అఫ్గానిస్తాన్: తాలిబాన్ల పాలనలో విదేశీ వాణిజ్యం ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది?
- విజ్దన్ మొహమ్మద్ కవూస
- బీబీసీ మానిటరింగ్

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకుని పది రోజులు దాటింది.
త్వరలో ఏర్పడబోయే తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు కొనసాగించడంపై చాలా దేశాలు ఇప్పటికీ తమ వైఖరి స్పష్టం చేయలేదు.
ఇది వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అఫ్గానిస్తాన్ ఏ దేశానికి కూడా ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే అది అఫ్గానిస్తాన్పైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది.
అఫ్గానిస్తాన్ విదేశీ వాణిజ్యం కొన్ని సంవత్సరాల నుంచి క్రమంగా పుంజుకుంటోంది.
ఐక్యరాజ్యసమితి కామ్‌ట్రేడ్ డేటాబేస్ ప్రకారం.. 2008లో 3.6 బిలియన్ డాలర్లుగా ఉన్న అఫ్గాన్ ఎగుమతులు, దిగుమతుల విలువ.. 2019 నాటికి 9.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2019 తర్వాతి నుంచి డేటా అందుబాటులో లేదు.
ఇతర దేశాలతో ఇప్పటిలాగే వాణిజ్య సంబంధాలు కొనసాగించే విషయంలో రాబోయే తాలిబాన్ ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.
అయితే, కొన్ని దేశాలు అఫ్గాన్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. వాణిజ్యం రద్దు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలతో వాణిజ్య సంబంధాలు ఇదివరకటిలా కొనసాగించడం తాలిబాన్లకు అంత సులువు కాదని చెప్పొచ్చు.
అఫ్గానిస్తాన్ సంక్షోభం మరింత ముదిరితే, ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు ప్రమాదంలో పడొచ్చు.
పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోవచ్చు. ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులకు ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఈ పరిస్థితి ఇతర దేశాల్లోని కొన్ని రంగాలపై ప్రభావం చూపించొచ్చు.
ఉదాహరణకు తాలిబాన్లు ఇటీవల సరిహద్దులు మూసివేయడంతో భారత్ - అఫ్గాన్ మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. దాంతో భారత్‌లో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగాయని కథనాలు వచ్చాయి. ఎందుకంటే 85శాతం డ్రై ఫ్రూట్స్‌ను భారత్ అఫ్గాన్ నుంచే దిగుమతి చేసుకుంటోందని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఏ దేశానికీ ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు
ఇరుగుపొరుగున ఉన్న దేశాలతో సహా ప్రపంచంలో ఏ దేశానికి కూడా అఫ్గానిస్తాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు.
కామ్‌ట్రేడ్ డేటాబేస్ ప్రకారం అఫ్గానిస్తాన్ 2019లో దాదాపు 112 దేశాలతో వాణిజ్యం (ఎగుమతులు, దిగుమతులు) చేసింది.
కానీ చాలా దేశాలకు ఎగుమతులు, దిగుమతుల్లో అఫ్గాన్ వాటా ఒక శాతం కంటే తక్కువే.
అంటే, ఈ దేశాలకు అఫ్గానిస్తాన్‌తో వాణిజ్యం చాలా చిన్న విషయం. అఫ్గాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకోవడమన్నది వాణిజ్యపరంగా ఈ దేశాలపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ అఫ్గాన్ మీద మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు.
అయితే, ఈ విషయంలో పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లకు మినహాయింపు ఉంది.
కామ్‌ట్రేడ్ డేటాబేస్ ప్రకారం, 2019లో పాకిస్తాన్ తన మొత్తం ఎగుమతుల్లో 4.9 శాతాన్ని అఫ్గానిస్తాన్‌కు ఎగుమతి చేసింది. అక్కడి నుంచి తన మొత్తం దిగుమతుల్లో 1.2 శాతాన్ని అఫ్గానిస్తాన్ నుంచి తెచ్చుకుంది.
ఇక ఉజ్బెకిస్తాన్ తన మొత్తం ఎగుమతుల్లో 3.1 శాతాన్ని అఫ్గానిస్తాన్‌కు పంపించింది. అక్కడి నుంచి 0.01 శాతం దిగుమతి చేసుకుంది.
అంటే పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లకు అఫ్గానిస్తాన్ చెప్పుకోదగిన ఎగుమతుల మార్కెట్ అని అర్థమవుతోంది. కానీ ఈ రెండు దేశాలకు అఫ్గాన్ ప్రధాన భాగస్వామి మాత్రం కాదు.
భారత్, పాకిస్తాన్‌లు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లు
అఫ్గానిస్తాన్ ప్రధానంగా పాకిస్తాన్, భారత్‌లకు తన ఎగుమతులు చేస్తుంటుంది.
అయితే, దక్షిణాసియాలోని అతిపెద్ద ఎగుమతిదారుల జాబితాలో అఫ్గానిస్తాన్ లేదు.
2019లో ఇది కేవలం 0.9 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే చేసింది.
ఇదే ఏడాది పాకిస్తాన్ 24 బిలియన్ డాలర్లు, భారత్ 323 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేశాయి.
అఫ్గాన్ తన ఎగుమతులకు భారత్, పాకిస్తాన్‌లపై ప్రధానంగా ఆధారపడుతోంది.
2019లో అఫ్గాన్ మొత్తం ఎగుమతుల్లో 81శాతం ఈ రెండు దేశాలకే వెళ్లాయి. ఇందులో భారత్‌కు 47శాతం, పాకిస్తాన్‌కు 34శాతం ఎగుమతి చేసింది.
చైనా, యూఏఈ, టర్కీ, ఇరాన్‌లతో పాటు మరో వంద దేశాలకు కూడా అఫ్గానిస్తాన్ ఎగుమతులు చేస్తోంది.
అయితే, మొత్తం ఎగుమతుల్లో ఈ నాలుగు దేశాల వాటా 11శాతంగా ఉంది.
అంటే ఈ దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం అఫ్గాన్‌కు ఉంది. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్‌తో. లేదంటే అఫ్గాన్ తన ప్రధాన ఎగుమతి మార్కెట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.
అఫ్గాన్ వ్యవసాయ రంగం
అఫ్గాన్ ఎగుమతుల్లో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులే ఉంటాయి. అఫ్గాన్ ఎగుమతి చేసే వాటిలో డ్రై ఫ్రూట్స్ ప్రధానమైనవి.
అఫ్గాన్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఇయర్ బుక్ ప్రకారం 2019లో అఫ్గాన్ మొత్తం ఎగుమతుల్లో డ్రై ఫ్రూట్స్ వాటా 35శాతం.
మెడికల్ హెర్బ్స్, తాజా పండ్లు, కూరగాయల వాటా మొత్తం ఎగుమతుల్లో 39శాతం ఉంటుంది. పత్తి, కాఫీ, టీ, ఇతర సుగంధ ద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తుంది.
దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 27 శాతంగా ఉందని అఫ్గాన్ తాజా స్టాటిస్టికల్ ఇయర్‌బుక్ చెబుతోంది.
2016-17లో చేపట్టిన సర్వే ప్రకారం అఫ్గాన్‌లో 44 శాతం ప్రజలు వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు.
దిగుమతులే ఆధారం
ఎగుమతుల మార్కెట్ల కంటే ఇతర దేశాలతో చేసుకునే దిగుమతులు అఫ్గాన్‌కు చాలా కీలకం.
కామ్‌ట్రేడ్ డేటాబేస్ ప్రకారం గత 11 సంవత్సరాలుగా అఫ్గాన్ తన ఎగుమతుల కంటే 12 రెట్లు అధికంగా దిగుమతులు చేసుకుంటోంది.
2008 నుంచి 2019 మధ్య కాలంలో ఇది 70.6 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది. అదే సమయంలో 6.1 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే చేసిందని కామ్‌ట్రేడ్ డేటాబేస్ చెబుతోంది.
అఫ్గాన్ ప్రధానంగా ఇండియా, పాకిస్తాన్లకే ఎగుమతులు చేస్తున్నప్పటికీ.. దిగుమతుల కోసం ఆదేశం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.
2019లో ఇరాన్, చైనా, పాకిస్తాన్ల నుంచి అఫ్గాన్ ఎక్కువగా దిగుమతులు చేసుకుంది. అఫ్గాన్ మొత్తం దిగుమతుల్లో ఈ దేశాల వాటా 41శాతం.
కేవలం పది దేశాల నుంచే 81శాతం దిగుమతులను చేసుకుంటోంది. కానీ కేవలం రెండు దేశాలకే 81 శాతం ఎగుమతులు చేస్తోంది అఫ్గానిస్తాన్.
2019లో ఇరాన్ నుంచి అఫ్గాన్ ఎక్కువగా (14.6%) దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో చైనా (13.9%), పాకిస్తాన్ (12.9%) ఉన్నాయి.
అఫ్గాన్ చాలా రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. వీటిలో మినరల్ ఫ్యూయల్స్ విభాగానిదే అత్యధిక వాటా. వీటిని అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తుర్క్మెనిస్తాన్ (30%) ఇరాన్ (27%) అమెరికా (20%) రష్యా (6%) కజకిస్తాన్ (4%)తో పాటు మరో 27 దేశాలు ఉన్నాయని కామ్‌ట్రేడ్ డేటాబేస్ చెబుతోంది.
అఫ్గాన్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వాటిలో జంతు లేదా వెజిటెబుల్ ఫ్యాట్, ఆయిల్స్ ఉన్నాయి. వీటిని ప్రధానంగా మలేసియా (67%) రష్యా (10%) పాకిస్తాన్ (9%)తో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
కొన్ని దేశాల నుంచి అఫ్గాన్ ప్రత్యేక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఉదాహరణకు నేపాల్ నుంచి ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులు, మారిషస్ నుంచి ప్రధానంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకుంటుంది.
అఫ్గాన్ కొన్ని ఉత్పత్తులను కేవలం కొన్ని దేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకుంటుంది.
ఉదాహరణకు 98శాతం జంతువులను పాకిస్తాన్ నుంచి, 89శాతం ఆర్గానిక్ కెమికల్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది.
అంటే.. ఈ దేశాలతో ఇప్పటిలాగే వాణిజ్య సంబంధాలు కొనసాగాలంటే ఈ దేశాలతో అఫ్గానిస్తాన్ సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ దిగుమతులపై ప్రభావం పడితే అఫ్గాన్ ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే దేశంలో వినియోగ వస్తువుల ధరలు పెరగొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
- ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ
- ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్డోజర్' ఎలా అయ్యారు?
- అఫ్గానిస్తాన్: ఐఎస్‌లో చేరి అఫ్గాన్‌లో జైలు పాలైన భారత మహిళ 'నిమిష' ఇప్పుడెక్కడ?
- ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి
- జాడలేని ఐఎస్ జిహాదీల భార్యలు, పిల్లలు
- తాలిబాన్ల పాలనలో అల్ ఖైదా, ఐఎస్‌లకు అఫ్గానిస్తాన్ అడ్డాగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)