జో బైడెన్: ఐరాసలో తొలి ప్రసంగం: ‘మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదు’

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన తొలి ప్రసంగంలో ప్రపంచ సహకారాన్ని అర్థించారు. ఇది 'మన ప్రపంచానికి నిర్ణయాత్మక దశాబ్దం' అంటూ అంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ నేపథ్యంలో మిత్ర దేశాలతో పొరపొచ్చాలు, జలాంతర్గాముల ఒప్పందం విషయంలో ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం నేపథ్యంలో బైడెన్ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వాతావరణ మార్పుల నివారణకు అమెరికా ఇస్తానని మాటిచ్చిన ఆర్థిక సహాయాన్ని 2024 నాటికి రెట్టింపు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రజాస్వామ్యం, దౌత్యానికి తన మద్దతును పునరుద్ఘాటించిన బైడెన్ ''మునుపెన్నడూ లేని రీతిలో మనమంతా కలిసి పనిచేయాలి'' అన్నారు.
వాతావరణ సంక్షోభం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐరాస 76వ సర్వ ప్రతినిధుల సభ న్యూయార్క్ నగరంలో జరిగింది.
బైడెన్ ఇంకేమన్నారు?
మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని, ప్రపంచం విడిపోవడాన్ని అమెరికా కోరుకోవడం లేదని బైడెన్ అన్నారు.
ఉమ్మడి సవాళ్లపై శాంతియుత పరిష్కారాలు ఆచరించేందుకు తీవ్రమైన విభేదాలున్న దేశాలతో కూడా కలిసి పనిచేసేందుకు సిద్ధమని బైడెన్ చెప్పారు.
బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాటలకు బదులిచ్చినట్లుగా అనిపించింది.
అమెరికా, చైనాలు ప్రచ్ఛన్న యుద్ధం దిశగా సాగితే, అది గత ప్రచ్ఛన్న యుద్ధాల కంటే ప్రమాదకరంగా ఉండొచ్చని ఆంటోనియో గత వారం అన్నారు.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణపై ఇంటాబయటా వెల్లువెత్తిన వ్యతిరేకతపైనా ఆయన మాట్లాడారు. సరికొత్త దౌత్య శకం కోసం నిర్విరామ యుద్ధాన్ని ముగించినట్లు ఆయన చెప్పారు.
వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు 2024 నాటికి వర్థమాన దేశాలకు అందించే ఆర్థిక సహాయాన్ని 1140 కోట్ల డాలర్లకు పెంచుతున్నట్లు చెప్పారు.
అయితే, పేద దేశాలకు 2020 నాటికి ఏడాదికి 10,000 కోట్ల డాలర్లు ఇస్తామని అభివృద్ధి చెందిన దేశాలు ప్రతిజ్ఞ చేసినా ఇంతవరకు అది నెరవేరలేదు.
మిత్ర దేశాలకు అమెరికా ఎప్పటిలా నాయకత్వం వహిస్తుందని బైడెన్ తన ప్రసంగం చివరలో చెప్పారు.
''కోవిడ్ నుంచి వాతావరణ మార్పుల వరకు అన్ని కఠిన సవాళ్లనూ ముందుండి ఎదుర్కొంటాం. మేం ఒంటరిగా వెళ్లం, కలిసి సాగుతాం'' అన్నారు బైడెన్.
ఇవి కూడా చదవండి:
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రసంగించేందుకు అనుమతించాలని కోరిన తాలిబాన్లు
- కశ్మీర్ విషయంలో తాలిబాన్లు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వరు - ఐఎస్ఐ మాజీ చీఫ్
- అఫ్గానిస్తాన్: 'మహిళల చదువుపై నిషేధం ఇస్లాం వ్యతిరేకం' - పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)