అఫ్గాన్ సంక్షోభం: ఐసిస్-కె ఎవరు? ఇది ఎందుకంత హింసాత్మకమైనది?

  • ఫ్రాంక్ గార్డనర్
  • బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్
ఐసిస్-కె

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఇటీవలి సంవత్సరాలలో వరుసగా జరిగిన దాడుల వెనక ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల హస్తం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. 2019లో కాబూల్‌లోని ఒక వివాహ మందిరంలో ఇలా..

ఐసిస్-కె లేదా ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్సు(ఐఎస్‌కేపీ) ఇది ఇస్లామిక్ స్టేట్‌కు అనుబంధ సంస్థ. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లో ఐసిస్-కె క్రియాశీలంగా ఉంది.

అఫ్గానిస్తాన్‌లో ఉన్న జిహాదిస్టు గ్రూపులు అన్నింటిలోకెల్లా ఇదే అత్యంత తీవ్రమైన, హింసాత్మకమైనది.

ఇరాక్, సిరియాల్లో ఐసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 2015 జనవరిలో ఐసిస్-కె ఏర్పాటైంది. ఆ తర్వాతి కాలంలో అమెరికా నేతృత్వంలోని మిత్రపక్షాలు తమని తాము ఖాలిఫాగా ప్రకటించుకున్న ఐసిస్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

అఫ్గాన్, పాకిస్తానీ జిహాదిస్టులను ఐసిస్-కె తన గ్రూపులో చేర్చుకుంటుంది. ప్రత్యేకించి తమ సొంత సంస్థ ఆలోచనలు అతి తీవ్రంగా లేదా కఠినంగా ఉండటం లేదని భావించే అఫ్గాన్ తాలిబాన్లు ఐసిస్-కెలో చేరతారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తూర్పు ప్రావిన్స్ నంగర్‌హార్‌ స్థావరంగా ఐసిస్-కె ఉంది. మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా జరిగే పాకిస్తాన్ మార్గాలకు సమీపంలో ఉంది

ఎంత కఠినం?

ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఘోరమైన దారుణాలకు ఐసిస్-కె పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బాలికల పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రసూతి వార్డును కూడా లక్ష్యంగా చేసుకుని గర్భిణులు, నర్సులను కాల్చి చంపింది.

తాలిబాన్ కేవలం అఫ్గానిస్తాన్‌పై తన దృష్టి సారించగా, ఐసిస్-కె మాత్రం గ్లోబల్ ఐఎస్ నెట్‌వర్క్‌లో అంతర్భాగం. పాశ్చాత్య, అంతర్జాతీయ, మానవతా కార్యక్రామాలను లక్ష్యాలుగా చేసుకుని వీలైనప్పుడల్లా దాడులకు పాల్పడుతుంది.

వీళ్లు ఎక్కడుంటారు?

తూర్పు ప్రావిన్స్ నంగర్‌హార్‌ స్థావరంగా ఐసిస్-కె ఉంది. మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా జరిగే పాకిస్తాన్ మార్గాలకు సమీపంలో ఉంది.

దీనికి దాదాపు మూడు వేల మంది ఫైటర్లు ఉండేవారు. కానీ, అమెరికా, అఫ్గాన్ బలగాలు, తాలిబాన్‌తో జరిగిన పోరాటాల్లో వీరి సంఖ్యాబలం బాగా తగ్గిపోయింది.

వీరికి తాలిబాన్‌తో సంబంధం ఉందా?

అవుననే చెప్పొచ్చు. హక్కనీ నెట్‌వర్క్‌ ద్వారా వీరికి తాలిబాన్‌తో సంబంధాలు ఉన్నాయి.

అధ్యయనకారుల అంచనాల ప్రకారం.. ఐసిస్-కె, హక్కనీ నెట్‌వర్క్‌ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. హక్కానీ నెట్‌వర్క్‌కి తాలిబాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి.

ఇప్పుడు కాబుల్‌లో భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఖలీల్ హక్కాని. అతని తలపై 5 మిలియన్ డాలర్ల (సుమారు 37 కోట్ల రూపాయల) బహుమతి ఉంది.

ఆసియా పసిఫిక్ ఫౌండేషన్‌కు చెందిన డా. సజ్జన్ గోహెల్ కొన్నేళ్లుగా అఫ్గానిస్తాన్లోని మిలిటెంట్ నెట్‌వర్క్‌లను గమనిస్తున్నారు.

'2019 నుంచి 2021 మధ్య జరిగిన ముఖ్యమైన దాడులన్నీ ఐసిస్-కె, తాలిబాన్ హక్కానీ నెట్‌వర్క్‌, పాకిస్తాన్‌లోని ఇతర ఉగ్రవాద గ్రూపులతో కలిసి చేసినవే' అని గోహెల్ పేర్కొన్నారు.

ఆగస్టు 15న కాబుల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఫుల్ ఏ చక్రి జైలు నుంచి చాలా మంది ఐసిస్, అల్ ఖైదా మిలిటెంట్లు విడుదలయ్యారు. ప్రస్తుతం వీరి సంఖ్యాబలం బాగా పెరిగింది.

కానీ తాలిబాన్‌తో ఐసిస్-కెకు చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జిహాద్‌ను, యుద్ధభూమిని వదిలిపెట్టి శాంతి చర్చల పేరిట తాలిబాన్లు ఖతార్‌లోని దోహాలో ఉన్న మిరుమిట్లుగొలిపే హోటళ్ల బాట పట్టారని నిందించేది.

భద్రత దృష్ట్యా ఐసిస్ మిలిటెంట్లు త్వరలో ఏర్పాటు కానున్న తాలిబాన్ ప్రభుత్వానికి కూడా ప్రమాదకరంగా మారారు.

బహుశా ఈ విషయంలో పాశ్చాత్య ఇంటెలిజెన్స్ బృందాలతో తాలిబాన్ గొంతు కలపొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)