అఫ్గానిస్తాన్‌: రూమీ పుట్టిన నేలపై కళలకు కూడా కష్టకాలం రానుందా?

  • పద్మ మీనాక్షి
  • బీబీసీ ప్రతినిధి
జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ

ఫొటో సోర్స్, Wikimedia Commons

"ప్రేమను వ్యక్తపరచాలంటే రూమీ కన్నా ప్రభావంతమైన, ప్రభావశీలమైన కవి మరెవరు కనిపిస్తారు?" అని ప్రముఖ సాహిత్యకారుడు, రచయత, ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు అంటారు.

ప్రపంచవ్యాప్తంగా కవిత్వ ప్రియుల్లో సూఫీ కవి రూమీ అంటే తెలియనివారుండరు. రూమీ అంటే ఒక మత్తు . రూమీ అంటే ఒక ప్రేమ. ఆయన కవిత్వం చుట్టూ ఎన్నో రచనలు, విశ్లేషణలు అల్లుకున్నాయి. ప్రేమ, ఎదురుచూపులు, అందులో మత్తెక్కిన తాత్వికత ఇవన్నీ కలగలిపితే రూమీ.

మరి రూమీ పుట్టిన నేలపై సంగీతం మూగబోతోందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ అఫ్గానిస్తాన్ నేలపై బల్క్ ప్రాంతంలో 8 శతాబ్దాల క్రితం 1207లో జన్మించారని చాలా మంది అధ్యయనకర్తలు చెబుతారు. కొంత మంది మాత్రం ఆయన తజికిస్తాన్ లో జన్మించారని అంటారు.

బల్క్ ప్రాంతం ప్రాచీన ఆధ్యాత్మిక రాజధాని. బౌద్ధ, పర్షియా సాహిత్యాలకు కేంద్రంగా ఉండేది.

అయితే, చిన్నతనంలోనే ఆయన కుటుంబం టర్కీకి వెళ్లిపోయింది. ఇప్పటికీ అఫ్గానిస్తాన్ లో రూమీ జన్మస్థలాన్ని చూడవచ్చని చెబుతారు. టర్కీ, ఇరాన్, అఫ్గానిస్తాన్ ఆయనను తమ వాడని అంటాయి. రూమీ ప్రపంచానికి చెందిన వ్యక్తి అని కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కాదని పాశ్చాత్య దేశాల్లోని ఆయన అభిమానులు వాదిస్తారు.

అయితే, తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక అక్కడ సంగీతం మూగబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

2001లో తాలిబాన్ల పాలన అనంతమయిన తర్వాత కళాకారులకు స్వేచ్ఛ లభించింది

తాలిబాన్ల గత పాలనలో టీవీలు చూడటం, సంగీతం వినడం లాంటివి పూర్తిగా నిషేధించారు. వాద్య పరికరాలతో కూడిన సంగీతాన్ని వివాహ వేడుకల్లో కూడా అనుమతించేవారు కాదు.

సంగీతాన్ని నిషేధించడంతో పాటు క్యాసెట్లు, వీడియో టేప్ లు, సంగీత పరికరాలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

ప్రముఖ సంగీతకారులను, శ్రోతలను కూడా వేధించి అరెస్టులు చేశారు. బహిరంగ సంగీత ప్రదర్శనలను కూడా నిషేధించారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనా కాలం ముగిసిన తర్వాత అఫ్గాన్ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకున్నారు. తమ సంప్రదాయ సంగీతానికి ఆధునిక సంగీతాన్ని మేళవించి ప్రపంచానికి వినిపించారు. మహిళా పాప్ సింగర్లు కూడా వెలుగులోకి వచ్చారు.

ఈ స్వేచ్ఛ ముగిసే కాలం వచ్చిందా అని ప్రజలు, సాహిత్యకారులు, కళాకారులు భయపడుతున్నారు.

మరి అఫ్గాన్ ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు దేశం విడిచి పారిపోతున్న వేళ కళలకు, సాహిత్యానికి స్థానం ఉంటుందా?

షరియా చట్టానికనుగుణంగానే పరిపాలనను సాగిస్తామని చెప్పిన తాలిబాన్లు కళలను ప్రోత్సహిస్తారా?

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

సంగీత తరగతి

అఫ్గానిస్తాన్ సంగీత చరిత్ర ఏంటి?

అఫ్గానిస్తాన్‌లో సంప్రదాయ సంగీతం గాత్రం కంటే కూడా ఎక్కువగా వాయిద్యాలతో కూడుకుని ఉంటుంది. జానపద రీతులు ఎక్కువగా ఉంటాయి.

మొహమ్మద్ జాహిర్ షా పాలనా కాలాన్ని (1933-1973) సంగీతానికి స్వర్ణ యుగం అని అంటారు. ఆయన పరిపాలనలో దేశంలో చాలా సంస్కరణలు అమలు అయ్యాయి.

అమీర్ షేర్ అలీఖాన్ (1863-66) (1868-79) పరిపాలనా కాలంలో ఆయన కొలువులో సభలు నిర్వహించేందుకు ఉత్తరభారతదేశం నుంచి సంగీతకారులను కాబుల్ పిలిచేవారని చెబుతారు.

జహీర్ షా కాలంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి సంగీతకారులను పిలిపించడం జరిగేదని చరిత్రకారులు చెబుతారు.

అఫ్గాన్ సంగీతానికి చక్రవర్తిగా పేరు పొందిన అహ్మద్ జాహిర్ నుంచి రాక్ అండ్ రోల్ విధానంతో ప్రయోగాలు చేసిన నేటి తరం ఆధునిక సంగీతకారుల సంగీతం కూడా ఎల్లలు దాటింది.

అమానుల్లా ఖాన్ పరిపాలనలో (1919-1929) మధ్యలో రేడియో ప్రారంభమయింది. కానీ, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు.

మారుతూ వస్తున్న జాతీయ గీతం

అఫ్గానిస్తాన్‌లో 1926లో తొలి జాతీయ గీతాన్ని రూపొందించారు. "ది రాయల్ సెల్యూట్" పేరుతో ఉన్న ఈ జాతీయ గీతం కేవలం వాయిద్య సంగీతంతో మాత్రమే కూడుకున్నది. ఇది 1943 వరకు అమలులో ఉంది.

1943-1973 వరకు గ్రాండ్ సెల్యూట్ అనే మరో గీతం కొనసాగింది. 1973-1978 వరకు ఒక జాతీయ గీతం, 1978-1992 వరకు 'బికమ్ హాట్, బికమ్ మోర్ హాట్' అనే జాతీయ గీతం ఉండేది.

"ఫోర్ట్రెస్ ఆఫ్ ఇస్లాం, హార్ట్ ఆఫ్ అసియా " పేరుతోనున్న మరొక గీతం 1992-1996 వరకు అమలులో ఉంది. ఇది 1919 నాటి ముజాహిదీన్ పోరాట గీతం. ఇదే గీతాన్ని 2001 - 2006 వరకు కొనసాగించారు.

అయితే, ఈ దేశానికి ఒక జాతీయ గీతం కొనసాగలేదు. గత 95 ఏళ్లలో అఫ్గానిస్తాన్‌లో అయిదు జాతీయ గీతాలు మారాయి.

తాలిబాన్ల పాలనా కాలంలో (1996-2001), అసలు జాతీయ గీత ప్రసక్తే లేదు. తాలిబాన్లు సంగీతానికి పూర్తిగా వ్యతిరేకం. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ గీతం కొనసాగుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఇటీవల అఫ్గాన్ మహిళలు ఒక ఎయిర్ పోర్టులో జాతీయ గీతాన్ని విషాద స్వరంతో ఆలపించిన వీడియో కూడా కనిపించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

తాలిబాన్ల పాలన అనంతమయిన తర్వాత కళాకారులకు స్వేచ్ఛ లభించింది

ఇస్లాం సంగీతానికి వ్యతిరేకమా?

"ఖురాన్ ప్రాధమికంగా సనాతన విధానాలను చెప్పే గ్రంధం కాదు. అన్ని మతాల్లో ఛాందసవాదం, ఆధ్యాత్మికవాదం ఉంటాయి. అదే సమస్య ఇస్లాంలో కూడా వచ్చింది. అయితే, రూమీ ఈ ఛాందసవాదానికి వ్యతిరేకి" అని చినవీరభద్రుడు అన్నారు.

"నువ్వు నీ స్నేహితుని ప్రతిబింబం కావాలి అని ఖురాన్ చెబుతుంది. రూమీ, షంషుద్దీన్ లాంటి కవులు నిజమైన ఖురాన్ ఆదర్శాలకు అనుగుణంగా జీవించారు. వాటిని ఆచరించడానికి సంగీతాన్ని వదిలి పెట్టాల్సిన అవసరం లేదనే సూఫీలు చెబుతారు" అని అన్నారు.

"తాలిబాన్లు పూర్తిగా ఛాందసవాదులు కావడంతో పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించేందుకు సంస్కృతి, కళల పై ఆంక్షలన్నీ విధిస్తారు. అయితే వీటినన్నటినీ వారు ఖురాన్ పేరు చెప్పి చేయడం సరైనది కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అఫ్గానిస్తాన్‌లో ఇప్పటివరకు ఎన్ని జాతీయ గీతాలు మారాయి?

అఫ్గానిస్తాన్ ను గతంలో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న నాటికి దేశంలో అమలులో ఉన్న జాతీయ గీతం ఆరవది.

2004లో అఫ్గాన్ ప్రభుత్వం కొత్త జాతీయ గీతానికి శ్రీకారం చుట్టింది. దీనిని అబ్దుల్ బరీ జహానీ రచించారు.

అఫ్గానిస్తాన్‌లో నివసించే జాతులన్నిటినీ సమైక్యపరిచేలా పష్తూన్ భాషలో జాతీయ గీతాన్ని రూపొందించారు. ఇందులో “పష్తూన్, తజిక్, హజారా, ఉజ్బెక్, తుర్క్ మన్, బాలూచ్, వచ్చాయి, నూరిస్తాని, అయిమాక్, అరబ్, కిర్గిజ్ కిజిల్బష్, గుజుర్, బ్రహ్వుయి జాతుల ప్రస్తావన ఉంటుంది.

"ఈ భూమి అందరిదీ, ఈ నేల ప్రతీ అఫ్గాన్‌కు గర్వకారణం" అనే వ్యాఖ్యాలతో ఈ జాతీయ గీతం మొదలవుతుంది.

2006లో ఆమోదం పొందిన ఈ గీతానికి యూరప్ ఆర్కెస్ట్రా జోడించి, జర్మనీలో రికార్డ్ చేశారు.

ఫొటో సోర్స్, Rumi by Haydar Hatemi

అఫ్గానీ సంప్రదాయ సంగీతం

పష్తూన్ల సంగీత సంస్కృతి దక్షిణ అఫ్గానిస్తాన్ సంగీతంలో కనిపిస్తుంది.

"ఈ ప్రాంతంలో ప్రముఖ పష్తూన్ కవులు, యోధులు రచించిన గీతాలను పాడుతూ ఉంటారు. వీరి గీతాల్లో ముఖ్యంగా జాతీయత, దేశభక్తి, వీరత్వం, విదేశీ ఆధిపత్య ధిక్కరణ కనిపిస్తూ ఉంటాయి" అని కాలిఫోర్నియా యూనివర్సిటీ, లాస్ ఏంజెల్స్ లో ఎత్నోమ్యూజికాలజీ ప్రొఫెసర్ హిరోమి లొరేన్ సకాతా "అఫ్గానిస్తాన్‌లో సంగీత ప్రయాణం" గురించి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఆమె 'మ్యూజిక్ ఇన్ ది మైండ్' పుస్తక రచయత కూడా.

ఆమె వ్యాసంలో అఫ్గాన్ల సంగీత సంస్కృతి గురించి ప్రస్తావించారు.

పష్తూన్లకు రబాబ్ అనే జానపద సంగీత వాయిద్యంతో అనుబంధం ఎక్కువ. దుర్ఖనే (రోమియో జూలియట్ తరహా ప్రేమ కథ) లో ఆదమ్ ఖాన్ వాయించిన రబాబ్ సంగీతానికి దుర్ఖనే ఆకర్షితురాలైనట్లు ఉంటారు.

అఫ్గానిస్తాన్ సంగీత పరికరాల్లో రబాబ్ కి చాలా ప్రాధాన్యత ఉంది.

ఖోరాసన్ ప్రాంతంలో కూడా జానపద సంగీతానికి ప్రాధాన్యత ఉంది. నాలుగు వ్యాక్యాల్లో రాసే వీటిని చాహర్ బైటి అంటారు. ఇక్కడ దూతార్ అనే వాయిద్యం వాయిస్తారు.

ఇరాన్, తజిక్ సంప్రదాయాలు, కాస్త హిందుస్తానీ సంగీతపు మేళవింపుతో ఉండే సంప్రదాయాన్ని అఫ్గానిస్తాన్ సంప్రదాయ సంగీతంగా కొంత మంది అభ్యసిస్తారు.

"పాశ్చాత్య దేశాల సంస్కృతులకు ప్రభావితులైన విద్యార్థుల ద్వారా 1960ల నుంచీ ఆధునిక సంగీతం మొదలయింది అని చెప్పవచ్చు. వారిలో కొందరు గిటార్, డ్రమ్స్ లాంటివి కూడా వాయించేవారు" అని హిరోమి తన వ్యాసంలో పేర్కొన్నారు.

రేడియో, టీవీల ఆవిర్భావం

1941లో మొదలయిన ప్రభుత్వ రేడియో స్టేషన్ అఫ్గాన్ ప్రజల వాణిని ఏకం చేసే సాధనంగా మారింది.

రేడియోలో ఇతర ఉద్యోగస్తులతో పాటు సంగీతకారులను కూడా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.

1971-72 కాలంలో అఫ్గాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన డాక్టర్ అబ్దుల్ జాహిర్ కొడుకు అహ్మద్ జాహీర్ ప్రావీణ్యం ఉన్న సంగీతకారుడు.

ప్రస్తుతం, అఫ్గానిస్తాన్ లో 175కు పైగా రేడియో స్టేషన్లు ఉన్నాయి. వినోదాన్ని అందించే అనేక టీవీ చానెళ్లు కూడా ఉన్నాయి.

టీవీ చానెళ్లు, ఇంటర్నెట్ ఆవిర్భావంతో అన్ని రకాల సంగీత బాణీలతో అఫ్గాన్ ప్రజలకు పరిచయం కలిగింది. అయితే, అఫ్గానిస్తాన్‌లో 2018 నాటికి 60.5 లక్షల మంది మాత్రమే ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. అంటే, దేశ జనాభాలో 17.6 శాతం మందికే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.

ప్రముఖ గాయని అర్యాన సయీద్ ను అఫ్గాన్ మహిళల వాణి అని అంటారు. అయితే, కాబుల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆమె భర్తతో కలిసి యూఎస్ మిలిటరీ విమానంలో దేశం విడిచి వెళ్లినట్లు టైటిల్ ప్రెస్ అనే వెబ్ సైటు పేర్కొంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రస్తుతం కనిపించటం లేదు.

తాలిబాన్ల హయాంలో మీడియా మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది.

సంగీతానికి చీకటి యుగం మొదలయిందా?

1979లో సోవియట్ అఫ్గానిస్తాన్ పై దాడి చేసినప్పటి నుంచీ సంగీతానికి చీకటి కాలం మొదలయిందని చెప్పవచ్చు. అదే సమయంలో చాలా మంది సంగీత కారులు దేశం విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు.

1996 -2001వరకు కొనసాగిన తాలిబాన్ల పాలనలో సంగీతానికి, గాయనీ గాయకులకు కష్టకాలం మొదలయింది. ప్రముఖ అఫ్గాన్ - అమెరికన్ రచయత ఖలేద్ హుస్సేనీ కూడా అఫ్గానిస్తాన్‌లో ఉండరు.

ముఖ్యంగా వీరి పాలనలో వాయిద్య పరికరాలతో కూడిన సంగీతాన్ని పూర్తిగా నిషేధించారు. ఆఖరికి వివాహ వేడుకల్లో కూడా సంగీతాన్ని నిషేధించారు.

వాయిద్యాలు లేకుండా మాత్రమే పాటలను పాడేందుకు అనుమతి ఉండేది. ఈ గీతాల్లో కూడా తాలిబాన్ల భావాలే వినిపిస్తాయి.

తాలిబాన్ల నిష్క్రమణతో ఊపిరి తీసుకున్న సంగీతం

2002 నుంచీ అఫ్గాన్లు తిరిగి సంగీతాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు.

కానీ, తాలిబాన్ల తాజా అక్రమణతో సంగీతానికి, సాహిత్యానికి కూడా చీకటి కాలం మొదలవుతుందనే భయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

తాలిబాన్లు తిరిగి సంగీతం, సంగీత ప్రదర్శనల పై నిషేధం విధించే అవకాశం ఉందని వారు అంటున్నారు.

"ఒక వైపు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగుపెడుతుంటే, ఇక కళలేముంటాయి?’’ అని రచయత, థియేటర్ ఆర్ట్స్ పరిశోధకురాలు జయప్రభ అనిపిండి అన్నారు.

"స్వేచ్ఛ ఉంటేనే కళ అయినా సాహిత్యం అయినా వర్ధిల్లుతుంది. స్వేచ్ఛ కోల్పోవడమంటే జాతి ఆత్మ పోవడమే. బందీలుగా ఉన్నప్పుడు కళ ఎలా బయటకు వస్తుంది? కంఠం మీద తుపాకీలు ఉన్నప్పుడు ఇక సంగీతం, సాహిత్యానికి చోటెక్కడుంటుంది?" అని ప్రశ్నించారు.

"కళ ద్వారా ఒక జాతి, సంస్కృతి ఆత్మ ప్రతిబింబిస్తాయి. స్త్రీలను, పిల్లలను, కళలను అణచివేయడం ద్వారా జాతి సంస్కృతే అంతమైపోతుంది. మనుగడ సాధ్యమయితేనే కళలు బ్రతుకుతాయి" అని అన్నారు.

తాలిబాన్ల తాజా పాలనలో ఏం జరుగుతోంది?

అయితే, తాలిబాన్లు తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచీ చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చూస్తే మాత్రం ఈసారి పాలన గతం కంటే వేరుగా ఉంటుందని ప్రస్తుతానికి తెలుస్తోంది.

మహిళలు చదువుకునేందుకు అనుమతి ఉంది గానీ పురుషులతో కలిసి కాదని చెప్తూ, కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌కు కొత్తగా ఎన్నికైన ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు.

గతంలో లాగా మహిళలు చదువుకోకుండా, ఉద్యోగాలు చేయకుండా తాము ఇప్పుడు అడ్డుకోబోమని తాలిబాన్ తెలిపింది.

దేశంలో టీవీ, రేడియో ప్రసారాలు కొనసాగుతున్నాయి.

అయితే, జాతీయ గీతం గురించి, సంగీతం గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)