ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఎవరు? నోబెల్ ప్రైజ్ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలు ఏంటి?

ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఎవరు? నోబెల్ ప్రైజ్ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలు ఏంటి?

The merchant of death is dead… అంటే 'ప్రజల చావులతో వ్యాపారం చేసే బిజినెస్‌మ్యాన్ చనిపోయాడు.'

ఇవాళ ప్రపంచమంతా రోజూ మాట్లాడుకునే ఒక పదానికి మూలమైన ఒక వ్యక్తి గురించి దాదాపు 130 ఏళ్ల కిందట ఫ్రెంచ్ పత్రికలు రాసిన హెడ్‌లైన్స్ ఇవి. అదీ బతికుండగానే. ఆయనే ఆల్‌ఫ్రెడ్ నోబెల్. ఈ పేరు కొందరికి కొత్తగా ఉండొచ్చు కానీ ఆయన వల్ల పుట్టుకొచ్చిన నోబెల్ ప్రైజ్ తెలియని వాళ్లు మాత్రం దాదాపుగా ఉండరు. నోబెల్ ప్రైజ్ ప్రారంభమై నేటికి సరిగ్గా 120 ఏళ్లు అవుతోంది. 1901 డిసెంబరు 10వ తేదీన తొలి నోబెల్ పురస్కారాలను అందించారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ చనిపోయింది కూడా ఈ రోజునే.

ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఎవరు?

బహుముఖ ప్రజ్ఞశాలి... ఏకకాలంలో అనేక అంశాలలో నైపుణ్యం కలిగి ఉన్న వాళ్లను ఇలా అంటూ ఉంటారు కదా. ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ అందుకొక చక్కని ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఆయనొక ఇంజినీర్, పరిశోధకుడు, బిజినెస్‌మ్యాన్... అంతేకాదు.. కొత్త కొత్త వాటిని కనిపెట్టేవ్యక్తి కూడా. అలాగే ఆరు భాషల్లో చేయి తిరిగిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. 1833లో స్వీడన్‌లో పుట్టిన నోబెల్, చిన్న నాటి నుంచే సైన్స్‌పై అమిత ఇష్టాన్ని పెంచుకున్నారు.

1850లలో పారిశ్రామిక విప్లవం నడుస్తున్నది. పెద్దపెద్ద రాజ్యాలు, దేశాలు... వనరుల కోసం వలసలు పెంచుకుంటున్న కాలమది. ఆధిపత్య పోరుతో నిత్య యుద్ధాలతో ఆయుధాలకు డిమాండ్ బాగా పెరుగుతున్న రోజులవి. అలా సైన్యానికి అవసరమైన ఆయుధాలను, పేలుడు పదార్థాలను నోబెల్ కుటుంబం తయారు చేస్తూ ఉండేది. దాంతో సహజంగానే ఆయనకు ఎక్స్‌ప్లోజివ్స్‌పైన ఆసక్తి పెరిగింది. శక్తిమంతమైన పేలుడు పదార్థాలపై పరిశధోనలు చేస్తూ చివరకు 1867లో డైనమైట్‌ను ఆవిష్కరించారు ఆల్‌ఫ్రెడ్ నోబెల్. ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచిపోయింది డైనమైట్. నిర్మాణ రంగం, గనులు, యుద్ధాల్లో దాని వాడకం విపరీతంగా పెరిగిపోయి అది ప్రపంచగతినే మార్చివేసింది.

నోబెల్ ప్రైజ్‌ను ఎందుకు ప్రారంభించారు?

ఆయుధాలు, ఆయిల్ వంటి వ్యాపారాల ద్వారా విపరీతంగా లాభాలు సంపాదించారు నోబెల్. తన సంపదలోని మెజారిటీ భాగాన్ని పక్కన ఉంచిన ఆయన, దాని మీద వచ్చే వడ్డీని... మనుషులకు అత్యంత మేలు చేసే ఆవిష్కరణలకు పంచాల్సిందిగా, చనిపోయే ముందు తన వీలునామాలో రాశారు. అలా పుట్టుకొచ్చిందే నోబెల్ ప్రైజ్. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ చనిపోగా... ఆ తరువాత అయిదు సంవత్సరాలకు అంటే 1901లో తొలిసారి నోబెల్ ప్రైజ్‌ను పకటించారు.

ఈ ప్రైజ్ పుట్టుక వెనుక చిన్న కథ కూడా ఉంది. 1888లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ సోదరుడు ఫ్రాన్స్‌లో చనిపోగా, నోబెల్ మరణించినట్లు పొరపాటుపడ్డాయి నాటి ఫ్రెంచ్ పత్రికలు. ప్రజల చావులతో వ్యాపారం చేసిన బిజినెస్‌మ్యాన్ చనిపోయాడని ఆ పత్రికలు రాశాయి. ఈ రాతలు నోబెల్‌ను చాలా బాధపెట్టాయని, దాంతో తాను చనిపోయిన తరువాత ప్రపంచం తనను మానవాళికి మేలు చేసిన గొప్ప వ్యక్తిగా గుర్తుంచుకోవాలనే కోరికతో నోబెల్ ప్రైజ్‌ను స్థాపించినట్లు కొందరు చెబుతుంటారు.

నోబెల్ ప్రైజ్ చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి?

నోబెల్ ప్రైజ్‌తోపాటు దాన్ని ప్రారంభించిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌పైనా విమర్శలు, వివాదాలున్నాయి. తన జీవితకాలమంతా కొత్తకొత్త పేలుడు పదార్థాలు కనిపెట్టి, వాటిని ఆయా దేశాలకు అమ్ముకొని అంతులేని లాభాలు ఆర్జించిన నోబెల్, యుద్ధాలలో ఎంతో మంది చావుకు పరోక్షంగా కారణమయ్యారని విమర్శించే వారున్నారు.

ఇక నోబెల్ బహుమతుల విషయానికొస్తే... ప్రైజ్ కమిటీ, మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల ప్రతిభను పెద్దగా గుర్తించడం లేదనే వాదనలున్నాయి. ఈ వాదనలను బలపర్చే లెక్కలు కూడా ఉన్నాయి. 1901 నుంచి 2021 వరకు గమనిస్తే... 947 మందికి నోబెల్ ప్రైజ్ ఇవ్వగా... ఇందులో మహిళ సంఖ్య 58 మాత్రమే. నోబెల్ పొందిన 28 సంస్థలను కూడా కలిపితే, ఇప్పటి వరకూ మొత్తం 975 బహుమతులు అందాయని నోబెల్ ఫౌండేషన్ వద్ద ఉన్న లెక్కలు చెప్తున్నాయి. ఇక శాంతి, సాహిత్యం వంటి విభాగాల్లో రాజకీయ కోణాలతోపాటు యూరప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా వలసపాలనకు వ్యతిరేకంగా తమ రచనల ద్వారా గళమెత్తిన ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, ఏషియన్ సాహిత్యకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదనే వాదనలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతులకు సంబంధించి కొన్ని స్పష్టమైన విమర్శలున్నాయి. ఉదాహరణకు, 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ అప్పటికే ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు.. నోబెల్ ప్రైజ్‌ను స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో...అమెరికా చేసేవి న్యాయమైన యుద్ధాలని గర్వంగా చెప్పుకోవడమే కాకుండా, తమ యుద్ధాలను బలంగా సమర్థించుకున్నారు బరాక్ ఒబామా. ఇక మరో ఉదాహరణ ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్. ఆయనకు 2019లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఆ దేశంలో టిగ్రే ప్రాంతంలో మొదలైన తిరుగుబాటును అణచివేసేందుకు తాను స్వయంగా యుద్ధరంగంలో అడుగుపెడతానని ప్రకటించడం ద్వారా ఇటీవల ఆయన వార్తల్లో నిలిచారు.

విమర్శల సంగతి ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా నోబెల్ ప్రైజ్‌కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ గెలిస్తే 100 కోట్లు ఇస్తామని గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి ఉన్నారు కూడా. అదీ దానికున్న క్రేజ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)