పైనాపిల్ తర్వాత ఇప్పుడు సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?

సీతాఫలం

ఫొటో సోర్స్, Getty Images

చైనా, తైవాన్ మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల ఎప్పుడూ లేనంత పతన దశకు చేరుకున్నాయి.

తైవాన్ నుంచి వచ్చే రెండు రకాల పండ్లను దిగుమతి చేసుకునేది లేదని చైనా కొన్ని రోజుల క్రితం స్పష్టం చేసింది.

దీంతో తైవాన్ ఇప్పుడు ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ వరకు తీసుకెళ్తామని చెబుతోంది.

ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉన్నాయంటూ తైవాన్ నుంచి రెండు పండ్ల రకాల(సీతాఫలం, వాక్స్ ఆఫిల్) దిగుమతులు ఆపివేస్తామని చైనా బెదిరించింది.

ఆ పండ్లలోని క్రిముల వల్ల తమ దేశంలో పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది.

తైవాన్ నుంచి దిగుమతి అవుతున్న సీతాఫలాల్లో 'ప్లానోకోకస్ మైనర్' అనే తెగులును తరచుగా గుర్తించినట్లు చైనా కస్టమ్స్ విభాగం చెబుతోంది.

దీంతో ఈ రెండు పండ్ల దిగుమతులు అడ్డుకోవాలని, అది గ్వాంగ్‌డాంగ్ శాఖకు సంబంధించిన అన్ని బ్రాంచీల కస్టమ్స్ విభాగాలను ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images

తైవాన్ ఏం చెబుతోంది?

ఎలాంటి శాస్త్రీయ కారణాలు వెల్లడించకుండానే, చైనా ఏకపక్షంగా వాదిస్తోందని తైవాన్ వ్యవసాయ మంత్రి చెన్ చీ చుంగ్ అన్నారు. చైనా నిర్ణయాన్ని కూడా ఆయన విమర్శించారు.

"మేం దీన్ని అంగీకరించం. సెప్టెంబర్ 30లోపు ప్రస్తుత సమస్యకు పరిష్కారం కనుగొనాలనే మా అభ్యర్థనకు సమాధానం ఇవ్వకపోతే, ఈ అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గరికి తీసుకెళ్తాం" అని ఆయన చైనాను హెచ్చరించారు.

చైనా నిర్ణయంతో ప్రభావితం అవుతున్న రైతులకు సాయంగా తమ ప్రభుత్వం 100 మిలియన్ తైపే డాలర్లు (రూ.26.54 కోట్లకు పైనే) ఖర్చు చేస్తుందని ఆయన చెప్పారు.

చైనా ఇదే ఏడాది ఫిబ్రవరిలో హానికారక క్రిములు ఉన్నాయనే కారణం చూపుతూ తైవాన్ పైనాపిల్ దిగుమతులపై నిషేధం విధించింది.

అది తమ దేశంపై ఒత్తిడి పెంచడానికి చైనా పన్నిన వ్యూహం అని తైవాన్ అంటోంది.

పైనాపిల్‌ మీద చైనా ఆంక్షలు విధించడంతో తైవాన్ తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది.

ఆ తర్వాత పైనాపిల్‌ను వీలైనంత ఎక్కువగా తినాలని తమ దేశ పౌరులకు అపీల్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడు దీనిపై ఒక ట్వీట్ చేసిన తైవాన్ ఉపాధ్యక్షుడు చింగ్-తె తన ట్వీట్‌లో తైవాన్ పైనాపిల్ ఫైటర్ జెట్ కంటే బలమైనదని రాశారు. భౌగోళిక రాజకీయ ఒత్తిడిలు దాని రుచిని పాడు చేయలేవన్నారు.

తైవాన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వివరాల ప్రకారం దేశంలో ప్రతి ఏటా నాలుగు లక్షల 20 వేల టన్నుల పైనాపిల్ ఉత్పత్తి అవుతుంది. అందులో 10 శాతం చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తారు.

అందులో ఎక్కువ భాగం చైనాకు పంపిస్తారు. చైనా ఆంక్షలతో దేశంలో ఈ ఏడాది పైనాపిల్ ధర పడిపోతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం అయ్యాయి.

దాంతో పైనాపిల్‌ వినియోగం పెరగడానికి దేశంలోని రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. తైవాన్ అధ్యక్షుడు సై ఇంగ్ వెన్ పైనాపిల్ చాలెంజ్ కూడా విసిరారు.

ఫొటో సోర్స్, YANG YU-FAN

చైనా, తైవాన్ మధ్య వివాదం

తైవాన్ ఒక దేశం కాదు, అది చైనాలోని ప్రాంతమే అని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం దశాబ్దాల నుంచి చెబుతోంది. అటు తైవాన్ మాత్రం ఆ వాదనలను కొట్టిపారేస్తూ వస్తోంది.

చైనా అంతర్యుద్ధంలో మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులు చియాంగ్ కాయి షేక్ నేతృత్వంలో జాతీయవాద కామింగ్‌తాంగ్ పార్టీని 1949లో ఓడించారు. ఆ తర్వాత కామింగ్‌తాంగ్ తైవాన్‌కు వెళ్లి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత అది తైవాన్ నియంత్రణను కామింగ్‌తాంగ్‌కు అప్పగించింది. కానీ, కామింగ్‌తాంగ్ అక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జపాన్ తైవాన్‌ను ఎవరికివ్వాలి అనే వివాదం తలెత్తింది.

అప్పుడు చైనాలో కమ్యూనిస్టులు, తైవాన్‌లో కామింగ్‌తాంగ్ పాలన ఉంది.

చైనాలో తాము గెలిచినప్పుడు, తైవాన్ మీద హక్కు కూడా తమకే ఉంటుందని మావో జెడాంగ్ భావించారు. కానీ, చైనాలో కొన్ని ప్రాంతాల్లో తాను ఓడిపోయినప్పటికీ, చైనాకు తానే అధికారికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని కామింగ్‌తాంగ్ చెప్పారు.

ఆ తర్వాత నుంచి ఇద్దరూ తమ దేశమే అధికారిక చైనా అంటూ చెప్పుకోవడం ప్రారంభించారు.

కానీ 1971లో చైనా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం పొందిన తర్వాత, 1979లో యూఎన్‌లో తైవాన్ అధికారిక గుర్తింపును రద్దు చేశారు. ఆ తర్వాత నుంచి తైవాన్ చైనా కంటే బలహీన పడడం మొదలైంది.

తైవాన్ ఒక ద్వీపం. అది 1950 నుంచే స్వతంత్రంగా ఉంది. కానీ, చైనా దానిని తమ తిరుగుబాటు దేశంగా భావిస్తుంది. తైవాన్ తమను స్వతంత్ర, సౌర్వభౌమాధికారం ఉన్న దేశంగా భావిస్తే, అటు చైనా మాత్రం తైవాన్ చైనాలో కలవాలని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)