COP26: వాతావరణ మార్పులపై సదస్సులు బంగ్లాదేశ్‌లోని ఒక మహిళ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి?
- డేవిడ్ షుక్‌మాన్
- సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్

షోర్బాను ఖాతూన్
బంగ్లాదేశ్‌లోని గబురాలో నివసిస్తున్న ప్రజలంతా వాతావరణ మార్పుల వల్ల కలిగే అన్ని రకాల ముప్పులనూ ఎదుర్కొంటున్నారు.
అక్కడి తీర ప్రాంతంలో రక్షణ వ్యవస్థను తుపాన్లు ధ్వంసం చేస్తుంటాయి. సముద్ర మట్టం పెరుగుతుండటంతో ఉప్పు నీరు బావుల్లోకి, పొలాల్లోకి చేరుతోంది.
ప్రకృతి వైపరీత్యాలతో సతమవుతున్న దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి.
వాతావరణ మార్పుల వలన కలిగే ఏ దుష్ప్రభావాలను అడ్డుకోవడానికి గ్లాస్గోలో కాప్ 26 సదస్సును నిర్వహిస్తున్నారో వాటన్నింటినీ గబురా ప్రజలు ఇప్పటికే ఎదుర్కొంటున్నారు.
అలాగే పేద దేశాలకు ఆర్థిక సహాయం చేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానం 12 ఏళ్ల తరువాత కూడా ఎలా నెరవేరలేదో ఈ గ్రామం పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.
కాప్ 26 సదస్సులో ఇది ఒక కీలకాంశం.
ముఖ్యంగా షోర్బాను ఖాతూన్ అనే మహిళ కథ వింటే, వాతావరణ మార్పుల సంక్షోభాన్ని పరిష్కరించడంలో అంతర్జాతీయ ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయో తెలుస్తుంది.
కాప్ 26 అంటే ఏంటి? ఈ సదస్సు ఎందుకు?
నేను ఆమెను 2009లో కలిశాను. అప్పటికే ఒక తుపాను ఆ గ్రామాన్ని అతలాకుతలం చేసింది. సముద్రపు అలలు ఊర్లోకి చొచ్చుకొచ్చాయి. అనేకమంది నివాసాలు కోల్పోయారు.
షోర్బాను తన నలుగురు పిల్లలతో కలిసి ఒక తాత్కాలిక శిబిరంలో నివసిస్తున్నారు. ఒక ఎత్తైన, ఇరుకైన కొండపై ఉన్న ఈ శిబిరం దాదాపు 5,000 మందికి రక్షణ కల్పిస్తోంది.
సముద్రపు ఆటుపోట్లకు భూమి మీద వేసిన కరకట్టల మధ్య ఖాళీల్లోంచి ఉప్పునీరు ఊర్లోకి ప్రవహిస్తోంది.
వీలైనప్పుడల్లా ఆ గ్రామంలో పురుషులు ఖాళీలను మట్టితో నింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, వారి శ్రమ అంతా వృధా అవుతోంది.
ఫొటో సోర్స్, AFP
తాగు నీటి కోసం స్థానికుల కష్టాలు
బంగ్లాదేశ్ నుంచి డెన్మార్క్ వరకు ప్రయాణం
గబురా గ్రామ పరిస్థితిని, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అంతర్జాతీయ వేదికపై వివరించడానికి ఆక్స్‌ఫామ్ సంస్థ షోర్బానూకు ఒక అవకాశం ఇచ్చింది.
2009లో ఆమె బంగ్లాదేశ్ నుంచి డెన్మార్క్‌కు ప్రయాణించి కాప్-15 సదస్సులో పాల్గొన్నారు.
ప్రస్తుతం గ్లాస్గోలో జరుగుతున్న సదస్సులాంటిదే ఆ ఏడాది డిసెంబర్‌లో డెన్మార్ రాజధాని కోపెన్‌హాగన్‌లో జరిగింది.
ఇంత పెద్ద సదస్సులో పాల్గొనడం వలన మీకేం లభించింది? అని ఆమెను అడిగాను.
భవిష్యత్తుపై కోపెన్‌హాగన్ సదస్సు ఆశ కలిగించిందనే ఉద్దేశంతో 'హోపెన్‌హాగన్ ' అని ఆమె జవాబిచ్చారు.
"ఇంత పెద్ద పెద్ద వాళ్లను కలవడం బావుంది" అని ఆమె అన్నారు.
వారందరి ప్రసంగాలను వినే అవకాశం వచ్చినందుకు ఆమె ఉత్సాహంగా కనిపించారు.
ధనిక దేశాలన్నీ పేద దేశాలకు ఆర్థిక సహాయం చేస్తామని కోపెన్‌హాగన్‌లో వాగ్దానం చేశాయి.
వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కునేందుకు 2020 నాటికి, ఏడాదికి 100 బిలియన్ డాలర్లు (రూ. 7,46,055 కోట్లు) అందిస్తామని హామీ ఇచ్చాయి.
ఆ సమయంలో దాన్ని ఒక గొప్ప ప్రతిపాదనగా పరిగణించారు. తమ కష్టాలను, అవసరాలను పట్టించుకుంటున్నారన్న భావన అభివృద్ధి చెందుతున్న దేశాలకు కలిగింది.
కానీ 12 సంవత్సరాల తరువాత కూడా ఆ వాగ్దానం నెరవేరలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2023 వరకు అది నెరవేరేలా లేదు.
గబురాలో ఇళ్లు, చెరువుల చుట్టూ చేరిన వరద నీరు
'ఎక్కడ చూసినా నీళ్లే'
గబురా వాసులకు కొంత సహాయం అందిందిగానీ, అది కోపెన్‌హాగన్‌లో వాగ్దానం చేసినదానికి అనుగుణంగా లేదు.
పైగా వారికి అందిన ఆర్థిక సహాయంలో చాలా భాగం బంగ్లాదేశ్ నుంచి వచ్చినదే.
దాంతో మట్టి కరకట్టలను పటిష్టం చేసేందుకు ఇసుక బస్తాలు కొనుక్కోగలిగారు.
అయినప్పటికీ, భారీ తుపాన్లకు సముద్రపు నీరు లోపలికి చొచ్చుకువస్తుంటుంది.
ఒక కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించారు. తుపాను వచ్చినప్పుడు ఈ కాంక్రీటు భవనమే వారికి ఆశ్రయం కల్పిస్తుంది.
కానీ, సముద్ర మట్టం మిల్లీమీటర్ల చొప్పున పెరిగిపోతూనే ఉంది. ధృవాల దగ్గర మంచు కరిగిపోతుండడంతో సముద్ర మట్టాలు పెరుగుతూనే ఉన్నాయి.
దానివలన, స్థానిక బావుల్లో ఉప్పునీరు చేరిపోతోంది. మంచి నీరు దొరకడం కష్టమైపోతోంది.
"మా చుట్టూ నీళ్లే. కానీ, దానివలన మాకేమీ ఉపయోగం లేదు. మేం తీవ్ర సంక్షోభంలో ఉన్నాం" అని షోర్బాను చెప్పారు.
మంచి నీరు కావాలంటే ఒక మైలు దూరం పోవాలి. అక్కడ ఆక్స్‌ఫామ్ సంస్థ నిర్మించిన సోలార్ డీశాలినేషన్ ప్లాంట్ వద్ద తాగు నీరు లభిస్తుంది.
కానీ అక్కడకు చేరుకోవాలంటే మండుటెండలో నడుచుకుంటూ వెళ్లాలి. తిరిగి వచ్చేటప్పుడు మంచి నీళ్ల కుండ మోసుకుంటూ రావాలి.
అందువల్ల, చాలామంది సమీపంలో ఉన్న ఉప్పునీటినే వాడుతున్నారు. దాంతో చర్మ వ్యాధులు, ఇతర ఇంఫెక్షన్లు సోకుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.
మహిళలు తాగుతున్న నీటిలో ఉప్పు స్థాయిలు ఎక్కువగా ఉండడమే ఈ ప్రాంతంలో అధిక గర్భస్రావాలకు కారణమా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి.
అందమైన ఈ గ్రామం మునిగిపోతోంది.
44 ఏళ్ల షోర్బాను తీవ్ర విచారంలో కూరుకుపోయారు. ఆమెలో మునుపటి కన్నా ఎక్కువగా ఆందోళన, నిరాశ కనిపిస్తున్నాయి.
"ఏం చేయాలో మాకేం పాలుపోవట్లేదు. మాకు ఎవరైనా సహాయం అందిస్తే, పరిస్థితుల్లో కొంతైనా మార్పు రావొచ్చు. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు మా దగ్గర డబ్బుల్లేవు. నా పిల్లలకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు" అంటూ ఆమె వాపోయారు.
రొయ్యల ఫ్యాక్టరీలో షోర్బాను కొడుక్కి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. అక్కడ పొలాల్లోకి కూడా నీరు చేరుపోతుండడంతో చిన్న చిన్న మడుగులు ఏర్పడుతున్నాయి. దాని వలన రొయ్యల పెంపకం అభివృద్ధి చెందుతోంది.
కానీ, స్థానికంగా పండించే ఆహారానికి కొరత ఏర్పడుతోంది. దాంతో పోషకాహార లోపం సమస్య పెరుగుతోంది.
గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 సదస్సు నుంచి షోర్బాను ఏమి కోరుకుంటున్నారు?
ఎలాంటి తుపానుకైనా కూలిపోని ధృడమైన కరకట్టలు, తాగేందుకు మంచి నీరు.. ఇవే షోర్బానుతో సహా ఆ గ్రామ వాసులు కోరుకుంటున్న సౌకర్యాలు.
వీటన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచ నాయకుల మాటలు చేతల్లో కనిపించాలని ఆమె కోరుకుంటున్నారు.
"మేం చాలా కష్టాలు అనుభవించాం. మా పిల్లలు, మనుమలు ఇక ఈ బాధలు పడకూడదు" అని ఆమె అన్నారు.
డేవిడ్ షుక్‌మాన్ దాదాపు 20 సంవత్సరాలుగా వాతావరణ మార్పులపై నివేదికలు అందిస్తున్నారు. ఇది ఆయనకు 10వ కాప్ సదస్సు.
ఇవి కూడా చదవండి:
- చెట్లకు కారుతున్న 'బంగారం'
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- ప్రపంచానికి తెలియని ఇంద్రధనుస్సు దీవి, తినగలిగే పర్వతం
- COP26: ‘వాతావరణ మార్పులపై చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యత, చర్యలకు ఇవ్వట్లేదు’ - మోదీ
- ఆస్ట్రేలియాను అట్టుడికిస్తున్న హీట్ వేవ్
- కోకా కోలా: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ కాలుష్యాన్ని సృష్టిస్తోన్న కంపెనీ
- భారత పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’
- మనుషులు బతకలేనంతగా వేడెక్కిపోతున్న దేశం ఇది
- పాలస్తీనా ఎడారి కోటలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద చలువ రాతి చిత్తరువు’
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వీడియో, అందమైన ఈ ఊరిని సముద్రం మింగేస్తోంది
పర్యావరణ మార్పుల ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఊరు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఈ అందమైన గ్రామం సముద్రంలో మునిగిపోతోంది.