మియన్మార్: ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగేవారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- లారా ఒవెన్ , కో కో ఆంగ్
- బీబీసీ న్యూస్

నిర్బంధంలో మహిళల పై హింస
భద్రతా కారణాల రీత్యా ఇందులో కొందరి పేర్లను మార్చాం.
మియన్మార్‌లో నిర్బంధంలోకి తీసుకున్న మహిళలను హింసించి, లైంగికంగా వేధించినట్లు బాధితులు కొందరు బీబీసీతో చెప్పారు. ఈ ఏడాది మొదట్లో మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు సైన్యం అయిదుగురు మహిళలను నిర్బంధించింది. అయితే, అరెస్టు చేసిన తర్వాత నిర్బంధంలో తమను వేధించి, హింసించినట్లు ఆ మహిళలు ఆరోపించారు.
ఈ ఏడాది ప్రారంభంలో మియన్మార్‌లో సైన్యం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మహిళలు కూడా పెద్ధ సంఖ్యలో పాల్గొన్నారు.
మియన్మార్‌లో గతంలోనూ సైనిక నిర్బంధానికి గురైన మహిళలను హింసించిన ఘటనలు ఉన్నప్పటికీ ఈ సారి తిరుగుబాటు తర్వాత సైన్యం అరాచకాలు మరింత పెరిగాయని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.
మియన్మార్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలలో పాల్గొంటున్న 1,318 మంది పౌరులు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా సైన్యం చేతిలో మరణించారు. అందులో 93 మంది మహిళలున్నారని అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే స్వచ్చంద సంస్థ చెబుతోంది.
మరణించిన మహిళల్లో కనీసం 8మంది, నిర్బంధంలో ఉండగా మరణించారు. అందులో నలుగురు విచారణ కేంద్రంలో వారిపై జరిగిన హింస కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.
మొత్తం 10,200 మందికి పైగా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇందులో 2,000 మందికి పైగా మహిళలున్నారు.
నిర్బంధంలో మహిళల పై హింస
ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ‘ఈన్ సో మే’ ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. ఆమె అరెస్టైన తర్వాత మొదటి 10 రోజులు మియన్మార్‌లో హింసాత్మక విచారణ కేంద్రాలుగా పేరు పొందిన సెంటర్లలో ఉన్నారు. తనను లైంగికంగా వేధించి హింసించారని ఆమె ఆరోపిస్తున్నారు.
నిరసనలో పాల్గొనేందుకు ఒక రోజు ఉదయం ప్లకార్డులు తయారు చేస్తుండగా తనను అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కించినట్లు ఈన్ సో బీబీసీతో చెప్పారు.
"నన్ను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లేసరికి రాత్రి అయింది. నా కళ్లకు గంతలు కట్టి, విచారణ కోసం గదిలోకి తీసుకుని వెళ్లారు" అని ఈన్ సో చెప్పారు.
నిర్బంధించిన వారు తనను ప్రశ్నలు అడుగుతూ, వారికి నచ్చని సమాధానం చెప్పిన ప్రతిసారీ వెదురు కర్రతో కొట్టేవారని ఆమె చెప్పారు.
అంతేకాకుండా ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంటుంది’ అంటూ పదేపదే అడిగేవారని చెప్పారు. "ఇక్కడకు వచ్చే మహిళలను ఏం చేస్తామో మీకు తెలుసా? మేం వారిని రేప్ చేసి చంపేస్తాం" అని ఒక విచారణ అధికారి తనను బెదిరించినట్లు చెప్పారు.
ఆమె కళ్లకు గంతలు కట్టి లైంగికంగా వేధించారు. "నా ఒంటి మీదున్న టాప్‌ను బలవంతంగా కిందకు లాగి నా శరీరాన్ని తాకారు" అని ఆమె చెప్పారు.
ఆ తర్వాత తన కళ్లకు కట్టిన గంతలు తొలగించారని, అప్పుడే, ఒక సెక్యూరిటీ గార్డు తుపాకీలోంచి బులెట్‌ను బయటకు తీయడం చూశానని ఆమె చెప్పారు. తన కుటుంబ సభ్యుల వివరాలు అడిగారని, చెప్పడానికి నిరాకరించడంతో బులెట్లతో నిండిన తుపాకీని తన నోట్లో పెట్టినట్లు ఆమె చెప్పారు.
తాత్కాలిక నిర్బంధ కేంద్రాలు
మిలిటరీ బారక్‌లలోని గదులు, పాడుబడిన ప్రభుత్వ భవనాలను కూడా తాత్కాలిక విచారణ కేంద్రాలుగా మారుస్తారని హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశోధకురాలు మానీ మౌన్గ్ చెప్పారు. బీబీసీతో మాట్లాడిన ఒక న్యాయవాది కూడా మానీ చెప్పిన విషయాలతో ఏకీభవించారు. ఆమె తన పేరును వెల్లడించవద్దని కోరారు.
విచారణ సమయంలో లైంగిక వేధింపులు, హింసకు గురయిన బాధితుల తరఫున కేసులకు ఆమె ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు.
"నా క్లయింట్ ఒకరిని పొరపాటుగా నిర్బంధించి అరెస్టు చేశారు. అధికారులు ఆరోపణలు చేసిన వ్యక్తి ఆమె కాదని వివరించినా, మోకాళ్ల కింద ఇనుప కడ్డీలతో కొట్టి హింసించారు" అని ఆ న్యాయవాది చెప్పారు.
ఆ తరువాత ఆమెను విచారణ కేంద్రానికి పంపించారు. ‘నాతో పడుకుంటే నిన్ను విడుదల చేసేలా చూస్తాను’ అని అక్కడున్న సెక్యూరిటీ గార్డు ఆమెతో అన్నారని తన తరఫు న్యాయవాది వెల్లడించారు.
మియన్మార్‌లో న్యాయ వ్యవస్థ పారదర్శకంగా ఉండదని సదరు న్యాయవాది చెప్పారు. కొన్నిసార్లు న్యాయవాదులకు కూడా తాము శక్తిహీనులమనే భావన కలుగుతుందని చెప్పారు.
"మేం అరెస్టులను, విచారణలను సవాలు చేయాలని చూస్తాం. కానీ, ఇక్కడ జరిగే ప్రక్రియలన్నీ చట్టబద్ధంగా సాగుతాయని, విచారణ అధికారులకు ఆదేశాలున్నాయని వాళ్లు చెబుతుంటారు" అని తెలిపారు.
అయితే, ఈన్ సో చెప్పిన విషయాలను స్వతంత్రంగా నిర్ధరించడానికి అవకాశం లేదు. నిర్బంధంలో ఉన్న ఇతర మహిళలతో కూడా బీబీసీ మాట్లాడింది. వారు కూడా నిర్బంధ కేంద్రాల్లో తాము హింసకు, వేధింపులకు గురైనట్లు చెప్పారు.
"మూడు వేళ్లతో ఒక గంటపాటు సెల్యూట్ (ఇది మియన్మార్ లో నిరసన తెలిపేందుకు ఉపయోగించే గుర్తు) చేయమని ఒత్తిడి చేసేవారు. అలా చేయమంటూ అక్కడున్న సెక్యూరిటీ గార్డు నా జుత్తు పట్టుకుని గట్టిగా లాగేవారు" అని నిర్బంధంలో ఉన్న ఒక మహిళ బీబీసీతో చెప్పేవారు.
"కొంతమంది అమ్మాయిలను గదిలోంచి బయటకు తీసుకుని వెళ్లేవారు. కొందరు అమ్మాయిలు వెనక్కి వచ్చేసరికి వారి దుస్తులకున్న బటన్లు ఊడిపోయి, లేదా పూర్తిగా తెగిపోయి ఉండేవి" అని షీ పీ థార్ టౌన్ షిప్‌లో విచారణ కేంద్రానికి వెళ్లిన మరొక మహిళ చెప్పారు.
ఓ ఉద్యమకారిణి నిర్బంధానికి ముందు , తర్వాత
తప్పుడు సమాచారం
ఈన్ సో మే చెప్పిన విషయాలను మియన్మార్ సమాచార శాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ జా మిన్ టున్ దగ్గరకు తీసుకుని వెళ్లింది బీబీసీ. అయితే, సైన్యం ఎవరినీ వేధించి, హింసించలేదని, అది తప్పుడు సమాచారమని ఆయన కొట్టి పారేశారు.
ఈ ఏడాది మొదట్లో, మిలిటరీ నిర్బంధంలో ఉన్న ఒక మహిళ ఫోటోను ప్రసారం చేసింది. ఆమె ముఖం చూస్తే గుర్తు పట్టడానికి వీలు లేనంతగా దెబ్బ తింది. ఆ ఫోటో వైరల్ అయింది. ఆయుధాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆమె ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
అయితే, ఆమె ముఖానికి అయిన గాయాలను కనిపించకుండా ఎందుకు చేయలేదని జనరల్ జా మిన్ టున్ ను బీబీసీ అడిగింది. "అరెస్టులు చేసినప్పుడు ముఖాలను దాచిపెట్టి ఉంచడం సాధ్యం కాదు. వారిని నిర్బంధిస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించారు" అని ఆయన చెప్పారు.
ఒంటరిగా నిర్బంధం
ఈ వేధింపులు కేవలం రహస్య విచారణ కేంద్రాల్లో మాత్రమే జరగవు. యాంగూన్‌లోని ఇన్‌సీన్ జైలులో తనను 40 రోజులకు పైగా ఒంటరిగా నిర్బంధంలో ఉంచారని లిన్ అనే మహిళ బీబీసీకి చెప్పారు. ఆమె వయసు 50 ఏళ్లు.
సెల్‌లో ఒంటి మీద ధరించిన దుస్తులు తప్ప మరేమీ ఉండేవి కావని.. కనీసం అవసరమైన మందులు కూడా ఉండేవి కాదని లిన్ చెప్పారు.
నిర్బంధంలో ఉండగా ఆమె బలహీనంగా మారిపోయారు.
"నేను చీకట్లో పడుకుని చనిపోతానేమోనని అనుకుంటూ ఉండేదానిని. కొన్ని సార్లు పక్క సెల్‌ల నుంచి అరుపులు, ఏడుపులు వినిపించేవి. ఎవరిని కొడుతున్నారనోనని అనుకుంటూ ఉండేదానిని" అన్నారు లిన్.
ఒక రోజు తన సెల్‌లోకి కొంత మంది మహిళా ఆఫీసర్లతో కలిసి ఒక పురుష ఆఫీసర్ వచ్చారని లిన్ చెప్పారు. "వారు బయటకు వెళుతుండగా ఆ ఆఫీసర్ నన్ను వీడియో తీస్తూ ఉండటాన్ని చూశాను. నేనా విషయం గురించి ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు" అన్నారామె.
జైళ్లలో 100 మందికి సరిపోయే గదుల్లోకి 500 మందిని ఉంచేవారని లిన్ చెప్పారు. అందరూ ఒకేసారి నిద్రపోయేందుకు సరిపడే స్థలం లేక ఒకరి తర్వాత ఒకరు పడుకుంటూ ఉండేవారని మానవ హక్కుల పరిశోధకురాలు మానీ మౌన్గ్ వెల్లడించారు.
వారికి కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా లభించేవి కాదని, వారి ప్రాథమిక హక్కులను కూడా తిరస్కరించేవారని మౌన్గ్ అన్నారు. ఇలాంటి పరిస్థితులను షీ పీ థార్ విచారణ కేంద్రంలో ఉన్న మహిళ కూడా అనుభవించినట్లు ఆమె చెప్పారు,
"ఇటీవల విచారణ కేంద్రాల నుంచి విడుదలై వచ్చిన కొంత మంది మహిళలకు అయిన గాయాలు ఇంకా మానలేదు. నెలసరిలో ఉన్న మహిళలను నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు, వారు స్నానం చేసేందుకు ఏడు రోజుల వరకు అనుమతించలేదు’’ అని ఆమె చెప్పారు.
అక్టోబరులో క్షమాభిక్ష పెడుతూ విడుదల చేసిన 500 మంది ఖైదీల్లో ఈన్ సో మే కూడా ఉన్నారు. ఉద్యమం వల్ల తిరిగి అరెస్టు అవుతానేమోననే భయం కూడా ఆమెను వెంటాడుతోందని అన్నారు.
"నన్ను తిరిగి అరెస్టు చేసే అవకాశం ఉంది. నేను చనిపోతానేమో కూడా. కానీ, నా దేశం కోసం ఏదైనా చేయాలని ఉంది" అని ఆమె అన్నారు.
100 మంది మహిళలు... అంటే ఏంటి?
బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.
( #BBC100Women హ్యాష్‌ట్యాగ్ వాడి మీరూ ఈ చర్చలో భాగం కావొచ్చు.)
ఇవి కూడా చదవండి:
- ‘నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి.. ఆ పార్టీ ప్రముఖులతో నీకు సంబంధాలున్నాయి అంటూ వేధించారు’
- మోదీ నుంచి పుతిన్ ఏం కోరుకుంటున్నారు
- న్యూజీలాండ్‌పై 372 పరుగుల తేడాతో భారత్ విజయం
- దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు
- కోవిడ్‌తో యూరప్‌లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)