‘పాకిస్తాన్‌లో కూడా జిహాద్ తప్పనిసరి.. అఫ్గాన్‌ షరియా వ్యవస్థను ఇక్కడా తేవాలి’ - తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్

  • బీబీసీ మానిటరింగ్ టీమ్
  • .
తాలిబాన్

ఫొటో సోర్స్, UMAR MEDIA WEBSITE

ఆగస్టు 15న తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత కాబుల్‌లోని బగ్రామ్, ఫుల్ ఏ చక్రి జైళ్ల నుంచి తమ ఖైదీలు విడుదల అవుతున్న కొత్త ప్రచార వీడియోను తెహ్రిక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) విడుదల చేసింది.

11 నిమిషాల వీడియోలో అమెరికాను ఓడించినందుకు అఫ్గాన్ తాలిబాన్లపై టీటీపీ ప్రశంసల వర్షం కురిపించింది.

అఫ్గానిస్తాన్ తాలిబాన్ చేతిలోకి వెళ్లిన తర్వాత వారి పట్ల తమకున్న విధేయతను టీటీపీ పునరుద్ఘాటించింది.

అయితే, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా టీటీపీ కార్యకలాపాలను తమ దేశంలో అనుమతించబోమని, అఫ్గాన్ తాలిబాన్లు తమ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు.

ఊరేగింపు ర్యాలీకి సంబంధించిన వీడియోలో టీటీపీ వ్యవస్థాపక అధ్యక్షులలో ఒకరైన మౌల్వి ఫకీర్ ముహమ్మద్‌కు గ్రూపు డిప్యూటీ లీడర్ ముఫ్తీ ముజాహిమ్ ఘన స్వాగతం పలకడం కనిపిస్తుంది. కాబుల్ లోని జైళ్ల నుండి వందలాది మంది ఇతర ఖైదీలతో పాటు మౌల్వి ఫకీర్ ముహమ్మద్‌ కూడా విడుదలయ్యారు.

పాకిస్తాన్‌లోని గిరిజన జిల్లా, అఫ్గాన్‌లోని కునార్ ప్రావిన్స్‌కు సరిహద్దు ప్రాంతమైన బజౌర్ చాప్టర్‌కి ఫకీర్ ముహమ్మద్ టీటీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అల్-ఖైదాతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అమెరికాలో సెప్టెంబర్ 11 దాడుల తరువాత, అల్‌ఖైదా ప్రస్తుత చీఫ్ ఐమాన్ అల్-జవహరిలతో పాటు ఇతర నాయకులకు కూడా బజౌర్‌లో ఫకీర్ ఆశ్రయం ఇచ్చినట్లు తెలిసింది.

2013లో తూర్పు అఫ్గాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో అఫ్గాన్ భద్రతా దళాలు ఆయన్ను అరెస్టు చేశాయి.

తాజా వీడియో పాష్తో భాషలో ఉంది. ఉర్దూ భాషలో సబ్ టైటిల్స్ ఇచ్చారు. ఈ వీడియోని టీటీపీ అధికారిక మీడియా విభాగం ఉమర్ స్టూడియో రూపొందించింది. ఆగస్ట్ 20న టీటీపీ అధికారిక వెబ్‌సైట్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈ వీడియోను విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

రాజధాని కాబుల్‌ని చేజిక్కించుకున్న తర్వాత అఫ్గాన్‌లో తాలిబాన్ కమాండర్లు మొదటిసారి అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన దృశ్యాలతో వీడియో మొదలవుతుంది.

వీడియోలో సగ భాగం మౌల్వి ఫకీర్ ముహమ్మద్ ప్రసంగించిన మూడు స్టేట్‌మెంట్‌ల క్లిప్‌లు ఉన్నాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత అఫ్గాన్ తూర్పు కునార్ ప్రావిన్స్‌లో టీటీపీ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ సమావేశాల్లో ఫకీర్ ఈ ప్రసంగాలు చేశారు.

వీడియో చివరలో ముఫ్తీ ముజాహిమ్ టీటీపీ సభ్యులకు 150 సెకన్ల సందేశాన్ని ఇచ్చారు.

మిగిలిన వీడియోలో సాయుధ టీటీపీ సభ్యులు ఒకరినొకరు అభినందించుకోవడం, విడుదలైన తర్వాత కునార్‌లోని తమ స్థావరాలకు సురక్షితంగా వారు చేరుకోవడం ఉంటుంది.

ఈ వీడియోలో టీటీపీ సీనియర్ కమాండర్, రెడ్ మాస్క్ బెటాలియన్ ఛీఫ్ హిలాల్ ఘాజీ ఉన్నారు. కునార్‌లో ఫకీర్ ముహమ్మద్‌ టీటీపీ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగింస్తున్న సమయంలో డజన్ల కొద్దీ ఇతర కమాండర్లతో హిలాల్ కనిపిస్తారు.

మౌల్వి ఫకీర్ ముహమ్మద్‌ ప్రకటనలు

అమెరికాపై తాలిబాన్ మిలటరీ సాధించిన విజయానికి అఫ్గాన్ తాలిబాన్ నాయకుడు హీబాతుల్లా అఖండ్ జాదా సహా ఆయన అనుచరులైన తాలిబాన్ రాజకీయ కమిషన్ నాయకుడు అబ్దుల్ ఘనీ బారాదార్, హక్కానీ నెట్‌వర్క్‌ చీఫ్ సిరాజుద్దీన్ హక్కానీలకు మౌలావి ఫకీర్ ముహమ్మద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకోసం ఎన్నో త్యాగాలు చేసిన తాలిబాన్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

అయితే, తాలిబాన్ మిలటరీ కమిషన్ కు నాయకత్వం వహిస్తున్న మౌల్వి యాకూబ్ గురించి ప్రస్తావించలేదు. ఈ నెల 17వ తేదీన టీటీపీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తాము అఫ్గాన్ తాలిబాన్‌కు విధేయులుగా కొనసాగుతామని స్పష్టం చేసింది. అయితే, ఇందులో తొలుత సిరాజుద్దీన్ హక్కానీ పేరు లేదు. వెంటనే విడుదల చేసిన సవరించిన ప్రకటనలో సిరాజుద్దీన్ హక్కానీ పేరును కూడా ప్రస్తావించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీహాదీ సోదరుల్లో టీటీపీ కూడా ఓ భాగమని, అందరి పట్ల సానుకూల ధోరణితో సత్సంబంధాలు ఉన్నాయని ఫకీర్ ముహమ్మద్‌ పేర్కొన్నారు. మతభ్రష్టులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిహాదిస్టులు అందరూ ఒకే నాయకత్వం కిందకు రావాలని పిలుపునిచ్చారు.

''ఏదైనా ప్రపంచ శక్తికి అహంకారం ఎక్కువయినప్పుడు అఫ్గానిస్తాన్‌పై దాడి చేస్తుంది. కానీ, చివరకు అమెరికాలా అవమానకరమైన ఓటమిని చవి చూస్తుంది'' అని టీటీపీ సభ్యులను ఉద్దేశించి ఫకీర్ ప్రసంగించారు. ''అఫ్గానిస్తాన్‌ని ఎవరు ఓడించలేరు. శత్రువులకు అదొక స్మశానం. గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్ కూడా అప్గానిస్తాన్ చేతిలో ఓటమి ఎదుర్కొన్నాయి'' అని తాలిబాన్లు విస్తృతంగా ఉదహరించే మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

‘పాకిస్తాన్‌లో జిహాద్ తప్పనిసరి’

చిన్నచిన్న గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చిన టీటీపీ ప్రస్తుత నాయకుడు ముఫ్తీ నూర్ వలీ మహసూద్ అంటే తనకు ప్రత్యేక గౌరవమని ఫకీర్ వెల్లడించారు.

పాకిస్తాన్‌లో జిహాద్‌ తప్పనిసరి అని, అఫ్గానిస్తాన్ రక్షణ కోసం తప్పకుండా కొనసాగించాలని నొక్కి చెప్పారు. పాకిస్తాన్ తమ(టీటీపీకి) ప్రియతమ దేశం అని, పాశ్చాత్య దేశాలు చెప్పినట్టల్లా ఆటలాడే ఇక్కడి అవినీతి నాయకులకు మాత్రమే మనం వ్యతిరేకులం అని పేర్కొన్నారు. పాకిస్తాన్ అణు శక్తి, మిలటరీ దళం 'మతభ్రష్ట' అధికారాల కోసం కాకుండా ముస్లిం సమాజానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. అఫ్గానిస్తాన్‌లో అమలవుతున్న షరియా లాంటి వ్యవస్థను పాకిస్తాన్‌లోనూ తీసుకొచ్చేందుకు పోరాడాలని పాకిస్తానీ జిహాదిస్టులకు పిలుపునిచ్చారు.

చివర్లో, పాకిస్తాన్ నుంచి వచ్చిన జిహాదిస్టులకు ఆశ్రయం కల్పించిన స్థానికుల పట్ల కృతజ్ఞతా భావంతో మెలగాలని కునార్లోని టీటీపీ సభ్యులకు సూచించారు. స్థానిక విషయాల్లో జోక్యం చేసుకోరాదని, పెద్దలను గౌరవించాలని వారిని కోరారు.

టీటీపీ ప్రస్తుత డిప్యూటీ చీఫ్ ముఫ్తీ ముజాహీం కూడా అమెరికా దాని మిత్రపక్షాలపై విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన అఫ్గాన్ తాలిబాన్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజ విజయంగా అభివర్ణించారు. తాలిబాన్ లాంటి భావజాలాన్ని వారి దేశాల్లోనూ పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు.

అఫ్గాన్ తాలిబాన్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ముజాహీం పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ తాలిబాన్ ఒకరి నాయకత్వం కిందకు వచ్చిందని, గ్రూపు నిర్ణయాలకు అనుగుణంగా యుద్ధం చేస్తుందని వెల్లడించారు.

టీటీపీ ఊరేగింపు

వీడియోలో జైలు నుంచి విడుదలైన సభ్యులకు టీటీపీ ఘనస్వాగతం పలికింది.

వారు మౌల్వి ఫకీర్‌తో కలిసి కునార్‌కు ప్రవేశద్వారమైన సవాకి జిల్లాను చేరుకున్నారు. ఈ ఊరేగింపులో రెండు డజన్లకు పైగా వాహనాలు కనిపించాయి. వీటిలో కొన్ని అఫ్గాన్ బోర్డర్ పోలీసులు, అఫ్గాన్ మిలటరీ, స్పెషల్ యూనిట్లకు చెందిన వాహనాలు కూడా ఉన్నాయి. చివరగా, కునార్ ప్రావిన్సు రాజధాని అసాదాబాద్ సెంట్రల్ స్క్వేర్ మీదుగా ఊరేగింపు టీటీపీ స్థావరాలకు చేరుకుంది.

అష్రఫ్ గనీ నేతృత్వంలోని అఫ్గాన్ ప్రభుత్వం కునార్‌లో టీటీపీకి ఆశ్రయం కల్పించిందని, ఫలితంగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని పాకిస్తాన్ గతంలో ఆరోపించింది. కాగా, కునార్ రాజధానిలో తమ స్ధావరాలు ఉన్నాయంటూ టీటీపీ ఓ డాక్యుమెంటరీని విడుదల చేయడం ఇదే తొలిసారి.

టీటీపీ ఊరేగింపులో జిహాదీల జాతీయ గీతాన్ని కూడా ఆలపించారు. ఈ పద్యాన్ని భారత ఉపఖండానికి చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ రచించారు. ఇక్బాల్ గీతాన్ని ఇలా అనువదించవచ్చు:

‘‘డేగలా ముందుకు దూసుకెళ్లిన వారి రెక్కలు తెగిపడ్డాయి. ఆ సాయంత్రపు నక్షత్రాలు, సూర్యాస్తమయపు రక్తంలో మునిగిపోయాయి. కానీ అవి మళ్లీ ఉద్భవిస్తాయి’’

ఈ లైన్లు 20వ శతాబ్ద ఆరంభంలో గ్రీస్ రాజ్యంపై టర్కీ మిలటరీ విజయానికి గుర్తుగా ఇక్బాల్ రాశారని సాహిత్య నిపుణులు చెబుతారు. ఒట్టోమన్ రాజ్య కాలంలో జరిగిన ఈ యుద్ధంలో యూకే, గ్రీస్‌కు దౌత్యపరంగా సహకారం అందించింది. జిహాదిస్టుల్లో అఫ్గాన్ విజయస్ఫూర్తిని నింపేందుకే వీడియోలో ఈ పాటను ఉంచారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)