కాబుల్ జంట పేలుళ్లు: ‘ఇస్లామిక్ స్టేట్ మరిన్ని దాడులు చేయొచ్చు.. ఆగస్టు 30లోగా అన్ని రాయబార కార్యాలయాల తరలింపు’

ఫొటో సోర్స్, EPA
"మేము క్షమించం. మేము మర్చిపోం. మేం వారిని వదిలిపెట్టం. వెంటాడి వేటాడుతాం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు
బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
"ఈ మిషన్‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు.
అలాగే కాబుల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
‘ఇస్లామిక్ స్టేట్ మరిన్ని దాడులు చేయొచ్చు’
కాబుల్ నుంచి ప్రజల తరలింపు కొనసాగుతున్నందున మరిన్ని దాడులకు ఇస్లామిక్ స్టేట్ పాల్పడనుందనే సమాచారంతో అమెరికా కమాండర్లు అప్రమత్తమయ్యారు.
రాకెట్లు, వాహనాలకు అమర్చిన బాంబులతో కాబుల్ విమానాశ్రయం లక్ష్యంగా దాడులు జరగొచ్చని యుఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీ వెల్లడించారు.
అఫ్గానిస్తాన్ నుండి సైనికుల ఉపసంహరణను వేగంగా పూర్తి చేస్తూనే 'అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటానికి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం' అని జనరల్ మెకెంజీ పేర్కొన్నారు.
తాలిబన్లతో ఒప్పందం ప్రకారం గడువు ఆగస్టు 31 లోగా తరలింపును పూర్తి చేయడానికి అమెరికా సన్నదం అవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ గడువును పొడిగించలేదు. గురువారం సాయంత్రం దాడులు జరిగినప్పటికీ తరలింపు ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
ఈ దాడి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బైడెన్ హెచ్చరించారు. బాంబు పేలుళ్లకు బాధ్యత వహించిన ఐసిస్-కెపై ఎలా దాడి చేయాలో ప్రణాళిక రూపొందించాలని తాను పెంటగాన్‌ను ఆదేశించానని చెప్పారు.
అనువాదకులు, అమెరికన్ సైన్యానికి సహకరించిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని రాయిటర్స్ పేర్కొంది.
ఆగస్టు 30లోగా అన్ని రాయబార కార్యాలయాల తరలింపు
అఫ్గానిస్తాన్‌లోని తమ పౌరులను, రాయబార కార్యాలయ ఉద్యోగులను ఆగస్టు 30 లోపు ఖాళీ చేయాలనే లక్ష్యంతో ఆయా దేశాల ప్రభుత్వాలు పని చేస్తున్నాయని నాటో దౌత్యవేత్త వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు.
అమెరికా దాని మిత్ర దేశాలు ఆగస్టు 31 కంటే ముందు వీలైనంత ఎక్కువ మందిని తరలించాలని పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రకటన వెలువడింది.
ఇంకా దాదాపు 1,500 మంది అమెరికా పౌరులు అఫ్గానిస్తాన్‌లో ఉన్నారు. దాదాపు 400 మంది తమ పౌరులు ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని యూకే తెలిపింది. కాబూల్‌లో 200 మంది తమ పౌరులు ఉన్నారని అంచనా వేసినట్లు జర్మనీ తెలిపింది. ఫ్రెంచ్ పౌరులు ఎవరైనా ఇప్పటికీ ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ శుక్రవారం సాయంత్రానికి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
కాబుల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లలో ఎంతో మంది గాయపడ్డారు
గురువారం నాడు (ఆగస్ట్ 26) స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు దాడి జరిగింది.
ముందుగా ఎయిర్పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.
అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.
కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది.
బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్లో పరిశీలిస్తుంటారు.
బాంబు పేలుళ్లలో 13మంది అమెరికన్లు సహా 60 మంది చనిపోయారు.
ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ శాఖ అయిన ఐసిస్-K దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ప్రజలను తరలిస్తున్న విమానంలో తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో వేలాది మంది అఫ్గాన్లు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చారు.
కాబుల్ జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఈ జిహాదీ గ్రూప్ ప్రకటించుకుంది.
బాంబు పేలుడు జరిగిన ప్రాంతం
'మేము మర్చిపోం, వారిని వెంటాడి, వేటాడుతాం'
"మేము క్షమించం. మేము మర్చిపోం. మేం వారిని వదిలిపెట్టం. వెంటాడి వేటాడుతాం. పేలుళ్లకు వాళ్లు మూల్యం చెల్లించుకునేలా చేస్తాం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
చనిపోయిన వారిలో 11 మంది సైనికులు, ఒక నేవీ వైద్య సిబ్బంది ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంజీ చెప్పారు.
ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పించిన హీరోలుగా దాడిలో మరణించిన అమెరికన్ సైనికులను అభివర్ణించారు బైడెన్.
ఐసిస్- కే నుంచి ముప్పు ఎక్కువగా ఉందని, మళ్లీ దాడులు జరగకుండా ఎలా ఆపాలనే దానిపై తాలిబాన్లతో కలిసి పనిచేస్తున్నామని జనరల్ ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. తాలిబాన్లు ఇప్పటికే చాలా దాడులను నిలువరించారని వెల్లడించారు.
ఆగస్ట్ 15న కాబుల్ తాలిబాన్ల వశమైంది. అప్పటి నుంచి లక్ష మందికి పైగా కాబుల్ నుంచి తరలించారు.
ఆగస్ట్ 31లోగా అమెరికా సేనలు అఫ్గాన్ వదిలి వెళ్లిపోవాలని తాలిబాన్లు డెడ్‌లైన్ పెట్టారు.
ఆ డెడ్‌లైన్‌లోగా దేశం వదిలి వెళ్లేందుకు చాలామంది అఫ్గాన్లు కాబుల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
రెండు బాంబు పేలుళ్ల తర్వాత ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పొగ
అయితే, తరలింపు ప్రక్రియను ఈ పేలుళ్లు మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది.
కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం 5800 మంది అమెరికా సైనికులు, మరో వెయ్యి బ్రిటన్ బలగాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు 104000 మంది పౌరులను అఫ్గాన్ నుంచి తరలించారు. వీరిలో 66వేల మంది అమెరికన్లు, 37వేల మంది మిత్రపక్షాల సభ్యులు ఉన్నారు.
సుమారు ఐదు వేల మంది ప్రజలు విమానాశ్రయం బయట ఎదురుచూస్తున్నారు. మరెంతో మంది చెక్ పోస్టులను దాటుకుని అక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాలు తమ ఆపరేషన్లను ఇదివరకే నిలిపేశాయి.
గత ఆరేళ్లుగా ఎయిర్పోర్ట్ వద్ద భద్రత కల్పిస్తున్న టర్కీ.. తమ బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
బాంబు పేలుళ్ల తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కాబుల్ నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుంచి బురఖాలో బందీ అయినంతవరకు
- సొరాయా: అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం కృషిచేసిన ఈ రాణి చివరికి ఇటలీ ఎందుకు పారిపోయారు
- ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్డోజర్' ఎలా అయ్యారు?
- ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
- ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ
- అఫ్గానిస్తాన్: ఐఎస్‌లో చేరి అఫ్గాన్‌లో జైలు పాలైన భారత మహిళ 'నిమిష' ఇప్పుడెక్కడ?
- ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి
- జాడలేని ఐఎస్ జిహాదీల భార్యలు, పిల్లలు
- తాలిబాన్ల పాలనలో అల్ ఖైదా, ఐఎస్‌లకు అఫ్గానిస్తాన్ అడ్డాగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)