నల్లులు కుడితే ఏమవుతుంది, వాటిని ఎలా నిర్మూలించాలి? 80 ఏళ్ల తర్వాత అవి ఎందుకు తిరిగొస్తున్నాయి?
- ప్రొఫెసర్ లూక్రెసియా అకోస్టా సోటో, ప్రొఫెసర్ ఫెర్నాండో జార్జ్ బోర్నే లినారెస్
- ది కన్వర్సేషన్

ఫొటో సోర్స్, Getty Images
నల్లులు వేల సంవత్సరాల పాటు మన ఇళ్లలోనే నివసించాయి. మానవులతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 5 మి.మీ పరిమాణంలో ఎర్రటి-గోధుమ రంగులో ఉండే ఈ చిన్న పురుగులు పరాన్నజీవులు.
ఇవి మనిషి రక్తాన్ని పీల్చడంతో పాటు ఆహారం కోసం కోళ్లు, గబ్బిలాలు, ఎలుకల వంటి జంతువులపైనా ఆధారపడతాయి.
సాధారణంగా వీటిని 'బెడ్ బగ్స్' అని పిలుస్తారు. ఇందులో మానవులపై ప్రభావం చూపే రెండు జాతులు ఉంటాయి. 1. సిమెక్స్ లెక్చలేరియస్- ఇవి ప్రపంచంలో అన్నిచోట్లా ఉంటాయి. 2. సి.హెమప్టెరస్- ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ నల్లుల వల్ల ప్రజారోగ్యానికి అనేక ఇబ్బందులు కలిగాయి. డీడీటీ వంటి క్రిమిసంహారక మందులను 1940, 1950లలో విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఇవి దాదాపు అంతమయ్యాయి.
కానీ ఇటీవలి సంవత్సరాలలో ఇవి నాటకీయంగా వృద్ధి చెందాయి. పురుగు మందులకు వాటిలో నిరోధకత పెరగడం, మనుషుల జీవనశైలిలో మార్పుల వల్ల ఇలా జరిగి ఉంటుందని చెప్పొచ్చు.
వీడియో: పేలు ఎలా వ్యాపిస్తాయి?
1. నల్లులు కుడితే ఏమవుతుంది?
నల్లులు రక్తాన్ని పీల్చేటప్పుడు, అది గడ్డకట్టకుండా నిరోధించేందుకు వాటి లాలాజలాన్ని లోపలికి పంపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల కొందరికి ఎలాంటి రియాక్షన్లు ఉండవు. కానీ కొందరిలో తీవ్రమైన అలర్జీలను కలిగిస్తాయి. ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఏర్పడే దద్దుర్ల వంటివి నల్లి కాటు వల్ల కూడా ఏర్పడతాయి.
నల్లులు కుట్టడం వల్ల 1 సెం.మీ పరిమాణంలో ఉండే దద్దుర్లుతో పాటు దురద, మంట కలుగుతాయి. శరీరంపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా ముఖం, చేతులు, మెడపై దాడి చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి.
దురద కారణంగా తరచుగా రుద్దడం వల్ల ఏర్పడే గాయాలు ఇన్‌ఫెక్షన్లుగా మారతాయి. ఇవి తీవ్రంగా మారి, చికిత్స చేయడం కూడా కష్టమవుతుంది.
ఇవి బాధితులకు మానసిక క్షోభను కలిగిస్తాయి. వారు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.
ఫొటో సోర్స్, Getty Images
2. నల్లులు ఉన్నట్లు గుర్తించడమెలా?
నల్లులు కుట్టిన తొమ్మిది రోజుల తర్వాత చర్మంపై గాయాలు, వాటి తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి బయటపడటానికి చాలా రోజులు పడుతుంది.
నల్లి కుట్టినట్టు అనుమానం వస్తే, ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా గోడ పగుళ్లలో, పరుపులపై, ఫర్నీచర్‌ను నిశితంగా గమనించాలి.
అక్కడ కనిపించే ఆనవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలి.
- అవి దాక్కునే ప్రాంతాల్లో నల్లటి మచ్చలు ఉంటాయి.
- పరుపులపై, బెడ్‌షీట్లపై తుప్పులాంటి ఎరుపు రంగు మరకలు ఏర్పడుతుంటాయి.
- నల్లుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దుర్వాసనతో పాటు వాటి మ్యూకస్ స్రావాలు కనిపిస్తుంటాయి.
నల్లుల ఉనికిని ఇలా నిర్ధారించవచ్చు
- రాత్రివేళల్లో నల్లులు చురుగ్గా ఉంటాయి. ఆ సమయంలో అవి కనబడుతుంటాయి.
- పాలిపోయిన పసుపు రంగులో ఉండే శరీరం పైపొరను నల్లులు వదిలివేస్తుంటాయి.
- పొదిగిన లేదా పొదగని గుడ్లు కనబడతాయి.
3. నల్లులు కుడితే ఏం చేయాలి?
దురదను తగ్గించడానికి వెంటనే చికిత్స తీసుకోవడంతో పాటు ఇన్‌ఫెక్షన్ సోకకుండా పరిశుభ్రతను పాటించాలి. చాలా మందికి ఇది సరిపోతుంది. కాకపోతే, దురద లేదా లక్షణాలు తీవ్రంగా ఉంటే ప్రత్యేక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
తీవ్రమైన లక్షణాలు కనిపించిన వారు కార్టికోస్టెరాయిడ్స్, యాంటీహిస్టామైన్స్ లేదా యాంటీబయాటిక్స్ వాడాల్సి రావొచ్చు. వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వేసుకోవాలి.
4. నల్లులు ఎక్కడ నుంచి వస్తాయి?
ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల సంఖ్య పెరిగిపోతోంది. వాటి నియంత్రణ కష్టమవుతోంది. ఇళ్లు, పక్షి గూళ్లు, గబ్బిలాల గుహలు వంటివి నల్లులకు మంచి ఆవాసాలుగా ఉన్నాయి. ఈ ఆవాసాల్లో నల్లులకు వెచ్చని ఆశ్రయం లభించడంతో పాటు వాటికి ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది.
ఇళ్ల గోడల్లోని పగుళ్లు, ఫర్నీచర్, వాల్ పేపర్ల వెనకాల, చెక్క పలకలు లేదా ఫొటోలు, దుప్పట్లు, పరుపుల కింద నల్లులు దాక్కుంటాయి. వీటికి నిశాచర లక్షణాలు ఉంటాయి. కాబట్టి పగటిపూట దాక్కొని, రాత్రివేళల్లో ప్రజలు నిద్రిస్తోన్న సమయాల్లో యాక్టివ్‌గా మారతాయి.
హోటళ్లు, ఎక్కువగా అతిథులు వస్తూ పోతూ ఉండే ఇళ్లు, ఆసుపత్రుల్లో ఇవి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
5. నల్లులను నిర్మూలించడం చాలా కష్టం, ఎందుకు?
నల్లులు ఆహారం లేకుండా ఆరు నెలల వరకు జీవించగలవు. మనుషులను కుట్టకుండా 12 నెలల వరకు బతకగలవు.
ఇళ్లలో తేమ అధికంగా ఉండటం, గాలి ప్రసరణ లేకపోవడం, అపరిశుభ్రత, గృహోపకరణాల నిల్వ తదితర కారకాల వల్ల మన ఇళ్లు నల్లులకు ఆవాసాలుగా మారుతుంటాయి.
అంటువ్యాధుల గురించి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలతో ప్రజలు కీటకాల నియంత్రణ విధానాలు పాటించడం లేదు. దీనివల్ల అవి పునరుజ్జీవం పొందడంతో పాటు నిరోధకతను సంపాదిస్తున్నాయి.
6. వాటిని ఎలా నివారించవచ్చు?
నల్లుల నివారణకు ఉత్తమమైన మార్గం ఏంటంటే, ముందుగానే వాటి ప్రవేశాన్ని నిరోధించడం. నల్లులు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం మొదటి మెట్టు. కానీ ఇటీవలి కాలంలో నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రులు, క్రూయిజ్ షిప్స్, సినిమా హాళ్లు, సబ్ వే, విమానాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వాటిని నివారించడానికి పరిశుభ్రత ఒక్కటే సరిపోదు.
వాటిని నియంత్రించాలంటే, ముందుగా మనం నల్లులు ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. ఇంట్లో తయారు చేసిన మందులను వాటిపై ఉపయోగించకూడదని చెబుతుంటారు. వాటి వాడకం వల్ల నల్లులు అప్రమత్తమై ఇళ్లలోని ఇతర ప్రదేశాలను వెతుక్కుంటాయి. వీటిని నివారించడానికి, కీటకాల నివారణ నిపుణులతో ఒకటికి రెండుసార్లు ఇంటిని శుద్ధి చేయించడం ముఖ్యమని చాలా సందర్భాల్లో తేలింది.
నల్లుల నియంత్రణ కోసం పైరిత్రిన్స్, పైరేథ్రాయిడ్స్, డెసికాంట్స్ (బోరిక్ యాసిడ్), బయో కెమికల్ సబ్‌స్టాన్సెస్ (వేప నూనె), పైరోల్స్ నియోనికోటికోనాయిడ్స్ (నికోటిన్ సింథటిక్ రూపాలు), కీటకాల పెరుగుదల నిరోధించే మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇళ్లలో పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలంటే... ఫర్నీచర్ లేదా సీలింగ్‌లలో ఉండే పగుళ్లను మూసివేయడం, 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పరుపులను శుభ్రం చేయడం లాంటివి చేయాలి.
నల్లులు పెద్ద సంఖ్యలో ఉంటే మాత్రం పురుగు మందులను తప్పనిసరిగా వినియోగించాలి. పరుపులు, ఫర్నీచర్ వంటి వాటిని పూర్తిగా తడి లేకుండా ఆరిన తర్వాతే వినియోగించాలి.
ఒకసారి నల్లులను పూర్తిగా తొలిగించాక మళ్లీ అవి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ ఫర్నీచర్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ హ్యాండ్ వస్తువుల్లో దాక్కొని ఉండే ఈ నల్లులు మళ్లీ ఇళ్లంతా వ్యాపించి కొత్త ప్రదేశాల్లో వాటి జనాభాను వృద్ధి చేస్తాయి.
(లూక్రెసియా అకోస్టా సోటో, ఫెర్నాండో జార్జ్ బోర్నే లినారెస్‌లు మిగ్యుల్ హెర్నాండేజ్ యూనివర్సిటీలో పారాసిటాలజీ ప్రొఫెసర్లు)
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి: అసలేం జరుగుతోంది?
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్
- ప్రధాని మోదీ ప్రారంభించనున్న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలేంటి
- భారత్‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
- చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చారు.. పగలు రెక్కీ, అర్థరాత్రి దోపిడీ
- మధులిక రావత్: సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షురాలు
- ‘నా కళ్లతో నేను ఒక్క వ్యక్తినే చూశా.. ఆయన కాలిపోతున్నారు’ - బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం ప్రత్యక్ష సాక్షి
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- తిరుపతి: 2015లో కుండపోత వర్షాలు పడినా రాని వరదలు ఇప్పుడెందుకొచ్చాయి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)