అఫ్గానిస్తాన్: 'ఓటమి ఎరుగని' పంజ్‌షీర్ లోయ కథ

  • పాల్ కెర్లీ, లూసియా బ్లాస్కో
  • బీబీసీ న్యూస్
చుట్టూ కొండలతో పంజ్‌షీర్ లోయ శత్రు దుర్గమంగా ఉంటుంది

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్,

చుట్టూ కొండలతో పంజ్‌షీర్ లోయ శత్రు దుర్గమంగా ఉంటుంది

పంజ్‌షీర్ లోయ అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే కాబుల్ సహా దేశాన్నంతా చేతిలోకి తీసుకున్న తాలిబాన్‌లకు ఇది మాత్రం కొరకరాని కొయ్యగా మారింది.

ఇక్కడ కొన్ని వేల మంది తాలిబాన్ వ్యతిరేక ఫైటర్లు ఉన్నారని భావిస్తున్నారు. పంజ్‌షీర్‌ లోపలికి వెళ్లడానికి ఒకే ఒక్క ఇరుకైన ప్రవేశద్వారం ఉంటుంది.

అఫ్గాన్ చరిత్రలో పంజ్‌షీర్‌ లోయ గురించి ఇంత చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. 1980లలో సోవియట్ బలగాలను, 90లలో తాలిబాన్లను ఎదిరించి నిలిచింది పంజ్‌షీర్.

సోవియట్, తాలిబాన్ల వ్యతిరేక ఫైటర్లకు ఇది కంచుకోటగా ఉంది. ఈ లోయ ప్రస్తుతం నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ -ఎన్ఆర్ఎఫ్ చేతిలో ఉంది.

ఈ లోయ శక్తి ఎలాంటిదో ఎన్ఆర్ఎఫ్ ఇటీవల ప్రపంచానికి చెప్పుకుంది..

'' రెడ్ ఆర్మీ తన శక్తితో మమ్మల్ని ఓడించలేకపోయింది. తాలిబాన్లు కూడా 25 సంవత్సరాల క్రితం ఈ లోయను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వాళ్లు ఇక్కడ ఘోర పరాజయాన్ని చూశారు'' అని ఎన్ఆర్ఎఫ్ విదేశీ వ్యవహారాల హెడ్ అలీ నజరీ బీబీసీకి చెప్పారు.

పొడవుగా, లోతుగా ఉండే ఈ లోయ కాబుల్‌కు ఉత్తరాన నైరుతి నుంచి ఈశాన్యం వరకు దాదాపు 120 కిలోమీటర్లు విస్తరించి ఉంది.

ఈ లోయ చుట్టూ ఎత్తైన పర్వతాలు పెట్టని కోటలా ఉన్నాయి. ఇవి 3000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ఈ ఎత్తైన పర్వతాలు దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయి.

అక్కడ ఒకే ఒక్క ఇరుకైన రోడ్డు ఉంది. అది రాళ్లు తేలిన భూములు, పంజ్‌షీర్ నది మధ్య వంకరటింకరగా సాగుతూ ఉంటుంది.

'ఈ ప్రాంతానికి పౌరాణిక కోణం కూడా ఉంది. ఇది కేవలం ఒక్క లోయ కాదు. ఒక్కసారి అక్కడికి వెళ్లిన తర్వాత మరో 12 లోయలు దానికి అనుసంధానమై ఉంటాయి' అని షాకిబ్ షరిఫీ అనే వ్యక్తి చెప్పారు.

చిన్నప్పుడు ఈయన అక్కడే ఉండేవారు. అఫ్గాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రధాన లోయ దారి అంజొమన్ పాస్‌కి వెళ్తుంది. అక్కడి నుంచి తూర్పుగా ముందుకు సాగి హిందూ కుష్ పర్వతాల వరకు వెళ్తుంది. అలెగ్జాండర్ ద గ్రేట్, తామెర్లేన్ సైన్యాలు గతంలో ఈ దారిలోనే ప్రయాణించాయి.

'పంజ్‌షీర్ లోయ మైనింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి. విలువైన ఖనిజాల తవ్వకాలు ఇక్కడ జరుగుతాయి' అని లీడ్స్ యూనివర్శిటీలో అంతర్జాతీయ చరిత్ర విభాగం ప్రొఫెసర్ ఎలిసబెత్ లీకే చెప్పారు.

ప్రస్తుతం ఈ లోయలో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్‌లు, ఒక విండ్ ఫామ్ ఉంది. ఇక్కడ రోడ్లు, ఒక రేడియో టవర్ నిర్మాణంలో అమెరికా సాయం చేసింది.

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్,

దేశమంతా ఆక్రమించుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్ లోయ కొరకరాని కొయ్యగా మారింది

కీలక ప్రాంతం

బగ్రామ్‌లో ఉన్న అమెరికా మాజీ సైనిక స్థావరం ఈ లోయ ముఖద్వారానికి కొద్ది దూరంలోనే ఉంటుంది. నిజానికి ఈ సైనిక స్థావరాన్ని 1950ల్లో సోవియట్ నిర్మించింది.

ఒక లక్షా 50వేల నుంచి రెండు లక్షల మంది వరకు ఈ లోయలో ఉంటారు. ఎక్కువ మంది 'దరి' భాష మాట్లాడతారు. అఫ్గాన్‌లో మాట్లాడే ప్రధాన భాషల్లో ఇది ఒకటి. వీళ్లు తజిక్ జాతికి చెందినవాళ్లు.

అఫ్గాన్ జనాభాలో దాదాపు 25శాతం మంది తజిక్ ప్రజలు ఉంటారు. కానీ పంజ్‌ షీర్‌లోని ప్రజలు పొరుగున ఉన్న తజికిస్తాన్ వెళ్లడానికి ఆసక్తి చూపించరు. స్థానికంగా వాళ్లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

పంజ్‌షీర్ ప్రజలు చాలా ధైర్యవంతులు. అఫ్గాన్‌ మొత్తంలో ధైర్యంలో వాళ్లను మించిన వాళ్లు లేరేమో అని మొన్నటి వరకు అఫ్గానిస్తాన్ వ్యవసాయ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన షరిఫీ చెప్పారు. వాళ్లు తాలిబాన్‌లతో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోరని ఆయన చెప్పారు. బ్రిటిష్, సోనియట్, తాలిబాన్లపై విజయాలు వారిలో ధైర్యాన్ని మరింత పెంచాయని ఆయన అన్నారు.

2001లో తాలిబాన్లు ఓడిపోయిన తర్వాత ఈ లోయను జిల్లా నుంచి ఒక ప్రావిన్స్‌ (రాష్ట్రం)గా మార్చారు. అఫ్గానిస్తాన్‌లో ఉన్న అతి చిన్న రాష్ట్రాల్లో ఇది ఒకటి.

సొంత హక్కులతో దీన్నొక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వివాదాస్పదమైందని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌యూఎస్ఐ)లో పరిశోధనకారుడు డాక్టర్ ఆంటోనియో గిస్టోజీ చెప్పారు.

2000 సంవత్సరం మొదట్లో పంజ్‌షీర్ ఫైటర్లకు చాలా శక్తి ఉండేదని, కాబుల్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వాళ్లు సాయం చేసి, ప్రభుత్వంలో కీలకంగా మారారని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పంజ్‌షీర్ లోయలోని యాంటీ తాలిబాన్ ఫైటర్లు

ప్రభుత్వంలో పంజ్‌షీర్ నేతలు

పంజ్‌షీర్ నాయకులకు ప్రభుత్వంలో, సైన్యంలో కీలక పదవులు ఇచ్చారు. ఈ లోయ స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. స్థానికులనే గవర్నర్లుగా నియమిస్తారు.

వేరే ప్రాంతం నుంచి వచ్చిన గవర్నర్లు కాకుండా స్థానిక గవర్నర్లు మాత్రమే పాలన సాగించే ఏకైక ప్రావిన్స్ ఇది.

''సాధారణంగా ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నవారినే గవర్నర్లుగా నియమిస్తారు. కానీ పంజ్‌షీర్‌లో పరిస్థితి వేరు. అక్కడ స్థానికులను మాత్రమే గవర్నర్లుగా నియమించేవారు'' అని డాక్టర్ ఆంటోనియో చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో ఇలాంటి వందలాది లోయలు ఉన్నాయి. కానీ కాబుల్‌ నుంచి వస్తున్న ప్రధాన రహదారికి సమీపంలో ఉండటం వల్ల ఇది వ్యూహాత్మకంగా కీలకంగా మారిందని డాక్టర్ ఆంటోనియో చెప్పారు.

ఈ లోయ ముఖద్వారం కాబుల్ ప్రధాన హైవేకి కాస్త సమీపంగానే ఉంటుంది. ఈ హైవే చదునైన కాబుల్ భూభాగం నుంచి పర్వతాలతో కూడిన సలంగ్ పాస్, అక్కడి నుంచి ఉత్తరాది నగరాలైన కుందుజ్, మజారే షరీఫ్‌లకు వెళ్తుంది.

పంజ్‌షీర్‌ ప్రాముఖ్యతకు అనేక కారణాలు ఉన్నాయని మొన్నటి వరకు అఫ్గానిస్తాన్ వ్యవసాయ శాఖలో డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన షరిఫీ చెప్పారు.

''ఈ లోయలో సుమారు పన్నెండు ప్రాంతాలు పోరాటానికి అనుకూలంగా ఉంటాయి. భౌగోళికంగా పర్వతాలు ఈ లోయకు పెట్టని కోటలా ఉంటాయి. పంజ్‌షీర్ ప్రజలు అసమాన ధైర్యసాహసాలు చూపిస్తారు. వీటన్నింటి కారణంగా పంజ్‌షీర్‌ ఒక విశిష్ట ప్రాంతంగా నిలిచిపోయింది. అఫ్గానిస్తాన్‌లోని చాలా ప్రాంతాలకు వీటిలో ఒక్కో లక్షణం ఉంది. కానీ పంజ్‌షీర్‌కు మాత్రం చాలా అంశాలు కలిసి ఉన్నాయి'' అని షరిఫీ చెప్పారు.

ప్రస్తుతం ఈ లోయలో ఆయుధాల నిల్వలు అపారంగా ఉన్నాయని భావిస్తున్నారు. చాలా మంది ఫైటర్లు గత 20 ఏళ్లుగా తమ పని మానేసి, ఆయుధాలను తిరిగి ఇచ్చేశారని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ అక్కడ ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నాయని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌యూఎస్ఐ)లో పరిశోధనకారుడు డాక్టర్ ఆంటోనియో గిస్టోజీ చెప్పారు.

పంజ్‌షీర్‌తో సంబంధాలున్న అఫ్గాన్ అధికారులు కూడా ఆయుధాలను ఈ లోయకు తరలించారు. హమీద్ కర్జాయ్, ఘనీ వంటి అధ్యక్షులపై ఆందోళనతో వారు ఈ పని చేశారు. కానీ వాళ్లు నిజంగా భయపడాల్సింది తాలిబాన్ల గురించి అని గిస్టోజీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తాలిబాన్‌లపై పోరుకు నాయకత్వం వహిస్తున్న 32 ఏళ్ల అహ్మద్ మసూద్

యువ నాయకత్వం

ఈ లోయలో తాలిబాన్ వ్యతిరేక దళాలకు 32 సంవత్సరాల అహ్మద్ మసూద్ నాయకత్వం వహిస్తున్నారు. ఈయన 1980, 90ల్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్ కుమారుడు.

అఫ్గాన్ సైన్యం, ప్రత్యేక బలగాల నుంచి తమకు సైనిక సహాయం అందుతోందని మసూద్ చెప్పారు.

''మాకు ఆయుధ నిల్వలు ఉన్నాయి. మా నాన్న కాలం నుంచే వాటిని మేము జాగ్రత్తగా సేకరించాం. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని మాకు తెలుసు'' అని వాషింగ్టన్ పోస్ట్‌ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన చెప్పారు.

మసూద్ తండ్రిని పంజ్‌షీర్ సింహం అని పిలుస్తారు. ఆయన ఒక ముజాహిదీన్ కమాండర్. సోవియట్, తాలిబాన్ బలగాలను ఆయన ఎదిరించారు. నిజానికి పంజ్‌షీర్ అంటే ఐదు సింహాలని అర్థం.

అహ్మద్ షా మసూద్‌ ఈ లోయలోనే పుట్టారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌, కాబుల్‌లలోని షాపులు, ఫ్లెక్సీలపై ఆయన ఫొటోలు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి.

1978లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ అప్గానిస్తాన్ అధికారంలోకి వచ్చింది. ఏడాది తర్వాత సోవియట్ యూనియన్ దళాలు అక్కడ అడుగుపెట్టాయి. వాటిని ఆయన అడ్డుకున్నారు. ఆయన వల్లే పంజ్‌షీర్ లోయ కమ్యూనిస్ట్ వ్యతిరేక కేంద్రంగా మారింది.

''సోవియట్-అఫ్గాన్ యుద్ధంలో ప్రతిఘటనకు ఆయన చిహ్నంగా మారిపోయారు'' అని లీడ్స్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎలిజబెత్ అన్నారు.

''ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. పాశ్చాత్య మీడియాతో తరచూ మాట్లాడేవారు. సోవియట్లు చర్చలు జరపడానికి సుముఖంగా ఉండే ఉద్యమ నాయకుల్లో ఈయన ఒకరు. అందుకే ఆయన చాలా కీలకంగా మారారు'' అని ఎలిజబెత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్,

అహ్మద్ షా మసూద్

ఆ కాలంలో ఇతర రెబల్ నాయకులతో పోలిస్తే మసూద్ భిన్నంగా ఉండేవారు. ఆయన చదువుకున్నారు. ప్రెంచ్ మాట్లాడేవారు. సాఫ్ట్‌గా ఉండేవారు. ఇతర కమాండర్లు కఠినంగా, నిరక్షరాస్యులుగా ఉండేవారని డాక్టర్ గిస్టోజీ చెప్పారు.

2001లో అల్‌ఖైదా ఆయన్ను చంపేసింది. అమెరికాలో 9/11 దాడులకు రెండు రోజుల ముందు అల్‌ఖైదా ఆయన్ను చంపేసింది. ఆయనొక నేషనల్ హీరో అని అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రకటించారు.

అయితే, ఈ ముజాహిదీన్ నాయకుడిని వార్ క్రిమినల్ అని కూడా కొందరు చెబుతుంటారు.

''అహ్మద్ షా మసూద్ చాలా అరాచకాలకు పాల్పడ్డారు. యుద్ధ సమయంలో ఆయన సారథ్యంలోని సైనిక బలగాలు వేధింపులకు పాల్పడ్డాయి'' అని 2005 నాటి హ్యుమన్ రైట్స్ వాచ్ ఇన్వెస్టిగేషన్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్,

పంజ్‌షీర్ ప్రాంతంలో కనిపించే 1979నాటి రష్యా హెలీకాప్టర్

పంజ్‌షీర్‌ను చేజిక్కించుకోవడం కష్టమా?

1980 నుంచి 1985 మధ్య సోవియట్ దాదాపు ఆరుసార్లు ఈ లోయపై దాడి చేసింది. భూతల దాడులతో పాటు వైమానిక దాడులూ చేసింది. కానీ ఈ ప్రాంతం గురించి రష్యన్ పైటర్లకు ఎక్కువగా తెలియదు. అందుకే వాళ్లు తరచూ మెరుపు దాడులకు గురయ్యేవారు.

అయితే, ఈ లోయపై సోవియట్లు గట్టి పట్టు సాధించగలిగారని డాక్టర్ గిస్టోజీ చెప్పారు. కానీ వారి పట్టు ఎంతో కాలం నిలువలేదు.

అక్కడ ఉండడం, సైన్యాన్ని మోహరించడం రష్యన్లకు ఎంతో సవాలుగా ఉండేది. వాళ్లు ప్రధానంగా ఉత్తర-దక్షిణ హైవేని కాపాడాలని అనుకున్నారు. కానీ అక్కడికి సమీపంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పోరాటం మొదలైందని డాక్టర్ గిస్టోజీ వివరించారు.

పంజ్‌షీర్ లోయలో ధ్వంసమైన ట్యాంకులు, విమానాలు, హెలికాప్టర్లు కనిపిస్తూ ఉంటాయి. సోవియట్ ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయో కథలు కథలుగా చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మసూద్ తండ్రి అహ్మద్ షా మసూద్‌ను అల్ ఖైదా హత్య చేసింది

వారసుడు

తండ్రి చనిపోయినప్పుడు అహ్మద్ మసూద్ వయసు 12 సంవత్సరాలు. ఆయన లండన్‌లో చదువుకున్నారు. రాయల్ మిలిటరీ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు.

తండ్రికున్న పేరు ప్రఖ్యాతులు వారసత్వంగా ఆయనకు వచ్చాయి. కానీ సైనిక నాయకుడిగా ఆయనకు అనుభవం లేదని డాక్టర్ గిస్టోజీ అన్నారు.

జాతీయ స్థాయిలో అధికార పంపిణీకి సంబంధించి చర్చలు జరిపే నైపుణ్యాలు ఆయనకు అవసరమని గిస్టోజీ చెప్పారు.

ఈ లోయలో ఇప్పుడేం జరుగుతుందో అంచనా వేయడం కష్టమని ప్రొఫెసర్ ఎలిజబెత్ చెప్పారు.

"ఒకవేళ తాలిబాన్లు దాడి చేస్తే మా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటారు. మా సైనిక బలం, లాజిస్టిక్స్ సమృద్ధిగా లేవని మాకు తెలుసు" అని వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన వ్యాసంలో ఆయన అన్నారు.

"పాశ్చాత్య దేశాల్లోని మా స్నేహితులు ఆలస్యం చేయకుండా మాకు ఆయుధాలు సరఫరా చేయకపోతే మా దగ్గరున్నవి త్వరగా అయిపోతాయి" అని ఆయన రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)