అఫ్గానిస్తాన్‌లో మహిళల జీవితం: 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?' అంటూ తాలిబాన్ల ప్రశ్నలు
- లీస్ డూసెట్
- చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్, కాబుల్

ఫొటో సోర్స్, AAMIR QURESHI
అఫ్గాన్ మహిళలు తమ ముఖంపై ముసుగులు, పొడవైన దుస్తులు ధరించడం ప్రారంభించారు.
"మహ్రం (మగ తోడు) లేకుండా మీరు ఎందుకు ప్రయాణిస్తున్నారు?" అంటూ ఒక అఫ్గాన్ మహిళను తాలిబాన్ గార్డు ప్రశ్నించారు.
ఆమె కాబుల్ పసుపు రంగు టాక్సీ వెనక సీటులో కూర్చుని ఉన్నారు. నల్లటి అక్షరాలతో తెల్లని తాలిబాన్ జెండా ఎగురుతున్న చెక్‌పాయింట్ దగ్గర ఆ టాక్సీని ఆపి ఆమెను ప్రశ్నించారు.
తన భర్తకు కాల్ చేయమన్నారు. తన దగ్గర ఫోన్ లేదని ఆమె చెప్పారు. మరో టాక్సీ డ్రైవర్‌ను పిలిచి, ఆమెను ఇంటికి తీసుకెళ్లి, ఆమె భర్తతో పాటు తిరిగి తీసుకురమ్మని ఆదేశించారు. ఆ తతంగం అంతా పూర్తయ్యాక, ఆ సమస్య పరిష్కారం అయిపోయింది.
కాబుల్ బజార్లు యథావిధిగా కొనసాగుతున్నాయి.
కాబుల్‌లో ఇప్పుడు దేనికి అనుమతి ఉంది? దేనికి లేదు?
కాబుల్‌లో ఇప్పుడు కూడా రోడ్లు రద్దీగానే ఉంటున్నాయి. దుకాణాలు, రోడ్డు మీద అటూ ఇటూ పరిగెత్తే పిల్లలు.. దూరం నుంచి చూస్తే అక్కడ ఏమీ మారలేదనిపిస్తుంది. కానీ, అది నిజం కాదు.
ఇప్పుడు కాబుల్ తాలిబాన్ ఆధీనంలో ఉన్న రాజధాని. వీధుల్లో సాయుధ తాలిబాన్లు తిరుగుతూ కనిపిస్తున్నారు.
అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ విడిచివెళ్లిన చివరిరోజు తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. "మీరు మీ ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ దేశం ఇప్పటికే ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించింది. వారితో సున్నితంగా వ్యహరించండి" అని కోరారు.
కొన్ని విషయాలు బయటకి చెప్పక్కర్లేదు. కిందటి నెల, మెరుపు వేగంతో తాలిబాన్లు కాబుల్‌ను ఆక్రమించుకున్న తరువాత, తాలిబాన్ 2.0 పాలనలో ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అఫ్గాన్ ప్రజలకు తేటతెల్లమైపోయింది.
పురుషులు గడ్డం గీసుకోవడం మానేసి గడ్డాలు పెంచడం ప్రారంభించారు. మహిళలు నల్లటి ముసుగులు, పొడవైన దుస్తులు ధరించడం మొదలుపెట్టారు.
అయినప్పటికీ, ఇంకా ఎంతో అనిశ్చితి, ఆందోళన మిగిలే ఉంది.
మర్యం రజాయీ
'కలలన్నీ నాశనం అయ్యాయి'
"ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అంటూ అనేకమంది అఫ్గాన్ పౌరులు ఆందోళనగా అడుగుతుంటారు. తప్పించుకు పారిపోవడానికి సహాయం అడుగుతారు.
కాబుల్ తాలిబాన్ హస్తగతం కాగానే, ఏం చేయాలో మర్యం రజాయీకి అర్థమైంది.
ఆగస్టు 15న తాలిబాన్ మిలిటెంట్లు వీధుల్లోకి వచ్చి ఆక్రమించుకోవడం ప్రారంభించినప్పుడు, ఆమె అటార్నీ జనరల్ కార్యాలయంలో మహిళా ప్రాసిక్యూటర్ల కోసం ఓ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు.
తరుముకొస్తున్న ముప్పు గురించి ఆమె ప్రస్తావించినప్పుడు "మనం ఈ క్లాసు కొనసాగించాలి" అని ఆమె విద్యార్థులంతా ముక్తకంఠంతో వేడుకొన్నారు. ఈ వర్క్‌షాప్ కోసం వారంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
కానీ క్లాసు ఆగిపోయింది. అప్పటి నుంచి భద్రత కోసం రజాయీ తన కుటుంబంతో సహా ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతూనే ఉన్నారు.
పెద్దయ్యాక ఇంజినీర్ అవుతానని ఆమె మూడేళ్ల కూతురు నీలోఫర్ ఇప్పటినుంచే కలలు కంటోంది.
"మహిళలు, పిల్లలు ఇస్లాం పరిధిలో వారి హక్కులన్నీ పొందుతారని" తాలిబాన్ ప్రకటించినప్పటికీ దాని అర్థమేమిటో, వారి ఉద్దేశమేమిటో ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియట్లేదు.
"ఆఫీసులకు రావొద్దు" అని రజాయీతో సహా అనేక మంది మహిళలకు కచ్చితంగా చెప్పారు.
మునుపటిరోజులు మళ్లీ రావేమోనని చాలామంది భయపడుతున్నారు. సొంత నగరమే పరాయిది అయిపోయినట్లుగా భావిస్తున్నారు.
"విద్య, ఉద్యోగం నా హక్కులు. సంఘంలో ఉన్నత స్థానం నా హక్కు. నా కలలన్నీ నాశనం అయిపోయాయి" అంటూ రజాయీ వాపోయారు.
బ్రిటిష్ రాయబార కార్యాలయంలో ప్రధాన వంటవాడిగా పనిచేసిన హమీద్
'ఇంక అవన్నీ జ్ఞాపకాలే'
రెండు దశాబ్దాల పాటు కొనసాగిన అంతర్జాతీయ సంబంధాలు కొత్త ఆలోచనలకు, కొత్త గుర్తింపులకు చోటిచ్చాయి. ఇప్పుడు అవన్నీ భారమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
"మేము ఎంతో ఆనందంగా క్రిస్మస్ పార్టీలు జరుపుకున్నాం. మంచి భోజనం వండుకుని, తిని సంతోషంగా గడిపాం. వాటి మధుర జ్ఞాపకాలు నా మనసు నిండా ఉన్నాయి" అని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో ప్రధాన వంటవాడిగా (షెఫ్)గా 13 సంవత్సరాలు పనిచేసిన హమీద్ చెప్పారు. ఆయన చేతిలో కొన్ని ఫొటోలు, తన పనిని మెచ్చుకుంటూ ఇచ్చిన సర్టిఫికేట్లు ఉన్నాయి.
హమీద్‌తో సహా ఎంబసీలో పనిచేసిన మరో 60 మంది సిబ్బంది ప్రయివేటు కాంట్రాక్టర్ ద్వారా ఆ ఉద్యోగాల్లో చేరారు.
అయితే, బ్రిటన్ విదేశాంగ కార్యాలయం నేరుగా నియమించిన సిబ్బంది.. తాలిబాన్ రాకమునుపే కాబుల్ నుంచి తరలిపోయారు. ఇలా కాంట్రాక్టర్ ద్వారా వచ్చినవారు మాత్రం ఇక్కడే ఉండిపోయారు.
"కోవిడ్ లాక్డౌన్లో కూడా మేము ఎంతో కష్టపడి పనిచేశాం. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఇలాగే వదిలేస్తే, అది పెద్ద మోసం అవుతుంది" అంటూ హమీద్ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిటన్‌తో సహా ఇతర పశ్చిమ దేశాలన్నీ వీరికి మరో మార్గం చూపిస్తామని హామీ ఇచ్చాయి. కానీ, వీరిలో చాలామందికి కొత్తమార్గం అంటే భయం, ఆందోళన కూడా.
తాలిబాన్‌తో ఒక సంభాషణ
తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నాక, చాలామంది అఫ్గాన్ పౌరులు కంగారుగా నగరం విడిచిపెట్టి పారిపోయారు.
మరోవైపు, అఫ్గానిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా తాలిబాన్లు కాబుల్‌కు వస్తున్నారు.
మేం కాబూల్ విమానాశ్రయానికి చేరుకోగానే, మధ్య అఫ్గానిస్తాన్‌లోని ఉరుజ్గాన్ నుంచి వచ్చిన ఒక సమూహం మాతో మాట్లాడింది.
"నేను కాబుల్ వచ్చి చాలా ఏళ్లు అయింది" అంటూ 25 ఏళ్ల రఫీవుల్లా చెప్పారు. ఇప్పుడు కాబుల్‌లో ఉన్నందుకు సంతోషం ఆయన గొంతులో తెలుస్తోంది.
ఆ దేశంలో వచ్చిన తాజా పరిణామాల గురించి ఆయన వయసులోనే ఉన్న అనేకమంది అఫ్గాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారని చెప్తూ, దానిపై ఆయన అభిప్రాయం అడిగాం.
"మేమంతా అఫ్గాన్ పౌరులమే. ఇప్పుడు దేశం శాంతి, అభివృద్ధి దిశలో కదులుతోంది" అంటూ రఫీవుల్లా మా వాదన కొట్టిపారేశారు.
కొన్ని ప్రాంతాల్లో తాలిబాన్లు ఇంటింటికీ వెళ్లి తలుపు కొడుతున్నారు. ప్రభుత్వ ఫోన్లు, కార్లు, ఇతర విలువైన వస్తువులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని ప్రయివేటు కార్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అవినీతికి పాల్పడనిదే అంత పెద్ద కార్లు కొనుగోలు చేయలేరనే సందేహం వచ్చినవాటిన్నటినీ స్వాధీనం చేసుకుంటున్నారు.
పశ్చిమ కాబుల్‌లో మైనారిటీ హజారా వర్గం ఎక్కువగా ఉండే దష్త్-ఎ-బార్చి వంటి ప్రాంతాల్లో ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారని, పురుషులను తీసుకెళిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
"నాకు చాలా భయంగా ఉంది. మా కుటుంబాలు మా సంపాదన మీదే ఆధారపడి ఉన్నాయని, మేము ఉద్యోగం చేసి తీరాలని తాలిబాన్లకు చెబుతున్నాం" అంటూ ఒక మహిళ వాపోయారు. ఆమె ఉద్యోగం కోసం రోజూ నగరంలోకి ప్రయాణించాల్సి ఉంటుంది.
'ఇది నిజమేనా?'
కాబుల్ వీధుల్లో బ్యాంకుల ముందు జనం బారులు తీరి కనిపిస్తున్నారు. చాలావరకు బ్యాంకులు మూతపడ్డాయి. చాలావాటిల్లో డబ్బు లేదు.
"గత వారం రోజులుగా డబ్బు కోసం నేను రోజూ బ్యాంకుల ముందు నిల్చుంటున్నాను. ఇది తిరోగమనానికి కొత్త ప్రారంభం" అని అక్కడి గుంపులోని ఒక వ్యక్తి చెప్పారు.
అయితే, కాబుల్‌కు దూరంగా ఉన్న కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం, అమెరికన్లు దేశాన్ని విడిచివెళ్లిపోయినందుకు ఊపిరి పీల్చుకుంటున్నామని చెబుతున్నారు. యుద్ధం ముగిసిందని వారు భావిస్తున్నారు.
మరోవైపు, ఆకలి, పేదరికంతో పోరాడుతున్న కొన్ని లక్షలమంది అఫ్గాన్ పౌరులకు మాత్రం జీవితం ఏమీ మారలేదు. వారి సమస్యల్లో ఏ మార్పూ లేదు.
పాత ప్రభుత్వం కూలిపోయి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న ఈ సమయంలో చాలామంది 'ఈరోజు గడిస్తే చాలు' అనుకుంటూ ముందుకు సాగుతున్నారు.
"ఇది నిజమేనా? వాస్తవంలో ఇలా జరుగుతోందా అనే సందేహం వస్తోంది. నేను చూస్తున్నదంతా నిజమేనా.. నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను" అని అఫ్గాన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ మంగ్లి అన్నారు.
ఇరవై ఏళ్ల క్రితం తాలిబాన్లను ఆ దేశం నుంచి తరిమికొట్టిన నాటి నుంచి మంగ్లి అక్కడ పనిచేస్తున్నారు.
"తాలిబాన్ ప్రతినిధి మీడియాను కో-ఆర్డినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, వారందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ తానే రాజు అనుకుంటున్నారు. ఎంతకాలం ఈ రిస్క్ తీసుకోగలనో తెలీదు. కానీ, జరుగుతున్న చరిత్రలో భాగం కావాలన్నదే నా కోరిక" అని మంగ్లి అన్నారు.
తాలిబాన్: ‘‘మహిళలతో ఎలా మాట్లాడాలో మా వాళ్లకు తెలియదు, అందుకే లేడీస్ ఇళ్లలోనే ఉండండి’’
చరిత్ర పునరావృతం అవుతోంది
ఒక చారిత్రక ఘట్టానికి తెరలేచింది. చరిత్రలో ఒక భాగం మళ్లీ ముందుకొచ్చింది. మెరిసే తెల్లటి గౌన్లు, ఎర్రటి లిప్‌స్టిక్‌లతో ఉన్న పోస్టర్లు, బిల్బోర్డులకు నల్లరంగు పూశారు.
వీధుల్లో కనిపించే ఎన్నో చిత్రాలపై పెయింట్ పూశారు. ధైర్యవంతులైన జర్నలిస్టులు, నిబద్ధత గల డాక్టర్ల కథలు మాయమైపోయాయి. యుద్ధం తరువాత శాంతి కోసం తపించిన కథలన్నిటిపై నల్లరంగు పూశారు.
మొట్టమొదటగా తాలిబాన్, అమెరికా మధ్య జరిగిన దోహా ఒప్పందాన్ని తెలిపే చిత్రంపై రంగు పడింది.
కవులకు పదాలు వెతుక్కుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో విధాలుగా పోరాటం జరిపిన నా పాత స్నేహితుడు మసూద్ ఖలీలీ నాకొక కవిత పంపారు.
"గత రాత్రి విధాత నా చెవుల్లో చెప్పిన మాట.. మన తలరాత అంతా నవ్వులతో, కన్నీళ్లతో నిండి ఉంది"
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- అఫ్గానిస్తాన్: అమెరికా సైనిక వాహనాలు,ఆయుధాలతో తాలిబాన్ల పరేడ్
- ‘టాయిలెట్‌కు కూడా వెళ్లకుండా ఆరు రోజులు అక్కడే ఉన్నా విమానం ఎక్కలేకపోయాను’
- ‘కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఏపీలోని ప్రైవేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించినంత ఫీజులే తీసుకుంటున్నారా? క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
- 2,700 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉత్తర భారతంలో తిరిగిన యువకుడు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు బయలుదేరారు
- అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పాకిస్తాన్ వెళ్లారా, అక్కడి స్టార్ హోటళ్లలోని విదేశీ సైనికులెవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)