అఫ్గానిస్తాన్: తాలిబాన్‌ల పునరాగమనం ప్రభావం అంతర్జాతీయ రాజకీయాలపై ఎలా ఉంటుంది?

బైడెన్

ఫొటో సోర్స్, Reuters

అఫ్గానిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా అధ్యక్షుడు తొందరపడినట్లుగానే ఆయన్ను నిందించడంలోనూ పండితులు, విశ్లేషకులు తొందరపాటుతనం చూపించారు.

కాబుల్ విమానాశ్రయంలో కనిపించిన హృదయ విదారక చిత్రాలు అమెరికాది తొందరపాటు నిర్ణయమనే సందేశానికి బలం చేకూరుస్తాయి.

మరోవైపు పశ్చిమ దేశాలు అఫ్గనిస్తాన్‌లో ఎంతో డబ్బు, సమయం, రక్తం ధారపోశాయి. అఫ్గాన్ ప్రజలు అంతకంటే ఎక్కువ ధారపోశారు.

అఫ్గానిస్తాన్‌ను ఎవరూ రక్షించలేకపోవచ్చు. నిజానికి అఫ్గానిస్తాన్ పాలనా వ్యవస్థే సరైన ప్రాతినిధ్యం లేకుండా, అవినీతిమయంగా సాగింది.

అఫ్గానిస్తాన్ గత రెండేళ్లలో కాదు గత 20 ఏళ్లుగా ఓడిపోతూనే ఉందనే వాదనకు అక్కడి వ్యవస్థ బలం చేకూరుస్తుంది.

ఇదంతా ఎలా ఉన్నా బలగాలు ఉపసంహరించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడమనేది అమెరికా విశ్వసనీయతకే పెద్ద దెబ్బ. అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరిక నైతిక స్థితికీ ఇది తీవ్రమైన దెబ్బగానే పరిగణించాలి.

అఫ్గానిస్తాన్ పరిణామాలను దశాబ్దాల వియత్నాం యుద్ధంతో పోల్చుతున్నారు. శత్రువుల చేతికి చిక్కిన నగరం నుంచి అమెరికా పౌరులను హెలికాప్టర్లలో తరలించడం వంటివి పోల్చడానికి అనువుగా ఉంటాయి. ఇలాంటి పోలికలే కాదు కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలూ ఉన్నాయి.

అమెరికా సేనలు వెళ్లిపోయిన రెండేళ్లకు దక్షిణ వియత్నాం ఓడిపోయింది. ఇక్కడ అఫ్లాన్ విషయంలో అమెరికా తాను వెళ్లిపోయినా తన మిత్రదేశాలు అఫ్గాన్‌కు మరికొన్నాళ్లు అండగా ఉండాలని కోరుకున్నట్లు అనిపిస్తుంది.

వియత్నాం యుద్ధం తరువాత అమెరికా ప్రజలు ఆ యుద్ధం విషయంలో రెండుగా చీలిపోయారు. అమెరికా మిలటరీ స్థైర్యం కూడా దెబ్బతింది.

అప్పటి ప్రచ్ఛన్న యుద్ధంలో వియత్నాం ఉదంతం అమెరికాకు దెబ్బే అయినా కూడా ఆ పోటీలో అమెరికాదే పైచేయిగా ఉంది. నాటో బలహీనపడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా మిత్రదేశాలేవీ అమెరికా మద్దతు కోరుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. వియత్నాం యుద్ధం తరువాత కూడా అమెరికా సూపర్ పవర్‌గానే ఉంది.

కానీ, అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ సంక్షోభంపై అమెరికాలో అంతర్గత విభేదాలు వియత్నాం నాటి పరిస్థితులతో పోల్చలేం. అఫ్గానిస్తాన్ మిషన్‌పై అమెరికా తన దేశంలోనే అపఖ్యాతి పాలైనా కూడా దానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సైగన్ పతనం

ప్రస్తుత పరిణామాలు కీలకమే అయినప్పటికీ 1970ల నాటి కంటే భిన్నమైనవి. అమెరికా, ఇంకా చెప్పాలంటే పశ్చిమ దేశాలు అనేక పోటీలలో నిమగ్నమై ఉన్నాయి. అందులో కొన్నిటిలో తిరుగులేని విజేతలుగా తేలగా.. అఫ్గానిస్తాన్ విషయంలో మాత్రం పూర్తిగా ఎదురుదెబ్బే.

అఫ్గాన్ పతనం అనేది 'ఉగ్రవాదంపై పోరు' చెబుతున్న యుద్ధంలో దారుణ పరాజయంగానే పరిగణించాలి.

విస్తృత స్థాయిలో ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం మధ్య సంఘర్షణగా చూసినప్పుడు కూడా ఈ వైఫల్యం అమెరికాకు ఎదురుదెబ్బే.

తాజా పరిణామాలతో రష్యా, చైనాలలో చిరునవ్వులు విరిసి ఉంటాయి. ఉదారవాద జోక్యం పేరుతో పశ్చిమ దేశాల జోక్యం.. ప్రజాస్వామ్య పరిరక్షణ, రూల్ ఆఫ్ లా ఉనికి పేరుతో చేసే ప్రచారం అఫ్గానిస్తాన్ విషయంలో పనిచేయలేదు.

ఈ అనుభవంతో అమెరికా, పశ్చిమ దేశాలు భవిష్యత్తులో ఇలాంటి ఉత్సాహం చూపించకపోవచ్చు.

అఫ్గానిస్తాన్ మిషన్‌లో అమెరికాతో కలిసి పనిచేసిన మిత్ర దేశాలు తెలివైనవి. ఈ పతనాన్ని వారు జీర్ణించుకోరు. బ్రిటన్ మంత్రులు కూడా వాషింగ్టన్‌తో తమ దేశ ప్రత్యేకమైన సంబంధాలను ప్రశంసిస్తూనే అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాన్ని మాత్రం బహిరంగంగానే విమర్శించారు.

అమెరికాకు మిత్రులుగా ఉన్న యూరప్ దేశాలు అమెరికాపై ఎంతగా ఆధారపడతాయో.. అమెరికా ఒకసారి నిర్ణయం తీసుకుని దాని అమలు దిశగా సాగుతున్నప్పుడు మిత్ర దేశాల అభిప్రాయాలను ఎంత తేలిగ్గా తీసుకుంటుందో ప్రస్తుత పరిణామాలకు దారితీసిన పరిస్థితులు స్పష్టం చేస్తాయి.

పాకిస్తాన్‌కీ ప్రతికూలం కావొచ్చు

అప్గాన్ పతనం పాశ్చాత్యులకు చేదువార్తే. కానీ, రష్యా, చైనా, పాకిస్తాన్‌లో నవ్వులు ఎంతకాలం ఉంటాయి?

తన స్వీయ భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తాలిబాన్‌లను పెంచిపోషించి, భద్రంగా చూసుకున్నది పాకిస్తానే.

కానీ, తాలిబాన్ పాలనలో అంతర్జాతీయ తీవ్రవాదం మరింత పెరిగితే ఈ ప్రాంతంలో నెలకొనే అలజడి తననూ ప్రతికూల పరిణామాలకు గురిచేయొచ్చని పాకిస్తాన్ గుర్తించవచ్చు.

చైనాకు ఓ వైపు సంతోషం.. ఓవైపు కంగారు

అమెరికా వైఫల్యాన్ని చూసి చైనా సంతోషిస్తుంది. అంతర్జాతీయంగా పట్టు పెంచుకుంటున్న తన ప్రత్యర్థి చైనాకు ధీటుగా ప్రపంచ శక్తిగా కొనసాగేందుకు, ఆ లక్ష్యంపై మరింత దృష్టి సారించేందుకు వీలుగానే బైడెన్ అఫ్గానిస్తాన్ నుంచి అంత తొందరగా వైదొలగి ఉండొచ్చు.

అయితే, అమెరికా వెళ్లిపోవడమనేది అఫ్గానిస్తాన్‌లో, మిగతా చోట్ల కూడా తన ప్రభావాన్ని విస్తరించడానికి చైనాకు అవకాశం ఇచ్చినట్లయింది.

అయితే, చైనా కూడా తాజా పరిణామాలపై ఎంతోకొంత ఆందోళనతో ఉంది. అఫ్గానిస్తాన్‌తో చైనాకు కొద్దిపాటి సరిహద్దు ఉంది.

తన దేశంలో ఉన్న ముస్లిం మైనారిటీల విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరును ప్రపంచం గమనిస్తోంది. ఇలాంటి తరుణంలో చైనా వ్యతిరేక ముస్లిం మిలిటెంట్ గ్రూపులు అఫ్గానిస్తాన్ భూభాగాన్ని వాడుకోవచ్చ ఆందోళన చైనాకు ఉంది.

మధ్య ఆసియాలో శాంతికే రష్యా ప్రాధాన్యం

రష్యా కూడా అఫ్గానిస్తాన్‌లో అస్థిరత, టెర్రిరజం విషయంలో ఎంతోకొంత ఆందోళనగానే ఉంది. 1980ల చివరలో సోవియట్ యూనియన్ మాదిరిగానే, ఇప్పుడు అమెరికా కూడా అఫ్గాన్ గిరిజన యోధులకు లొంగడమనేది రష్యాను కాస్త స్థిమితంగా ఉండేలా చేయొచ్చు.

కానీ, మధ్య ఆసియాలో శాంతి గురించే రష్యా ఎక్కువగా ఆందోళన చెందుతుంది. కారణం అక్కడి అనేక దేశాలు రష్యాకు మిత్రదేశాలు.

అఫ్గానిస్తాన్ పతనాన్ని ఊహించిన రష్యా అలాంటి సందర్భాలలో తలెత్తే పరిణామలను నిరోధించడానికి, తన సత్తా ప్రదర్శించడానికి గాను మొన్నటి వేసవిలో రష్యా యుద్ధ ట్యాంకులను తజికిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులకు తరలించి సైనిక విన్యాసాలు చేసింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

బైడెన్

ఆ దేశాలు ఇకపై అమెరికాను విశ్వసనీయ భాగస్వామిగా చూడవా?

అఫ్గానిస్తాన్‌లో అమెరికా పరాజయమనేది పశ్చిమ దేశాల శత్రు దేశాలకు ప్రయోజనం కలిగించే అంశమే.

తాజా పరిణామాలు అమెరికా మిత్రదేశాల ధోరణులలో ఎలాంటి మార్పులు తెస్తాయనేది కీలకం.

అఫ్గాన్ అనుభవం నుంచి వారు ఏం గ్రహిస్తారు? తక్షణ సంక్షోభాన్ని దాటి నాటో దేశాలు, ఇజ్రాయెల్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ అమెరికాను ఇకపై విశ్వసనీయ భాగస్వామిగా చూస్తాయా?

ఒకవేళ వారు అలా చూడకపోతే అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించినట్లే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)