కోవిషీల్డ్‌ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదా?

  • సౌతిక్ బిశ్వాస్
  • భారత ప్రతినిధి
కోవిషీల్డ్‌ను భారత్‌లో విస్తృతంగా ఉపయోగించారు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్ ప్రభుత్వం విదేశీ ప్రయాణ మార్గదర్శకాలను సవరించింది. ఆస్ట్రాజెనెకా టీకాకు భారత వెర్షన్ అయిన కోవిషీల్డ్‌ వ్యాక్సీన్‌.. ఆమోదం పొందిన టీకా అని వివరణ ఇచ్చింది.

అయితే, ఈ వ్యాక్సీన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ ఆ దేశానికి వెళ్లే భారతీయులు అక్కడ 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుందా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

బ్రిటన్ గత వారం కొత్త ప్రయాణ నిబంధనలు ప్రకటించింది. ఇవి అక్టోబర్ 4 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నిబంధన ప్రకారం వివిధ దేశాల నుంచి ఇంగ్లండ్ వచ్చేవారు రెండు డోసుల టీకా వేసుకుని ఉంటే పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది.

అయితే బ్రిటన్, ఆ జాబితాలో భారత్‌ను చేర్చలేదు.

అంటే బ్రిటన్‌కు వెళ్లే భారతీయులు కోవిషీల్డ్‌ వ్యాక్సీన్ రెండు డోసులు వేసుకున్నా కూడా అక్కడ సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాల్సి వస్తోంది. దేశంలో తిరగడానికి అనుమతి పొందే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, EPA

బ్రిటన్ తీరుపై నిరసనలు

బ్రిటన్ ప్రభుత్వ తీరుపై భారత్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి.

కోవిషీల్డ్‌.. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాకు భారత వెర్షన్. అయినా.. దాన్ని బ్రిటన్ గుర్తించకపోవడంపై భారత్‌లో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది వివక్షేనంటూ భారత్ ఆక్షేపించింది. వ్యాక్సినేషన్ పూర్తైన భారతీయులకు బ్రిటన్‌లో పది రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించాలని కోరింది.

భారత్‌లోని ప్రముఖులు బ్రిటన్ నిర్ణయాన్ని అత్యంత వివక్షపూరితమైన, జాత్యహంకార నిర్ణయంగా అభివర్ణించారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ ఈ అంశాన్ని బ్రిటన్ విదేశాంగ మంత్రి దగ్గర లేవనెత్తారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ చెప్పారు.

"వివక్షపూరిత విధానం వల్ల బ్రిటన్ వెళ్లే మా పౌరులపై ప్రభావం పడుతుంది. మా ఆందోళనలను బ్రిటన్ గుర్తించకపోతే, భారత్ కూడా అలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

అంటే భారత్ కూడా బ్రిటన్ నుంచి వచ్చేవారికి అలాంటి ఆంక్షలే విధించవచ్చు. ప్రస్తుతం భారత్ వచ్చే బ్రిటన్ ప్రయాణికులకు జ్వరం ఉందా అని పరీక్షిస్తున్నారు. కోవిడ్-19 పరీక్షలు చేస్తున్నారు. నెగెటివ్ వస్తే, వారు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.

"నిజానికి బ్రిటన్‌‌లో అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం విచిత్రంగా ఉంది. ఇది జాత్యహంకారాన్ని చాటుతోంది" అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

తన కొత్త పుస్తకాన్ని ప్రమోట్ చేయడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగే చర్చలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లాల్సిన కాంగ్రెస్ ఎంపీ, రచయిత శశి థరూర్ ఈ నిబంధనలకు నిరసనగా తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పారు.

"భారతీయులను మిగతావారికంటే తక్కువగా ఎందుకు చూస్తారు? పూర్తిగా టీకాలు వేసుకున్న భారతీయులు క్వారంటైన్‌లో ఉండాల్సిరావడం చాలా బాధాకరం. ఇతర దేశాల్లో అదే టీకా వేసుకున్న వారికి మాత్రం క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన లేదు" అని థరూర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, KALIPRASAD

ఫొటో క్యాప్షన్,

సీరం ఇన్‌స్టిట్యూట్, పుణె

పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆస్ట్రాజెనెకా నుంచి లైసెన్స్‌ తీసుకుని కోవిషీల్డ్ టీకా తయారు చేస్తోంది. పేద దేశాలకు టీకాలు అందించడంలో భాగంగా కోవాక్స్ స్కీమ్ కింద ఇది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో వివిధ ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని ఆ దేశాలకు లక్షల డోసుల వ్యాక్సీన్‌ను సరఫరా చేసింది.

భారత్‌లో తయారైన కోవిషీల్డ్ టీకా వేసుకున్న ప్రయాణికులకు "పెద్ద సమస్యలేవీ ఉండవని తాను నమ్మకంగా ఉన్నట్లు" బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జులైలో చెప్పారు.

బ్రిటన్ ఔషధ నియంత్రణ అధికారులు ఈ వ్యాక్సీన్ గణాంకాలను యూరోపియన్ యూనియన్ మెడిసిన్స్ ఏజెన్సీతో పంచుకున్నామని చెప్పారు.

"ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్ సరిగ్గా ఒకలాగే ఉన్నాయి" అని టీకా నిపుణులు ప్రొఫెసర్ ఆడమ్ ఫిన్ అన్నారు. కోవిషీల్డ్ టీకాను యూరోపియన్ యూనియన్‌లో 23 దేశాలు ఆమోదించాయి.

అయినప్పటికీ కోవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్న భారతీయులు తమ దేశం వస్తే పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని బ్రిటన్ ఆంక్షలు పెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images

నకిలీ టీకాల గురించి వచ్చిన వార్తలకు, ఈ చర్యలకు ఏదైనా సంబంధం ఉందా..?

భారత్, ఆఫ్రికాలో జులై, ఆగస్టు నెలల్లో కోవిషీల్డ్ నకిలీ టీకా డోసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వాటిని పంపిణీ నుంచి తొలగించారని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.

ఈ నియమాలకూ, ఫేక్ కోవిడ్ సర్టిఫికెట్లతో ఏమైనా సంబంధం ఉందా..

భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తీసుకొస్తున్న వాక్సినేషన్ సర్టిఫికెట్లు నిజమైనవేనా, కాదా అనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

టెలిగ్రామ్ ద్వారా 28 దేశాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతోందని ఈ నెల మొదట్లో అమెరికా సైబర్ సెక్యూరిటీ కంపెనీ 'చెక్ పాయింట్' తన నివేదికలో చెప్పింది. భారత్‌లో ఒక కోవిడ్ వ్యాక్సినేషన్ నకిలీ సర్టిఫికెట్ ధర రూ.5500 పలుకుతోందని పేర్కొంది.

టీకా ధ్రువీకరణ గుర్తింపు ప్రక్రియను విస్తరించడానికి తమ ప్రభుత్వం భారత్‌తో కలిసి పనిచేస్తోందని భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.

భారత సర్టిఫికెట్లలో క్యూఆర్ కోడ్ ఉంటుందని దాని ద్వారా వెరిఫై చేసుకోవచ్చని శశి థరూర్ చెబుతున్నారు.

మరోవైపు బ్రిటన్ వెళ్లే భారత ప్రయాణికులకు ఈ నిబంధనలు కలవరం కలిగిస్తున్నాయి. టీకా రెండు డోసులు వేయించుకున్నప్పటీకీ క్వారంటైన్‌లో ఉండాలనడంలో అర్థం లేదని వారు చెబుతున్నారు.

"వాళ్లు మన టీకాలపై ఎందుకింత వివక్ష చూపిస్తున్నారు. ఇవి మాపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. మా ఖర్చులు పెరుగుతున్నాయి" అని బ్రిటన్ వెళ్లి, అక్కడ ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్న ఒక విద్యార్థి తల్లి హేమా ఆనంద్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)