నేపాల్ బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా మాట్లాడేవారు... నేను వారికి అభ్యంతరం చెప్పలేకపోయేదానిని"

అసంఘటిత రంగంలో చిక్కుకుంటున్న బాల కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

రీటా (పేరు మార్చాం) నేపాల్‌లోని తన స్వగ్రామం నుంచి రాజధాని ఖాట్మండుకు వెళ్ళినప్పుడు, ఆమె తన పేదరికం అంతమైపోతుందని భావించారు.

రీటా గ్రామంలో తన తాగుబోతు తల్లి, తోబుట్టువులతో కలిసి ఉండేది. ఆమె తండ్రి పని కోసం మలేషియాకు వెళ్లిపోయి కుటుంబాన్ని విడిచిపెట్టేశారు.

"మొదట్లో ఆయన ఇంటికి డబ్బులు పంపేవారు. కానీ, నెమ్మదిగా డబ్బు పంపడం ఆపేశారు. మాకు భూమి కూడా లేదు. దాంతో, నేను 12 - 13 సంవత్సరాల వయస్సులో ఖాట్మండు వచ్చాను" అని రీటా చెప్పారు.

ఖాట్మండులో ఆమె రకరకాల పనులు చేశారు. మొదట్లో ఒక ఇటుకల ఫ్యాక్టరీలో, ఇళ్లల్లో గిన్నెలు తోమే పని, హోటళ్లలో, షాపుల్లో సహాయకురాలిగా పని చేశారు.

ఈ పనులకు ఆమెకు తగినంత డబ్బులు లభించేవి కాదు. పని మాత్రం నడుం విరిగిపోయేలా ఉండేది. పనిలో తోటి మగవారు ఆమెను తాకడానికి ప్రయత్నిస్తూ వేధించేవారని చెప్పారు.

14 సంవత్సరాలకు రీటాకు ఒక రెస్టారంట్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆమె రెస్టారంట్‌కు వచ్చిన అతిథులతో కలిసి కూర్చుని, తిని, తాగడం లాంటి పనులు చేయాలి.

"కొంత మంది కస్టమర్లు హుక్కా తాగేవారు. మద్యం సేవించేవారు" అని ఆమె గుర్తు చేసుకున్నారు.

"వాళ్ళు నా చేతులు పట్టుకుని అసభ్యంగా మాట్లాడేవారు. కానీ, నేను వారికి అభ్యంతరం చెప్పలేకపోయేదానిని. కొంత మంది నన్ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించేవారు. అలాంటప్పుడు టాయిలెట్‌కు వెళ్లాలని చెప్పి తప్పించుకుంటూ ఉండేదానిని" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్,

పగటిపూట బాల కార్మికులు.. రాత్రైతే...

ఆమె కథను చైల్డ్ లేబర్ యాక్షన్ రీసెర్చ్ ప్రోగ్రాం (క్లారిసా)కు వివరించారు.

రీటాను మద్యం సేవించమని బలవంతం చేస్తూ సెక్స్ కోసం కొంతమంది అద్దెకు తీసుకున్న గదులకు, గెస్ట్ హౌస్‌లకు తీసుకుని వెళ్లేవారు. అందుకు బదులుగా ఆమెకు డబ్బు ఇచ్చేవారని చెప్పారు.

దోపిడీకి గురవుతున్న కొన్ని వేల మంది నేపాలీ పిల్లల్లో రీటా ఒకరని ప్రచారకర్తలు చెబుతున్నారు.

ఇందులో కొంత మంది 11 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది దేశంలో ఉన్న అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్ కేంద్రాల్లో బాల కార్మికులుగా చిక్కుకుని ఉన్నారని అన్నారు.

బాల కార్మికుల గురించి చర్చకు వచ్చినప్పుడు మనం సాధారణంగా పెద్ద పెద్ద సంస్థలు, అంతర్జాతీయ సరఫరా చెయిన్‌లపై దృష్టిని కేంద్రీకరిస్తామని క్లారిసా డైరెక్టర్, సస్సెక్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్‌లో ప్రొఫెసర్ డ్యానీ బర్న్స్ అన్నారు.

కానీ, చిన్నచిన్న వ్యాపారాలు, కుటుంబ యాజమాన్యంతో నడిచే సంస్థల్లో బాల కార్మికులు అత్యంత హీనమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ బర్న్స్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్‌లో 5-17 సంవత్సరాల వయస్సులో ఉన్న 11 లక్షల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు. పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమైనప్పటికీ 2,20,000 మంది పిల్లలు ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్నారు.

బాలకార్మిక వ్యవస్థను అంతం చేయాలనే ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు అనుగుణంగా ఖాట్మండు కూడా 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. 2022 నాటికి హేయమైన పరిస్థితుల్లో పని చేస్తున్న బాల కార్మిక వ్యవస్థను అంతం చేస్తామని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేపాల్ మహిళా, శిశు, సీనియర్ సిటిజన్స్ శాఖ మంత్రి ఉమా రెగ్మి బీబీసీ నేపాల్‌కు చెప్పారు.

"మాకు సమయం చాలా తక్కువగా ఉంది. కానీ, 2022 నాటికి హేయమైన స్థితిలో ఉన్న బాల కార్మికులను ఆ పరిస్థితుల నుంచి తప్పించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తాం" అని ఆమె చెప్పారు.

అలా చేయాలంటే, నేపాల్ ముందు అసంఘటిత రంగంలో ఉన్న చిన్న వ్యాపారాలపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్ సెక్టర్‌పై దృష్టి సారించాలని ప్రచారకర్తలు అంటారు.

ఈ అడల్ట్ ఎంటర్టైన్‌మెంట్ రంగంలో పని చేస్తున్న సుమారు 400 మంది పిల్లల దగ్గర నుంచి వివరాలను సేకరించినట్లు క్లారిసాలో అధ్యయనకర్తగా పని చేస్తున్న ప్రగ్య లంశాల్ చెప్పారు.

"చాలా మంది పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఖాట్మండు వచ్చినవారే ఉన్నారు. వారిని అసంఘటిత రంగంలో ఉన్న కొంత మంది స్నేహితులు, బంధువులు, పొరుగువారు ఈ పనుల్లోకి చేరుస్తారు. అందులో చాలా మంది మసాజ్ పార్లర్లలో, డాన్స్ బార్లలో, గెస్ట్ హౌస్‌లు, లేదా ఆమోదయోగ్యం కాని రెస్టారంట్‌లలో పనులకు కుదురుతారు.

"చాలా మంది పిల్లలు పేద కుటుంబాల నుంచి లేదా విచ్చిన్నమైన కుటుంబ నేపధ్యాల నుంచి వస్తారు" అని నేపాల్‌లోని క్లారిసా హెడ్ సుధీర్ మళ్ల చెప్పారు.

వీళ్ళలో చాలా మందిని దొహోరీ రెస్టారెంట్లలో (జానపద సంగీతాన్ని ప్రచారం చేస్తామని చెప్పే సంస్థలు) పనులకు పెట్టుకుంటారు.

"ఇందులో కొన్ని మంచి సంస్థలు కూడా ఉన్నాయి. కానీ, నగరంలోని చీకటి సామ్రాజ్యంలో కొన్ని చోట్ల సెక్స్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వారు మద్యం సర్వ్ చేసేందుకు, టేబుళ్ల దగ్గర వెయిట్ చేసేందుకు, హుక్కా బార్లలో, మసాజ్ పార్లర్లలో పని చేసేందుకు వయసులో ఉన్న అమ్మాయిలను నియమించుకుంటూ ఉంటారు" అని ఆయన చెప్పారు.

"ఇలాంటివన్నీ సాధారణంగా బహిరంగంగా జరగవు. ఇళ్ల బేస్‌మెంట్‌లు, వీధి మూలల్లో, ప్రైవేటు అపార్ట్మెంట్‌లలో జరుగుతూ ఉంటాయి" అని చెప్పారు .

"ఈ సంస్థలు వ్యాపార నిర్వహణ కోసం చట్టప్రకారం వారి వ్యాపార, సిబ్బంది వివరాలను తెలియచేస్తూ అధికారికంగా నమోదు చేయడంతో పాటూ, తరచుగా వివరాలను పునరుద్ధరించుకుంటూ ఉండాలి. కొంత మంది వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో నమోదు చేసి, ఆ లైసెన్సును తిరిగి పునరుద్ధరించరు. అలా చేయని పక్షంలో వారికి పెద్దగా ప్రతికూల పరిణామాలేవీ ఉండవు. కొంత మంది అసలు సంస్థను నమోదు కూడా చేయరు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

దీంతో, ఇక్కడ పని చేసే పిల్లలకు పనికి సంబంధించి అధికారిక కాంట్రాక్టులేమి ఉండవు. వారు చేయాల్సిన పనికి సంబంధించిన వివరాలు ఎక్కడా పొందుపరచరు. వారికొక స్థిరమైన జీతం కూడా ఉండదు.

ఇక్కడెప్పుడూ తమను దోపిడీకి గురి చేసే పరిస్థితులు ఉండేవని ఇలాంటి ప్రదేశాల్లో పని చేసే బాలికలు, యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు చెప్పినట్లు లంశాల్ చెప్పారు.

రెస్టారంట్‌కు వచ్చిన అతిధులు ఎక్కువ బిల్లు చేస్తే, వారికొచ్చే టిప్‌లు కూడా ఎక్కువగానే ఉండేవని ఆ అమ్మాయిలు చెప్పారని ఆమె తెలిపారు.

"చాలా మంది చాలా చిన్న వయసులో ఉండటంతో పాటు, వారికి చదువు కూడా లేదు. చాలా సార్లు వారి కుటుంబాలు వీరు సంపాదించే ఆదాయం పైనే ఆధారపడటంతో వారికి మరో మార్గం ఉండేది కాదు. వారు దిక్కు లేని స్థితిలో అణచివేతకు గురయ్యే పరిస్థితిల్లోకి జారిపోతూ ఉండేవారు" అని తెలిపారు.

కోవిడ్ 19 వారి పరిస్థితిని మరింత దిగజార్చింది.

"ప్రభుత్వ ఆదేశాలతో మహమ్మారి సమయంలో పరిశ్రమ అంతా మూతపడింది. కానీ, కొంత మంది మరింత రహస్యంగా ఈ పనులు చేయడం మొదలయింది" అని చెప్పారు.

"పిల్లలు భయంకరమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం వచ్చేది. ఇది వారి జీవనోపాధికి సంబంధించిన అంశం. వారు ఇంటద్దెలు కట్టాలి, తిండి తెచ్చుకోవాలి, కొన్ని సార్లు మొత్తం కుటుంబాన్ని పోషించాలి" అని చెప్పారు.

"కోవిడ్ అభివృద్ధిని వెనక్కి మళ్లించింది. బాల కార్మికులతో సతమవుతున్న ఏ దేశమూ 2025 నాటికి ఈ వ్యవస్థను అంతం చేయలేదు" అని ప్రొఫెసర్ బర్న్స్ అన్నారు.

"కొంత కాలం పాటూ ఈ వ్యవస్థ అంతమయ్యే పరిస్థితులు కనపడ్డప్పటికీ, గత ఒకటిన్నర సంవత్సరాలుగా మాత్రం బాల కార్మిక సమస్య ఉన్న దేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది" అని ఆయన అన్నారు.

"దీర్ఘకాలంలో దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న పిల్లలను బయటకు తేవడం చాలా కీలకమైన విషయం. కానీ, ఆకలి కారణంగా ఈ పనులను చేసే పిల్లలు ఉంటూనే ఉంటారు. అందుకే, ముందుగా వారి పని పరిస్థితులను మెరుగు పరిచేందుకు చూడాలి.

అదే ఇప్పుడు వారికి చేయగలిగిన ఉత్తమమైన పని" అని అన్నారు.

దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న పిల్లలను రక్షించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఉమా రెగ్మి చెప్పారు.

అవసరమైన వారు హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా తమను సంప్రదించవచ్చని చెప్పారు.

"ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్న పిల్లల గురించి తెలుసుకునేందుకు మేము వివిధ సంస్థలను సంప్రదిస్తున్నాం" అని ఆమె చెప్పారు.

"ఒకసారి వారి గురించి వివరాలు సేకరించిన తర్వాత గృహ మంత్రిత్వ శాఖతో కలిసి చట్ట వ్యతిరేకంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న వారిని బాధ్యులను చేసి శిక్షిస్తాం" అని చెప్పారు.

వీడియో క్యాప్షన్,

బాలికలను ఇంటర్నెట్‌లో ఎలా వేధిస్తారో బట్టబయలు చేశారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)