అఫ్గానిస్తాన్: 'మహిళల చదువుపై నిషేధం ఇస్లాం వ్యతిరేకం' - పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

అఫ్గానిస్తాన్‌లో బాలికలు చదువుకోకుండా అడ్డుకోవడమనేది ఇస్లామిక్ వ్యవస్థకు వ్యతిరేకమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించేందుకు తాము విధించబోయే షరతులపై బీబీసీతో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు.
‘‘అఫ్గాన్‌లో నాయకులు అన్ని వర్గాలనూ కలుపుకుంటూ వెళ్లాలి. ముఖ్యంగా వారు మానవ హక్కులను గౌరవించాలి.’’
‘‘పాకిస్తాన్ భద్రతకు ముప్పుగా పరిణమించే ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం ఇవ్వకూడదు.’’
ఫొటో సోర్స్, Reuters
గతవారం అఫ్గాన్‌లో మాధ్యమిక పాఠశాలలను తెరిచారు. అయితే, బాలురు, టీచర్లను మాత్రమే స్కూలుకు రావాలని తాలిబాన్లు సూచించారు. బాలికలు కూడా త్వరలోనే స్కూలుకు వెళ్తారని తాను ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబాన్లు చేస్తున్న ప్రకటనలు అన్ని వర్గాలనూ ప్రోత్సహించేలానే ఉన్నాయి’’అని బీబీసీ ప్రతినిధి జాన్ సింప్సన్‌తో ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌తో జాన్ సింప్సన్
‘‘నాకు తెలిసినంత వరకు వారు బాలికలను కూడా స్కూలుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. మహిళల్ని విద్యకు దూరం చేయాలనే వాదనకు ఇస్లామిక్ వ్యవస్థలో చోటు లేదు. అసలు ఇలాంటి వివక్షకు మతంతో సంబంధంలేదు’’అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
గత ఆగస్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్లీ 1990లనాటి పరిస్థితులే వస్తాయని ఆందోళన వ్యక్తమైంది. ఆనాడు అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు.. మహిళల హక్కులపై కఠినమైన ఆంక్షలు విధించారు.
తాజాగా మహిళల హక్కులను తాము గౌరవిస్తామని తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగానే మహిళలకు హక్కులు కల్పిస్తాం’’అని వారు చెప్పారు.
గతవారం బాలికలను స్కూలుకు అనుమతించకపోవడంపై.. అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తమైంది. దీంతో తాలిబాన్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘త్వరలోనే బాలికలు కూడా పాఠశాలల్లోకి అడుగుపెడతారు’’అని అన్నారు.
అయితే, ఇంతకీ బాలికలు ఎప్పుడు పాఠశాలల్లోకి అడుగుపెడతారు? వారికి ఎలాంటి పాఠ్యాంశాలు బోధిస్తారు? లాంటి అంశాలపై ఇప్పటివరకు స్పష్టతలేదు.
స్కూళ్లు, కాలేజీలలో అబ్బాయిలు, అమ్మాయిల నడుమ తెర ఉండాల్సిందే
తాము విధించిన షరతులకు లోబడే తాలిబాన్లు పరిపాలన కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘వారికి మరింత సమయం అవసరం. దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి’’అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
‘‘ఈ విషయంపై ఇప్పుడే ఏదో ఒకటి మాట్లాడటం తొందరపాటు అవుతుంది’’అని ఇమ్రాన్ వివరించారు. అఫ్గాన్‌లో మహిళలకు అన్ని హక్కులూ తప్పక ఇస్తారని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్‌ను మిత్ర దేశంగా చాలా దేశాలు చూడటం లేదు. ముఖ్యంగా తాలిబాన్ సహా కొన్ని మిలిటెంట్ సంస్థలకు పాక్ సాయం అందిస్తోందని మొదట్నుంచీ అమెరికా ఆరోపిస్తూనే ఉంది. అయితే, ఈ ఆరోపణలను పాక్ ఖండిస్తూ వచ్చింది.
అఫ్గాన్ భూభాగం నుంచి కుట్ర పన్నిన 9/11 దాడుల అనంతరం, ఉగ్రవాదంపై పోరాటంలో మిత్రదేశాల జాబితాలో పాక్‌ను కూడా అమెరికా చేర్చింది. అయితే, తాలిబాన్ సహా కొన్ని ఇస్లామిస్ట్ సంస్థలతో పాక్ గూఢచర్య సంస్థకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం తాలిబాన్‌ను అధికారంగా గుర్తించే విషయంలో ‘‘పొరుగు దేశాలతో’’ కలిసి తాము నిర్ణయం తీసుకుంటామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
‘‘అఫ్గాన్‌లో పరిణామాలను పొరుగు దేశాలతో కలిసి మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం. తాలిబాన్లకు గుర్తింపు విషయంలో మేమంతా కలిసే నిర్ణయం తీసుకుంటాం.’’
అంతర్యుద్ధంపై ఆందోళన
‘‘అఫ్గాన్‌లో అన్ని వర్గాలనూ కలుపుకుంటూ తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి. లేకపోతే, ఇక్కడ మళ్లీ అంతర్యుద్ధం తలెత్తే ముప్పుంది’’అని ఇమ్రాన్ అన్నారు.
‘‘కొన్ని వర్గాలను వారు దూరంగా పెడితే, మళ్లీ అంతర్యుద్ధం వస్తుంది. అంటే అస్థిరమైన, కల్లోలిత పరిస్థితులు చోటుచేసుకునే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదం చెలరేగే ముప్పుంది. అది నిజంగా ఆందోళన కలిగించే అంశం.’’
అఫ్గాన్‌లో మిగతా పాలక వర్గాన్ని మంగళవారం తాలిబాన్లు ప్రకటించారు. దీనిలో అందరూ మగవారే ఉన్నారు.
తాజాగా వైద్య మంత్రిగా డాక్టరును ఎంచుకున్నారు. అయితే, తాలిబాన్లకు నమ్మిన బంట్లుగా ఉన్నవారికే ప్రభుత్వంలో చోటు ఇస్తున్నారని, మైనారిటీ వర్గాలను దూరం పెడుతున్నారని విమర్శకులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ విషయంలో తాలిబాన్లు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వరు - ఐఎస్ఐ మాజీ చీఫ్ అసద్ దురానీ
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)