తాలిబాన్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ సహాయం.. పోరాటం ఆగదు, లొంగేది లేదు అన్న అమ్రుల్లా సలేహ్

అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ బీబీసీకి ఒక వీడియో సందేశం పంపించారు
అఫ్గానిస్తాన్‌లోని పంజ్‌షీర్ వ్యాలీలో తాజాగా ఘర్షణలు, పోరాటాలు నమోదయ్యాయి. తాలిబాన్ల చెరలో చిక్కకుండా, వారికి ఎదురు నిలుస్తోన్న చివరి ప్రాంతం ఈ పంజ్‌షీర్ వ్యాలీ.
పంజ్‌షీర్ వ్యాలీ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని వచ్చిన వార్తలు నిరాధారమైనవని ప్రతిఘటన బృందం నాయకుల్లో ఒకరైన అమ్రుల్లా సలేహ్ స్పష్టం చేశారు.
తమకు టెలిఫోన్, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యాలను తాలిబాన్లు నిలిపివేయడంతో వ్యాలీలో పరిస్థితులు కష్టంగా మారాయని ఆయన చెప్పారు.
అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోన్న తాలిబాన్లు ఈ లోయపై పట్టు సాధించేందుకు పోరాటాలు చేస్తున్నారు.
రాజధాని కాబుల్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పంజ్‌షీర్ వ్యాలీ అఫ్గానిస్తాన్‌లోని అతిచిన్న ప్రావిన్సులలో ఒకటి. కేవలం ఈ ప్రాంతంపై మాత్రమే తాలిబాన్లు పట్టు సాధించలేకపోతున్నారు.
తాలిబాన్ వ్యతిరేక యోధులకు ఆవాసమైన ఈ లోయలో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది నివసిస్తున్నారు. ఎత్తైన పర్వత శిఖరాలకు వెనుక భాగంలో ఈ లోయ ఉంటుంది.
తాలిబాన్ వ్యతిరేక దళానికి స్థానిక గిరిజన నాయకుడు అహ్మద్ మసూద్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ దళంలో స్థానిక మిలీషియా సభ్యులతో పాటు అఫ్గాన్ మాజీ భద్రతా సిబ్బంది సభ్యులు కూడా భాగంగా ఉన్నారు. 1980ల్లో సోవియట్ సేనలు, 1990ల్లో తాలిబాన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా అహ్మద్ మసూద్ తండ్రి సమర్థంగా పోరాడారు.
తాజా పోరాటంలో ఇరు వైపులా ప్రాణ నష్టం జరిగినట్లు బీబీసీకి పంపిన వీడియో సందేశంలో అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు సలేహ్ పేర్కొన్నారు.
''మేం కఠిన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాలిబాన్ల దాడిని ఎదుర్కొంటున్నాం. మా దళాలు వారికి లొంగవు'' అని వెల్లడించారు.
బీబీసీకి పంపించిన వీడియోలో ఇంకా ఆయన ఏమన్నారంటే..
‘‘నేను పంజ్‌షీర్ వ్యాలీలో ఉన్నాను. నేను అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయానని వస్తోన్న వార్తలు నిరాధారమైనవి. మేం తాజా పరిస్థితిపై చాలా సమావేశాలు నిర్వహించాం. ప్రస్తుతం కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. అందులో సందేహం లేదు. తాలిబాన్లతో పాటు అల్‌ఖైదా, స్థానిక టెర్రరిస్టు గ్రూపుల దాడులను ఎదుర్కొన్నాం. వీటికి ఎప్పట్లాగే పాకిస్తానీయుల మద్దతు ఉంది. మేం ఇంకా పోరాడుతున్నాం. మా పోరాటం ఎవరికీ తలొగ్గదు. టెర్రరిజం ముందు తలవంచబోదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. నేను పారిపోలేదు, ఎక్కడా దాక్కోలేదు. నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేదేంటంటే... నేను గాయపడ్డాను, పారిపోయాను అంటూ ఈ క్షణం వరకు వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవి. అవన్నీ ఫేక్.’’
ఫొటో సోర్స్, Reuters
లోయలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు
కానీ లోయలోని కొన్ని జిల్లాలు తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లినట్లు ప్రతిఘటన బృందం నాయకులు అంగీకరించారు. తాలిబాన్ అనుకూల సామాజిక మాధ్యమాలు సైతం తమ ఫైటర్లు యుద్ధ ట్యాంకులను, ఇతర మిలిటరీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని క్లిప్పులను ప్రదర్శించాయి.
పంజ్‌షీర్‌ను తాలిబాన్లు వశపరుచుకున్నారనే పుకార్లు వ్యాప్తి చెందడంతో కాబుల్‌తో పాటు ఇతర నగరాలు గన్‌ఫైర్‌తో సంబరాలు చేసుకున్నారు. చాలామంది ఈ కాల్పుల్లో మరణించారు.
''గాలిలో కాల్పుల్ని విరమించి, దానికి బదులుగా ఫైటర్లు దేవుడికి కృతజ్ఞత చెప్పాలని'' తాలిబాన్ల అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటు ఇప్పట్లో లేనట్లేనా?
బీబీసీ న్యూస్ ప్రతినిధి యాల్డా హకీమ్ విశ్లేషణ
తాలిబాన్ వ్యతిరేక దళాల అదృష్టాన్ని పరీక్షించడానికి, వారి భవిష్యత్‌ను నిర్ణయించడానికి రాబోయే కొన్ని వారాలు చాలా కీలకమని ఇరు పక్షాలు భావిస్తున్నాయి.
అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందే సలేహ్‌తో పాటు అతని బృందాన్ని నాశనం చేయాలని తాలిబాన్ నాయకత్వం అనుకుంటోంది.
అక్టోబర్ చివరినాటికి అలా చేయడంలో తాలిబాన్లు విఫలమైతే, ఆ తర్వాత పెద్ద ఎత్తున దాడులు చేయడం చలికాలంలో కష్టంగా మారుతుంది.
మరోవైపు జాతీయ ప్రతిఘటన దళం మంచి సమయం కోసం వేచి చూస్తోంది. తాలిబాన్ వ్యతిరేక యోధులు మరి కొన్ని వారాల పాటు ఇక్కడ నిలదొక్కుకోగలిగితే వారికి కోలుకోడానికి కనీసం 5 నెలల సమయం లభిస్తుంది. ఈ సమయంలో విదేశీ మద్దతు కూడగట్టడానికి వారు ప్రయత్నించవచ్చు.
రాబోయే రోజుల్లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, వారితో పాలనాపర సంప్రదింపులు జరిపేందుకు విదేశీ ప్రభుత్వాలు మార్గాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
తాలిబాన్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ సహాయం
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ కాబుల్‌లో చర్చల కోసం ఉన్నారు. అఫ్గాన్ మిలిటరీని ఏర్పాటు చేయడంలో ఆయన తాలిబాన్లకు సహాయపడతారని ఈ వారం ప్రారంభంలో అధికారి ఒకరు రాయిటర్స్‌తో చెప్పారు.
కాబుల్ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత పాకిస్తాన్ సీనియర్ అధికారి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ పర్యటన గురించి సెరెనా హోటల్‌లో కొందరు విదేశీ జర్నలిస్టులు ఆయనను అడిగారు.
అఫ్గానిస్తాన్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం కోసం తాను పనిచేస్తానని, దీని గురించి చర్చించేందుకే కాబుల్‌కు వచ్చినట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ పర్యటనలో ఆయన తాలిబాన్ సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు.
తాలిబాన్లకు చైనా, రష్యా, పాకిస్తాన్ అండ
యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఆదివారం ఖతర్‌కు వెళ్లనున్నారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా కీలక మధ్యవర్తిత్వ పాత్రను పోషించనుంది.
ఇస్లామిస్ట్ గ్రూప్‌తో వ్యవహారాలు జరుపుతామని, అయితే వారిని అఫ్గాన్ ప్రభుత్వంగా గుర్తించబోమని యూరోపియన్ యూనియన్, యూకే శుక్రవారం వ్యాఖ్యానించాయి.
అంతర్జాతీయ ఆమోదం కోసం తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని, కానీ వారు తమ నిబంధనల ప్రకారమే దాన్ని కోరుతున్నారని కాబుల్‌లో ఉన్న బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్ లైస్ డౌసెట్ చెప్పారు.
ఒకవేళ పాశ్చాత్య దేశాలు వారితో సంబంధాలు కొనసాగించేందుకు సుముఖంగా లేకపోతే... చైనా, రష్యా, పాకిస్తాన్‌లాంటి ఇతర శక్తులు వారిని ఆశ్రయించవచ్చని మా ప్రతినిధి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- VPN అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనిని బ్యాన్ చేయాలనుకుంటోందా?
- గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్‌కు ఎలా చేరింది? అసలేం జరిగింది?
- పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. ‘వందల్లో మృతులు’
- అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్‌లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
- ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)