కోవిడ్ వ్యాక్సీన్: బూస్టర్ డోసులతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా, అది సరైన పనేనా?

ఫొటో సోర్స్, Reuters
కోవిడ్ -19 వ్యాక్సీన్ బూస్టర్ షాట్స్ ఇవ్వడం మొదలుపెట్టిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి
డెల్టా వేరియంట్ తో పొంచి ఉన్న భయంతో కోవిడ్ వ్యాక్సీన్లు తీసుకున్నవారికి కూడా బూస్టర్ డోసులు ఇవ్వాలని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి.
ఒక వైపు, ప్రపంచంలో చాలా దేశాలకు సరిపడినన్ని వ్యాక్సీన్లు లేకపోయినా, మరో వైపు బూస్టర్ షాట్ల అవసరం, సమర్ధత గురించి చాలా తక్కువ శాస్త్రీయ సమాచారం అందుబాటులో ఉండటంతో వివిధ దేశాల మధ్య ఇదొక భిన్నాభిప్రాయాల అంశంగా మారిపోయింది.
"కోవిడ్ 19ను మునిగిపోతున్న నౌకతో పోలుస్తూ, ఒకవైపు ప్రజలను మునిగిపోయేందుకు వదిలేసి, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్న వారికి అదనంగా లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి ప్రణాళికలు చేస్తున్నాం" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎపిడెమియాలజిస్ట్ మైక్ ర్యాన్ అన్నారు.
ప్రపంచంలోని ప్రజలందరికీ వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చేవరకూ ఈ బూస్టర్ షాట్లను నిలుపుదల చేయమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఒక నైతిక విషయంగా ప్రభుత్వాలకు పిలుపునిస్తోంది.
కానీ, శాస్త్రీయ ఆధారాలు ఏమి చెబుతున్నాయి? బూస్టర్ షాట్ల గురించి వస్తున్న వివిధ వాదనలేంటి?
ఇది బూస్టర్ షాట్లు వేయడానికి సరైన సమయమేనా? లేదా మనం వేచి ఉండవచ్చా?
ఫొటో సోర్స్, EPA
ఏయే దేశాలు బూస్టర్ షాట్లను ఇస్తున్నాయి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపును పక్కన పెట్టి, కొన్ని దేశాలు ఇప్పటికే బూస్టర్ షాట్లను ఇవ్వడం మొదలుపెట్టాయి.
మోడర్నా కానీ, ఫైజర్ కానీ రెండవ డోసు తీసుకున్న 8 నెలల తర్వాత వయసు, ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా అమెరికా బూస్టర్ డోసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
దుబాయ్ లో రెండవ డోసు తీసుకున్న ఆరు నెలలకు ప్రజలందరికీ బూస్టర్ డోసులు, అనారోగ్యం ముప్పు ఉన్నవారికి మూడు నెలల తర్వాత బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి.
ఇజ్రాయెల్ లో 40 సంవత్సరాలు పైబడిన వారందరికీ బూస్టర్ డోసులు ఇస్తున్నారు. రెండవ డోసు తీసుకున్న అయిదు నెలల తర్వాత ఎప్పుడైనా బూస్టర్ షాట్ ఇస్తున్నారు.
చిలీ, ఉరుగ్వే, కంబోడియా కూడా సైనోవాక్, సైనోఫార్మ్ వ్యాక్సీన్లను తీసుకున్న వారికి బూస్టర్ డోసులు ఇస్తున్నారు. వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
థాయిలాండ్, ఇండోనేసియా కూడా సైనోవాక్ వ్యాక్సీన్ తీసుకున్న వైద్యరంగ సిబ్బందికి మరొక రకమైన బూస్టర్ డోసు ఇస్తున్నారు.
ఆ దేశ జనాభాలో 8 శాతం, 12 శాతం మందికి మాత్రమే వ్యాక్సీన్ ఇవ్వడం పూర్తయింది.
ఫ్రాన్స్, జర్మనీ సెప్టెంబరులో బూస్టర్ షాట్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. యూకే ఈ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇండియా కూడా బూస్టర్ షాట్లను ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాయి. అయితే, ఈ దేశాలు ఈ మేరకు ఎటువంటి ప్రకటనలూ చేయలేదు.
ఫొటో సోర్స్, Reuters
వ్యాక్సీన్లు, డెల్టా వేరియంట్
గతంలో వచ్చిన వేరియంట్ ల కంటే కూడా డెల్టా వేరియంట్ రెండు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పడంతో, చాలా దేశాలు వేరియంట్ గురించి ఆందోళన చెందుతున్నాయి.
"వ్యాక్సీన్ డోసులు పూర్తిగా తీసుకున్న వారి నుంచి కూడా డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకుతుంది" అని సిడిసి అందించిన నియమావళి చెబుతోంది.
కానీ, వ్యాక్సీన్లు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ శరీరంలో ఉండే సమయం తగ్గుతుందని కూడా సిడిసి పేర్కొంది. అందుకే కొత్త వేరియంట్ ల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే "వ్యాక్సీన్లను తీసుకోవడమే ఉత్తమమైన మార్గం" అని, ప్రజలందరినీ వ్యాక్సీన్లు తీసుకోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు.
"కానీ, బూస్టర్ డోసులను ఇవ్వడం వెనుక శాస్త్రీయత లేదు" అని కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ విభాగంలో సీనియర్ రీసెర్చర్ ఫెల్లో ఒక్సానా పైజిక్ అన్నారు.
"డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కోసం ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయమే ఈ బూస్టర్ డోసులు" అని ఆమె బీబీసీతో అన్నారు.
"బూస్టర్ డోసులు ఆవశ్యకత, సమర్ధత గురించి ఎటువంటి ఆధారాలు లేవు" అని డాక్టర్ పైజిక్ చెప్పారు.
"అయితే, వ్యాక్సిన్ల వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుందనే అంశం గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. తేలికపాటి ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాక్సిన్లు కాపాడగల్గుతున్నాయి కానీ, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మాత్రం కాపాడలేకపోతున్నాయని ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం వల్ల తెలుస్తోంది" అని ఆమె చెప్పారు.
ఫొటో సోర్స్, EPA
తగ్గిపోతున్న రోగనిరోధక శక్తి
ఫైజర్, ఆస్ట్రాజెనెకా డోసుల వల్ల ఏర్పడ్డ రోగ నిరోధక శక్తి ఆరు నెలల్లో తగ్గు ముఖం పడుతున్నట్లు కరోనావైరస్ తో పోరాడేందుకు వ్యాక్సిన్ల ప్రభావం గురించి అధ్యయనం చేస్తున్న పరిశోధనకారులు చెబుతున్నారు.
కానీ, వ్యాక్సీన్లు డెల్టా వేరియంట్ కి కూడా రక్షణ కల్పిస్తున్నాయని చెప్పారు.
రెండు డోసుల ఫైజర్ వ్యాక్సీన్ తీసుకున్న నెల రోజుల తర్వాత 88శాతం, 5-6 నెలల తర్వాత 74 శాతం రక్షణ తగ్గుతున్నట్లు జో కోవిడ్ అనే అధ్యయనం చెబుతోంది.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత 4 - 5 నెలలకు 77 శాతం నుంచి 67 శాతం రక్షణ తగ్గుతున్నట్లు తెలిసింది.
"వ్యాక్సిన్ల నుంచి రక్షణ తగ్గుతుందనే విషయం ఊహించిన విషయమే" అని ప్రభుత్వానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సలహాలు ఇచ్చే ప్రొఫెసర్ ఆడం ఫిన్ చెప్పారు.
"అత్యధిక జనాభాకు వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ నుంచి కూడా. అందుకే, ఎంత మందికి వీలయితే అంత మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం అవసరం" అని ఆయన అన్నారు.
కానీ, ఈ బూస్టర్ల విషయంలో అవలంభించాల్సిన విధానం గురించి బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో, ఈ బూస్టర్ డోసులు ప్రతీ ఒక్కరికి అవసరం ఉండకపోవచ్చు" అని అన్నారు.
"కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకినవారికి సహజంగానే బూస్టర్ రక్షణ లభించి ఉంటుందని అంటే, వారికి మూడు వ్యాక్సిన్లు లభించినట్లే" అని చెప్పారు.
"ఈ బూస్టర్ డోసులను అందరికీ ఇచ్చే బదులు, మొత్తం ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. లేదా ప్రస్తుతం ఉన్న వనరుల దృష్ట్యా ఇదొక నైతికంగా సందేహించే వృథా కార్యక్రమం అవుతుంది" అని అన్నారు.
ఫొటో సోర్స్, Reuters
డబ్ల్యుహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్
నైతిక సందిగ్ధత
60 సంవత్సరాలు మించి వయసు ఉన్నవారికి మూడవ డోసు ఫైజర్ తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా ఇన్ఫెక్షన్ నుంచి గణనీయమైన రక్షణ ఇస్తుందని ఇజ్రాయెల్ లో జరిగిన రెండు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫైజర్, మోడర్న వ్యాక్సిన్ల పై చేసిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
"కానీ, ఒక సమూహానికి రక్షణ పెంచేందుకు, మరొకరికి వ్యాక్సీన్ ఇవ్వడంలో జాప్యం చేయడం తెలివైన వ్యూహం కాదు" అని డాక్టర్ పైజిక్ అన్నారు.
"వ్యాక్సిన్లు ఇవ్వడంలో జాప్యంతో పాటు, ఇన్ఫెక్షన్ల సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఆందోళన కలిగించే డెల్టా వేరియంట్ లాంటి వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది" అని అన్నారు.
సంపన్న దేశాలన్నీ 50 సంవత్సరాలు నిండిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే, మరో బిలియన్ డోసుల అవసరం పడుతుందని డాక్టర్ పైజిక్ చెప్పారు.
మరో వైపు బురుండి, ఎరిత్రీ లాంటి దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ మొదలు కావల్సి ఉంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 0.01 శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. టాన్జేనియాలో 0.37 శాతం, నైజీరియాలో 0.69 శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఈజిప్ట్, వియత్నాంలలో 2శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆఫ్రికాలో వ్యాక్సీన్ పూర్తయిన వారి శాతం ఇంకా 2.5 శాతం కంటే తక్కువే ఉంది.
"వ్యాక్సిన్లు, వేరియంట్లకు మధ్య జరుగుతున్న పరుగు పందెంలో, బూస్టర్లు తక్కువ, మధ్య, దీర్ఘ కాలపరిమితుల్లో వైరస్ కి అనుకూలంగా పని చేస్తాయి" అని డాక్టర్ పైజిక్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
వివిధ స్థాయిల్లో రక్షణ
వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ సోకడం, వ్యాప్తి చెందిస్తుందనే సమాచారాన్ని బట్టీ చూస్తే, మూకుమ్మడిగా చేసే ఇమ్యునైజేషన్ ప్రక్రియ వైరస్ అరికట్టడానికి సరిపోకపోవచ్చని అనిపిస్తోంది.
కేవలం వ్యాక్సిన్ల మీదే ఆధారపడకుండా, కోవిడ్ రాకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ చర్యలన్నీ పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
"స్వీయ రక్షణ కోసం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా రక్షణ కల్పించాలంటే, పబ్లిక్ ఇండోర్ స్థలాల్లో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలి" అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో కోవిడ్ గురించి స్వతంత్రంగా సలహాలిచ్చే శాస్త్రవేత్తల బృందంలోని పరిశోధకురాలు క్రిస్టీనా పేజెల్ చెప్పారు.
"అలాగే, వ్యాక్సిన్లు తీసుకున్నవారి నుంచి కూడా ఇన్ఫెక్షన్ సోకుతున్నందున కోవిడ్ రక్షణ చర్యలు పాటించకుండా ఉండేందుకు వారికి కూడా ఎటువంటి మినహాయింపులు ఇవ్వకూడదు" అని ఆమె అన్నారు.
"బూస్టర్ షాట్లు అవసరం పడవచ్చు, కానీ, అల్పాదాయ దేశాలకు వెళ్లాల్సిన వ్యాక్సీన్ నిల్వలను బూస్టర్ షాట్ల కోసం వాడడం నేను అంగీకరించలేకపోతున్నాను" అని డాక్టర్ పైజిక్ అన్నారు.
"కానీ, ప్రపంచంలో చాలా దేశాలకు మొదటి డోసు వ్యాక్సీన్ తక్షణమే అందించాల్సిన అవసరం ఉంది" అని ఆమె అన్నారు.
"మనం స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు అతి నెమ్మదైన, ఖరీదైన మార్గాన్ని ఎంచుకుంటున్నాం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వాతావరణ మార్పులు: మానవాళికి ముప్పు పొంచి ఉందన్న ఐపీసీసీ నివేదిక
- దళిత గిరిజన దండోరా: 'దళిత బంధు' రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు-రేవంత్రెడ్డి
- ఆంధ్రప్రదేశ్: కొత్త విద్యా విధానంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)