ఇమ్రాన్ ఖాన్ నిర్ణయంతో పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశం కాదని అంగీకరించినట్లయిందా
- సహర్ బలోచ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, GETTY IMAGES
'పాకిస్తాన్ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. అమెరికా ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటే, పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమని స్పష్టం చేసినట్లు ఉండేది'
ఇదీ కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
మారుతున్న పాకిస్తాన్ ముఖచిత్రం, ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ తన విదేశాంగ విధానాన్ని విస్తరించాలిగానీ కుదించకూడదని నిపుణులు అంటున్నారు.
డిసెంబర్ 9,10 తేదీలలో ప్రజాస్వామ్యంపై ఒక వర్చువల్ కాన్ఫరెన్స్‌ను అమెరికా నిర్వహించింది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా 110 దేశాలను ఆహ్వానించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్.
పశ్చిమ దేశాలతో పాటు భారత, పాకిస్తాన్‌లకు కూడా ఆహ్వానం అందింది. అయితే, ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్ నిరాకరించింది.
"భవిష్యత్తులో మరోసారి మరో సదస్సులో కలిసి పాలుపంచుకోగలమని" ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ సదస్సుకు చైనా, రష్యా, బంగ్లాదేశ్‌తో సహా మరికొన్ని దేశాలకు ఆహ్వానం అందలేదు.
చైనా ఒత్తిడి మేరకే పాకిస్తాన్ ఈ సదస్సులో పాల్గొనకూడదనే నిర్ణయం తీసుకుందని, అది తెలివితక్కువ చర్య అని విశ్లేషకులు అంటున్నారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
'ఐరన్ బ్రదర్'
అమెరికా సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించిన నేపథ్యంలో, పాకిస్తాన్‌ను 'ఐరన్ బ్రదర్ ' గా అభివర్ణిస్తూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చావో లిజియాన్ ట్వీట్ చేశారు.
చైనాకు నాయకత్వం వహించడానికి బీజింగ్‌కు బదులుగా తైవాన్‌ను అమెరికా ఆహ్వానించింది. దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ సదస్సులో పాల్గొంటే చైనాతో సంబంధాలు చెడిపోతాయని పాకిస్తాన్ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
"పాకిస్తాన్ నిర్ణయం సరైనదే. అది మంచి ఉద్దేశంతోనే తీసుకున్న నిర్ణయం. అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలను చైనా కోణం నుంచి ఎందుకు చూడాలి? ఈ సదస్సుకు హాజరైన వారందరూ నిజంగా ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నారా అన్నది పాకిస్తాన్‌కు వచ్చిన సందేహం" అని పాక్ మాజీ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి అన్నారు.
అమెరికా, చైనాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం.. పాకిస్తాన్ విదేశాంగ విధానం
అమెరికా, చైనాల మధ్య ఇటీవల కాలంలో పెరుగుతున్న ప్రచ్ఛన యుద్ధాన్ని సూచిస్తూ, "పాకిస్తాన్ ఎలాంటి ప్రచ్ఛన్న యుద్ధ కూటమిలోనూ భాగం కాబోదని" ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు వేదికలపై చెప్పారు.
"ప్రపంచం అనేక వర్గాలుగా విడిపోవడానికి ఇది దారితీస్తుంది. ఏ వర్గంలోనూ భాగం కాకూడదన్నదే పాకిస్తాన్ ప్రయత్నం" అని ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కాన్‌క్లేవ్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఫొటో సోర్స్, MINISTRY OF FOREIGN AFFAIRS
'ఈ సదస్సుకు హాజరు కాకుండా పాకిస్తాన్ తప్పు చేసింది'
"ఈ సదస్సులో పాల్గొనకుండా పాకిస్తాన్ తప్పు చేసిందని" కాయద్ ఎ ఆజం యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ ఫర్హాన్ సిద్ధిఖీ అభిప్రాయపడ్డారు.
"పాకిస్తాన్ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. అమెరికా ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటే, పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమని స్పష్టం చేసినట్లు ఉండేది."
పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం, సైనిక నియంతృత్వం రెండూ కలిసి ఉంటాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. అందుకే దాన్ని 'హైబ్రిడ్ పాలన' అంటారు.
ఈ నేపథ్యంలో అమెరికా ఆహ్వానించిన సదస్సులో పాల్గొని ఉంటే పాకిస్తాన్ పూర్తి ప్రజాస్వామ్య దేశంగా పేరు పొంది ఉండేదన్నది ఫర్హాన్ సిద్ధిఖీ అభిప్రాయం.
"చైనాను నియంతృత్వ దేశంగా అమెరికా పరిగణిస్తోంది. అందుకే ఈ సదస్సుకు చైనాను ఆహ్వానించలేదు. ఇది పాకిస్తాన్‌కు మేలు చేయదు. సమస్యలను పెంచుతుంది" అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, అమెరికాల మధ్య దౌత్యపరమైన అంతరాలు పెరుగుతున్నాయి
గత ఏడాది కాలంగా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పాకిస్తాన్, అమెరికాల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్నాయని నిపుణులు అంటున్నారు.
బైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టాక ఇమ్రాన్ ఖాన్‌కు స్వయంగా ఫోన్ చేయకపోవడం, తాలిబాన్లపై, వారికి మద్దతిచ్చే దేశాలు, సంస్థలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా సెనేట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం మొదలైన విషయాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు వీగిపోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ అమెరికన్ ఫోరమ్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో మాట్లాడుతూ, "అఫ్గానిస్తాన్‌లో అమెరికా మిషన్ ముగిసింది కాబట్టి పాకిస్తాన్, అమెరికాలు తమ సంబంధాలను ఉగ్రవాదాన్ని అంతం చేయడానికే పరిమితం చేయకుండా మరింత విస్తృతపరచాలని" అన్నారు.
అయితే, "పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు ఏర్పరచుకునేందుకు అమెరికా ఎదురుచూడట్లేదని" అమెరికా దౌత్యవేత్త, విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ వెండీ షర్మన్ ఆ తరువాత నిర్మొహమాటంగా చెప్పారు.
మరోవైపు, "తాము నిర్వహిస్తున్న సదస్సుకు పాకిస్తాన్‌ను ఆహ్వానించిందంటే అమెరికా ఇప్పటికీ పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి మొగ్గు చూపిస్తున్నట్లే. అమెరికా ఒక అడుగు ముందుకు వేసింది కాబట్టి పాకిస్తాన్ కూడా ఒక అడుగు ముందుకు వేయాలి" అని ఫర్హాన్ సిద్ధిఖీ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
సదస్సుకు హాజరు కాకపోవడం పాకిస్తాన్‌కు భారంగా మారనుందా?
బైడెన్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుతో అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అవిశ్వాసానికి తెరపడుతుందన్న ఆశ ఉందని విశ్లేషకులు అమీర్ రానా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే, ఇప్పుడు పాకిస్తాన్ ఆ సదస్సుకు వెళ్లకపోవడంతో ఈ ఆశలకు గండి పడినట్టేనా?
"తమ దేశంలో అమెరికా పెట్టుబడులు పెట్టాలని పాకిస్తాన్ భావిస్తే, తమ విదేశాంగ విధానాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే, అమెరికా నిర్వహించే సదస్సులకు గైర్హాజర్ కాకుండా ఉండడం మంచిది" అని ఫర్హాన్ సిద్ధిఖీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆ దేశాన్ని అప్పుల్లో ముంచిందా
- 26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్‌లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్‌లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
- పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈవో అయితే, పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? సుష్మా స్వరాజ్ వీడియోను ఎందుకు ట్వీట్ చేస్తున్నారు?
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
- వరదలు, కరవును తట్టుకునే వ్యవసాయం ఇదీ..
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ఉత్తరాఖండ్‌లో ఒకటి తర్వాత మరొకటిగా గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?
- ఈ పక్షి మాంసం కామోద్దీపన కలిగిస్తుందా? అరబ్ షేక్‌లు దీన్ని వేటాడేందుకు పాకిస్తాన్ వస్తున్నారా, మరి నజీమ్‌ను ఎవరు చంపారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)