అఫ్గానిస్తాన్: తాలిబాన్లు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌‌కు మద్దతు ఇవ్వరు - ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీ

పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీ
ఫొటో క్యాప్షన్,

పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీ

అఫ్గాన్ తాలిబాన్లపై పాకిస్తాన్ ప్రభావం ఏమాత్రం లేదని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) అసద్ దురానీ అన్నారు.

భారత్ సహా ఏ దేశంతో అయినా తమ ప్రయోజనాలను బట్టి తాలిబాన్లు సంబంధాలు ఏర్పరుచుకుంటారని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ చెప్పినంత మాత్రాన తాలిబాన్లు కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకోవడం కూడా ఉండదని దురానీ తెలిపారు.

ఐఎస్ఐ ప్రస్తుత చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ఇటీవలి కాబుల్ పర్యటన గురించి కూడా దురానీ ప్రశ్నలు లేవనెత్తారు. ఆ పర్యటన సరి కాదన్న ఆయన, దానివల్ల అనవసర ఊహాగానాలకు తెరతీశారని, ఉద్రిక్తతలు పెంచారని అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో భారత్ ప్రభావం, తాలిబాన్‌తో సంబంధాలపై దురానీ బీబీసీ ప్రతినిధి ఉస్మాన్ జాహిద్‌తో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Getty Images

అది భారత్ అయినా, రష్యా అయినా.. తాలిబాన్లు ప్రపంచంలోని ఏ దేశంతో అయినా తమ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సంబంధాలు ఏర్పరుచుకోవాలని కోరుకుంటారు అన్నారు.

అఫ్గాన్ తాలిబాన్లు గత ఆగస్టు 15న కాబుల్‌ను ఆక్రమించారు. ఆ తర్వాత వారు భారత్‌తోకూడా సంబంధాలు ఏర్పరుచుకున్నారు.

ఖతార్‌లో భారత రాయబారి దీపక్ మిత్తల్, తాలిబాన్ రాజకీయ కార్యాలయం చీఫ్ షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్‌తో సమావేశం అయ్యారని గత నెల చివర్లో భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.

అయితే, ఆ చర్చల్లో అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా, త్వరగా స్వదేశం తీసుకురావడంపైనే ఫోకస్ పెట్టారు.

అఫ్గానిస్తాన్ గత ప్రభుత్వాలతో భారత్‌కు సన్నిహితసంబంధాలు ఉన్నాయి. భారత్ 2001లో అమెరికా దాడుల తర్వాత అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. భారీ పెట్టుబడులు పెట్టింది. కానీ ఇప్పుడు తాలిబాన్ల అధికారంలో అఫ్గానిస్తాన్‌తో తమ సంబంధాల గురించి వస్తున్న ప్రశ్నలపై భారత్ తన వైఖరి స్పష్టం చేయడం లేదు.

దీనిపై "అఫ్గానిస్తాన్ నుంచి భారత్ బయటికి వెళ్లిపోయిందని చెప్పడం సరికాదు. ప్రస్తుత పరిణామాలు తాత్కాలికమే" అంటారు దురానీ.

"భారత్ తాలిబాన్లతో చర్చలు జరిపి, అఫ్గానిస్తాన్‌లో తాము పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామని చెబితే, తాలిబాన్లు కచ్చితంగా అనుమతిస్తారు. అది ఒక వాస్తవం" అని దురానీ అన్నారు.

ఫొటో సోర్స్, Pib

భారత్ ప్రభావం

ఆఫ్గానిస్తాన్‌లో భారత్ పెట్టుబడులు పెట్టాలనే తాలిబాన్లు కోరుకుంటారని ఆయన చెప్పారు.

"అఫ్గానిస్తాన్ ప్రజలు, అక్కడి సమాజంపై భారత్ ప్రభావం చాలా ఉంది. ఈ విషయంలో భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. భారత్‌కు అఫ్గానిస్తాన్‌తో సరిహద్దులు లేవు. కానీ అక్కడ భారతీయుల ప్రభావం కనిపిస్తుంది. అక్కడి వారు భారత సినిమాలను ఇష్టపడతారు" అని ఆయన అన్నారు.

భారత్, తాలిబాన్ల సంబంధాలపై పాకిస్తాన్ ప్రభావం గురించి కూడా దురానీ మాట్లాడారు.

"భారత్, అఫ్గానిస్తాన్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. మధ్యలో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడంలో అసలు అర్థం లేదు" అన్నారు.

తాలిబాన్ల మీద పాకిస్తాన్ ప్రభావం గురించి కూడా మాట్లాడిన ఆయన ఇంతకు ముందు కూడా వారిపై పాకిస్తాన్ ప్రభావం లేదు, ఇప్పుడు కూడా లేదని అన్నారు.

ఫొటో క్యాప్షన్,

పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీ

కశ్మీర్ మీద ఏం చెప్పారు

కశ్మీర్ విషయంలో తాలిబాన్లు పాకిస్తాన్‌కు అండగా ఉండరని దురానీ అన్నారు.

"అఫ్గాన్ తాలిబాన్ ఎవరి సూచనలు తీసుకోరు. తమ ప్రయోజనాల గురించి వారికి బాగా తెలుసు. ఎవరో చెప్పినంత మాత్రాన వెంటనే ఏదైనా ఒప్పుకోడానికి వారు సిద్ధంగా లేరు" అన్నారు.

తాలిబాన్లు ఉమ్మడి ప్రయోజనాల గురించి పాకిస్తాన్‌తో మాట్లాడుతారు కానీ, భారత పాలిత కశ్మీర్‌లో కొనసాగుతున్న సాయుధ పోరాటంలో వారు పాకిస్తాన్ వైపు చేరడమన్నది ఎప్పటికీ జరగదని అభిప్రాయపడ్డారు.

భారత్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలు

అసద్ దురానీ 1990, 91లో ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నారు. అంతకు ముందు ఆయన పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.

భారత నిఘా ఏజెన్సీ రా మాజీ చీఫ్ ఎఎస్ దులత్‌తో కలిసి దురానీ 'స్పై క్రానికల్స్' అనే పుస్తకం కూడా రాశారు. దీనిపై పాకిస్తాన్‌లో చాలా వివాదం రాజుకుంది.

దురానీకి 'రా'తో సంబంధాలున్నాయని పాక్ రక్షణ శాఖ అధికారులు ఆరోపించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలను ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారని కూడా చెప్పారు.

ప్రభుత్వ అధికారుల గోప్యతకు సంబంధించిన 'అఫిషియల్ సీక్రెట్ యాక్ట్స్ 1923' ఉల్లంఘించారని దురానీపై ఆరోపణలు కూడా నమోదు చేశారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన పేరును 2018 మేలో ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్(ఈసీఎల్)లో చేర్చింది. ఆయన్ను దేశం బయటకు వెళ్లకుండా నిషేధం విధించింది. కానీ ఇస్లామాబాద్ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో ఆయన పేరును ఈసీఎల్ నుంచి తొలగించాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, TWITTER / LINDSEY HILSUM

ఫొటో క్యాప్షన్,

ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్

ఐఎస్ఐ చీఫ్ హమీద్ విమర్శలు

దురానీ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబుల్ పర్యటన గురించి కూడా తీవ్ర విమర్శలు చేశారు.

"డైరెక్టర్ జనరల్ దగ్గర అన్ని రకాల పద్ధతులు ఉంటాయి. వాటి ద్వారా వాళ్లు రహస్యంగా అలాంటి సమావేశాలు జరపవచ్చు" అన్నారు.

"పాకిస్తాన్ పాత్ర ప్రాధాన్యం గురించి చెప్పడానికి ఆ ప్రాంతంలో పర్యటించడం సబబే. కానీ ఆ సమావేశానికి సంబంధించిన వివరాలు బయటికి రావడం సరికాదు" అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఫైజ్ హమీద్ సెప్టెంబర్ 5న హఠాత్తుగా దేశ రాజధాని కాబుల్ వెళ్లారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఫొటోలు కూడా మీడియాలో కనిపించాయి.

కాబుల్ పర్యటనకు సంబందించిన ఫొటోలు, వీడియోల్లో లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ఒక హోటల్ లాబీలో టీ కప్పు పట్టుకుని కనిపించారు. అప్పుడు ఆయన మీడియాతో "మీరేం కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది" అన్నారు.

ఆ తర్వాత భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మీడియా ఐఎస్ఐ చీఫ్ హమీద్ కాబుల్ పర్యటన గురించి రకరకాల ఊహాగానాలు రాశాయి.

"ఆయన ఆ స్థితిని తప్పించుకుని ఉండవచ్చు. ఫైజ్ హమీద్ పర్యటన సమయంలో ఒక గ్రూప్ పంజ్‌షీర్‌లో పాకిస్తాన్ పాత్ర గురించి వదంతులు ప్రచారం చేసింది. దాంతో అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ పాత్ర, భవిష్యత్ వ్యూహాల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి" అని దురానీ అన్నారు.

"ఐఎస్ఐ చీఫ్, తాలిబాన్ నేతల సమావేశంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. కానీ, నేను ఐఎస్ఐ చీఫ్ స్థానంలో ఉండుంటే, తాలిబాన్లతో ఆ సమావేశాలు మరోలా జరిగుండేవని కచ్చితంగా చెబుతాను" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

నోరు అదుపులో పెట్టుకోవాలి

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు నివ్వడంపై కూడా దురానీ స్పందించారు.

"పాకిస్తాన్ నిర్ణయం కీలకమైనది. కానీ, దానిపై చైనా, టర్కీ, ఖతార్, రష్యా, ఇరాన్, మధ్య ఆసియా దేశాలు, మిగతా మిత్రదేశాలతో చర్చలు జరిపి ఉండాలి" అన్నారు. ఆ విషయంలో పాకిస్తాన్ వైఖరిని ఆయన ప్రశంసించారు.

గుర్తింపు విషయంలో మంత్రులు చేసిన ప్రకటనలను ఆయన అనవసర ప్రకటనలుగా వర్ణించారు.

"సమయానికి ముందే ప్రకటనలు ఇవ్వడంలో అర్థం లేదు. దానిపై నోరు అదుపులో పెట్టుకుని ఉండడమే మంచిది" అన్నారు.

"ఇలాంటి అంశాలను దౌత్య స్థాయిలో పరిష్కరించడానికి మాత్రమే అనుమతించాలి. ప్రభుత్వంలో ఒక మంత్రి లేదా ఒక ప్రతినిధి ఏదో ప్రైవేటు చానల్లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ సర్కారు గురించి ప్రభుత్వ విదేశాంగ విధానానికి భిన్నంగా ఏవైనా ప్రకటనలు చేయడం మంచిది కాదు" అన్నారు.

ఫొటో సోర్స్, EPA

టీటీపీతో సంబంధాలు

తహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో అఫ్గాన్ తాలిబాన్ల సంబంధాల గురించి అడిగినపుడు, అఫ్గాన్ తాలిబాన్లు వారితో సంబంధాలను తెంచుకోరని దురానీ చెప్పారు.

టీటీపీ పాకిస్తాన్‌లో ఎన్నో తీవ్రవాద దాడులకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అఫ్గాన్ తాలిబాన్లతో చర్చలు జరిపామని, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా టీటీపీ తమ భూభాగాన్ని ఉపయోగించనివ్వబోమని తాలిబాన్లు తమకు భరోసా ఇచ్చారని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెప్పింది.

ఐక్యరాజ్యసమితి జులై నెలలో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్‌లో 'తహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్‌'కు ఆరు వేలకు పైగా సుశిక్షితులైన మిలిటెంట్లు ఉన్నారు.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా మద్దతుతో నడిచిన గత ప్రభుత్వంపై తాలిబాన్లు చేసిన యుద్ధంలో టీటీపీ వారికి మద్దతు ఇచ్చింది, సహకరించింది.

"టీటీపీతో అఫ్గాన్ తాలిబాన్లకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో మిలిటరీ ఆపరేషన్ తర్వాత అది టిటీపీ మిలిటెంట్లు ఆ దేశం నుంచి బయటకు పారిపోయినప్పుడు వారికి అఫ్గానిస్తాన్‌లో ఆశ్రయం లభించింది" అని దురానీ చెప్పారు.

పాకిస్తాన్ ప్రభుత్వం టీటీపీతో చర్చలు జరపాలి. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి అంటారు దురానీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)