పంజ్‌షీర్‌లో జెండా ఎగురవేసిన తాలిబాన్‌లు, లోయ మొత్తం తమ అధీనంలో ఉందని ప్రకటన

పంజ్‌షీర్‌లో తాలిబాన్ల జెండా

ఫొటో సోర్స్, Taliban

పంజ్‌షీర్‌లో తాలిబాన్‌లు తమ జెండా ఎగురవేశారు. ఇప్పటివరకు తమకు పట్టుచిక్కని ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబాన్లు కొద్దిరోజులుగా అక్కడి నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గాన్(ఎన్ఆర్ఎఫ్)తో భీకర పోరు సాగిస్తున్నారు.

ఈ పోరులో విజయం సాధించామని తాలిబాన్‌లు తాజాగా మరోసారి ప్రకటించారు.

పంజ్‌షీర్‌లో తమ ఫైటర్లు జెండా ఎగురవేస్తున్న దృశ్యాలను తాలిబాన్‌లు విడుదల చేశారు.

అయితే, తాము ఇంకా పోరాడుతున్నామని ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లు చెబుతున్నారు.

ఎన్ఆర్ఎఫ్ నాయకుడు అహ్మద్ మసూద్ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియో సందేశంలో అంతర్జాతీయ సమాజంపై విమర్శలు చేశారు. తాలిబాన్లకు ఆమోదం పలుకుతూ వారు రాజకీయంగా, సైనికపరంగా ఆత్మవిశ్వాసం పెంచుకునేలా అంతర్జాతీయ సమాజం వ్యవహరిస్తోందని మసూద్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్

సోమవారమే ప్రకటన

పంజ్‌షీర్ లోయ ఇప్పుడు పూర్తిగా తమ అధీనంలోనే ఉందని, ఆ ప్రాంతాన్నీ గెలిచామని తాలిబాన్‌లు సోమవారం ప్రకటించుకున్నారు.

కాబుల్‌కు ఉత్తరాన ఉండే పంజ్‌షీర్‌పై పట్టు కోసం తాలిబాన్లు కొద్దిరోజులుగా తీవ్రంగా పోరాడుతున్నారు.

పంజ్‌షీర్‌లోని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్(ఎన్ఆర్ఎఫ్) నుంచి తాలిబాన్లకు గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో కొన్నాళ్లుగా అక్కడ భీకర పోరు సాగుతోంది.

దీంతో రాజధాని కాబుల్ సహా దేశమంతటినీ తమ అధీనంలోకి తెచ్చుకున్నా పంజ్‌షీర్ లోయపై మాత్రం తాలిబాన్లు పట్టు సాధించలేకపోయారు.

కానీ, తాజాగా వారు పంజ్‌షీర్ కూడా తమ అధీనంలోకి వచ్చిందని ప్రకటించారు.

అయితే, తాలిబాన్లు చేసిన ప్రకటనను 'నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్' ఖండించింది.

ఫొటో సోర్స్, Getty Images

తాలిబాన్లు చెబుతున్నది నిజం కాదు: ఎన్ఆర్‌ఎఫ్

''ఈ విజయంతో అఫ్గానిస్తాన్ పూర్తిగా యుద్ధం నుంచి బయటపడింది'' అని తాలిబాన్ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

అయితే, ''ఇది అవాస్తవం. తాలిబాన్‌లు పంజ్‌షీర్‌ను గెలవలేదు. వారు చెబుతున్నది మేం ఖండిస్తున్నాం'' అని ఎన్ఆర్ఎఫ్ అధికార ప్రతినిధి అలీ మైసమ్ 'బీబీసీ'తో చెప్పారు.

రెండు రోజుల కిందట కూడా తాలిబాన్లు ఇలాంటి ప్రకటనే చేశారు.

"అల్లా దయ వల్ల మొత్తం అఫ్గానిస్తాన్ మా చేతుల్లోకి వచ్చింది. పంజ్‌షీర్‌లో సమస్యలు సృష్టిస్తున్న వాళ్లు ఓడిపోయారు. ఆ ప్రాంతం ఇప్పుడు మా ఆధీనంలో ఉంది" అని తాలిబాన్ కమాండర్ ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

దాంతో పంజ్‌షీర్ వ్యాలీ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని వచ్చిన వార్తలు నిరాధారమైనవని ప్రతిఘటన బృందం నాయకుల్లో ఒకరైన అమ్రుల్లా సలేహ్ ఆ వెంటనే ప్రకటించారు.

ఫొటో క్యాప్షన్,

అమ్రుల్లా సలేహ్

తమకు టెలిఫోన్, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యాలను తాలిబాన్లు నిలిపివేయడంతో వ్యాలీలో పరిస్థితులు కష్టంగా మారాయని ఆయన చెప్పారు.

అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోన్న తాలిబాన్లు ఈ లోయపై పట్టు సాధించేందుకు పోరాటాలు చేస్తున్నారు.

రాజధాని కాబుల్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పంజ్‌షీర్ వ్యాలీ అఫ్గానిస్తాన్‌లోని అతిచిన్న ప్రావిన్సులలో ఒకటి. కేవలం ఈ ప్రాంతంపై మాత్రమే తాలిబాన్లు పట్టు సాధించలేకపోతున్నారు.

తాలిబాన్ వ్యతిరేక యోధులకు ఆవాసమైన ఈ లోయలో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది నివసిస్తున్నారు. ఎత్తైన పర్వత శిఖరాలకు వెనుక భాగంలో ఈ లోయ ఉంటుంది.

తాలిబాన్ వ్యతిరేక దళానికి స్థానిక గిరిజన నాయకుడు అహ్మద్ మసూద్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ దళంలో స్థానిక మిలీషియా సభ్యులతో పాటు అఫ్గాన్ మాజీ భద్రతా సిబ్బంది సభ్యులు కూడా భాగంగా ఉన్నారు. 1980ల్లో సోవియట్ సేనలు, 1990ల్లో తాలిబాన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా అహ్మద్ మసూద్ తండ్రి సమర్థంగా పోరాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)