంతి స్థాపన, యుద్ధాలను అడ్డుకోవడం తదితర లక్ష్యాలతో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ సంస్థ అది.
ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images
మొదటి ప్రపంచ యుద్ధం అనంతం, పారిస్ శాంతి ఒప్పందంతో 1920లో నానాజాతి సమితి ఏర్పాటైంది.
నానాజాతి సమితి మనుగడలో ఉన్నప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. దీంతో నానాజాతి సమితి విఫలమైందని అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సంస్థాగతమైన లోపాలే నానాజాతి సమితి విఫలం కావడానికి ప్రధాన కారణాలు. అందరూ అంగీకారం తెలిపితేనే, సభ్య దేశాలపై నానాజాతి సమితి చర్యలు తీసుకునేది.
ఇప్పుడు కూడా ఏదైనా అంశంపై అన్ని ఐరాస శాశ్వత సభ్య దేశాలు ఒక మాటపైకి రావడం చాలా కష్టం. అందుకే ఐరాస కూడా నానాజాతి సమితిలా అయిపోతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images
ఐరాస ఏం చేయలేదా?
అఫ్గానిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేదని చెప్పడం కూడా సరికాదు.
సంక్షోభాన్ని నివారించేందుకు ఐరాస నేరుగా జోక్యం చేసుకోవచ్చు. అయితే, మానవతా సాయం అందించేందుకు ఐరాస సంస్థలు కృషి చేస్తున్నాయి.
వైద్య పరమైన సాయంతో మొదలుపెట్టి, బాలికల విద్యకు ప్రోత్సాహం, శరణార్థుల పునరావాసం తదితర విషయాల్లో ఐరాస సాయం చేస్తోంది.
మరోవైపు నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధాలు ఐరాస చర్యలకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
ఉదాహరణకు అఫ్గాన్‌లో కల్లోలిత పరిస్థితుల వల్ల కేవలం కొద్దిమంది సిబ్బందితోనే ఐరాస విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.
సహాయక చర్యలు చేపడుతున్నవారిపై ఎలాంటి దాడులు చేయబోమని తాలిబాన్లు భరోసా ఇచ్చారు. అయితే, ఎంతవరకు ఐరాస సిబ్బందికి రక్షణ ఉంటుందో వేచి చూడాలి.
ఇక అఫ్గాన్ సంక్షోభంలో ఐరాస నేరుగా జోక్యం చేసుకోవాలంటే, భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ కలిసి ముందుకురావాలి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)