Apple: బైక్‌లతో ఐఫోన్ కెమెరాలకు ప్రమాదం.. ఎలా అంటే

బైక్

ఫొటో సోర్స్, Getty Images

పెద్ద శబ్దాలతో వేగంగా దూసుకెళ్లే బైక్‌ల నుంచి వచ్చే వైబ్రేషన్లతో ఐఫోన్ యూజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని యాపిల్ సంస్థ సూచించింది. ఈ వైబ్రేషన్లతో యాపిల్ ఫోన్ల కెమెరా వ్యవస్థ దెబ్బతినే ముప్పు ఉందని హెచ్చరించింది.

జీపీఎస్ సేవల కోసం వేగంగా కదిలే శక్తిమంతమైన బైక్‌లపై ఐఫోన్లను పెట్టకూడదని సంస్థ ఓ ప్రటకనను విడుదల చేసింది.

‘‘ఇంజిన్ల నుంచే వచ్చే వైబ్రేషన్లతో ఐఫోన్లలోని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదా క్లోజ్డ్ లూప్ ఆటోఫోకస్ సిస్టమ్ వ్యవస్థలు దెబ్బతింటాయి’’అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఫోన్లను తమ వాహనాలపై పెట్టే స్కూటర్లు, మోపెడ్ డ్రైవర్లు కూడా వైబ్రేషన్ల తీవ్రతను తగ్గించే పరికరాలను ఉపయోగించాలని యాపిల్ సూచించింది.

జీపీఎస్ సహాయం కోసం బైక్‌కు అమర్చడంతో తమ మొబైల్ ఫోన్లు దెబ్బతిన్నాయని చాలా మంది ఐఫోన్ వినియోగదారులు సోషల్ మీడయాలో పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో యాపిల్ స్పందించింది.

కొన్ని ఐఫోన్ మోడల్స్.. ఇలా దెబ్బతినే ముప్పుందని యాపిల్ సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images

వైబ్రేషన్లే కారణం...

ఫోన్ కదలికలు, వైబ్రేషన్లు, భూమి గురుత్వాకర్షణల ప్రభావం ఫోటోలపై పడకుండా చూసేందుకు ఐఫోన్లలో కొన్ని ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. వీటినే బైక్‌లు దెబ్బతీస్తున్నాయి.

‘‘భారీ శబ్దాలతో వేగంగా దూసుకెళ్లే బైక్‌ల నుంచి శక్తిమంతమైన వైబ్రేషన్లు వస్తుంటాయి. ఇవి ఫ్రేమ్‌లు, హ్యాండిల్‌బార్స్ గుండా ఫోన్‌లోకి చొచ్చుకెళ్తుంటాయి’’అని ప్రకటనలో యాపిల్ పేర్కొంది.

‘‘ఇలాంటి శక్తిమంతమైన వైబ్రేషన్లకు సమీపంలో ఫోన్లు ఉంటే వాటిలోని కీలకమైన వ్యవస్థలు దెబ్బతింటాయి. ఫలితంగా ఫోటోలు, వీడియోల నాణ్యత తగ్గిపోతుంది.’’

‘‘అందుకే, జీపీఎస్ సేవల కోసం బైక్‌లపై ఫోన్‌లు పెట్టకూడదు.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)