జిమ్‌లో స్పోర్ట్స్ బ్రా, పెళ్లికి ముందు సెక్స్, మగవాళ్లకు నలుగురు భార్యలు.. షరియా పాటించే ఇస్లామిక్ దేశాలకు చెందిన ఈ ఐదుగురు మహిళలు ఆ చట్టం గురించి ఏమంటున్నారు?

  • స్వామినాథన్ నటరాజన్
  • బీబీసీ ప్రతినిధి
షరియా దేశాల్లోని చాలామంది మహిళలు
ఫొటో క్యాప్షన్,

షరియా చట్టాన్ని అమలు చేసే పలు దేశాల్లో చాలామంది మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు

తాలిబాన్ల గత పాలనలో అఫ్గానిస్తాన్‌లో మహిళల అణచివేతకు మారుపేరుగా నిలిచిన అమానుష పాలన ఉండేది. వారికి విద్య, ఉద్యోగం లేకుండా చేసి, ప్రజా జీవితంలోంచి తొలగించి పాలన సాగించారు.

కానీ, తాలిబాన్లు ఇటీవల అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత షరియా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్త్రీలకు అన్ని హక్కులూ కల్పిస్తామని చెబుతున్నారు. అయితే, ఈ హక్కులు ఏమిటనే అంశంపై పూర్తి స్పష్టత లేదు.

షరియా అంటే భగవంతుని ఇష్టాలకనుగుణంగా జీవించేందుకు కొన్ని నియమాలని చెప్పవచ్చు. ఇందులో ప్రార్ధనలు, ఉపవాసం, పేదలకు ఇచ్చే విరాళాలకు సంబంధించిన నియమాలుంటాయి.

ఇస్లాం మతస్థులు పాటించే చట్టమే షరియా.

కొన్ని ఇస్లాం కోర్టులు విధించే కఠినమైన శిక్షలను మానవ హక్కుల సంఘాలు తరచుగా విమర్శిస్తూ ఉంటాయి. కానీ, షరియా అమలు చేసే విధానం వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.

మహిళల రాజకీయ స్వాతంత్రం గురించి కొన్ని నిబంధనలున్నప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మాత్రం 1990లలో తాలిబాన్లు విధించినంత కఠినమైన నియమాలను చాలా దేశాల్లో మహిళలు పాటించరు.

షరియా చట్టానికనుగుణంగా జీవించడం గురించి సౌదీ అరేబియా, నైజీరియా, ఇరాన్, ఇండోనేసియా, బ్రూనై దేశాలలో నివసిస్తున్న ఐదుగురు మహిళలు బీబీసీతో తమ అనుభవాలను పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Hannan Abubakar

ఫొటో క్యాప్షన్,

హన్నన్ అబూబాకర్ - సౌదీ అరేబియా

సౌదీ అరేబియా

నేను టాంజేనియా వారసత్వానికి చెందిన వ్యక్తిని కానీ, సౌదీ అరేబియాలోనే ఎక్కువ కాలం గడిపానని హన్నన్ అబూబాకర్ చెప్పారు.

భారతీయ పాఠ్యాంశాలను బోధించే ఇంటర్నేషనల్ స్కూలుకు వెళ్లాను. స్కూలు బస్సులలో అబ్బాయిలు, అమ్మాయిలు విడివిడిగా కూర్చునేవారు.

క్యాంటీన్‌లో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరు ప్రదేశాలు ఉండేవి.

చాలా వరకూ మేము వేర్వేరు తరగతుల్లోనే చదువుకునేవాళ్ళం. కానీ, కొన్ని సబ్జెక్టులను మాత్రం మగ టీచర్లు చెప్పేవారు.

అమ్మాయిలను ఆటలు ఆడేందుకు అనుమతించేవారు. కానీ, వారు అబ్బాయిలతో ఆడకూడదు. మేము రెండు వేర్వేరు రోజుల్లో స్పోర్ట్స్ డే జరుపుకునేవాళ్ళం.

కానీ, టీచర్లు అమ్మాయిల పట్ల వివక్ష చూపేవారు కాదు.

ప్రస్తుతం సౌదీ అరేబియా స్వేచ్ఛాయుత దేశం.

ఫొటో సోర్స్, Hannan Abubakar

మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవచ్చు. కార్లు డ్రైవ్ చేయవచ్చు. నేను లైసెన్సు పొందే పనిలో ఉన్నాను.

కొన్నేళ్ల క్రితం మాకు సినిమా హాళ్లు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఉన్నాయి. నాకు సినిమా హాళ్లకు వెళ్లడం చాలా ఇష్టం.

నేను నా ముఖాన్ని కప్పుకోవడం లేదు. తలకు స్కార్ఫ్ ధరించడం తప్పని సరి కాదు.

గతంలో, రెస్టారెంట్లలో ఫ్యామిలీ సెక్షన్, సింగిల్ సెక్షన్ అని రెండు వేర్వేరు విభాగాలు ఉండేవి. ఇప్పుడలాంటి విభజన లేదు.

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పురుషులు కలిసి ఉండవచ్చు.

ఉదాహరణకు నేను నా పురుష సహోద్యోగులతో కలిసి లంచ్‌కి వెళుతూ ఉంటాను.

కానీ, ఇది కూడా ముస్లిం దేశమే. ఇక్కడ నైట్ క్లబ్‌లు, బార్లు ఉండవు. మద్యపానం సేవించడాన్ని అనుమతించరు.

నేను జెడ్డాలో ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను. నేను పని చేసే సంస్థలో ఉద్యోగులకు వారి పనిని బట్టీ జీతం ఇస్తారు కానీ, జెండర్ ఆధారంగా కాదు.

నాకు 30 సంవత్సరాలు. నాకు నచ్చిన వ్యక్తి లభించినప్పుడు నేను వివాహం చేసుకుంటాను. నా తల్లి తండ్రులు నన్ను ప్రోత్సహిస్తారు. వాళ్లెప్పుడూ నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేయలేదు.

ఇక్కడ సంస్కరణలు చాలా నెమ్మదిగా అమలవుతున్నాయని కొందరు అంటున్నారు. కానీ, మా అమ్మ గారు నేను పుట్టక ముందు సౌదీలో ఉండేవారు. ఆమె ఈ మార్పులను చాలా తీవ్రంగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Mahsa

ఫొటో క్యాప్షన్,

మహస - ఇరాన్

ఇరాన్‌

ఇరాన్‌లో మహిళలు ఎదుర్కొనే నిబంధనలు సాధారణంగా వారి కుటుంబ నేపధ్యం పై ఆధారపడి ఉంటాయి అని మహస చెప్పారు. (ఆమె పేరు మార్చాం)

ఇరాన్‌లో సమాజాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. కొందరు చాలా మతవాదంతో, కఠినంగా, ఇరుకైన మనస్తత్వంతో, పక్షపాత ధోరణితో ఉంటారు. కొంత మంది వాళ్ళింట్లో అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉంటే వారిని చంపడానికి కూడా వెనుకాడరు.

రెండవ వర్గం నా కుటుంబం లాంటి వారు. అర్బన్ మధ్యతరగతికి చెందిన వారు. మాకు విద్య, ఉద్యోగం సంపాదించడం ముఖ్య లక్ష్యంగా ఉంటాయి.

మూడవ వర్గం సంపన్న వర్గాలకు చెందిన వారు. వీరు చట్టాలకు కట్టుబడి ఉండరు.

నేను టెహరాన్‌లో పుట్టి పెరిగాను. స్కూలులో, యూనివర్సిటీలో నేను అబ్బాయిలతో కలిసి చదువుకున్నాను.

ఇరాన్‌లో చాలా మంది తల్లితండ్రులు వాళ్ళ పిల్లలు వైద్యం కానీ, ఇంజనీరింగ్ కానీ చదవాలని అనుకుంటారు. కానీ, నాకు డెంటల్ కాలేజీలో సీటు రాకపోవడంతో ఇంగ్లీష్ చదివాను. ప్రస్తుతం నేను కిండర్ గార్డెన్ స్కూలులో పిల్లలకు చదువు చెబుతున్నాను.

ఫొటో సోర్స్, Mahsa

చాలా మంది మహిళలు వివిధ నగరాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండే మహిళలు ఇల్లు అద్దెకు తీసుకోవచ్చు. వాళ్ళు సొంతంగా హోటళ్లకు కూడా వెళ్ళవచ్చు.

నాకు సొంత కారు ఉంది. నేను ఊర్లో డ్రైవ్ చేస్తూ ఉంటాను. నాతో పాటు మరొక పురుషుడు ఉండాల్సిన అవసరం లేదు. కానీ, తలకు స్కార్ఫ్ మాత్రం తప్పకుండా ధరించాలి.

ఎవరైనా యువ జంటలు బహిరంగంగా చిలిపిగా ప్రవర్తించినా, అమ్మాయిలు పొట్టి ఓవర్ కోట్లు ధరించినా పోలీసులు చూస్తే మాత్రం వాళ్ళను పట్టుకుంటారు. కానీ, వాళ్లకు లంచం ఇస్తే వదిలేస్తూ ఉంటారు.

కొన్ని సార్లు, నేరం చేసిన వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి వాళ్ళ తల్లితండ్రులను పిలిపించి వారు సిగ్గుపడేలా చేస్తారు.

నేను పెళ్లి చేసుకోక ముందు నా బాయ్ ఫ్రెండ్‌తో 4 సంవత్సరాలు డేటింగ్‌కి వెళ్లాను. మేమిద్దరం సినిమాలు, పార్కులు చాలా చోట్లకు తిరిగే వాళ్ళం. నేను అదృష్టవంతురాలిని. మాకు పెళ్లి అయిందా లేదా అని ఎవరూ మమ్మల్ని ఆపి అడగలేదు.

మా అమ్మ నాన్నలు చాలా కఠినంగా ఉండేవారు. వాళ్లెప్పుడూ నన్ను రాత్రి 9 గంటలలోపు ఇంటికి రమ్మనేవారు.

నా స్నేహితులతో కలిసి ట్రిప్స్‌కు వెళ్లనిచ్చేవారు కాదు. నాకు పెళ్లి తర్వాత ఎక్కువ స్వేచ్చ దొరికింది.

మద్యపానం నిషేధించారు. మా దగ్గర బార్లు లేవు. కానీ, ఇక్కడ ప్రజలు రహస్యంగా కొనుక్కుని తాగుతూ ఉంటారు. పార్టీలలో చాలా మంది తాగుతూ ఉంటారు. కానీ, నాకా రుచి నచ్చదు. నేను తాగను.

నాకు పిల్లలను కనాలని లేదు. మా జీతాలు చాలా తక్కువ. మేమొక ఆయాను కూడా పెట్టుకునే స్థోమత లేదు. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, భర్త పట్ల శ్రద్ధ వహించడం అన్నీ చేయడం నాకు కష్టం.

నేను భగవంతుడిని నమ్ముతాను. కానీ, మతపరమైన కార్యక్రమాలు పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వను. నేను ప్రతీ రోజూ ప్రార్ధనలు చేయను.

ఫొటో సోర్స్, Huwaila Ibrahim Muhamma

ఫొటో క్యాప్షన్,

హువాలియా ఇబ్రహీం ముహమ్మద్ - నైజీరియా

నైజీరియా

"నేను షరియా న్యాయవాదిని. గత 18 సంవత్సరాలుగా కానో, అబూజా, లాగోస్‌లో న్యాయవాద వృత్తిలో ఉన్నాను" అని నైజీరియాకు చెందిన హువాలియా ఇబ్రహీం ముహమ్మద్ అన్నారు.

నేను షరియా న్యాయ విధానాన్ని నమ్ముతాను. నైజీరియాలోని 12 రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని, క్రిమినల్, ఫ్యామిలీ చట్టాలకు ఉపయోగిస్తారు. నేను షరియా కోర్టులు, సాధారణ కోర్టుల్లో కూడా ప్రాక్టీస్ చేస్తాను. కోర్టుల్లో పురుషులు న్యాయమూర్తులుగా ఉంటారు కానీ, మహిళలు ఎటువంటి భయం లేకుండా కోర్టుల్లో వాదిస్తారు.

షరియా చట్టాన్ని అనుసరించి అపరాధిని క్షమించేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఎవరికైనా కఠినమైన శిక్షను విధించే ముందు జడ్జి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది.

కొన్ని రకాల నేరాల్లో నేరస్థులకు బహిరంగంగా కొరడా దెబ్బలు కూడా కొడతారు. కానీ, ఇప్పటి వరకు ఒక మహిళను అలా శిక్షించడం నేను చూడలేదు.

రాళ్లతో కొట్టి చంపడం లాంటి కొన్ని తీర్పులు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి కానీ, అలాంటివి ఎప్పుడూ అమలు చేయలేదు. ద్రోహం చేసిన నేరానికి ఇస్లాంలో రాళ్లతో కొట్టి చంపడాన్ని శిక్షగా విధిస్తారు.

ఆస్తి వారసత్వం విషయానికొచ్చేసరికి, పురుషులకు మహిళల కంటే రెట్టింపు ఆస్తి వస్తుంది. ఇది అన్యాయంగా అనిపించవచ్చు కానీ, దాని వెనక ఒక కారణముంది. మహిళలకు ఆర్ధిక బాధ్యతలేవీ ఉండవు. వారిని సంరక్షించే బాధ్యతలను తండ్రులు, అన్నదమ్ములు, భర్తలకు మాత్రమే ఇస్తారు.

షరియాలో భర్త భార్యను కొట్టవచ్చనే అంశం ఉంది. కానీ, నిజానికి భర్త భార్యను కొడుతున్నట్లు నటించవచ్చు లేదా నెమ్మదిగా కొట్టవచ్చని అర్ధం. కానీ, ఆమెకు హాని చేయడం గానీ, గాయపరచడం కానీ చేయకూడదు.

కొంత మంది మహిళలు వేధించే భర్తలను కోర్టు వరకు తీసుకుని వెళ్లారు. నేను చాలా కేసులు వాదించి గెలిచాను కూడా. జెండర్ ప్రమేయం లేకుండా న్యాయం లభిస్తుంది.

నైజీరియాలో మహిళలు ముఖాన్ని కప్పుకోనవసరం లేదు. ఇక్కడ మహిళలు శరీరాన్ని పూర్తిగా కప్పుకుంటారు. ఎవరైనా పొట్టి స్కర్టు వేసుకుంటే చాలా అసాధారణంగా ఉంటుంది. అయితే, ఒంటి నిండా బట్టలు వేసుకోలేదనో, తలకు స్కార్ఫ్ పెట్టుకోలేదనో మహిళలను శిక్షించడం సరైనది కాదు.

ఫొటో సోర్స్, Izzati Mohd Noor

ఫొటో క్యాప్షన్,

ఇజ్జాతి మొహమ్మద్ నూర్ - బ్రూనై

బ్రూనై

‘నేను బ్రూనైలో పుట్టి పెరిగాను. నాకు 17 సంవత్సరాలుండగా చదువుకునేందుకు ప్రభుత్వ స్కాలర్ షిప్ లభించినప్పుడు 2007లో యూకే వెళ్లాను’ అని ఇజ్జాతి మొహమ్మద్ నూర్ చెప్పారు. .

నేను లండన్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చేశాను. ఆ తర్వాత నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో పని చేశాను.

కొన్ని వారాల క్రితమే నేను స్వదేశానికి తిరిగి వచ్చాను. ఇక్కడ చాలా మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు. చాలా కాలం నుంచీ వివాహం, విడాకులు ఆస్తిహక్కుల విషయంలో షరియా చట్టాన్నే అనుసరిస్తున్నారు.

క్రిమినల్ కేసుల్లో వ్యవహరించడానికి 2014లోనే దీనిని ప్రవేశపెట్టారు. కానీ, ఇప్పటి వరకు ఈ చట్టాన్ని అనుసరించి కఠినమైన శిక్షలేవీ విధించలేదు.

మహిళలకు నచ్చిన దుస్తులు ధరించడాన్ని ఇక్కడ చూడవచ్చు. మీరు జిమ్‌కి వెళితే, అక్కడ తలకు స్కార్ఫ్ కట్టుకున్న వాళ్ళు ఒకరుంటే, స్పోర్ట్స్ బ్రా ధరించి మరొకరు ఉంటారు.

ఇక్కడ మతపరమైన విషయాలకు సంబంధించి పోలీసులు ప్రజలను శిక్షించరు.

నా స్కూలు చదువులో భాగంగా ఇస్లాంకున్న అయిదు మూల స్తంభాలను, ఇస్లాం ఆర్ధిక శాస్త్రం, షరియా చట్టాన్ని నేర్పారు.

ఉదయం పూట సైన్సు, గణితం లాంటివి చదివితే, మధ్యాహ్నం మతబోధన చేసే విద్యాలయానికి వెళ్లేదానిని. మాకు పురుషులు, మహిళలు కూడా టీచర్లుగా ఉండేవారు.

వారసత్వపు హక్కు వరకు వచ్చేసరికి, షరియాను అనుసరించి అక్కాచెల్లెళ్ల కంటే రెట్టింపు వాటాను అన్నదమ్ములు పొందుతారు. కానీ, మా దేశంలో చాలా మంది మా తాతగారిలా ఆస్తిని రాస్తారు. ఆయన రాసిన వీలునామా ఇస్లామిక్ చట్టాన్ని కొట్టివేస్తుంది.

ఫొటో సోర్స్, Izzati Mohd Noor

నేను రోజుకు 5సార్లు ప్రార్ధన చేయను. కానీ, ఎప్పుడు వీలయితే అప్పుడు చేస్తాను.

నా చిన్నప్పుడు నా తల్లితండ్రులు ప్రార్ధన చేయడం గురించి చాలా కఠినంగా ఉండేవారు.

ఒక్కొక్కసారి నేను పూర్తిగా ప్రార్ధన మానేసిన రోజులు కూడా ఉన్నాయి. చివరకు నా మార్గాన్ని నేను కనుక్కున్నాను.

నేను విమానం నడపడం కూడా నేర్చుకున్నాను. నాకు పైలట్ లైసెన్స్ లభించింది.

నేను ఉత్తర జర్మనీకి చెందిన బాయ్ ఫ్రెండ్‌ని కలిసాను. మా పరిచయం కొత్తలోనే నేను మతపరమైన వ్యక్తినని చెప్పాను. నేను ఇస్లామిక్ వాతావరణంలోనే నా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాను. మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం.

వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండకూడదని కొంత మంది ముస్లిం స్కాలర్లు భావిస్తారు.

కానీ, వివాహం చేసుకోవాలనుకునేవారు తమ జీవితాంతం కలిసి ఉండాలంటే, పెళ్ళికి ముందే ఒకరినొకరు అర్ధం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం.

మతపరంగా ఏది తప్పో, ఏది సరైందో నాకు తెలుసు. నాకేది సరైందో, తప్పో కూడా నాకు తెలుసు. అవి రెండూ వేర్వేరు విషయాలు.

నేను తలకు స్కార్ఫ్ ధరించను. నేను సరైన ముస్లింను కాదని కూడా కొందరు అంటారు. కానీ, ఇది నాకు, భగవంతుడికి సంబంధించిన వ్యవహారం. నేను తప్పు చేస్తున్నట్లు భగవంతుడు భావిస్తే, నేను భగవంతునికి క్షమాపణ చెబుతాను.

బ్రూనైలో చాలా తక్కువ శాతం మంది ప్రజలే ఛాందసంగా ఉంటారు. అత్యధికులు సహనంతోనే ఉంటారు.

విద్యను అభ్యసించడం, కొత్త విషయాలను నేర్చుకోవడం ఇస్లాంలో కీలకమైన విలువ. అసలు మహిళలు విద్యనభ్యసించకూడదనే విషయం ఎక్కడ నుంచి వచ్చిందో నాకర్ధం కాదు. ఇది పూర్తిగా ఇస్లాంకి విరుద్ధం .

నేను ప్రతీ రోజూ మెరుగైన ముస్లింగా అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.

ఫొటో సోర్స్, Nasyiratu Dina

ఫొటో క్యాప్షన్,

నస్యిరాటుడినా - ఇండోనేసియా

ఇండోనేసియా

"నేను ఎకనామిక్స్ విద్యార్థిని. నాకు 19 సంవత్సరాలు. నేను ఒక అబ్బాయి దగ్గర పార్ట్ టైం సెక్రెటరీగా పని చేస్తున్నాను" అని ఇండోనేసియాకు చెందిన నస్యిరాటుడినా చెప్పారు. నేను ఖాళీ సమయంలో కిండర్ గార్డెన్ వారికి చదువు చెబుతాను.

నేను అసెహ్ బేసర్‌లో పుట్టి పెరిగాను. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఇండోనేసియాలో ఉన్నారు కానీ, అసెహ్ ప్రావిన్సులో మాత్రం షరియాను కచ్చితంగా పాటిస్తారు.

నేను రోజుకు అయిదు సార్లు ప్రార్ధిస్తాను. నా వరకూ షరియా అనేది మా నమ్మకంలో భాగం. కఠినమైన శిక్షల గురించి అంగీకరిస్తాను కానీ, అవి నేరస్థులను శిక్షించడం కోసం పెట్టినవి.

నేను పొడవైన డ్రెస్సులు వేసుకుంటాను. తలకు స్కార్ఫ్ వేసుకుంటాను. కానీ, ముఖం కప్పుకోను. ఇక్కడ మహిళలు మినీ స్కర్టులు, షార్టులు ధరించలేరు.

నాకు నచ్చినంత స్వేచ్ఛగా నేనుండవచ్చు. యూనివర్సిటీలో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే క్లాస్‌లో కలిసి చదువుకుంటారు. కానీ, వేర్వేరుగా కూర్చుంటారు. అబ్బాయిలతో కలిసి మాట్లాడటం పట్ల నిషేధం ఏమి లేదు. నేను అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటాను. కానీ, ఎక్కువగా కాదు.

కొంత మంది స్నేహితులు ప్రేమలో ఉన్నారు. ప్రేమలో ఉండటం మంచిదే.

అవివాహితులు జంటలుగా బయటకు వెళ్లి ప్రేమను ఒకరిపై ఒకరు బహిరంగంగా చూపించుకోలేరు. వివాహానికి ముందు శారీరక సంబంధాలను పెట్టుకోవాలని కూడా ఇక్కడ అమ్మాయిలు అనుకోరు. అది మా మతంలో నిషేధం.

అబ్బాయిలు, అమ్మాయిలు గ్రూపుగా వెళ్ళవచ్చు. మేము షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కలిసి వెళుతూ ఉంటాం.

ఇక్కడ మాకు సినిమా హాళ్లు లేవు. అది కొంత విచారమైన విషయం.

నేను టీవీలో సినిమాలు చూస్తాను. సోషల్ మీడియాలో ఉంటాను. నాకు సంగీతమంటే ఇష్టం. నేను కొన్ని పాటల పోటీల్లో కూడా పాల్గొన్నాను.

ఇస్లాంలో పురుషులు నలుగురు భార్యలను పెళ్లి చేసుకోవచ్చు. కానీ, నేను మాత్రం ఎవరికో మూడవ, నాలుగవ భార్యగా వెళ్లాలని అనుకోవడం లేదు. నేనలా ఉండలేను. ప్రతీ అమ్మాయి తన భర్త తన కోసం మాత్రమే ఉండాలని అనుకుంటుంది.

నేను కిండర్ గార్డెన్ స్కూలు మొదలుపెట్టి బిజినెస్ లీడర్ అవ్వాలని అనుకుంటున్నాను.

నేను అఫ్గాన్ మహిళల కోసం చాలా బాధపడుతున్నాను. పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సిరియా, ఇరాన్‌లో ప్రజలందరూ బాంబు పేలుళ్ల శబ్దాలకు కాకుండా పక్షుల కిలకిలా రావాలకు మేల్కోవడాన్ని చూసేందుకు ఎక్కువ కాలం జీవించి ఉండాలని అనుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)