క్యాన్సర్ చికిత్స తరువాత సెక్స్ సమస్యలు వస్తాయా? కెమికల్ మెనోపాజ్ అంటే ఏమిటి
- అలైస్ ఎవాన్స్
- న్యూస్‌బీట్ రిపోర్టర్

ఫొటో సోర్స్, Getty Images
కైట్ వీల్డే
కైట్ వీల్డే, 17 ఏళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో ఆమె లైంగిక జీవితంపై ప్రభావం పడింది.
క్యాన్సర్ చికిత్స తర్వాత ఆమె సన్నిహిత సంబంధానికి సిద్ధపడినప్పుడు నొప్పి, అసౌకర్యం, అవమానం కలిగాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎలాంటి సహాయం పొందాలో ఆమెకు తెలియలేదు.
మాంచెస్టర్‌కు చెందిన కైట్, 'అక్యూట్ మైలాయిడ్ లుకేమియా' అనే ఒక రకమైన రక్త క్యాన్సర్ బారినపడ్డారు.
క్యాన్సర్‌కు ముందు తన సెక్స్ లైఫ్ బాగుండేదని కైట్ చెప్పారు. కానీ క్యాన్సర్ వచ్చాక సెక్స్ ప్రమాదకరంగా మారవచ్చని కీమోథెరపీ సందర్భంగా డాక్టర్లు తనకు చెప్పారని ఆమె తెలిపారు.
తమ లైంగిక జీవితంపై క్యాన్సర్ ప్రతికూల ప్రభావం చూపిస్తోందని ఆ వ్యాధి బారిన పడిన 46 శాతం మంది యువత చెప్పినట్లు మెక్‌మిలన్ క్యాన్సర్ సపోర్ట్ పరిశోధనలో వెల్లడైంది.
యూకే క్యాన్సర్ రీసెర్చ్ తాజా డేటా ప్రకారం, బ్రిటన్‌లో ఏటా 15 నుంచి 24 ఏళ్ల మధ్యనున్న వారిలో దాదాపు 2,400 మందికి క్యాన్సర్ నిర్ధరణ అవుతోంది.
రొమ్ము క్యాన్సర్ సోకిన తర్వాత బిడ్డకు జన్మనివ్వొచ్చా?
క్యాన్సర్ చికిత్స వల్ల కైట్‌లో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోయింది. శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య ఉండాల్సిన స్థాయిలో లేనప్పుడు... లైంగిక చర్యలో సాధారణంగా కలిగే చిన్న చీలిక, పగులు ఏర్పడితే రక్తం గడ్డకట్టదు. రక్తస్రావం అవుతూనే ఉంటుంది.
''నాకు చాస్టిటీ బెల్ట్ పెట్టినట్లుగా అనిపించేది'' అని న్యూస్‌బీట్‌తో కైట్ చెప్పారు.
క్యాన్సర్ చికిత్స వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో కైట్ పోరాడారు. కీమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోవడం, బరువులో హెచ్చుతగ్గులు, ఎముకల్లో నొప్పి తదితర ఇబ్బందులు కలిగేవి.
దీంతో ఆమె తన కాలేజీ స్నేహితులు, డేట్‌కు వెళ్తుంటే వారిని చూసి అసూయపడేవారు.
కీమోథెరపీ సమయంలో సెక్స్ పట్ల ఆమె ఆసక్తి కోల్పోయారు. కానీ ఎముక మజ్జ మార్పిడి చికిత్స విజయవంతమయ్యాక ఆమెలో మళ్లీ లైంగిక జీవితంపై ఆసక్తి మొదలైంది.
ఒక రాత్రి తన భాగస్వామితో లైంగికంగా కలిసే ప్రయత్నం చేసినప్పుడు ఆమెకు నొప్పితో పాటు అసౌకర్యం కలిగింది.
' నా మనస్సు విరిగిపోయింది'
కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్స కారణంగా ఆమె శరీరం కెమికల్ మెనోపాజ్ స్థితిలోకి వెళ్లినట్లు అప్పుడు ఆమెకు తెలియదు.
మెనోపాజ్‌లో వచ్చే అనేక లక్షణాల్లో 'వెజినల్ అట్రోఫీ' ఒకటి. దీని వల్ల వెజైనా సన్నగా, పొడిగా మారడంతో లైంగిక చర్య ఇబ్బందిగా మారుతుంది.
చికిత్స వల్ల శరీరంలో ఇలాంటి మార్పులు కలుగుతాయని ఆమెను ఎవరూ హెచ్చరించలేదు.
''నేను అనుకున్నంత సరదాగా అయితే అది లేదు'' అని కైట్ చెప్పారు.
క్యాన్సర్ సోకిన తల్లులు తమ బిడ్డకు పాలివ్వచ్చా?
అందరిలాగే, తాను కూడా డేటింగ్‌కు సిద్ధమయ్యానని ఆమె భావించేలోగానే ఈ చెడు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయారు. ఇక తాను రిలేషన్‌షిప్ కొనసాగించాలనుకునే వ్యక్తులతో 'లైంగిక చర్య'లో పాల్గొనలేనని చెప్పడం ప్రారంభించారు.
''ఒక విధంగా నేను కుంగిపోయాను. నాకు అవమానంగా కూడా అనిపించింది'' అని ఆమె చెప్పుకొచ్చారు.
సిగ్గు కారణంగా తన చేదు అనుభవం గురించి కొన్ని నెలల పాటు ఆమె ఎవరికీ చెప్పలేదు.
కానీ, చివరకు తన అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం ఆమెకు లభించింది. తాను చికిత్స పొందిన ఆసుపత్రికి చెందిన ఒక నర్స్... మహిళల ఆరోగ్యానికి సంబంధించిన క్లినిక్‌ను ఏర్పాటు చేశారు.
అక్కడ కైట్‌కు కావాల్సిన మద్దతుతో పాటు సలహాలు సూచనలు లభించాయి.
''ఆ అపాయింట్‌మెంట్ అనంతరం నేను చాలా ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చాను. నేను ప్రతిదాన్ని మళ్లీ కొత్తగా తెలుసుకోవాల్సి వచ్చింది'' అని కైట్ చెప్పారు.
ఫొటో సోర్స్, JACK FIELDING
జాక్ ఫీల్డింగ్ (కుడి), ఆయన సన్నిహితుడు లియామ్ (ఎడమ)
'నాకు చాలా అసహ్యం వేసింది'
జాక్ ఫీల్డింగ్‌కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆయన 'ఎంపీఎన్‌ఎస్‌టీ' అని పిలవబడే ఒక రకమైన సార్కోమాతో బాధపడ్డారు. దీని నుంచి కోలుకున్నాక, ఆరోగ్య సిబ్బందిని లైంగిక జీవితానికి సంబంధించిన సలహాలను అడగాలంటే 'చాలా ఇబ్బందికరంగా, అసహ్యకరంగా' భావించారు.
బోల్టన్‌కు చెందిన జాక్, 2019లో చికిత్స సందర్భంగా శారీరక బరువుతో పాటు జుట్టును కోల్పోయారు. వాటితో పాటు 'తనను తాను కూడా కోల్పోయానని' జాక్ భావించారు.
''నా ఆత్మ గౌరవం చాలా దెబ్బతింది. నన్ను నేను దాదాపు ఏలియన్‌లా భావించాను. అద్దంలో నా ముఖం చూసుకోలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో మరొకరి ముందు నగ్నంగా, సన్నిహితంగా మెలగడమనేది నాకు చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే నాకు అప్పుడు చాలా అసహ్యంగా అనిపించింది'' అని న్యూస్‌బీట్‌తో 26 ఏళ్ల జాక్ చెప్పారు.
క్యాన్సర్ వల్ల వ్యక్తుల లైంగిక జీవితం చాలా రకాలుగా ప్రభావితం అవుతుందని 'మాక్‌మిలన్ క్యాన్సర్ సపోర్ట్' పేర్కొంది.
క్యాన్సర్ వల్ల కలిగే ఉద్వేగాలతో సెక్స్ పట్ల అనాసక్తి ఏర్పడుతుంది.
చికిత్స కారణంగా అలసట వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు కలుగుతాయి.
అందం పరంగా చూస్తే జుట్టు ఊడిపోవడం, అధిక బరువు లేదా బరువు తగ్గడం, మచ్చలు ఏర్పడతాయి.
దీర్ఘకాలిక సమస్యలైన శక్తి తగ్గిపోవడం, లైంగిక అంశాల పరంగా శరీరంలో మార్పులు రావడం జరుగుతాయి.
ఫొటో సోర్స్, CAIT WILDE
కైట్ వీల్డే
''ఎన్‌హెచ్‌ఎస్‌లలో సైకోసెక్సువల్ థెరపీ అందించే వనరులు సరిపడినంత లేవు. కాబట్టి ఈ అంశంలో సహాయం పొందాలనుకునే చాలా మంది ప్రజలు డబ్బులు చెల్లించి సేవలు పొందుతున్నారు'' అని కరోలిన్ లావోట్ అన్నారు.
హెల్త్ సర్వీస్ నియమించిన సైకోసెక్సువల్ థెరపిస్టుల చిన్న బృందంలో కరోలిన్ ఒకరు.
''వయోజన దశలో ఉన్నవారికే లైంగిక జీవితపు శ్రేయస్సు గురించి ఆలోచించడం చాలా కష్టం. అలాంటిది క్యాన్సర్‌తో బాధపడుతోన్న టీనేజర్లకు ఇది మరింత ఒంటరితనాన్ని కలిగిస్తుంది'' అని ఆమె చెప్పారు.
యూకేలో స్పెషలిస్టు థెరపీ అనేది చాలా అస్పష్టంగా ఉందని డాక్టర్ రిచర్డ్ సిమ్‌కాక్ అంగీకరించారు.
''కైట్, జాక్ లాంటి వ్యక్తులు ఎదుర్కొంటోన్న సమస్యలకు పరిష్కారం అందుబాటులో ఉండదు. కాబట్టి ఎక్కువ మంది నిపుణులను వీటికి కేటాయించడం మంచిది. సున్నితత్వంతో కూడిన అలాంటి అంశాలకు సరైన పరిష్కారాలు చూపే విధంగా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాధితులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి'' అని మాక్‌మిలన్ క్యాన్సర్ సపోర్ట్ క్లినికల్ అడ్వైజర్, క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ రిచర్డ్ అభిప్రాయపడ్డారు.
క్యాన్సర్ బాధితులకు లైంగిక పరమైన సలహాలు, సూచనలు, సమాచారాన్ని మెరుగుపర్చడం కోసం కైట్ ఒక క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న ఇతర యువతతో కలిసి వారి లైంగిక జీవితపు స్టోరీలపై మ్యాగజైన్‌ను తెచ్చేందుకు కృషి చేశారు.
''ఇందులో కాస్త ఎక్కువ సమాచారమిచ్చాం. కానీ ఇవన్నీ మా సొంత అనుభవాలు. నిజాయతీగా ఉండేలా ప్రజల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం. నాలాగా, ప్రజలు చీకట్లో మగ్గిపోకూడదు అనుకుంటున్నా'' అని కైట్ చెప్పుకొచ్చారు.
కేన్సర్ రోగులకు జట్టు దానం చేసిన బాలిక
ఇవి కూడా చదవండి:
- నల్లులు కుడితే ఏమవుతుంది, వాటిని ఎలా నిర్మూలించాలి? 6 ప్రశ్నలు - సమాధానాలు
- కశ్మీర్: ఆత్మీయుల మృతదేహాల కోసం ఇప్పటికీ వేచి చూస్తున్న కుటుంబాలు
- వ్లాదిమిర్ పుతిన్: 'రహస్యంగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశా'
- ‘డ్యూటీ నుంచి తిరిగొస్తున్న పోలీసుల బస్సుపై కాల్పులు జరిపి చీకట్లో పారిపోయారు’
- జూమ్ కాల్లో ఒకేసారి 900 మందిని ఉద్యోగంలోంచి తీసేసిన బాస్
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- రిజర్వేషన్లు పదేళ్లు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా
- హామ్ట్రాక్: ముస్లింలు పాలిస్తున్న అమెరికా నగరం
- విశాఖలో ఈ చిన్నారి విగ్రహాన్ని ముందుకొస్తున్న సముద్రం మింగేస్తుందా? -ఫోటో ఫీచర్
- ‘నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి.. ఆ పార్టీ ప్రముఖులతో నీకు సంబంధాలున్నాయి అంటూ వేధించారు’
- మోదీ నుంచి పుతిన్ ఏం కోరుకుంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)