Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

లైవ్ రిపోర్టింగ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. ప్రపంచవ్యాప్తంగా 18,72,073 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో 9,352.. తెలంగాణలో 592.. ఏపీలో 439

    కరోనావైరస్ తాజా సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    * ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి 10 గంటల సరికి 18,72,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,16,098 మంది ఈ వైరస్ బారినపడి మరణించారు.

    * భారత్‌లో 9,352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 324 మంది మరణించారు.

    * ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 439కి పెరిగింది. ఏడుగురు మరణించారు.

    * తెలంగాణలో సోమవారం ఒక్క రోజే 61 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 592కి, మృతుల సంఖ్య 17కి పెరిగింది.

  2. తెలంగాణలో 592 పాజిటివ్ కేసులు.. 17 మంది మృతులు

    తెలంగాణలో సోమవారం కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 592కి, మృతుల సంఖ్య 17కి పెరిగింది.

    ఇప్పటివరకు రాష్ట్రంలో 103 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    కరోనా కేసులు
  3. ఏపీలో కొత్తగా ఏడుగురికి కరోనా పాజిటివ్.. 439కి పెరిగిన కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో గుంటూరులో 3, నెల్లూరులో 4 కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 439కి పెరిగింది. ఇప్పటివరకు ఏడుగురు మరణించారు.

    కరోనా కేసులు
  4. పుదుచ్చేరిలో లాక్‌డౌన్ పొడిగింపు

    పుదుచ్చేరిలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఈ మేరకు మంత్రిమండలి ఆమోదం పలికిందని ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ప్రకటించారు.

    View more on twitter
  5. కరోనావైరస్: దేశంలో 9,352 పాజిటివ్ కేసులు, 324 మంది మృతులు

    దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,352కి చేరింది..

    ఇందులో 980 మందికి వ్యాధి నయం కాగా 324 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ప్రస్తుతం 8,048 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లోనే 51 మంది మరణించడంతో మృతుల సంఖ్య 324కి చేరింది.

    కరోనా
  6. తెలంగాణలో కొత్తగా 32 పాజిటివ్ కేసులు

    తెలంగాణలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షించారు.

    ఎక్కువ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నందున హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

    హైదరాబాద్ నగరాన్ని 17 జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా చేపట్టి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.

    తెలంగాణలో మొత్తం 246 కంటెయిన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశామని, అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 126 కంటెయిన్మెంట్ జోన్లు ఉన్నాయని అధికారులు చెప్పారు.

    కరోనా
  7. ప్రధాని మోదీకి సోనియా లేఖ

    లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ఆహార భద్రతకు భరోసా కల్పించే చర్యలను సూచిస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు.

    కేంద్రం ఇప్పటికే జాతీయ ఆహారభద్రత చట్టం కింద ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి వ్యక్తికీ 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతించిన ఆమె దీనికి అదనంగా మరో మూడు నెలల పాటు రేషన్ కార్డు లేకున్నా ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని సూచించారు.

    View more on twitter
  8. తమిళనాడులో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

    తమిళనాడులో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.

    View more on twitter
  9. రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

    ఇప్పటికే పొడిగించిన కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

    ఈ మేరకు ప్రధాని మంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా తెలిపింది.

    దీంతో ప్రధాని తన ప్రసంగంలో లాక్‌డౌన్‌పై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు.

    ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించగా మరికొన్ని రాష్ట్రాలు ఇటీవల ప్రధానితో వీడియో కాన్ఫరెన్సులో పొడిగించాలని కోరాయి.

    View more on twitter
  10. చిన్నారి కోసం రాజస్థాన్ నుంచి ముంబయికి పాలు తెచ్చిన రైల్వే

    కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ ఇబ్బందే ముంబయికి చెందిన ఓ మహిళకు ఇటీవల ఎదురైంది.

    ఆటిజంతో బాధపడుతున్న ఆమె చిన్నారికి ఒంటె పాలు అత్యవసరం. ‌లాక్‌డౌన్ వల్ల ఆ పాలను తెచ్చుకునే వీలు లేకుండా పోయింది. దీంతో తమ సమస్య గురించి ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు.

    ఈ ట్వీట్‌ను ఒడిశాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి బోత్రా చూశారు. తనకు పరిచయం ఉన్న అధికార వర్గాల దృష్టికి ఈ విషయాన్ని ఆయన తీసుకువెళ్లారు. అలా ఈ విషయం వాయువ్య రైల్వే చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్‌ తరుణ్ జైన్‌కు తెలిసింది.

    ఈ సమస్యను పరిష్కరించే విషయమై ఆయన ఇతర అధికారులను సంప్రదించారు. పంజాబ్‌లోని లూథియానా నుంచి ముంబయిలోని బాంద్రాకు పార్సిల్ రైలు నడుస్తోందని, దీన్ని రాజస్థాన్‌లోని ఫల్నా స్టేషన్‌లో ఆపితే, స్థానిక ఒంటె పాల సరఫరాదారుడు పాలను తెచ్చిచ్చే వీలుందని వాళ్లు గుర్తించారు.

    దీనికి అనుగుణంగానే రైలును ఫల్నాలో ఆపారు. ఒంటె పాల సరఫరాదారు 20 లీటర్ల పాలు, పాల పొడిని అందులోకి ఎక్కించారు. ముంబయిలో ఆ మహిళ కుటుంబానికి దాన్ని అధికారులు చేరవేశారు.

    వివిధ ప్రాంతాలు, శాఖల సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించగలిగామని అధికారులు చెప్పారు.

  11. ప్లాస్మా థెరపీ వాడేందుకు కేరళకు అనుమతి

    కోవిడ్-19 రోగులకు చికిత్సలో ప్లాస్మా థెరపీని వినియోగించేందుకు కేరళకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి ఇచ్చింది.

    కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కార్యాచరణ బృందం ప్లాస్మా థెరపీని వినియోగించేందుకు ఐసీఎంఆర్‌ను అనుమతి కోరింది.

    ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దాన్ని ప్రతిఘటించే క్రమంలో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ యాంటీ బాడీస్ (ప్రతిరోధకాల)ను తయారు చేసుకుంటుంది. ఇన్ఫెక్షన్ నయమైనవారి రక్తంలోని ప్లాస్మాలో ఈ యాంటీ బాడీస్ ఉంటాయి. వీటిని ఉపయోగించి వేరే రోగుల్లోనూ ఇన్ఫెక్షన్ నయం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.

  12. మహారాష్ట్రలో 2 వేలు దాటిని కోవిడ్-19 కేసులు

    View more on twitter

    మహారాష్ట్రలో కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 82 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 59 కేసులు ముంబయిలోనే వెలుగుచూశాయి.

    దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2064కు చేరింది.

  13. ‘మళ్లీ ఇలాంటివి రాకూడదంటే, వన్యప్రాణుల మార్కెట్లను నిషేధించాలి’

    కరోనావైరస్

    కరోనావైరస్ తరహాలో భవిష్యత్తులో మహమ్మారులు రాకుండా, ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల మార్కెట్లపై నిషేధం విధించాలని ఐరాస జీవవైవిధ్య విభాగం చీఫ్ ఎలిజబెత్ మరుమా మ్రెమా విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణుల అమ్మకాలు, కొనుగోళ్ల వల్ల అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులతోపాటు మానవాళి ఆరోగ్యానికి కూడా ముప్పు పొంచి ఉందని ఆమె బీబీసీతో అన్నారు.

    ‘‘మనుషుల చర్యల వల్ల వన్యప్రాణులతో మనకు దూరం చెరిగిపోయిన కారణంగానే గత 60 ఏళ్లలో ఎన్నో వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించాయి. మాంసం మార్కెట్లు నిబంధనల ప్రకారం, పరిశుభ్రంగా నడిచేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వన్యప్రాణుల అక్రమ వ్యాపారం వాటిలో సాగకూడదు’’ అని ఆమె అన్నారు.

    ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆర్థిక, ఆహార భద్రత కారణాలతో వన్యప్రాణుల వ్యాపారంపై ఆధారపడుతున్నారన్న విషయాన్ని కూడా ఎలిజబెత్ అంగీకరించారు.

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా వన్యప్రాణులను తినడంపై తాత్కాలిక నిషేధం విధించింది. ఆ దేశంలోని వుహాన్‌ నగరంలో వన్యప్రాణులను అమ్మే మార్కెట్ నుంచి కరోనావైరస్ వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని కచ్చితంగా నిరూపించే ఆధారాలైతే ఇంకా లేవు.

  14. చైనాలో పెరుగుతున్నాయ్...

    ఆదివారం కొత్తగా 108 కేసులు నమోదు

    చైనాలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.

    ఆదివారం కొత్తగా 108 కేసులు నమోదయ్యాయి. ఐదు వారాలుగా చైనా ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల్లో రోజువారీ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదు. కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య తక్కువే ఉంటున్నా, క్రమేపీ పెరుగుదల కనిపిస్తోంది.

    చైనా పౌరులు సొంత దేశానికి తిరిగి చేరుకుంటుండటం వల్లే కేసులు పెరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొత్త కేసుల్లో ఎక్కువ భాగం అలా వచ్చినవారే ఉంటున్నారు.

    ఆదివారం నమోదైన 108 కేసుల్లో 98 మంది విదేశాల నుంచి వచ్చినవారే. దాదాపు సగం కేసులు ఉత్తర ప్రావిన్సు హెలాంగ్‌జియాంగ్‌లో నమోదవుతున్నాయి. రష్యా నుంచి అక్కడికి తిరిగివస్తున్నవారు ఈ ఇన్ఫెక్షన్‌తో ఉంటున్నారు.

    ఇన్ఫెక్షన్లతో దేశానికి వచ్చినవాళ్ల కారణంగా చైనాలో కరోనావైరస్ రెండో అలజడి మొదలుకావొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా, కొత్త కేసులను చైనా పూర్తిగా ఆపలేకపోతోంది.

    కరోనావైరస్ మొదలైన హుబే ప్రావిన్సులో స్వల్ప సంఖ్యలోనైనా, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి. ఆదివారం ఈ ప్రావిన్సులో ఇద్దరు చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ మరణాల సంఖ్య 3,341కి చేరుకుంది. లక్షణాలు చూపని 61 కొత్త కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, చైనా వీటిని కరోనావైరస్ నిర్ధారిత కేసులుగా పరిగణించడం లేదు.

  15. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 432

    కరోనావైరస్

    ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో 12 పాజిటివ్ అని నిర్థరణయ్యాయి.

    గుంటూరులో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 432కి చేరింది.

    ఇప్పటివరకూ 12 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు. ప్రస్తుతం 413 మంది చికిత్స పొందుతున్నారు.

  16. దక్షిణాసియాలో ఆర్థిక మాంద్యం రావచ్చు

    ప్రపంచ బ్యాంక్ అంచనా

    కరోనావైరస్

    కరోనావైరస్ సంక్షోభం కారణంగా భారత్ సహా దక్షిణాసియా దేశాలు... ఆర్థిక ప్రగతి విషయంలో 40 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత దారుణ స్థితికి చేరుకునే దశలో ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ అంటోంది.

    దక్షిణాసియా ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 1.8 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఆరు నెలల క్రితం ఇదే ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా వృద్ధి రేటు 6.3 శాతం ఉండొచ్చని లెక్కగట్టింది.

    భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు దక్షిణాసియాలో ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు పావు వంతు ఇక్కడే నివసిస్తున్నారు.

    ఏప్రిల్‌తో మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వృద్ధి రేటు కూడా చాలా క్షీణిస్తుందని పేర్కొంది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, మాల్దీవులు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంటోంది.

    పేదరిక నిర్మూలన విషయంలో ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానించింది.

  17. భారత్‌లో 9వేలు దాటిన కేసుల సంఖ్య

    View more on twitter

    భారత్‌లో కరోనావైరస్ మొత్తం కేసుల సంఖ్య 9152కు చేరింది.

    గడిచిన 24 గంటల్లో 35 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 308కి చేరింది.

    ఇప్పటివరకూ 856 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

    ప్రస్తుతం 7987 యాక్టివ్ కేసులున్నాయి.

  18. ఫ్రాన్స్, ఇటలీల్లో తగ్గుతున్న మరణాలు

    ఈఫిల్ టవర్ - కరోనావైరస్

    యూరప్‌లో కరోనావైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్న ఫ్రాన్స్, ఇటలీల్లో కరోనావైరస్ మరణాల సంఖ్య తగ్గుతోంది.

    ఇటలీలో ఒక రోజు వ్యవధిలో కరోనావైరస్ కారణంగా 431 మంది మరణించారు. గత మూడు వారాల్లో రోజువారీ మరణాలు ఇంత తక్కువగా నమోదవ్వడం ఇదే తొలిసారి.

    ఫ్రాన్స్‌లోనూ మరణాలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కాస్త తగ్గాయి. ఆదివారం 315 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు 345 మంది చనిపోయారు.

    స్పెయిన్‌లో రోజువారీ కరోనావైరస్ మరణాలు 600 దాటాయి. కొత్త ఇన్ఫెక్షన్లు నెమ్మదిస్తున్నా, రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఉండొచ్చని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.

  19. కరోనావైరస్: భారత్‌లో కొట్టిన చప్పట్ల శబ్దం నాసాకు వినిపించిందా?

    బీబీసీ ఫ్యాక్ట్ చెక్

    ఫేక్ న్యూస్

    కరోనావైరస్ గురించి సోషల్ మీడియాలో పాపులర్ అయిన కొన్ని అవాస్తవాలు, తప్పుదోవ పట్టించే వార్తల నిజాయతీ, వాటి ప్రామాణికతను బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ పరిశీలిస్తోంది.

    జేక్ గుడ్‌మెన్ ఇలాంటి కొన్ని వార్తలను తీసుకొచ్చినా, బీబీసీ మానిటరింగ్, ట్రెండింగ్, రియాలిటీ చెక్ వాటిని కొట్టిపారేసింది.

    దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారికి ధన్యవాదాలు చెబుతూ భారతీయులు మార్చిలో చప్పట్లు, శబ్దాలు చేయడం గురించి మరో పాపులర్ మెసేజ్ వైరల్ అవుతోంది.

    భారత్‌లో ప్రజలందరూ అలా చప్పట్లు కొట్టడం, శబ్దాలు చేయడం వల్ల వచ్చిన ధ్వనిని నాసా తమ శాటిలైట్ల ద్వారా విన్నదని, దాంతో కరోనావైరస్ తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందని అంటున్నారు.

    ఇది నిజమేనా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  20. న్యూజీలాండ్ నర్సుకు బ్రిటన్ ప్రధాని కృతజ్ఞతలు

    బోరిస్ జాన్సన్

    కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారినపడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరిన ఆయన, కొన్ని రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు.

    నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) తన ప్రాణాలను కాపాడిందని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తనకు చికిత్స అందించిన వైద్య సిబ్బందిలో కొందరి పేర్లను బోరిస్ నేరుగా ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

    ఆ జాబితాలో న్యూజీలాండ్‌లోని ఇన్వర్‌కార్గిల్‌కు చెందిన జెన్నీ మెక్‌గీ కూడా ఉన్నారు. ఆమె తొమ్మిదేళ్లుగా లండన్‌లో పనిచేస్తున్నారు. తన పరిస్థితి ఎలాగైనా మారిపోయే ప్రమాదం ఉన్న సమయంలో, జెన్నీ నిత్యం తన పక్కనే కంటికి రెప్పలా ఉన్నారని బోరిస్ జాన్సన్ అన్నారు.

    జెన్నీ గురించి బోరిస్ ప్రస్తావించిన తర్వాత న్యూజీలాండ్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. జెన్నీ తల్లిదండ్రులను కొన్ని పత్రికలు ఇంటర్వ్యూ చేశాయి. తమ కూతురి సేవలకు గుర్తింపు రావడం పట్ల గర్వపడుతున్నామని వాళ్లు అన్నారు.

    బోరిస్ జాన్సన్‌కు వైద్య సేవలు చేస్తున్నట్లు జెన్నీ తనకు చెప్పలేదని, వార్తలు బయటకు వచ్చాకే ఈ విషయం తెలిసిందని ఆమె తల్లి స్టఫ్ అనే న్యూస్ వెబ్‌సైట్‌తో అన్నారు. ఆ తర్వాత కూడా బోరిస్ తనతో బాగా ముచ్చటించినట్లు మాత్రం జెన్నీ చెప్పారని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రి సిబ్బంది అంతా పనిభారంతో ఉన్నారని జెన్నీ చెప్పినట్లు ఆమె తెలిపారు.