వ్లాదిమిర్ పుతిన్: 'రహస్యంగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశా'

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పుతిన్ (2010 నాటి ఫైల్ ఫొటో)

సోవియట్ యూనియన్ 1991లో విచ్ఛిన్నం అవ్వడం గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆదాయం కోసం తాను టాక్సీ డ్రైవర్‌గా పనిచేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

సోవియట్ యూనియన్ పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్ల, రష్యన్లు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది.

ఈ విచ్ఛిన్నాన్ని పుతిన్ చారిత్రక రష్యా పతనంగా అభివర్ణించారు.

మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశమైన ఉక్రెయిన్ పట్ల ఆయన ఉద్దేశాలకు సంబంధించిన ఊహాగానాలకు తాజా వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి.

ఉక్రెయిన్‌తో సరిహద్దులో రష్యా 90 వేలకు పైగా బలగాలను మోహరించింది. దీంతో రష్యా దాడి చేయాలని యోచిస్తున్నట్లు భయాందోళనలు చెలరేగాయి.

కానీ వీటిని రష్యా ఖండించింది. తూర్పువైపు నాటో విస్తరణకు వ్యతిరేకంగా హామీ కోరడంతో పాటు ఉక్రెయిన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

ఆదివారం ప్రసారమైన 'రష్యా' అనే డాక్యుమెంటరీ చిత్రంలో పుతిన్ తాజా వ్యాఖ్యలు చేశారు.

''సోవియట్ యూనియన్ అనే పేరుతో చారిత్రక రష్యా విచ్ఛిన్నం జరిగింది. ఆ తర్వాత, రష్యా మరింత విచ్ఛిన్నం కావడానికి కొంత సమయమే పడుతుందని పశ్చిమ దేశాలు నమ్మాయి'' అని పుతిన్ అన్నారు.

ఈ పతనాన్ని ఒక విషాదంగా పుతిన్ భావించడం అందరికీ తెలిసిందే. కానీ, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న వ్యక్తిగత ఇబ్బందుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కొత్తవి.

''కొన్నిసార్లు, నేను అదనంగా డబ్బు సంపాదించాల్సి వచ్చింది. అంటే ఒక ప్రైవేట్ కారుకు డ్రైవర్‌గా పనిచేసి కొంత అదనంగా డబ్బు సంపాదించాను. నిజంగా చెప్పాలంటే దీని గురించి మాట్లాడటం వెగటుగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు అలా జరిగింది'' అని ఆయన అన్నారు.

ఆ సమయంలో రష్యాలో టాక్సీలు అరుదుగా ఉండేవి. కొంతమంది అంబులెన్స్‌లను టాక్సీలుగా ఉపయోగించుకునేవారు.

పుతిన్, సోవియట్ సెక్యూరిటీ సర్వీస్ 'కేజీబీ' మాజీ ఏజెంట్ అనే సంగతి అందరికీ తెలుసు.

1990 దశకం ప్రారంభంలో సెయింట్ పీటర్స్‌బర్గ్ మేయర్ అనటోలీ సోబ్‌చాక్ కార్యాలయంలో పుతిన్ పనిచేశారు. యూఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛిన్నానికి దారితీసిన, సోవియట్ అధ్యక్షుడు మిఖైల్ గోర్బచెవ్‌కు వ్యతిరేకంగా 1991 ఆగస్టులో జరిగిన తిరుగుబాటు తర్వాత కేజీబీ నుంచి తప్పుకున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.

అనధికార క్యాబ్‌ల వాడకం

ప్యాట్రిక్ జాక్సన్, బీబీసీ న్యూస్

ఒక రాత్రి, డిపోకు వెళ్తోన్న బస్సులో ఎక్కాను. కానీ నేను ఆంబులెన్స్‌లో ప్రయాణించడాన్ని మాత్రం నిరాకరించారు. 1990ల్లో రష్యాలో అంబులెన్స్‌లను టాక్సీలుగా వాడటం పెరిగిపోయింది. అప్పట్లో మాస్కోలో నాకు తెలిసిన ప్రతీ రష్యన్ యువకుడు వాటిని ఉపయోగిస్తున్నట్లు అనిపించింది. ముఖ్యంగా మోటార్‌ వెహికిల్ ఉన్న ప్రతీ రష్యన్ కుటుంబీకుడు అనధికార క్యాబ్‌లను రాత్రివేళల్లో రహస్యంగా నడిపేవారని అనిపించింది. ఈ అనధికార క్యాబ్‌లను బొంబిలా (బాంబర్) అని పిలిచేవారు.

1989లో నేను చదువుకుంటోన్న రోజుల్లో కేవలం రెండు నియమాలే ఉండేవి. ఈ రెండూ కూడా అధికారికంగా రాసిపెట్టిన నిబంధనలు కావు. అందులో 1. ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్న కారులో ఎక్కవద్దు. 2. బయలుదేరే ముందే చార్జీలను మాట్లాడుకోవడం. అప్పట్లో తగినన్ని అధికారిక టాక్సీలు ఉండేవి కావు.

1991లో యూఎస్‌ఎస్ఆర్ విచ్ఛిన్నం అయినప్పుడు, దాని రూబెల్ విలువ కోల్పోయినప్పుడు ఈ అనధికార మార్కెట్ పుట్టగొడుగుల్లా పెరిగిపోయింది.

సందర్భానుసారంగా అప్పుడప్పుడు నేను డ్రైవర్లతో జ్ఞానాత్మకమైన చర్చలు జరిపేవాడిని. కానీ తరచుగా నిశ్శబ్ధంగా నా ప్రయాణాలు సాగేవి. నేను పాశ్చాత్యుడిని అయిన కారణంగా నా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయొచ్చు అని డ్రైవర్లు గ్రహించేవారేమో! లేక, తాము అనుకున్న జీవితాలను విడిచిపెట్టి, దానికి బదులుగా బోంబింగ్ ద్వారా సంపాదిస్తున్నామని వారు సిగ్గుపడి నాతో మాట్లాడకుండా ఉండిపోయారేమో...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)