భారత్‌‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి

కామ్ ఎయిర్

ఫొటో సోర్స్, @FMAMUNDZAY

తాలిబాన్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనమై సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గానిస్తాన్‌కు భారత్ మానవతా సాయంగా పంపిన వైద్య సామగ్రి మొదటి కన్‌సైన్‌మెంట్ ఆ దేశానికి చేరుకుంది.

అష్రఫ్ ఘనీ పాలన ముగిసిన తర్వాత ఆ దేశానికి భారత్ నుంచి అందిన మొదటి మానవతా సాయం ఇది.

దిల్లీ నుంచి నేరుగా కాబూల్ వెళ్తున్న అఫ్గాన్ ఎయిర్‌లైన్స్ కామ్ ఎయిర్‌లో 1.6 మెట్రిక్ టన్నుల వైద్య సామగ్రిని భారత్ అఫ్గానిస్తాన్‌కు పంపింది.

అఫ్గానిస్తాన్ ఆరోగ్య శాఖ భారత్ అందించిన సాయాన్ని స్వాగతించింది. కానీ, దేశంలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు తమకు మరింత సాయం అవసరమని చెప్పింది.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఆ దేశానికి పంపిన తొలి మానవతా సాయం ఇదే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అఫ్గానిస్తాన్‌ ఆరోగ్య శాఖకు భారత్ కొంత వైద్య సామగ్రిని విరాళంగా అందించింది.

"మేం దీనిని ప్రశంసిస్తున్నాం. మిగతా దేశాలు కూడా అఫ్గానిస్తాన్‌కు సాయం అందించేలా ముందుకు రావాలని అపీల్ చేస్తున్నాం" అని అఫ్గానిస్తాన్ స్థానిక చానల్ టోలో న్యూస్‌తో మాట్లాడిన ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావిద్ హజీర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మందులతోపాటూ భారత్ అఫ్గానిస్తాన్‌కు 5 లక్షల కరోనా టీకా డోసులు కూడా పంపించింది.

భారత్‌లో అఫ్గానిస్తాన్ రాయబారి ఫరీద్ మాముంద్‌జయీ ఒక ట్వీట్ ద్వారా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

"తమకు చెడు చేసిన వారికి కూడా మంచి చేసేవారే మహాత్ములు. ఈ సంక్షోభ సమయంలో అఫ్గానిస్తాన్‌లోని చిన్నారులకు వైద్య సహాయం అందించిన భారత్‌కు ధన్యవాదాలు. భారత్-అఫ్గాన్ స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది" అన్నారు.

"దేశంలో పిల్లలందరికీ ఒక చిన్న సాయం, ఒక చిన్న ఆశ, తమపై నమ్మకముంచే ఎవరైనా కావాలి. భారత్ పంపిన వైద్య సామగ్రికి సంబంధించిన మొదటి కన్‌సైన్‌మెంట్ ఉదయం కాబూల్ చేరుకుంది. ప్రాణాలు కాపాడే 1.6 మెట్రిక్ టన్నుల మందులు ఈ సంక్షోభ సమయంలో ఎన్నో కుటుంబాలకు సాయం చేస్తాయి. ఇది భారత ప్రజల తరఫున అఫ్గానిస్తాన్‌కు అందిన బహుమతి" అని ఆయన మరో ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

మానవతా సాయమే, తాలిబాన్లకు గుర్తింపు లేదు

అయితే, భారత్ పంపించిన వైద్య సామగ్రి మానవతా సాయంలో భాగం మాత్రమే. భారత్ తాలిబాన్ల ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. భారత్ తమ మానవతా సాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల ద్వారా అఫ్గానిస్తాన్‌లో ఉన్న ఆస్పత్రులకు పంపుతోంది.

తాలిబాన్ల మానవహక్కుల రికార్డ్, భద్రతా స్థితిపై ఉన్న అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపునిచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్ గతంలో అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.

ద హిందూ రిపోర్ట్ ప్రకారం భారత విదేశాంగ శాఖ కామ్ ఎయిర్ విమానంలో 1.6 మెట్రిక్ టన్నుల వైద్య సామగ్రితోపాటూ 10 మంది భారతీయులు, 94 మంది మైనారిటీ సమాజాలకు చెందిన వారు కూడా కాబూల్ వెళ్లినట్లు తెలుస్తోంది.

భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

"అఫ్గానిస్తాన్‌లో సవాలుగా నిలిచిన మానవీయ పరిస్థితి దృష్ట్యా భారత ప్రభుత్వం దిల్లీ నుంచి కాబూల్ వెళ్తున్న విమానంలో వైద్య సామగ్రితోపాటూ మానవతా సాయాన్ని కూడా పంపింది. ఈ మందులను కాబూల్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు అందిస్తారు. నగరంలోని ఇందిరాగాంధీ చిల్డ్రన్ హాస్పిటల్లో వీటిని ఉపయోగిస్తారు" అని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters

భారత్ తరఫున బహుమతి

మానవతా సాయంగా పంపిన వైద్య సామగ్రి ఉన్న అట్ట పెట్టెలపై "భారత ప్రజల తరఫున అఫ్గానిస్తాన్ ప్రజలకు బహుమతి" అనే స్టిక్కర్లు అంటించారు.

శనివారం పంపించిన ఈ సాయంతో అఫ్గాన్‌కు మానవతాసాయం అందించిన ఇరాన్, ఖతార్, యూఏఈ, తుర్కెమినిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల జాబితాలో భారత్ చేరింది.

"కఠిన శీతాకాలంలో అఫ్గాన్ పౌరులకు మానవతా సాయం, వైద్య సామగ్రిని చేర్చాలంటే, ఆ దేశం వరకూ ఎలాంటి అడ్డంకులూ, నియంత్రణలూ లేని మార్గం ఉండాలి" అని సెప్టెంబర్ 13న విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ ఒక ప్రసంగంలో డిమాండ్ చేశారు.

తాలిబాన్లు ఆగస్టు మధ్యలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కాబూల్ విమానాశ్రయం నిర్వహణ, దేశంలోని ఆస్పత్రుల్లో అవసరమైన మందుల సరఫరా కోసం తాలిబాన్ పాలకులు అంతర్జాతీయ సాయం కోరుతున్నారు.

ఈ ఏడాది ఆగస్టులో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత భారత్ మొదటిసారి అఫ్గానిస్తాన్‌కు మానవతా సాయం అందించింది.

ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అడుగు. ఎందుకంటే రాబోవు రోజుల్లో భారత్ నుంచి అఫ్గానిస్తాన్‌కు భారీ స్థాయిలో మానవతా సాయం అందబోతోంది. ఈ సాయం పాకిస్తాన్ మీదుగా అఫ్గానిస్తాన్ వరకూ చేరుకోనుంది.

ఫొటో సోర్స్, Getty Images

దీనిలో భాగంగా భారత్ అఫ్గానిస్తాన్‌కు 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు పంపించబోతోంది. వాటిని పాకిస్తాన్ గుండా అఫ్గాన్ ట్రక్కుల్లో తీసుకెళ్లడానికి పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది.

కానీ, భారత్ ఈ గోధుమలను అఫ్గానిస్తాన్ ట్రక్కుల్లో లేదంటే తమ ట్రక్కుల్లో సరఫరా చేస్తామని షరతు పెట్టింది. మొదట పాకిస్తాన్ దీనికి ఒప్పుకోలేదు. కానీ, ఆ తర్వాత అది అఫ్గానిస్తాన్ ట్రక్కుల్లో వాటిని సరఫరా చేయడానికి అనుమతి ఇచ్చింది.

భారత్ అందించే ఈ సాయం వాఘా బోర్డర్ మీదుగా పాకిస్తాన్‌ పంజాబ్ చేరుతుంది. అక్కడి నుంచి వాటిని ఖైబర్ పంఖ్తుంఖ్వా తోర్‌ఖమ్ వరకూ తీసుకెళ్తారు. ఇది అఫ్గాన్ ప్రాంతంలోని నంగర్‌హార్ సరిహద్దుల్లో ఉంటుంది.

భారత్ తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వదని, అయితే రెండు దేశాల మధ్య వైద్య, విద్యా, ఇతర అంశాల్లో సంప్రదింపులు కొనసాగే అవకాశం ఉందని ఇంతకు ముందు రిపోర్టులు వచ్చాయి.

ఆగస్టులో తాలిబాన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్నప్పుడు, ఆ దేశంలో అస్థిరత ఏర్పడడంతో భారత్ 'ఆపరేషన్ దేవీ శక్తి' ద్వారా మొత్తం 669 మందిని అఫ్గానిస్తాన్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.

వీరిలో 488 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా రకరకాల ప్రాజెక్టుల్లో పనిచేస్తూ అక్కడ చిక్కుకుపోయారు. వీరితోపాటూ 206 మంది అఫ్గాన్ ప్రజలను కూడా అప్పుడు భారత్ తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)