స్టాలిన్ కాలంలో వేలాది మందిని సామూహికంగా ఖననం చేసిన భారీ శ్మశానం

ఫొటో సోర్స్, Aleksander Babich
ఒడెస్సాలో వేలాది మందిని ఖననం చేసిన శ్మశానం
స్టాలిన్ పాలన కాలంలో యుక్రెయిన్‌లో వేలాది మందిని ఖననం చేసిన అతి పెద్ద శ్మశానాల్లో ఒకదాన్ని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు.
దక్షిణాది నగరమైన ఒడెస్సాలో బయటపడిన 29 భారీ సమాధుల్లో 5000 నుంచి 8000 మంది అవశేషాలను పరిశోధకులు గుర్తించారు.
ఎయిర్‌పోర్టు విస్తరణ ప్రణాళిక పనుల్లో భాగంగా జరుపుతోన్న తవ్వకాల్లో 1930 దశకం చివరి నాటిదిగా భావిస్తోన్న ఈ ప్రాంతం బయటపడింది.
సోవియట్ యూనియన్ను జోసెఫ్ స్టాలిన్ పరిపాలించిన కాలంలో లక్షలాది మంది యుక్రెయిన్లు చనిపోయినట్లు భావిస్తున్నారు.
1930 దశకం చివర్లలో సోవియట్ రహస్య పోలీసు దళాల చేతిలో వీరంతా మరణించి ఉంటారని యుక్రెయిన్ నేషనల్ మెమొరీ ఇన్స్టిట్యూట్ రీజినల్ బ్రాంచ్ హెడ్ సెర్జీ గుత్సల్యుక్ ఏఎఫ్‌పీతో చెప్పారు.
రష్యాలో పొందుపరిచిన రికార్డుల ప్రకారం బాధితులను గుర్తించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
సోవియట్ రహస్య పోలీసు దళాలు 1938 నుంచి 1941 మధ్య కాలంలో ఒడెస్సాలో దాదాపు 8,600 మందికి మరణశిక్ష విధించాయని యుక్రెయిన్ఫార్మ్ వెబ్సైట్ పేర్కొంది.
ఫొటో సోర్స్, AFP
బైకివ్నీయా సామూహిక ఖననాల ప్రాంతం
ఆ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్యను అంచనా వేయడం సాధ్యం కాదని నేషనల్ మెమొరీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. అయితే ఇది యుక్రెయిన్‌లో కనుగొన్న అతిపెద్ద సామూహిక సమాధుల్లో ఒకటిగా నిలిచింది.
సైట్‌లోని అన్ని ప్రాంతాల్లో పూర్తిగా తవ్వకాలు చేపట్టి ఉంటే ఇప్పటివరకు కనుగొన్న వాటికంటే ఎక్కువ సంఖ్యలో మృతదేహాల అవశేషాలు అక్కడ కనిపించి ఉండేవని డిస్కవరీలో పనిచేసిన చరిత్రకారుల్లో ఒకరైన అలెక్సాండర్ బాబిచ్ ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు.
సైనిక విభాగానికి చెందిన ఆ సైట్‌కు సమీప ప్రాంతంలో మరిన్ని సమాధులు ఉండవచ్చని ఆయన అన్నారు.
1930ల నాటి జోసెఫ్ స్టాలిన్ హింసాత్మక అణిచివేతలో లక్షలాది మంది మరణించారని యుక్రెయిన్ చరిత్రకారులు చెబుతున్నారు. వారి సామూహిక సమాధులను ఒడెస్సాతో పాటు యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో కనుగొన్నట్లు వెల్లడించారు.
బైకివ్నీయాలోని అతిపెద్ద సైట్లలో ఒకటైన, రాజధాని కీవ్‌కు వెలుపల ఉన్న అటవీ ప్రాంతంలో 2 లక్షల మందికి పైగా రాజకీయ ఖైదీలను ఖననం చేసినట్లు కొందరి అంచనా.
స్టాలిన్ పాలనలో 1932-1933 కరువు సమయంలో లక్షలాది మంది యుక్రెయిన్ ప్రజలు మరణించారు. దీన్ని సోవియట్ నాయకుడు స్టాలిన్ చేసిన మారణహోమంగా కొందరు యుక్రెయిన్లు నమ్ముతారు. అయితే, ఈ వాదనను రష్యా ఖండిస్తూ వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఇందిరా పార్క్: 'పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు' అనే నిర్ణయంపై వివాదం, మహిళా సంఘాల ఆగ్రహం
- తాలిబాన్లు జిహాద్‌పై అమెరికా వదిలిన బాణమా... - ఇస్లామిక్ స్టేట్ ఎందుకలా ప్రచారం చేస్తోంది?
- మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుంచి బురఖాలో బందీ అయినంతవరకు
- సొరాయా: అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం కృషిచేసిన ఈ రాణి చివరికి ఇటలీ ఎందుకు పారిపోయారు
- ‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’
- ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్డోజర్' ఎలా అయ్యారు?
- ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)