అఫ్గానిస్తాన్: హక్కుల కోసం నిరసన తెలుపుతున్న మహిళలపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించిన తాలిబాన్లు

అఫ్గానిస్తాన్‌లో మహిళా హక్కుల ఉద్యమకారులు

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబుల్‌లో హక్కుల కోసం పోరాడుతున్న మహిళలపై తాలిబాన్లు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలను ప్రయోగించారు.

అధ్యక్ష భవనానికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుండగా తాలిబాన్లు తమను లక్ష్యంగా చేసుకున్నారని మహిళలు చెబుతున్నారు.

అయితే, నిరసనలు అదుపు తప్పాయని, అందుకే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తాలిబాన్లు చెబుతున్నట్లు అఫ్గాన్ మీడియా సంస్థ టోలో న్యూస్ తెలిపింది.

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆధీనంలోకి తీసుకున్న అనంతరం కాబుల్, హెరాత్‌లలో హక్కుల కోసం మహిళలు నిరసనలు చేపడుతున్నారు.

తమకు ఉద్యోగం చేసుకునే హక్కులు ఇవ్వాలని, ప్రభుత్వంలోనూ తమను భాగస్వామ్యం చేయాలని మహిళలు కోరుతున్నారు.

కొన్నిరోజుల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు చోటు కల్పిస్తామని ఇప్పటికే తాలిబాన్లు వెల్లడించారు. అయితే, మంత్రి పదవులు మాత్రం ఇవ్వబోమని స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images

1996 నుంచి 2001 మధ్య కాలంలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు తమపై అణచివేత కొనసాగినట్లుగానే, ఇప్పుడు కూడా అణచివేత ఉంటుందేమోనని చాలా మంది మహిళలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆనాడు బయటకు వెళ్లేటప్పుడు మహిళలు తప్పకుండా బురఖా వేసుకోవాలని సూచించారు. చిన్నచిన్న తప్పులకే కఠినమైన శిక్షలు విధించేవారు.

‘‘25ఏళ్ల క్రితం తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు, నన్ను స్కూలుకు వెళ్లకుండా అడ్డుకున్నారు’’అని టోలోలో జర్నలిస్టుగా పనిచేస్తున్న అజితా నజీమీ చెప్పారు.

‘‘వారి ఐదేళ్ల పాలన తర్వాత, నేను 25ఏళ్లు చదువుకున్నాను. చాలా శ్రమించాను. ఇప్పుడు మళ్లీ ఆంక్షలు విధిస్తామంటే ఎలా? మా భవిష్యత్ కోసం అలాంటి ఆంక్షలు లేకుండా ఉండేందుకు పోరాడతాం’’ అని అన్నారు.

మరోవైపు కొందరు మహిళలను తుపాకులతో తలపై కొట్టారని, దీంతో రక్తం కూడా కారిందని నిరసనలు చేపట్టిన వారిలో ఒకరైన సోరాయా.. రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

పంజ్‌షీర్ లోయలో ఘర్షణలు

మరోవైపు కాబుల్‌కు ఉత్తరాన పంజ్‌షీర్ లోయలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇక్కడ తాలిబాన్లతో నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్‌ఆర్ఎఫ్) ఫైటర్లు పోరాడుతున్నారు.

ఇక్కడ తాము ఆధిక్యం సాధిస్తున్నామంటూ రెండు వర్గాలూ చెప్పుకొంటున్నాయి. మరో రెండు జిల్లాలను ఆధీనంలోకి తీసుకున్నామని, ప్రావిన్స్ కేంద్రం వైపుగా వెళ్తున్నామని తాలిబాన్లు చెబుతున్నారు.

మరోవైపు ‘‘భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. వేల మంది తాలిబాన్లను ముట్టడించాం’’ అని ఎన్‌ఆర్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.

1,50,000 నుంచి 2,00,000 మంది జనాభా ఉండే ఈ లోయలో ఇదివరకు తాలిబాన్లు అఫ్గాన్‌లో అధికారంలో ఉన్నప్పుడు, 1980 నాటి సోవియట్ యూనియన్ పాలనా కాలంలోనూ ప్రతిఘటన ఎదురైంది.

హెరాత్‌లో నిరసనలు చేపడుతున్న మహిళలను ఎన్‌ఆర్‌ఎఫ్ నాయకుడు అహ్మద్ మసూద్ ప్రశంసించారు. పంజ్‌షీర్‌ లోయలో తాము కూడా అలానే పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

అయితే, పంజ్‌షీర్‌ లోయలో ఇటు తాలిబాన్లు, అటు ఎన్‌ఆర్ఎఫ్ ఫైటర్ల వ్యాఖ్యలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images

మొదలైన విమాన సేవలు

గతవారం అమెరికా సేనల ఉపసంహరణ అనంతరం, అఫ్గాన్‌లో మళ్లీ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. హెరాత్, మజర్-ఏ-షరీఫ్, కాందహార్ నగరాలకు విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు అఫ్గాన్ ఎయిర్‌లైన్ అరియానా ప్రకటించింది.

ఖతార్‌కు విమానాల రాకపోకలను ప్రారంభించడంలో అడ్డంకిగా ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసినట్లు ఖతార్ దౌత్య ప్రతినిధి చెప్పినట్లు అల్‌జజీరా తెలిపింది.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ ఆదివారం ఖతార్‌కు రాబోతున్నారు. తాలిబాన్లతో చర్చల్లో ఖతార్ కీలకపాత్ర పోషించింది. అయితే, ప్రస్తుతం తాలిబాన్ నేతలను ఆంటొనీ కలిసే సూచనలేవీ కనిపించడం లేదు.

మరోవైపు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ అధిపతి జనరల్ ఫైజ్ అహ్మద్ కాబుల్‌కు వచ్చారు. అయితే, రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

‘‘అఫ్గాన్ సైన్యం పునర్‌వ్యవస్థీకరణలో సాయం చేసేందుకు ఆయన ఇక్కడకు వస్తున్నారు’’ అని రాయిటర్స్ వార్తా సంస్థతో ఇటీవల ఓ అధికారి చెప్పారు. తాలిబాన్లకు ఐఎస్ఐ మొదట్నుంచీ సాయం చేస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తూనే వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను పాక్ ఖండించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)